శ్రీవర తృతీయ రాజతరంగిణి-30

5
3

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ సర్గ

బభూవ వర్షః షట్‌త్రింశః సర్వవృష్ణి కులక్షయాత్।
భయాకృత్ సర్వజంతూనాం భారతాదితి విశృతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 8)

ప్రాణులన్నిటికీ 36వ సంవత్సరం భయానకమైనది. మహాభారతంలో యదు వంశీయుల వినాశనం 36వ సంవత్సరంలోనే సంభవించింది.

యదువంశంలో ముసలం పుట్టి, వారిలో వారు కొట్టుకుని సర్వనాశనం అవటం మహాభారతం కథ చెప్తుంది. ఇది జగత్ప్రసిద్ధం. దీని ఆధారంగా ప్రాణులన్నిటికీ 36వ సంవత్సరం నష్టదాయడం అంటున్నాడు శ్రీవరుడు.

అభవన్ పత్రపుష్పైఘా ధూళిధూసరితా నతాః।
భావి దుర్భిక్ష పీడార్తజన చిన్తావశాదివ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 9)

కరువు కాటకాలకు గురై బాధపడే భావితరాల  జనాలను ఊహించుకుని విచారంతో తలలు వంచినట్లు చెట్లు ఆకులు, పూలు దుమ్ముతో నిండి వంగిపోయాయి.

అద్భుతమైన వర్ణన ఇది.

కళ్ళ ముందు దుమ్ముతో నిండిన చెట్లు, పూలు కనిపిస్తాయి. అవి ధూళి బరువుతో వంగిపోయాయి. గోధుమరంగుతో నిండిన చెట్లు చేమలు కళ్ళ ముందు నిలుస్తాయి. శ్రీవరుడు చేసిన చమత్కారం ఏమిటంటే, స్వయంగా అవి ధూళితో నిండి ఉన్నాయి. మొత్తం రంగు మారిపోయింది. కానీ అవి తమ దుస్థితికి దుఃఖించటం లేదు. అవి భవిష్యత్తు తరాలు పడే బాధలను తలుచుకుని తలలు వంచుతున్నాయి. ఈ విశ్వంలో భవిష్యత్తు గురించి ఆందోళన చెందే ఏకైక జీవి మనిషి. కొన్ని జీవులు భవిష్యత్ కోసం తిండిని సమకూర్చుకున్నా, ఆ సమకూర్చుకోవటం ప్రాకృతికంగా సంభవిస్తుంది తప్ప దానిలో ఉద్విగ్నతలు, ఆందోళనలు ఉండవు. కానీ ఇక్కడ శ్రీవరుడు ప్రకృతి సర్వం – భవిష్యత్తు తరాలు అనుభవించే బాధలను తలచుకుని బాధపడుతోందని రాశాడు. చాలా చక్కని శ్లోకం ఇది.

కొంచెం ఆగి, శ్రీవరుడి ఈ వర్ణనను ఆలోచిస్తే, దేశంలో ఇస్లామీయుల ప్రాబల్యం పెరుగుతున్న సమయంలో భారతీయుల మనోభావాలను ఈ శ్లోకం ప్రతిబింబిస్తుందనిపిస్తుంది. తమ ధర్మం నిలుపుకోవటం ఆ కాలంలో పెద్ద సమస్య, జీవన్మరణ సమస్య. ముంచుకొస్తున్న సముద్రపు నీరులా ఇస్లామీయులు దేశమంతా విస్తరిస్తున్నప్పుడు తీవ్రమైన పట్టుదలతో తమ ధర్మాన్ని కాపాడుకుంటున్నా, భవిష్యత్తు తరాలు ఎలా తమ ధర్మాన్ని నిలుపుకుంటాయో, లేక వారు లొంగిపోతారో, నిలుపుకునేందుకు ఎన్ని కష్టాలు అనుభవిస్తారోనన్న ఆందోళనతో ఎన్ని తరాలు ఎంత మానసిక క్షోభను అనుభవించాయో ఊహకు అందదు. “పన్ను కట్టినవారిని వారి ధర్మాన్ని పాటించుకోనియవచ్చు అన్న నియమం లేకపోతే ఈ దేశంలో ఒక్క కాఫిర్ కూడా మిగిలేవాడు కాదు” అన్న అమీర్ ఖుస్రో వ్యాఖ్యను గమనిస్తే, ఆ కాలంలో ఎంతటి ఉధృతితో మతమార్పిళ్ళు జరిగాయో, ఎంత దృఢ సంకల్పం, తీవ్రమైన పట్టుదలలు ధర్మ రక్షణకు తోడ్పడ్డాయో అనిపిస్తుంది.

భవితా వత్సరే మూష్మిన్ దుర్భిక్షం పాంశువర్షణాత్।
ఇత్యాఖ్యాన్తుత్తరం పృష్టా భూభుజా దైవవిత్తమాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 10)

సంభవిస్తున్న పరిణామాలకు ఆందోళన చెందిన రాజు జ్యోతిష్యులను సంప్రదించాడు. ధూళి వర్షం వల్ల కరువు కాటకాలు సంభవిస్తాయని వాళ్లు చెప్పారు.

ఇస్లామీయులపై భారతీయుల సంపర్క ప్రభావాన్ని చూపించే మరో సంఘటన ఇది.

ఇస్లాంలో ఖగోళ శాస్త్రాన్ని ‘ఇల్మ్ కత్ అల్-నుజామ్’ అంటారు. నక్షత్రాల శాస్త్రం. అయితే, ఖురాన్, హాదిత్‌ల ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మానవ జీవితంపై ప్రభావం చూపిస్తాయని నమ్మటం కానీ, అలా భవిష్యత్తును వివరించాలని, తెలుసుకోవాలని ప్రయత్నించటం కానీ ‘హరామ్’ క్రిందకు వస్తుంది. ఎందుకంటే, అందరి భవిష్యత్తులను నిర్ణయించేది ‘అల్లాహ్’ ఒక్కడే. గ్రహాలు, నక్షత్రాల ద్వారా మానవ జీవితం గురించి తెలుసుకోవటమంటే భగవంతుని పనితీరును తెలుసుకోవాలని ప్రయత్నించటం. అది నేరం. అలాగని ఇస్లాంలో ఖగోళ శాస్త్రానికి స్థానం లేదని కాదు.

గ్రహాలు, నక్షత్రాల ద్యారా ప్రయాణ దిశను తెలుసుకోవటం, కాబా ఏ వైపున ఉన్నదో గ్రహించటం, నమాజ్ సమయాలను గణించటం  వంటి ఉపయోగకరమైన పనుల కోసం గ్రహశాస్త్రాన్ని వాడవచ్చు. కాబట్టి భవిష్యత్తును ఊహించే ‘జ్యోతిషశాస్త్రం’ ఇస్లాంలో ‘హరామ్’ క్రిందకు వస్తుంది. అయినా సరే ఇస్లామీ పండితులు గ్రహాల కదలికల ప్రభావం మానవ జీవితంపై ఉంటుందని నమ్మి ఆ దిశగా ప్రయోగాలు చేశారు. అబు మాషర్ అల్ బల్ఖి, అల్ హషిమ్, మాషా అల్లాహ్ వంటి వారు ఈ దిశగా అధ్యయనం చేశారు. ‘కితాబ్-అల్-దరాజ్’ ఇందుకు ఉదాహరణ. చివరికి వీరు మహమ్మద్ ప్రవక్త జననం కూడా గ్రహాల అనుకూలతల వల్ల సంభవించిందని ప్రతిపాదించారు. కానీ ఇస్లామీయులు వీరందరినీ వ్యతిరేకించారు. ఎందుకంటే ఖురాన్‌లో ‘అల్ మదయ్యా 3’ ప్రకారం భవిష్యత్తును, అదృష్టాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించటం అల్లాహ్ మాటను కాదనటం క్రిందకు వస్తుంది.

కానీ భారతదేశంలో ప్రవేశించిన తరువాత, ఇస్లామీయులు జ్యోతిషశాస్త్రం వైపు ఆకర్షితులయ్యారు. భారతీయ రాజుల లాగే ఆస్థాన జ్యోతిష్కులను నియమించుకున్నారు. గ్రహగతుల ద్వారా మంచి రోజు, మంచి ముహూర్తం వంటివి నిర్ణయించే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

ఓట్టోమాన్‌లు ఆస్థాన జ్యోతిష్కుడిని (మునాజ్జిం బాషి) ఏర్పాటు చేసుకున్నా వారి పని కాలెండర్లు తయారు చేయటం, ఇతర నిర్ణయాలు తెలపటమే తప్ప, భవిష్యత్తును ఊహించటం కాదు. వారి మాటలను ఓట్టోమాన్ సుల్తానులు ఖాతరు చేయలేదు. ఇందుకు భిన్నంగా భారతదేశంలో స్థిరపడిన ఇస్లామీయులు నెమ్మదిగా జ్యోతిషశాస్త్రాన్ని నమ్మటం, పాటించటం ఆరంభించారు. ఇది మొఘులుల కాలానికి తారాస్ధాయికి చేరింది.

మొఘలులు రాజుకు సంతానం కలగగానే ఆ సంతానం జన్మ పత్రిక రాయించేవారు. భారతీయుల ప్రభావంతో ‘దర్శన ఉత్సవం’ వంటి సూర్య ఆరాధన కార్యక్రమాలు ఆరభించారు. హుమయున్ తండ్రి బాబర్ జ్యోతిషాన్ని నమ్మేవాడు. ‘అక్బర్ నామా’ ద్వారా బాబరు, అక్బరులు ఎలా జ్యోతిషాన్ని నమ్మేవారో తెలుస్తుంది. హుమాయున్ అయితే జ్యోతిషాన్ని ఎంతగా నమ్మేవాడంటే, ఆ రోజు గ్రహగతులను అనుసరించి అందుకు తగ్గ రంగు దుస్తులను ధరించేవాడు. హుమాయున్ ఏర్పాటు చేసిన ‘బసల్త్-ఇ-నిషాత్’ అనే గుండ్రటి కార్పెట్ గ్రహగతులను ప్రతిబింబించేది.

సూర్య గ్రహ కూటమిలోని ఏడు గ్రహాలకు ప్రతీకగా భవనంలో ఏడు గదులను నిర్మించాడు హుమాయాన్. జహంగీర్ విడుదల చేసిన మోహర్లు (నాణేలు) 12 రాశుల చిహ్నాలతో ఉంటాయి. దీన్ని బట్టి ఇస్లామీయులపై భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రభావాన్ని తెలుసుకోవచ్చు.

అందుకే దేశంలో కరువు కాటకాలు సంభవించే రీతిలో ధూళివర్షం కశ్మీరులో కురుస్తున్నపుడు జైనులాబిదీన్ జ్యోతిష శాస్త్రవేత్తలను  సంప్రదించాడు. వారు రాబోయే కరువు కాటకాలను స్థిరపరిచారు.

భవిష్యత్తు గురించి ఆందోళన మనిషిని జ్యోతిషశాస్త్రం వైపు మళ్ళిస్తుంది.

షట్‍త్రింశో వత్సరోతీతో దుర్భిక్షార్తీ ప్రభావాత్।
ఏషమస్తాదృశాః ప్రాప్తో భీతిరిత్యుదభూతధృది॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 11)

గత 36వ సంవత్సరం భయంకరమైన దుర్భిక్షాన్ని చూపించింది. ఈ 36వ సంవత్సరం కూడా అంతకన్నా ఘోరమైన దుర్భిక్షాన్ని కలిగిస్తుందని ప్రజలు భయపడసాగారు.

గత 36వ సంవత్సరం అంటే సుల్తాన్ షహబుద్దీన్ పాలనాకాలం. ఆ కాలంలో భయంకరమైన పరిణామాలు సంభవించాయి. శ్రీనగర్‍ను జలప్రళయం ముంచెత్తింది. శంకరాచార్య పర్వతం జల ప్రవాహానికి ఒడ్డులాంటిదయింది. ఆ కాలంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరిగింది. శ్రీవరుడు ఈ సంఘటనను ప్రస్తావిస్తున్నాడు. మళ్ళీ అంతకన్నా ఘోరమైన పరిస్థితులు కశ్మీరు ఎదుర్కొవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు ప్రజలు.

పతాత్ మార్గశీర్షేథ మాస్యుపద్రవ దర్శనమ్।
దేశేన్న విలసచ్ఛాలిమాలే ప్రాలేయ వర్షణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 12)

మార్గశిర మాసంలో పంటలు చక్కగా పండిన సమయంలో హిమపాతం సంభవించి సర్వనాశనం అయింది.

ఈ వర్ణన మన ఊహకు అందేదే. అకాల వర్షాల వల్ల ఏపుగా పండిన పంట జలమయం అయి నాశనం అవటం ఈనాటికీ మనం చూస్తూనే ఉన్నాం.

దుర్భిక్షదుఃస్థితం లోకం కథం పశ్యామి సాప్రతమ్।
ఇతీవ భూరభూచ్ఛన్నముఖీ హిమసితాంశుకైః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 13)

ప్రజల బాధలను, కష్టాలను చూడలేక భూమి తన ముఖాన్ని తెల్లటి దుప్పటితో కప్పేసుకున్నట్టు భూమి అంతా మంచు పరుచుకుంది.

పర్షియన్ రచయితలు తమ కశ్మీరు చరిత్రలో హిమపాతం ప్రస్తావించలేదు. భూమిపై శ్వేత వస్త్రం పరచుకున్నట్లు మంచు పరచుకోవటాన్ని వారు ప్రస్తావించ లేదు. కాబట్టి చరిత్ర రచయితలు శ్రీవరుడి వర్ణనలనూ పెద్దగా పట్టించుకోలేదు. జరిగిన సంఘటనలకు శ్రీవరుడు ప్రత్యక్ష సాక్షి అన్న విషయాన్ని వారు విస్మరించారు.

శ్రీవరుడి రచన ప్రకారం 1460లో దేశం కరువు కాటకాలతో సతమతమయ్యింది. 1462లో వరదలు కశ్మీరాన్ని ముంచెత్తాయి. తరువాత సంవత్సరం కశ్మీరాన్ని మంచు కప్పేసింది.

సంఘటనలను అనుభవిస్తున్నప్పుడు తెలియదు కానీ, వెనుతిరిగి చూసుకుంటే, ప్రపంచ గమనంలో ఒక పద్ధతి కనిపిస్తుంది. ఏ సంఘటన కూడా  హఠాత్తుగా సంభవించదు. ముందు ఆ సంఘటనను సూచిస్తూ పలు సంఘటనలు సంభవిస్తాయి. కానీ భవిష్యత్తు  చూడలేని మనిషి ఆ సంఘటనలకు అంత ప్రాధాన్యం ఇవ్వడు.

జైనులాబిదీన్ పాలన చివరి దశలో ప్రవేశిస్తోంది. ఆరంభంలో అత్యద్భుతమైన విజయాలు సాధించాడు జైనులాబిదీన్. అంతా సవ్యంగా, అద్భుతంగా సాగింది. సంతానం నడుమ రాజ్యం కోసం పోరాటం, జైనులాబిదీన్ దుర్దశ ఆరంభాన్ని సూచిస్తుంది. ఆ వెంటనే కరువు కాటకాలు, వరదలు, హిమపాతం ఇలా ఒకటొకటిగా కశ్మీరు అల్లకల్లోలమై  దుర్భరమైన వేదనలను అనుభవించటం మొదలయింది. ఈ దుస్సంఘటనల పర్యవసానం జైనులాబిదీన్ మరణం! ఇదంతా అత్యంత తీవ్రమైన దుర్ఘటనకు ప్రజలను సిద్ధం చేస్తున్నాయి. అగ్నిపర్వతం బ్రద్దలయ్యే ముందు భూకంపాలు వస్తాయి. భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటానికి సూచనలు. అగ్నిపర్వతం నుండి పొగ వెలువడుతుంది. బూడిద వర్షం కురుస్తుంది. ఇదంతా అగ్నిపర్వతం బ్రద్దలవబోతోందన్నదానికి సూచన!!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here