[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ద్వితీయ సర్గ
ఛాదితా శాలయాః పక్కా హిమైర్జన మనోహరాః।
ఖలమూర్స సభామధ్యే పండితైః స్వగుణా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 14)
ఎలాగయితే దుష్టులు, మూర్ఖుల సభలో పండితులు తమ స్వగుణాన్ని మరచిపోతారో, అలాగే, కశ్మీరంలో హిమపాతం వల్ల ఏపుగా పండిన పంటలన్నీ మంచులో కప్పబడిపోయాయి.
పండిన పంటలు కళ్లకు అందంతో విందు చేస్తాయి. అలా మంచు కూడా ఎంతో ఆనందం కలిగిస్తుంది. కానీ మంచు పంటను కప్పేయటం ఆనందకరమైన విషయం కాదు. పంట నాశనం అయిపోయింది. శ్రీవరుడు పంటను పండితులతో, మంచును దుష్టులు మూర్ఖులకు ప్రతీకలుగా తీసుకున్నాడు. ఎలాగయితే దుష్టులు, మూర్ఖుల సభలో పండితులు స్వగుణాలను మరచిపోవాల్సి వస్తుందో, అలాగ మంచు నిండటంతో పంట అదృశ్యం అయిపోయింది. చక్కటివి ఈ పోలికలు, ప్రతీకలు.
మూర్ఖులు, దుష్టుల సభలో పండితుల పాండిత్యం ఎందుకూ కొరగాదు. అది అవహేళనలకు, దూషణలకు గురువుతుంది. కాబట్టి, అలాంటి సభల్లో పండితుడు పాండిత్యాన్ని మరచిపోవాలి. మార్ఖులు మెచ్చిందే మాట్లాడాలి. పాండిత్యం మూర్ఖత్వంతో కప్పబడిపోయిందన్న మాట.
కుక్ష్యావేగాద్ బుభుక్షార్తః క్షపితాక్షః క్షణే క్షణే।
ఆశు దుర్భిక్ష యక్షోత్ర వ్యఘాత్ ప్రక్షీణలక్షణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 15)
నిరంతరం కడుపు నింపుకోవటం గురించి ఆలోచిస్తూ, ఆకలితో అలమటిస్తూ, ఆశతో ఎక్కడ ఆహారం లభిస్తుందోనని వెతుకుతూన్న ప్రజలను చూస్తే త్వరలో సర్వనాశనం అవబోతుందనిపిస్తుంది.
మనిషికీ ఇతర జీవులకూ తేడా ఏమిటంటే, ఇతర జీవులు నిరంతరం తిండి కోసం వెతుకుతూ ఉంటాయి. నిత్యం వాటికి తిండి ధ్యాసనే. తిన్నా తినకున్నా వాటి దృష్టి తిండి మీదే ఉంటుంది. మనిషి ఇందుకు భిన్నం. కానీ కశ్మీరంలో ఎంత తీవ్రస్థాయిలో కరువు వచ్చిందంటే, ప్రజలు తిండి కోసం వెతకటం తప్ప, మరో పని లేదు. వారి కడుపులు నిండే ప్రసక్తి లేదు. ఎల్లప్పుడూ ఆకలే వారికి. ఎప్పుడయితే మనుషులు ఇతర జీవుల్లా తిండి తప్ప మరో ధ్యాస లేకుండా జీవిస్తారో, అప్పుడు సర్వనాశనం ఎంతో దూరం లేదన్న మాట.
ఈ సందర్భంగా ‘క్షపితాక్ష’ అనే పదం వాడాడు శ్రీవరుడు. చంచలమైన కళ్లతో, కళ్ళను విస్తరించి అన్న అర్థాలు వస్తాయి. అక్కడి ప్రజలు ఆశలు నిండిన కళ్లతో నలుదెసల తిండి కోసం వెతుకుతున్నారన్న దాన్ని ఈ పదంతో సూచించాడు.
శ్రీవరుడు ఈ సందర్భంలో ‘ఆకలి’ గురించి ప్రస్తావించాడు. ప్రస్తుత సమాజంలో ‘ధన సంపాదన ఆకలి’ అధికంగా కనిపిస్తుంది. శ్రీవరుడు వర్ణించిన కరువు కాలం నాటి ఆకలిని మించిన ‘ఆకలి’ ఈనాడు సమాజంలో ‘ధన సంపాదన’ గురించి కనిపిస్తోంది. ఏ ఆకలి అధికమైనా అనర్థదాయకమే. వినాశకరమే!
ప్రవిశ్య రాత్రౌ గేహాన్తః క్షుద్భక్షోద్రేకపీడితః।
హిరణ్యాది ధనం త్యస్త్యో భాండేభ్యోన్నమ పాహరత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 16)
శ్రీవరుడు అచ్చమైన కవి. కానీ చరిత్ర రచన చేయాల్సి వచ్చింది. ఆ రచనను వర్ణనలతో కావ్యస్థాయికి ఎదిగించాడు. కల్హణుడు, జోనరాజు, శ్రీవరుడు.. ముగ్గురూ రచించినది చరిత్రే అయినా, ముగ్గురి శైలి ఎవరికి వారిదే ప్రత్యేకం. కల్హణుడిలో ఆధ్యాత్మిక చింతన, అధికంగా కనిపిస్తుంది. జోనరాజులో ఓ రకమైన నిర్లిప్తత కనిపిస్తుంది. శ్రీవరుడి రచనలో ఆవేదనతో పాటు కవితాత్మ తొంగిచూస్తుంటుంది. శ్రీవరుడు వర్ణించినట్టు కరువును వర్ణించిన మరో సంస్కృత కవి లేడు. ఎందుకంటే శ్రీవరుడు ఆ కరువు కాటకాల దుర్భర దుస్థితిని తన కళ్లతో చూశాడు. స్వయంగా అనుభవించాడు. అందుకని ఇతరుల వర్ణనలకూ, శ్రీవరుడి వర్ణనలకూ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
‘యోగ వాశిష్టం’ లోను కరువు వర్ణన ఉంది.
పాంసు ధూసర సర్వాంగం క్షుధితా శేష మానవమ్।
నిరన్నతృణ పానీయం దేశాద్యుద్ధావ మండలమ్॥ (3.108.13)
ప్రజలందరి శరీరాలు దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. తినటానికి తిండి లేదు. త్రాగటానికి నీరు లేదు. దేశం ఒక ఎడారిలా అయిపోయింది.
కచన్మరుమరీచ్యంబు మజ్జన్మహిషమండలమ్।
వాతోత్యసీకరవ్యూహాపరివాహనాంబరమ్॥ (3.108.14)
ఎండమావులు నీళ్లలా కనిపించటంతో, భ్రమలో పశువులు అది చెరువు అనుకుని అక్కడ దొర్లుతున్నాయి. ఎడారిని చల్లబరిచేందుకు గాలి కూడా వీయటం లేదు.
పానీయశబ్ద మాత్రైక శ్రవణోత్కనరవ్రజామ్।
ఆతపాతతిసంశోషసీదత్సకలమానవమ్॥ (3.108.15)
మండించే సూర్యకణాల తాకిడికి గురవుతూ, మండిపోతున్న మనుషులే, నీటి కోసం వినపడే కేకలను వినటానికి మిగిలి ఉన్నారు.
పత్రగ్రసనసంరంబ్ధక్షుధితోత్థితజీవితమ్।
స్వాంగచర్వణసంరంభలుఠద్దశనమండలమ్॥ (3.108.16)
ఆకలి తాళలేక మనుషులు కనబడిన చెట్లను, కాండాలను, శాఖలను తినాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారు ప్రాణాలు కోల్పోయారు. మనిషిని మనుషులు చీల్చి పీక్కు తినటంతో వారి పళ్ళు మరింత సానబెట్టినట్టయ్యాయి.
మాంసశంకానిగీర్ణోగ్రఖదిరాగ్నికణోత్కరమ్।
మండకాసారసంగ్రస్తవనపాషాణఖండకమ్॥ (3.108.17)
మాంస ఖండం అనుకుని తుమ్మ జిగురు కోసం పరుగెత్తారు కొందరు. మరి కొందరు లడ్డూలనుకుని (తీపి పదార్థాలని భ్రమపడి) రాళ్లను మ్రింగసాగారు.
ఇలా సాగుతుంది కరువు వర్ణన.
మనుషులు ఒకరినొకరు పీక్కు తినటం, ఆకులు లేని చెట్ల వర్ణన, వేడికి కాలిపోయిన పాముల విషం నుండి చెట్లు విషమయం అవటం, మనుషులను పీక్కుతినే ఆత్రంతో, రక్తం అంటిన తమ వేళ్ళనే కొరకటం.. ఇలా భయంకరంగా ఉంటుంది కరువు.
శ్రీవరుడి కరువు వర్ణన ఇంత భీకరంగా ఉండదు. కానీ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తాడు.
ఆకలికి తాళలేక, ఇళ్ళల్లోకి దొంగతనంగా ప్రవేశించినవారు, బంగారం, ఇతర విలువైన వస్తువుల వైపు కూడా చూడక, అన్నం గిన్నెలను దొంగిలించకుపోయారట.
యోగవాశిష్టంలో కరువు వర్ణన భయం, జుగుప్సలు కలిగిస్తాయి. ఒకరకమైన విరక్తిని కలిగిస్తాయి.
శ్రీవరుడి వర్ణన ‘నిజం’ అనిపిస్తుంది. దుస్థితిని కళ్ళకు కడుతుంది.
సాధారణంగా విలువైన వస్తువులను దొంగిలిస్తారు. కానీ ఆ కాలంలో బంగారం ఉన్నా, దాని వైపు కూడా చూడకుండా అన్నాన్ని ఎత్తుకు పోయేవారట. అన్నం అంత విలువైనది! బంగారం కన్నా విలువైనది. బంగారం ప్రాణాలు కాపాడదు, అన్నం కాపాడుతుంది. అందుకే ఏ కాలంలోనైనా అన్నం బంగారం కన్నా విలువైంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. బంగారం ఓ పనికిరాని లోహం మాత్రమే. కానీ సాధారణ పరిస్థితులలో మనిషి ఇది గ్రహించలేడు. బంగారానికి విలువనిస్తాడు. బంగారం కోసం హత్యలు చేస్తాడు. మోసాలు చేస్తాడు. నానా గడ్డీ కరుస్తాడు. కానీ ఎప్పుడయితే అన్నం దొరకదో, ఎంత బంగారం ఉన్నా ఎందుకూ కొరగాదు. ఏమీ లాభం లేదు. ఈ విషయాన్ని అత్యంత సరళంగా, అద్భుతంగా చెప్పాడు శ్రీవరుడు. ఎంత బంగారం ఉన్నా, ఎంత ధనం పోగువేసినా..చివరికి మనకు మిగిలేది, అవసరమయ్యేది ఒక్క ముద్ద మాత్రమే. కడుపునిండా తినగలిగినవాడిని మించిన ధనవంతుడు, అదృష్టవంతుడు మరొకడులేడు. ఇది తెలుసుకోలేనివారు, భవంతులు, వాహనాలు చూసుకుని అదే గొప్ప అనుకుంటారు. కానీ, అసలయిన అదృష్టం ఆహారం లభించటం, దాన్ని సేవించగలగటం. అది లేకపోతే, ఏది ఎంత వున్నా కరువుకాటకాలే, కష్టదినాలే.
(ఇంకా ఉంది)