[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
తృతీయ సర్గ
తృష్టః ప్రసాదమతులం కురుతే క్షణాధ్యః
క్రుద్ధః ప్రజాసు కురుతే భయంప్రత్కర్మమ్।
ఉన్మత్తపార్థివపతేరివ హన్త ధాతోర్లీలాస్వతంత్రచరితం
భువి చుష్యతే కైః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 1)
సంతోషం కలిగినప్పుడు ప్రజలపై అనంతమైన వరాలను కురిపిస్తాడు రాజు. కోపం కలిగినప్పుడు ప్రజలను భయభ్రాంతులను చేస్తాడు. రాజులాగే విధాత కూడా ఒక్కోసారి వరాలు కురిపిస్తాడు, మరోసారి తీవ్రమైన కష్టాలను కలుగచేస్తాడు. స్వతంత్రంగా వ్యవహరించే రాజును, విధిని ఎవరు అర్థం చేసుకోగలరు? వారి చర్యలను ఎవరు అర్థం చేసుకోగలరు?
మూడవ సర్గ ఆరంభం లోనే విధిలీలను ప్రస్తావించాడు శ్రీవరుడు. భారతీయ రచయితలు చరిత్ర రచనను రసవిహీన రచనగా భావించలేదు. చరిత్ర అన్నది మానవ జీవిత చరిత్రతో సమానం. జీవిత చరిత్రలు కేవలం వ్యక్తుల జీవితాల గురించో, వారు సాధించిన, జయాపజయాల గురించో మాత్రమే కాదు. మానవ జీవిత అధ్యయనం ద్వారా సృష్టి రచనలో భగవంతుడి ప్రణాళికను గ్రహించటం, విధి చేసే విచిత్రి లీలలను అధ్యయనం చేయటం ద్వారా భవిష్యత్తు తరాలు గుణపాఠాలు నేర్చుకునేట్టు చేయటంతో పాటు మానవ జీవితంలోని అనూహ్యమైన అంశాలను ఎత్తి చూపించటం ద్వారా క్షణభంగురమైన జీవిత తత్త్వాన్ని బోధపరచమే కాదు, విధి ఆడించే ఆటలో మానవుడు ఒక తోలుబొమ్మ మాత్రమే అన్న గ్రహింపుకు తేవటం కూడా చరిత్ర రచన, అధ్యయనాలలో భాగమే. అది కావ్య రచన అయినా, చరిత్ర రచన అయినా, ప్రేమగాథ అయినా, భక్తి గ్రంథమయినా, ప్రధానంగా భారతీయుల దృష్టి వ్యక్తి నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం వైపే. శ్రీవరుడు రాజతరంగిణి రచనలో కూడా అదే ప్రదర్శిస్తున్నాడు.
మూడవ సర్గ విషాదభరితమైనది. విధిలీలలు అర్థం కావు. కాలం ఒకసారి వర్షపు జల్లు కురిపిస్తే, మరోసారి వడగాడ్పులతో నిప్పులు కురిపిస్తుంది. ఎందుకు? అని మానవుడు తనను తాను ప్రశ్నించుకుంటాడు కానీ సమాధానం రాదు. విధి స్వతంత్రమైనది. ఎవరి మాట వినదు. ఎవరి ప్రార్థనలకు లొంగదు. ఎవరి నివేదనలను, అభ్యర్థులను ఖాతరు చేయదు. ఏది ఎందుకు జరిగిందో ఎలాంటి వివరణలు ఇవ్వదు విధి. ఎవ్వరేమనుకున్నా లెక్క చేయదు. ఒకరికి మంచి జరుగుతుంది. ఒకరికి చెడు జరుగుతుంది. శిఖరానికి ఎగబ్రాకుతున్నవాడు కన్నుమూసి కన్ను తెరిచేలోపు నెత్తురు కక్కుకుని నేల రాలిపోతాడు. ఏదో సాధిస్తాడనుకున్న వాడు హఠాత్తుగా అదృశ్యమైపోతాడు. ఎందుకూ పనికిరానివాడనుకున్నవాడు ఎంతో గొప్ప వాడవుతాడు. అందుకే విధి లీలలు విచిత్రం, సర్వ స్వతంత్రం.
శ్రీవరుడు విధి గురించి ఇంతగా వివరించటానికి కారణం తరువాతి శ్లోకాల వల్ల తెలుస్తుంది.
షట్‌త్రింశవర్ష దుర్భిక్ష దుఃఖవిస్మరణం జనః।
న యావద్ కరోత్ తావ దష్టాత్రింశోపి వత్సరౌ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 2)
ప్రజలు ఇంకా 36వ సంవత్సరంలో అనుభవించిన దుఃఖాన్ని పూర్తిగా మరచిపోకముందే 38వ సంవత్సరంలో కూడా..
వృష్టయా సహ రజోవర్షమపతద్ గగనాద్ భువి।
ఉదీపక్ష తశాల్యుత్థ భావి దుర్భిక్ష సూచకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 3)
ఆకాశం నుంచి ధూళి వర్షం కురిసింది. ఆ వర్షం వల్ల పంటలన్నీ నాశనమయ్యాయి. భవిష్యత్తులో కలిగే కరువు కాటకాలకు సూచనగా నిలచిందీ సంఘటన.
కశ్మీరులో ధూళి వర్షం కురవటం గురించి గతంలో చర్చించుకున్నాము. ధూళి వర్షం కురవటంతో పంటలు పాడవుతాయి. సరైన తిండి దొరకదు. అది కరువు కాటకాలకు దారి తీస్తుంది. ఆపై వచ్చే వరదలూ, మంచుతుఫాన్లు ప్రజల ఇక్కట్లును తీవ్రం చేస్తాయి.
అథాచిరేణ గర్జన్తో ధృతచాపా ఘనా ఘనా।
జనానుధ్వేజయామాసుః శరాసరై రివారయః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 4)
త్వరలోనే ఆకాశంలో మేఘాలు గర్జించటం ఆరంభించాయి. ఇంద్రధనుస్సు ఏర్పడింది. శత్రువులు బాణాల వర్షం కురిపించినట్లు ఆకాశం నుండి వర్షం కురిసింది. ప్రజలను భయభ్రాంతులను చేసింది.
కశ్మీర ప్రజలకు దుర్దినాలు ఆరంభమయ్యాయి.
కల్హణుడు తన రచనకు రాజతరంగిణి అని పేరు పెట్టటంలోని ఔచిత్యం అడుగడుగునా అర్థమవుతూంటుంది.
జైనులాబిదీన్ పాలన – ఇస్లాం పాలన ఆరంభమయిన తరువాత కశ్మీరులో ‘స్వర్ణయుగం’ లాంటిది. ఈనాడు కశ్మీరులో ‘మంచి’ అన్న ప్రతిదానికీ బీజం ఆనాటి జైనులాబిదీన్ పాలన కాలంలో కనిపిస్తుంది. ఈనాటికీ కశ్మీరు ప్రజల వృత్తులలో, జీవన విధానంలో, ఆలోచనలలో, సాంఘిక పద్ధతులతో కూడా జైనులాబిదీన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జైనులాబిదీన్ ఒక ఉత్తుంగ తరంగం లాంటివాడు. అతని తరువాత వచ్చినవారు పైకి ఎగిసే తరంగం లాంటి వారు కారు. అంటే ఎగసి పడిన తరంగం తరువాత అంతగా శక్తిలేని తరంగం వంటి రాజులు రాజ్యానికి వచ్చారన్న మాట. ఆ తరువాత కాస్త పైకి ఎగిరిన తరంగం లాంటి రాజు వచ్చాడు. ఇలా ఉథ్థాన పతనాల తరంగాలతో కూడిన తరంగిణి లాంటిది రాజుల చరిత్ర. అందుకే ఇది రాజతరంగిణి అయింది. అత్యుత్తమ రీతిలో రాజ్యం చేసిన జైనులాబిదీన్ చివరిదశ విరుగుతున్న తరంగాన్ని తలపింపచేస్తుంది. ధూళి వర్షం కురిసింది. పంటలు నాశనమయ్యాయి. ఇంతలో కుంభవృష్టి కురిసింది.
వృష్టుయు పద్రవ సంనద్ధాః ఫలర్ద్వి హరణాకులాః।
ఉత్థితా బుద్భు దర్యాజాద్ దృష్ట్యా నాగఫణా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 5)
నదుల ఉపరితలంపై పడుతున్న వర్షపు చినుకుల వల్ల ఏర్పడిన బుడగలు, పంటలను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న తల ఎత్తిన పాముల పడగల్లా ఉన్నాయి.
అద్భుతమైన వర్ణన!
ఇక్కడే భారతీయ సృజనాత్మక కవుల గొప్పతనం తెలిసేది. వారు చెప్తున్నది రాజుల కథ. ఈ రాజు ఫలానా సంవత్సరం జన్మించాడు, ఫలానా ఫలానా రాజులను ఓడించాడు. పన్నులు వసూలు చేశాడు. ఫలానా శాసనాలు వేశాడు. ఇలా రాస్తూ పోవటం చరిత్ర రచనగా భావిస్తారు. కానీ అది చదవటానికి విసుగు కలిగిస్తుంది. ఏ మాత్రం ఉత్సాహం కలిగించదు. ఇందుకు భిన్నంగా భారతీయ చరిత్ర రచయితలు చరిత్ర రచనను రసమయం చేస్తారు. చరిత్ర చదవటం ఒక రసప్రవాహంలో ఈదులాడే అనుభవంలా మలచారు.
ఇక్కడ కవి వర్ణించేది కుంభవృష్టిని. వరదలకు కారణమైన వర్షాన్ని. అపుడు ఘోరమైన వర్షం కురిసింది. కశ్మీరును జలమయం చేసింది అని రాయటం ఎంత సులభమో, దాన్ని చదివి మరచిపోవడటం కూడా అంతే సులభం. కానీ శ్రీవరుడి వర్ణనను మరచిపోవటం కష్టం. దాని వెంట వచ్చిన చరిత్ర కూడా గుర్తుంటుంది. శ్రీవరుడి వర్ణన ఎంత అద్భుతంగా ఉందంటే, ఎక్కడ నీటిలో బుడగలను చూసినా పడగ విప్పిన పాము గుర్తుకు వస్తుంది.
బుడగలు పడగలు విప్పిన పాముల్లా కనిపించటం కవి ఊహ. కానీ అవి పంటలను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న పాములలా కనిపించటం, కురుస్తున్న వర్షం వల్ల సంభవించే దుష్పరిణామాన్ని సూచిస్తున్నది. ఔచితీవంతమైన వర్ణన ఇది.
(ఇంకా ఉంది)