Site icon Sanchika

శ్రీవర తృతీయ రాజతరంగిణి-32

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ సర్గ

సర్వస్మిన్ దివసే రాత్రావపి భిక్షు పరంపరాః।
శరా ఇవాలిషన్ దేహే గేహే దాన్యవహే తదా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 17)

బాణాలు శరీరంలోకి దిగబడినట్టు, రాత్రింబవళ్లు భిక్షువుల పరంపర, ధాన్యం ఉన్న ఇళ్లల్లోకి జొరబడుతూండేవారు.

ధాన్యవద్ గృహ సందిష్టకృష్ట కంభు కదంబకాః।
నీర సాపూప భోగేనాప్య రక్షన్ కేపి జీవితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 18)

కొందరు ఇళ్ళల్లో దూరి దొరికిన ధనాన్ని తీసుకుని, ఆహారం అమ్మే స్థలాలకు వెళ్ళి ఆహారం కొనుక్కుని తిని బ్రతికేవారు.

శ్రీవరుడు ‘ఆహారం’ అన్న పదం బదులు ‘అపూప్’ అన్న ఖాద్య పదార్థం పేరు వాడేడు. ఇది గోధుమ పిండితో చేసే తీపి పదార్థం. ఈ ‘అపూప్’ లను కొనుక్కుని తిని ప్రాణాలు కాపాడుకునేవారట ఆనాటి ప్రజలు. ఈ ‘అపూప్’ ను ‘తీపి పూరి’ అనవచ్చు.

పాలీపాలీ వతాసక్త శ్పం కటంకిత భోజనః।
చిరాచిరాస్వాదరతః కోపి కోపి హతోభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 19)

కొందరు ఆలస్యంగా తినటం వల్లనో, అంటే భోజనానికీ భోజనానికీ నడుమ సుదీర్ఘమైన అంతరం ఉండటం వల్లనో – కొందరు దొరికినది దొరికినప్పుడల్లా అంతరం అన్నది లేకుండా తినటం వల్లనో ప్రాణాలు కోల్పోయారు.

కొందరికి తిండి దొరికేది కాదన్న మాట. దాంతో వారు ఒక పూట తింటే, మరెన్ని రోజులకు మళ్ళీ తిండి దొరుకుతుందో లేదో తెలిసేది కాదు. ఇలా భోజనానికీ భోజనానికీ నడుమ సుదీర్ఘమైన విరామం   ఉండటం వల్ల వారు తిండి లేక మరణించారు. కొందరు దొరికినప్పుడే తిండి తినాలన్న ఆత్రంతో, ఇప్పుడు కాదంటే, మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియక, ఇక దొరకదేమోనన్న భయంతో వెంటవెంటనే తిని ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు రకాల స్థితులలో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి చెప్పటం వల్ల శ్రీవరుడు కశ్మీరం లోని కరువు తీవ్రత, ఆకలి చావుల స్వరూపాలను ఎత్తి చూపిస్తున్నాడు.

క్షీణా గ్రామేషు వాస్తవ్యాః కెచిదన్నామృతాప్తయే।
శాకామూలాఫలాహారా వ్రతనిష్ఠా ఇవాభవన్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 20)

క్షీణించి బలహీనులైన గ్రామీణులు అన్నాన్ని అమృతంలా భావించి దాని కోసం పరితపించారు. వారు ఏదో వ్రతం చేస్తున్నట్టు దొరికిన ఆకులు, ఫలాలు   తింటూ బ్రతకాలని ప్రయత్నించారు.

వారికి అన్నం దొరకటం లేదు. కాబట్టి దొరికినదేదో తిని ప్రాణాలు నిలుపుకుంటున్నారు. అన్నం వారికి అమృతంతో సమానమై పోయింది.

చిరాష్టంకాన్తరే క్షిప్త్వా శాక కిమపి తండులమ్।
పక్త్యాన్యే కేపి తద్యోగాడకృర్వన్ ప్రాణాధారణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 21)

కొందరు, ఆకులతో బియ్యాన్ని కలిపి వండి తిని ప్రాణాలు కాపాడుకున్నారు. ఆకుకూరలు బియ్యం కలిపి వండుకున్నారట. ఆకుకూరలు అధికం, బియ్యం కొద్దిగా వండి తిని కడుపు నింపుకున్నారు.

సర్పిర్లవణ తైలానాం తండులేన మహార్వతా।
హుతా నీచేన సాధునామివ సర్వోపయోగినామ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 22)

నీచుల అహంకారం ఎలా మంచివారి గొప్పతనాన్ని చులకన చేస్తుందో, అలాగ పెరుగుతున్న బియ్యం ధర వల్ల నెయ్యి, ఉప్పు, నూనెల ధరలు తక్కువగా కనిపిస్తున్నాయి.

కరువు కాలంలో దేని ధర అయినా ఆకాశాన్ని అంటుతుంది. కానీ అన్నిటికన్నా ఎక్కువగా ప్రజలు  బియ్యం కోసం ఆరాటపడటంతో బియ్యం అతి విలువైనదయింది. దాని ధర ముదు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఇది అన్నం కోసం ఆరాటాన్ని చూపిస్తుంది.

అన్నం తినకపోతే మిగతా ఎన్ని తిన్నా తిన్నట్టు ఉండదు. అందుకని ఆకులతో బియ్యం కలిపి వండుకుని తిన్నారు ప్రజలు. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు వదిలి బియ్యం దొంగిలించారు. నాణేలు ఎత్తుకుపోయి బియ్యం కొనుక్కున్నారు. బియ్యం దొరక్క ఏది దొరికితే అది.. ఆకులు, గడ్డలు, శాఖలు తిన్నారు. వారికి అన్నం అమృతంలా తోచింది.

శ్రీవరుడి కరువు వర్ణనలు ఎదను కలచి వేస్తాయి. నిజానికి అతి దగ్గరగా ఉంటాయి. కానీ కవిత పంథాను వదలవు. ఒక వార్తను చెప్తున్నట్టు చెప్తూ ఒక అలంకారం జోడిస్తాడు, చెప్తున్న వార్త ప్రభావం మరింత తీవ్రమయ్యేందుకు. బియ్యం ధర పెరగటంతో ఇతర వస్తువుల ధరలు తగ్గాయట. అదీ ఎలా, నీచుల అహంకారం మంచివారి గొప్పతనాన్ని చులకన చేసినట్టు. నీచుడికి మంచి చెడు స్పృహ ఉండదు. వాడికి తాను గొప్ప అనుకున్నదే గొప్ప. మిగతావారిలో ఎలాంటి గొప్పతనం వాడికి కనబడదు. మంచివారి గొప్పతనం వాడికి అర్థం కాదు. చులకన చేస్తాడు. నెయ్యి, నూనె వంటివి విలువైన వస్తువులు. ఒకప్పుడు ఎంతో ధనవంతులు మాత్రమే నెయ్యిని వాడగలిగేవారు. సామాన్యులు ప్రత్యేక సందర్భాలలో నెయ్యిని వాడేవారు. అలాంటివన్నీ బియ్యం ముందు వెలతెల పోతున్నాయి, కశ్మీరం లోని కరువు పరిస్థితిలో. ఎందుకంటే, ప్రాణం నిలిచేది బియ్యం వల్లనే. నెయ్యి, నూనె, ఉప్పుల వల్ల కాదు.

బహుధాన్య కథానిష్ఠో యోభూత్ పూర్వం పురాన్తరే।
బహుధాన్య కథానిష్ఠ స్తత్కాలం స వ్యలోక్యత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 23)

ఒకప్పుడు తమ దగ్గర ఉన్న ధన ధాన్యాల గురించి అధికంగా మాట్లాడేవారు కూడా ఇప్పుడు కేవలం బియ్యం గురించే మాట్లాడుతున్నారు.

బంధజీవస్తథా కన్దో బంధుజీవ ఇవాభవత్।
మందాన్ సంధారాయామాస క్షుధాన్ధాన్ యోన్ధాసా వినా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 24)

ఆహారం కోసం ప్రజలు గ్రుడ్డివాళ్లయి పోయారు. వారికి ఆహారం తప్ప ఏమీ కనబడడం లేదు. వారికి పుష్పాలు కనిపించినా బాధ కలుగుతోంది తప్ప ఆనందం కలగటం లేదు. ఆకలి అన్నిటినీ మరపింపచేస్తున్నది. ఇప్పుడు వారికి ఆనందం కలిగించేది కేవలం ఆహారం మాత్రమే.

ధాన్యఖారేః క్రయః పూర్వం దీన్నారాణాత శతత్రయమ్।
దుర్భిక్షతస్తదా సార్ధసహస్రేణాపి నాపి సా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 25)

గతంలో మూడు వందల దీనారాలకు ఖారీ ధాన్యం లభించేది. కానీ ఇప్పడు 1500 దీనారాలిచ్చినా ఖారీ లభించటం లేదు.

‘దీనారం’ అన్నది సంస్కృత పదం. దశకుమార చరిత్రలో దీనారం పదం వాడకం కనిపిస్తుంది. భారతీయుల దీనారం బంగారు నాణెం. రానురాను ఇతర లోహాలతో తయారు చేసిన నాణేలను కూడా దీనారాలు అనటం ఆనవాయితీ అయింది. అరబ్బుల ‘దిరహమ్’ దీనార్‌కు రూపాంతరమే. ‘దీనారియమ్’ అన్నది రోమన్‌లో రూపాయలను సూచించేందుకు వాడేవారు. ఇరాన్, సిరియాలను అరబ్బులు ఆక్రమించక ముందు ‘దీనార్’ వాడకంలో ఉండేది. తమ విజయసూచకంగా అరబ్బులు ‘దీనార్’ను తొలగించి ‘దిరహమ్’ వాడకాన్ని ఆరంభించారు.

‘ఖారీ’ అన్న పదానికి ‘గాడిద మోసేంత బరువు’ అన్న అర్థం ఉంది. అంటే ఒక్క దీనారం ఇస్తే, గాడిద మోసేంత బరువు ఉన్న ధాన్యం లభించేది అన్న మాట. కానీ ఇప్పుడు 1500 దీనారాలు ఇచ్చినా ఏమీ లభించటం లేదు.

‘ఖారీ’ అన్న పదం ఋగ్వేదంలో చతుర్థ మండలంలో కనిపిస్తుంది.

పాణిని కూడా కొలతలను వివరిస్తూ ‘ఖారీ’ అన్న పదాన్ని వాడేడు. క్షేమేంద్రుడు కూడా ‘ఖారీ’ లేక ‘ఖారికా’ అన్నాడు.

శ్రీవరుడి ఈ శ్లోకం నాటి దుస్థితిని ప్రదర్శిస్తుంది. ఒక పూట కడుపు నిండాలంటే ఎంత ధనం అవసరమో ఎత్తి చూపిస్తుంది. ధనవంతులు సైతం కడుపు నింపుకునేందుకు కష్టపడేవారన్నమాట.

కిమన్యత్ కుత్రచిద్ రాష్ట్రే ధాత్రా నిష్కించనో జనః।
అభవన్మండ కుండస్య కాంచికేనాపి వంచితః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 26)

అప్పటి పరిస్థితుల గురించి ఏమి చెప్పాలి? రాజ్యంలో ప్రజలకు గంజి కూడా లభించని దుస్థితి నెలకొని ఉంది.

యత్ పూర్వమకరోద్దేలం రసవద్ వ్రీహిశాలిషు।
మన్యే తేనైవ శాపేన భయమాపత్ ప్రజేద్దశామ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 27)

గతంలో ఆహారాన్ని హేళన చేసిన పాపానికి ఈనాడు తిండి లభించక కష్టపడే కాలం దాపురించింది.

సాధారణంగా సమృద్ధిగా లభిస్తున్నంత కాలం వస్తువు విలువ తెలియదు. కానీ కాలం చాలా కఠినమైనది. ఎవరెవరికి ఎలాంటి గుణపాఠాలు నేర్పాలో అలాంటి పాఠాలు  నేర్పుతుంది. అహంకారాన్ని అణచి వేస్తుంది. విర్రవీగే వాడిని వెర్రివాడిని చేస్తుంది. అందుకే కాలాన్ని దైవంలా భావించి జాగురూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. కశ్మీరంలో ఆహారం లభించని దుస్థితి చూస్తుంటే గతంలో ఆహారం సమృద్ధిగా లభిస్తున్నప్పుడు ‘ఇది బాగా లేదు’, ‘అది బాగా లేదు’, ‘ఇది నేను తినను’ అంటూ చులకన చేసిన పాపానికి ఈనాడు బియ్యం అన్నది లభించని దుస్థితిని అనుభవిస్తున్నట్టున్నారు కశ్మీరీయులు.

ప్రజలు ఇలా ఆహారం లేకుండా ఇక్కట్ల పాలవుతుంటే దయాళువు అయిన జైనులాబిదీన్ ఏమీ పట్టనట్టు కూర్చోలేదు. కరువు దయనీయ స్థితిని వర్ణించిన శ్రీవరుడు జైనులాబిదీన్ చేపట్టిన చర్యలను ఇక్కడి నుంచి చెప్పటం ఆరంభించాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version