శ్రీవర తృతీయ రాజతరంగిణి-36

3
2

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ సర్గ

ఉత్పన్నధ్వసినో భావాన్ కరిష్యాభ్యహమంజసా।
ఇతి జ్ఞాపయితు మేఘో బుద్బుదానసృజద్ ధృవమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 6)

సమాజంలో ప్రతీదాన్ని ధ్వంసం చేస్తానని బెదిరిస్తున్నాయి, నీళ్లల్లో బుడగలు వచ్చేందుకు కారణమైన మేఘాలు.

ఇంతకు ముందు శ్లోకంలో బుడగలు సర్వం నాశనం చేసేందుకు పడగలెత్తిన పాముల్లా ఉన్నాయన్నాడు శ్రీవరుడు. ఈ శ్లోకంలో, ఆ బుడగలు వచ్చేందుకు కారణమయిన మేఘాలు, సమాజంలో ఉత్పన్నమయిన ప్రతీదాన్ని నాశనం చేస్తాయని బెదిరిస్తున్నట్లు ఉన్నాయని అంటున్నాడు.

ప్రళయకాల మేఘాలన్నమాట. అప్పటికే కశ్మీరులో నదులు ఉగ్ర రూపం ధరించి సర్వం ముంచెత్తుతున్నాయి. ఇంతటితో ఆగము, ఇంకా విధ్వంసాన్ని కొనసాగిస్తామన్నట్టు బెదిరిస్తున్నట్టున్నాయన్నమాట మేఘాలు.

ఈ విశ్వంలో ఏదీ ఒంటరిగా రాదు. ప్రతీ దానికీ మరొకటి కారణమవుతుంది. దానికి ఇంకోటి కారణమవుతుంది. కానీ మనుషులు పైపై కారణాలు చూసి తీర్మానించేస్తారు. తరచి చూస్తే కానీ గొలుసులా ఒకదానితో మరొకటి సంబంధం ఉన్న కార్యకారణ సంబంధం బోధపడదు. మానవ జీవితం వంద సంవత్సరాలు మాత్రమే. కానీ సృష్టి కొన్ని కోట్ల సంవత్సరాలది. సృష్ట్యారంభంలో వెలువడిన తరంగాలను ఇంకా శాస్త్రవేత్తలు కనుగొంటునే ఉన్నారు. వాటి ప్రభావాన్ని విశ్లేషిస్తూనే ఉన్నారు. అంటే ఎక్కడో ఒక సీతాకోకచిలుక రెక్కలు అల్లాడించటం వల్ల ఉత్పన్నమయిన వాయు తరంగాల ప్రభావం ఎంతో కాలం తరువాత జరిగే పరిణామాలకు కారణమవుతుందంటుంది విజ్ఞానశాస్త్రం. దీనిని Chaos theory లో butterfly effect గా వర్ణిస్తారు.

ఈ సిద్ధాంతం ప్రకారం భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే తుఫానుకు ఈనాడు ఒక సీతాకోకచిలుక రెక్కలు అల్లార్చటం వల్ల చెలరేగే వాయు తరంగాలు కారణమవుతాయి. అంటే, ఆరంభంలో కలిగే ఒక చిన్న మార్పు భవిష్యత్తులో జరిగే అతి తీవ్రమైన మార్పులకు కారణమవుతుంది. విజ్ఞానశాస్త్రవేత్తలు దీన్ని butterfly effect అన్నారు. భారతీయ శాస్త్రవేత్తలు కార్యకారణ సంబంధం అన్నారు. ఈ కార్యకారణ సంబంధం వివరించేందుకు పురాణాలు బోలెడన్ని ఉదాహరణలు చెప్తాయి.

ఓ మహర్షి దైవ గృహంలోకి వెళ్తుంటే అడ్డుపడ్డారని ద్వారపాలకులకు శాపం ఫలిస్తుంది. ఫలితంగా వారు అయిదు రాక్షస జన్మలు పొందుతారు. మనిషి జీవితం సృష్టి వైశాల్యంతో పోలిస్తే బహు అల్పం. దాంతో ఎప్పుడో పొందిన శాపం, ఫలితంగా పొందుతున్న జన్మల నడుమ సంబంధాన్ని గుర్తించలేకపోతాడు మనిషి. ఆ నిజాన్ని అతి సూక్ష్మంగా స్ఫురింప చేస్తున్నాడు శ్రీవరుడు.

నీటిలో బుడగలు వర్షం వల్ల ఉత్పన్నమవుతాయి. వర్షం మేఘాల వల్ల భువిని చేరుతుంది. మేఘాలు భూమిపై నీరు ఆవిరి కావటం వల్ల ఏర్పడతాయి. నీరు సూర్యుడి వేడి వల్ల ఆవిరి అవుతుంది. సూర్యుడి వేడి భూమిని చేరే పరిమాణం భూమిపై మానవుల కార్యకలాపాలపై, వాటికి ప్రకృతి ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది. అంటే, ప్రత్యక్షంగా ప్రకృతి కారణంగా కనిపిస్తున్నా, పరోక్షంగా మనిషి తన చర్యల ప్రభావాన్ని తానే అనుభవిస్తున్నాడన్న మాట. కర్మ ఫలాన్ని అనుభవించటం అంటే ఇదే!

వృక్షాః సర్వత్ర పత్రాంతః పతద్వృస్వనచ్ఛలాత్।
అశ్రుబిందూనివాముంచన్ రూదన్తో జనచిత్తయా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 7)

చెట్ల ఆకులపై చిందే నీటి బిందువుల శబ్దం ఎలా ఉందంటే, భవిష్యత్తులో మానవులు అనుభవించే నష్టాలకు తలచుకుని వృక్షాల పత్రాలు రోదిస్తున్నట్టుగా ఉంది.

అద్భుతమైన వర్ణన!

మానవ మనస్తత్వాన్ని చక్కగా చిత్రించే వర్ణన ఇది.

మనిషి మనస్తత్వంలో ఓ వైచిత్రి ఉంది.

ఎదురుగా ఏమైనా ఉండనీ, మనిషి తాను చూడాలనుకున్నది చూస్తాడు.

ఎదురుగా ఏమైనా ఉండనీ, అతని మనసు ఏమి ఆలోచిస్తుందో అదే కనిపిస్తుంది, చూపిస్తుంది. ఇక్కడ శ్రీవరుడు భవిష్యత్తులో కశ్మీరు అనుభవించే ఇక్కట్లును వర్ణిస్తున్నాడు. కాబట్టి చెట్ల ఆకులపై పడుతున్న వర్షపు నీటి బిందువుల ధ్వని, మానవుల ఇక్కట్లను తలచుకుని చెట్లు రోదిస్తున్నట్టుగా ఉందంటున్నాడు.

మనిషి మనసులో ఉన్న భావన ప్రకృతిని అతడు అర్ధం చేసుకునే విధానాన్ని ప్రభావితం చేస్తుంది.

అదే, ఓ ప్రేయసి ప్రియుడి సమాగమం కోసం ఎదురుచూస్తుంటే, చెట్ల ఆకుల ప్రతి శబ్దం ప్రియుడి పద ధ్వనిలా వినిపించేది. ప్రియుడి గుసగుసలుగా అనిపించిది. ప్రియుడి రాకకు స్వాగత గీతంలో తోచేది.

ఔచితీవంతమైన వర్ణన ఇది.

ఇలాంటి వర్ణన రచన సంవిధానంలో ఒక పద్ధతి. ఈ వర్ణన వల్ల ప్రకృతికి జరగబోయేది తెలుస్తుందన్న భావన కలుగుతుంది. ప్రకృతి ఇలా రోదించటం వల్ల కశ్మీరు ప్రజలు పడే ఇక్కట్ల గురించిన గ్రహింపు వచ్చి పాఠకుడి హృదయం బరువెక్కుతుంది. ఉద్విగ్నత పెరుగుతుంది.

నిజానికి కథా రచన కానీ, నవల రచన కానీ పాశ్చాత్య ప్రక్రియలనీ, వాటిని రచించేందుకు నియమాలు, సూత్రాలు పాశ్చాత్యులు ఏర్పాటు చేసినవి పాటించాలని ఒక తప్పుడు ప్రచారం సాహిత్య ప్రపంచంలో సాగుతోంది. కానీ మౌలికంగా రచన అన్నది ఏ ఒక్కరి సృష్టి కాదు. అది ప్రాకృతికంగా సృష్టి రచనలో ఇమిడి ఉన్నది. ఈ రచన సంవిధానాన్ని అవగాహన చేసుకున్న భారతీయులు, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించి రూపొందించిన లాక్షణిక సూత్రాలను మించిన రచన సంవిధాన నిర్దేశనా సూత్రాలు ప్రపంచంలో వేరేవి లేవు. మిగతా సూత్రాలన్నీ కృత్రిమమూ, కృతకమూ మాత్రమే. శ్రీవరుడు రచన చేసే సమయానికి భారతదేశంలో పాశ్చాత్య రచన సూత్రాలు ప్రచారంలోని రాలేదు. అందుకే ఔచితీవంతమైన వర్ణనలతో, అతి చక్కని రచన సంవిధానంతో ఆసక్తికరంగా, ఉద్విగ్నతామయంగా, ఆలోచనా స్ఫోరకంగా ఉంది రచన. సృష్టి రచన ప్రణాళికపై అవగాహన కలిగించే రీతిలో సాగుతోంది.

వితస్తా లేదరీ సింధుక్షిప్తికాద్యాస్తదాపగాః।
అన్యోన్య స్వర్ధయేవోగ్రా గ్రామాంస్తీరేశ్వమజ్జాయన్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 8)

ఆ సమయంతో కశ్మీరు లోని – వితస్త, లేదరీ, సింధు, క్షిప్తికా నదులు ఉగ్ర రూపం ధరించటంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టుగా, తీర ప్రాంతంలలో ఉన్న గ్రామాలను ముంచెత్తాయి.

అతి చక్కటి వర్ణన.

వరదల్లో ఉన్నప్పుడు నదులు పొంగిపొర్లటం, ఊళ్ళకు ఊళ్ళను ముంచెత్తటం సర్వసాధారణంగా జరిగేదే. సాధారణమైన విషయాన్ని అసాధారణంగా చెప్పటమే సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం.

చూసింది చూసినట్టు, ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సృజనాత్మకత అన్నట్టు చేస్తున్న దుష్ప్రచార ప్రభావానికి గురయిన సాహిత్య ప్రపంచంలో “ఆకాశం నల్లగా ఉంది, చంద్రుడు తెల్లగా ఉన్నాడు, నీళ్లు నీలంగా ఉన్నాయి” అనటమే ఉత్తమ సృజనాత్మకతగా చలామణీ అవుతోంది. ఇలాంటి కాలం కన్నా ముందు వాడు కాబట్టి శ్రీవరుడు నదులు పొంగిపొర్లటాన్ని, ఊళ్ళను ముంచెత్తటాన్ని – ఉగ్రరూప ప్రదర్శనలో నదులు పోటీ పడుతున్నట్లుగా వర్ణించాడు.

వితస్త నది ఝీలమ్ నదిగా తెలుసు. లేదరీ నది అసలు పేరు ‘లంబోదరి’. ‘లంబోదరి’ అనే పదం అపభ్రంశం ‘లేదరీ’! అనంతనాగ్, విజయేశ్వరిల నడుమ ఈ నది వితస్తతో కలుస్తుంది. ఈ నది ఒడ్డుననే ‘పహల్‌గాంవ్’ ఉంది. సింధు నదిని కశ్మీరీ సాహిత్యంలో ‘ఉత్తర గంగ’ అంటారు. ద్రాస్, హరముఖ పర్వతాల నుంచి ఈ నదికి నీళ్లు అందుతాయి. సోనామార్గ్, కంగన్, గాందార్ బల్‌ల గుండా ప్రవహిస్తూ వితస్తలో విలీనమవుతుంది. ఈ నదిది తీవ్ర గతి. క్షిప్తికా నది శ్రీనగర్ గుండా ప్రవహిస్తుంది.

ఈ నదులన్నీ తీవ్రరూపం దాల్చి ఒడ్డున ఉన్న గ్రామాలను పోటీపడి ముంచెత్తాయి.

సవిభ్రమా ధృతావర్తా వాహిన్యుత్థాః సహేపితాః।
జవాదధావన్నుతుంగా స్తతరంగ తురంగమాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 9)

ఈ నదుల అలలు ఆశ్వాల( వాహినిల) వేగంతో ఎగసిపడి పరుగులెత్తాయి. ఈ తరంగాల శబ్దాలు యుద్ధ సమయంలో పరుగులెత్తే అశ్వాల సకిలింపుల శబ్దాలకు మించింది.

నదులు ఉగ్రరూపం దాల్చాయి. కాబట్టి, ఆ నదుల్లో ఎగిసిపడే తరంగాల వేగాన్ని అశ్వాల వేగంతోనూ, తరంగాలు ఎగసిపడుతూంటే ఉత్పన్నమవుతున్న హోరును యుద్ధ సమయంలోని అశ్వాల అరుపులతోనూ పోల్చటం ఔచితీమంతం. యుద్ధ సమయంలో ‘వాహిని’ అనటంతో మరింత భీకరమైన దృశ్యం కళ్ళ ముందు నిలుస్తుంది.

‘వాహిని’లో అయిదు వందల ఏనుగులు, 500 రథాలు, 1500 అశ్వాలు, 2500 పదాతిదళాలు ఉంటాయి. ఇలాంటి దశ సేనలను ‘పృతన’ అంటారు. పది పృతనాలు కలిపి ఒక ‘వాహిని’ అవుతుంది. అలాంటి ‘వాహిని’ ఘోషలా ఉందట తరంగాల ఘోష!

కశ్మీరీయుల లెక్కకు భిన్నమయిన లెక్క మహాభారతంలో కనిపిస్తుంది. మౌలికమైన ‘పత్తి’ అంటే అయిదుగురు సైనికులు, ముగ్గురు అశ్వికులు, ఒక ఏనుగు, ఒక రథం. మూడు ‘పత్తి’లు కలిస్తే, ఒక ‘సేనాముఖ’. మూడు ‘సేనాముఖ’లు కలిస్తే, ఒక ‘గుల్మా’. మూడు ‘గుల్మా’లు ఒక ‘గణం’. మూడు గణాలు కలిస్తే ఒక ‘వాహిని’. మూడు వాహినులు కలిస్తే ఒక ‘పృతాన’ అయితే, లెక్కలేమయినా శ్రీవరుడు చెప్పదలచుకున్నది అర్థమవుతుంది. చూపదలచుకున్న దృశ్యం కనిపిస్తుంది. ఉత్తుంగ తరంగాలతో, అతి వేగంగా దూసుకు వస్తున్న సైన్య శబ్దాలతో కూడి ఉన్న ఉగ్ర నదులు సర్వం ముంచెత్తుతున్నాయి..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here