Site icon Sanchika

శ్రీవర తృతీయ రాజతరంగిణి-37

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ సర్గ

అత్యుంచ పాతకృన్నీచోన్నతిదం చ నిరంకుశమ్।
అసీదపథగం సత్యం తదా జలవిజృంభితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 10)

నీళ్లల్లో అలలు ఎంత ఉధృతంగా వస్తున్నాయంటే, క్రింద ఉన్న వాటిని పైకి ఎత్తుతున్నాయి. పైన ఉన్న వాటిని క్రిందకు తెస్తున్నాయి. ఇలా నిరంకుశంగా ప్రవర్తిస్తూ జలాలు విజృంభిస్తున్నాయి.

పదాలతో దృశ్యాలను కళ్ళ ముందు నిలుపుతూ, ఆ దృశ్యాలలో తానూ ఓ భాగమైన అనుభూతిని మనస్సుకు కలిగించే అత్యద్భుతమైన రచనా సంవిధానం ఇది. నీటి అలలు ఎగసి పడుతున్నాయి. ఆ అలలను వర్ణిస్తున్నాడు శ్రీవరుడు. అలలు ఎగిసి పడేటప్పుడు ద్రోణులు, శృంగాలు ఏర్పడతాయి. అల పైకి ఎగసినప్పుడు అలలు క్రింద ద్రోణిలో ఉన్నవాటిని పైకి లేపుతాయి. ఆ వెంటనే అల ద్రోణి ఏర్పడినప్పుడు ఆ పైన ఉన్న వాటిని క్రిందకు తెస్తాయి. ఇలా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాయట అలలు. ఎగసిఎగసి పడే అలలను చూసిన వారందరికీ ఈ వర్ణన ఆ అనుభవాన్ని తాజా చేస్తుంది. అలలు నిరంకుశమే కాదు,  అల్లరి కూడా చేస్తున్నాయి. ఎవ్వరి మాట వినవు. నిరంకుశమైనవి.

మృదోర్జలస్య తత్కాలేద్రి వృక్ష విటపాలిశు।
కేనోపదిష్టం తత్కాలే మలోత్పాటనపాటవమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 11)

జలం మృదువైనది. ఒక పలచటి కాగితాన్ని చింపేందుకు కొంతయినా శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. కాగితాన్ని చింపేటప్పుడు వ్యతిరేక ఘర్షణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, నీళ్లు అలా కాదు, నీళ్లల్లోకి చేతులు సునాయాసంగా దించవచ్చు. నీళ్లను చీల్చవచ్చు. చొచ్చుకుపోవచ్చు. అంత మృదువైనవి నీళ్ళు. అలాంటి నీళ్ళకు – చెట్లను మూలాలతో సహా పెకిలించి వేయటం ఎవరు నేర్పారు? ఆశ్చర్యపోతున్నాడు శ్రీవరుడు.

పర్వత పాదాల వద్ద నున్న మట్టిని తొలిచేస్తూ, చెట్ల వ్రేళ్లతో సహా చెట్లను పెకిలించి వేసే శక్తి మృదువైన నీటికి ఎలా వచ్చింది? ఇలా వ్రేళ్లతో సహా పెకిలించి వేయటం నీటికి ఎవరు నేర్పారు అని ఆశ్చర్యపోతున్నాడు శ్రీవరుడు.

పర్వత ప్రాంతాలలో భూపాతాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి నీరు మట్టిని కోస్తూ, చెట్లను వ్రేళ్లతో సహా పెకిలించి వేయటం మరింత బాగా అర్థమవుతుంది. గుట్టలు, చెట్లు నీటి తాకిడికి కరిగిపోయి నీటి ప్రవాహంలో భాగం అయితాయి. ఓ వైపు భయం కలిగిస్తున్నా, మరో వైపు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే దృశ్యం అది.

శ్రీవరుడు ఈ సందర్భంగా రచించిన శ్లోకాలు కూడా ఈ రకమైన పరస్పర విభిన్నమైన, అనుభూతిని కలిగించే రీతిలో ఉండటం గమనార్హం.

ఊళ్ళూ, ఇళ్లూ, చెట్లు, గుట్టలను ప్రవాహం పెకిలించుని పోతుండటం ఎంతగా భయాన్ని కలిగిస్తుందో, అంతగా అద్భుతం అనినిపిస్తుంది.

మనిషి మనసులో కలిగే ఈ పరస్పర భిన్నమైన భావనలే మనిషిని సాహసం వైపు ఉసిగొల్పుతాయి. ప్రాణ ప్రమాదం ఉందని తెలిసినా పర్వతారోహణకు సిద్ధమవుతాడు మనిషి. అనేక సాహస కృత్యాలు చేస్తాడు. అలలపై నీటిపై జాలువారాలని తపన పడతాడు. ప్రకృతి శక్తిని ఎదిరించి నిలవాలని తహతహలాడతాడు. ఇలాంటి భావన కలుగుతుంది శ్రీవరుడి వర్ణనలు చదువుతుంటే.

ఓ వైపు ఊళ్ళూ, ఇళ్ళూ కొట్టుకుపోతున్నాయి. ఆస్తినష్టం, ప్రాణనష్టం కలుగుతోంది.

మనిషిగా ఈ పరిస్థితికి బాధపడుతూనే, కవిగా ప్రకృతిలో నిబిడీకృతమైన ఉన్న ఈ సర్వనాశక శక్తిని చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. ఆ వినాశక శక్తి సౌందర్యాన్ని దర్శించి దాన్ని తన అక్షరాలలో బంధించి ప్రదర్శించాలని తపన పడుతున్నాడు.

తుఫాను లోకి ప్రయాణించాలనే సాహసికుడిలో, దాన్ని తన కెమెరాలో బంధించాలని తపన పడే ఛాయాచిత్రకారుడిలో ఎలాంటి తపన కనిపిస్తుందో, ఎగసిపడే అలలతో నిరంకుశంగా ప్రవర్తిస్తూ, తీవ్రమైన కోపంతో సర్వం ముంచెత్తుతున్న నదుల ఆగ్రహావేశాలను అక్షరాలలో బంధించి ప్రదర్శించాలనే శ్రీవరుడి తపన కూడా అలాంటిదే. ఆనందం, ఆశ్చర్యం, బాధ, విషాదం కలగలిసిన అపూర్వ రచన ఈ వర్ణనలు.

మృదువైన జలాలకు ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది?

గుట్టలను సైతం కొట్టుకుపోతూ, చెట్లను వ్రేళ్లతో సహా తీసుకుని వెళ్ళిపోవటం మృదు జలాలకు ఎవరు నేర్పించారు అని ఆశ్చర్యపోతున్నాడు. ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మని రెమ్మరెమ్మకు’ అని ఆశ్చర్యం ప్రకటిస్తున్న కవి ప్రకృతిని చూసి ఎంతగా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాడో, సర్వం తనలో కలిపేసుకుని ప్రవహించే నీటి వినాశక శక్తిని చూస్తూ శ్రీవరుడు కూడా అంతే సంభ్రమాశ్చార్యాలకు గురవుతున్నాడు. అయితే విరిసే పూలను చూసిన కవి హృదయంలో ఆనందాశ్చర్యాలుంటే;  శ్రీవరుడి హృదయంలో భయం, భక్తి కనిపిస్తాయి.

అగ్రాగ్ర పశుగోప్రాణిగృహధాన్యాధిహారకః।
భయదోభూజ్జలాపూరః స మ్లేచ్ఛోప్తింజసం నిభః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 12)

నీటి ప్రవాహం పశువులను, ఊళ్లను, ప్రాణులను, ధాన్యాన్ని – సర్వం నాశనం చేస్తూ ప్రవహిస్తుంది. ఇది మ్లేచ్ఛుల హింసను తలంపుకు తెస్తూ భయావహంగా ఉంది.

ఈ శ్లోకం చదివిన తరువాత ఆగకుండా ముందుకు పోవడం కష్టం. ఈ ఒక్క శ్లోకంతో శ్రీవరుడు రాజతరంగిణి స్థాయిని విపరీతంగా పెంచివేశాడు. మనసు లోలోతుల్లోంచి దీర్ఘమైన నిట్టూర్పు వెలువడుతుంది. గతంలో జరిగిన పొరపాట్లను గ్రహించకుంటే, వర్తమానంలోనూ అవే పొరపాట్లు జరగటంవల్ల, భవిష్యత్తు నాశనమవుతుందంటారు. గతం, భవిష్యత్తులో ప్రాణం పోసుకుంటుందంటారు.

అన్నింటినీ ముంచెత్తుతూ, దేన్ని వదలకుండా సర్వనాశనం చేస్తున్న వరద జలాలను చూస్తూంటే శ్రీవరుడికి ‘మ్లేచ్ఛుల హింస’ సజీవంగా కళ్ళ ముందు నిలిచిందట. మ్లేచ్ఛుల హింస అంత భయంకరంగా ఉందట ఆ ప్రళయ కాలం. ‘మ్లేచ్ఛులు’ అని శ్రీవరుడు ఎవరిని సూచిస్తున్నాడో చెప్పనవసరం లేదు.

కశ్మీరుపై భారతీయ రాజుల అధికారం తొలగిన తరువాత నుంచి కశ్మీరీయులకు దుర్దినాలు ప్రారంభమయ్యాయి.

ఆరంభంలో అధికారానికి వచ్చిన సుల్తానులు పరమత సహనం ప్రదర్శించారు. కానీ కశ్మీరులో ఇస్లామీయులు అధికారానికి వచ్చిన వార్త తెలిసిన వెంటనే పలు ఇస్లామీ పండితులు, ముఖ్యంగా హమదానీ వంటి సూఫీలు  కశ్మీరు వచ్చి చేరారు. కశ్మీరుకు అలవాటు లేని సంకుచితత్వాన్ని, అసహనాన్ని కశ్మీరులో ప్రవేశపెట్టారు. ఇస్లామేతరులపై హింసను, అత్యాచారాలను జరిపేందుకు ప్రేరణనిచ్చారు. దానికి ధార్మిక సమర్ధననిచ్చారు.  ఫలితంగా ఒక పద్ధతి ప్రకారం ఇస్లామేతరులపై దమనకాండ తీవ్రస్థాయిలో చెలరేగింది. ‘దులచా’ కశ్మీరును సృష్టి ఆరంభం స్థితికి తెచ్చి వెళ్ళాడు. సికందర్ బుత్‌షికన్, అల్లీ షాహల పాలనా కాలంలో ఇస్లామేతరులకు మతం మారటము, ప్రాణాలు వదలుకోవటం తప్ప మరో మార్గం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదిలి పారిపోవాలనుకునే వారి ప్రయత్నాలను భంగం చేసేందుకు కశ్మీరీ సైనికులు సరిహద్దులను కట్టుదిట్టం చేసి చిన్న పురుగు కూడా కశ్మీరం సరిహద్దులు దాటకుండా చూశారు. ఈ రకంగా ఇస్లామేతరుడన్న వాడు లేకుండా కశ్మీరును పూర్తిగా ఇస్లామికీకరణ చేయాలన్న పట్టుదల ఫలితంగా జైనులాబిదీన్ అధికారానికి వచ్చేసరికి కశ్మీరులో కేవలం 13 పండితుల కుటుంబాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వారు కూడా బిక్కుబిక్కుమంటూ దినదినగండం నూరేళ్ళ ఆయుష్షులా బ్రతికి ఉన్నారు.

ఇలా మహిళలు, వృద్ధులు, పిల్లలు, పండితులు, కళాకారులు వంటి తేడాలేమీ లేకుండా, సమాజంలో వ్యక్తి స్థాయి, గౌరవం వంటి వాటితో ఏ మాత్రం సంబంధం లేకుండా, ఎలాగయితే వరద నీరు ఇల్లు వాకిలిని, చెట్టు, గుట్ట అన్న తేడా లేకుండా అన్నిటినీ తనలో కలిపేసుకుంటూ పోతుందో, అలాగ ఇస్లామ్ మత సంకుచితవాదం కశ్మీరీ భారతీయులందరినీ మతం మార్చటమో, హతమార్చటమో చేస్తూ పోయింది. అన్నిటినీ ముంచెత్తుతున్న ఉధృతమైన వరద నీటిని చూస్తుంటే శ్రీవరుడికి ఇస్లామీయుల హింస గుర్తుకు రావటంలో ఆశ్చర్యం లేదు.

ఈ శ్లోకం చదువుతూ, ఆలోచిస్తుంటే ఆనాడు భారతీయ సమాజాన్ని ఇస్లాం ఓ తుఫానులా ముంచెత్తుతూన్న సమయంలో భారతీయుల హృదయాలలో చెలరేగిన భీతావహ జ్వాలలు, వారు కార్చిన నిస్సహాయ అశ్రువులు, వారి మనస్సులలో చెలరేగిన ఆవేశ వీచికలు మనస్సు గ్రహిస్తుంది. తెలియని ఆవేదన మనస్సుని చుట్టుముడుతుంది. ఎంతటి భయంకరమైన, దారుణమైన పరిస్థితులను , భయంకరమైన దమనకాండను, రాక్షసమైన మారణకాండనూ తట్టుకుని మరీ వారు తమ ధర్మాన్ని నిలుపుకుని భావితరాలకు సజీవంగా అందించారో ఆలోచిస్తే, హృదయం కరిగి నీరైపోతుంది.

ఆనాడే కాదు, ఈనాడు మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలను గమనిస్తే, మనసు భవిష్యత్తు పట్ల భయంతో గడ్డకట్టుకుపోతుంది.

1990 ప్రాంతాలలో మన కళ్ళ ముందే కశ్మీరులో పండితులను పద్ధతి ప్రకారం హత్యలు చేస్తూ, భయభ్రాంతులను చేస్తూ కశ్మీరు నుండి వెడలగొట్టటం సంభవించింది. ఆనాడు కశ్మీరు వదిలిన పండితులు ఇంకా స్వంతంత్ర భారతంలో కాందిశీకుల్లా బ్రతుకుతున్నారు. వారిని కశ్మీరులో స్థిరపరిచే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇస్లామీ  తీవ్రవాదుల తుపాకుల నీడలో బ్రతికేందుకు బయటి వారెవరికీ కశ్మీరులో ధైర్యం సరిపోవటం లేదు. తీవ్రవాదుల హింసనుండి రక్షిస్తామన్న విశ్వాసాన్ని భారత ప్రభుత్వం కలిగించలేకపోతోంది.

ప్రస్తుతం మన కళ్ళ ముందే బంగ్లాదేశ్‍లో ఇస్లామీ సంకుచితవాదులు కంకణం కట్టుకుని మరీ హిందువులపై దాడులు చేయటం, దేశంలో జీవించాలంటే ఇస్లామ్ స్వీకరించటం తప్పనిసరి అని ప్రకటించి బెదిరించటం, ప్రస్తుతం జరుగుతున్న దారుణ దమనకాండలను చూస్తుంటే, ఇస్లామీయుల సంఖ్య ఎంతగా పెరిగితే అంతగా ఇస్లామేతరుల మనగడ ప్రమాదంలో పడుతుందన్న చేదు నిజం బోధపడి భయం తుఫాన్ స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

అంతేకాదు, ఇస్లామీయులు అధికంగా ఉన్న దేశాలలో సైతం అంతఃకలహాలవల్ల  నెలకొంటున్న అరాచక పరిస్థితుల ఆధారంగా  ప్రాణాలు అరచేత పట్టుకుని ఇస్లామీయులు ఇతర దేశాలకు కాందిశీకులుగా చేరుతున్నారు. అక్కడ వారి సంఖ్య ఒక స్థాయికి చేరగానే సంఖ్యాబలం ఆధారంగా ఆయా దేశాలలో అరాచకం సృష్టిస్తున్నారు. తమ బల ప్రదర్శనతో ఆయా దేశాలపై ఆధిక్యం సాధించాలని చూస్తూన్నారు. ఇస్లామేతరులపై ‘హింస’ నెరపుతున్నారు. పలు యూరప్ దేశాలలో నెలకొంటున్న అరాచక పరిస్థితులు ఈ చేదు నిజాన్ని నిరసిస్తున్నాయి. ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికాతో సహా వలస వస్తున్న ఇస్లామీయులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలన్నీ ఇప్పుడు మ్రింగ లేక కక్కలేక, పెరుగుతున్న ఇస్లామీయుల ప్రాబల్యం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలను ఎదుర్కొనలేక సతమతమవుతున్నాయి.

అయితే దీన్ని ‘ఇస్లామోఫోబియా’ గా కొట్టి పారేస్తున్నారు కొందరు. కానీ ఇది ఫోబియా కాదు, ఇది ‘స్కేరీ ట్రూత్ ఆఫ్ ఇస్లాం మెజారిటీ’ అని ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా మేధావులు గుర్తిస్తున్నారు.

కానీ శ్రీవరుడు రచించిన రాజతరంగిణిలో ఈ శ్లోకం కళ్ళకు కట్టుకున్న గంతలను తొలగించి వేస్తుంది. కళ్ళకు క్రమ్మిన కుహానా లౌకికవాద పొరలను కరిగించి వేస్తుంది. చేదు నిజాన్ని నగ్నంగా చూపుతుంది.

అనాడు కశ్మీరులో జరిగిందే ఇటీవల కశ్మీరు లోనూ జరిగింది. ఇప్పటికీ జరుగుతోంది. ఆనాడు కశ్మీరులో జరిగిందే ఇప్పుడు, బంగ్లాదేశ్ లోనూ జరుగుతోంది. బంగ్లాదేశ్‌గా గుర్తింపు పొందిన ప్రాంతం భారతీయులది. ఇస్లామీయులు అధిక సంఖ్యలో ఉన్నారన్న కారణంతో అది బంగ్లాదేశ్ అనే ఇస్లాం దేశంగా అవతరించింది. ఇప్పుడు అక్కడ నుంచి హిందువులను మతం మారకపోతే చంపుతాం, తరిమి కొడతాం అంటున్నారు. మధ్యయుగం కాదిది. ఇరవయ్యొకటవ శతాబ్దం. కానీ మధ్యయుగపు దౌర్జన్యం, సంకుచితం  ఈనాడూ చలామణీ అవుతోంది. ఆనాడు కశ్మీరులోనూ కశ్మీరులో ఆరంభంనుంచీవుంటున్న పండితులను కశ్మీరునుంచి వెడలగొట్టారు. ఈనాడూ అది ఇంకా కొనసాగుతోంది.

వంగదేశం బంగ్లాదేశ్‍గా మారటంలో ప్రధాన పాత్ర పోషించింది సంఖ్యాబలం. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా శక్తివంతమైనది సంఖ్యాబలం. శ్రీవరుడి రాజతరంగిణిలోని  ఈ శ్లోకం ఇలాంటి అనేక ఆలోచనలకు ప్రేరణనిస్తుంది.

నీరు మామూలుగా వున్నప్పుడు మృదువయినది. ఒడ్డు దాటని ప్రవాహంతో ఆనందం కలిగిస్తుంది. కానీ, నీరు అధికమైనప్పుడు, ఒడ్డుకు ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది. ఇంకా అధికమైతే, అన్నిటినీ ముంచెత్తుతుంది, మ్లేచ్చుల హింసలా!!!

అందుకే ఓ కవి అన్నట్టు “ఈ ప్రపచం మారదు. అది కొత్తగా కనపడినా దాని ముఖం పాతదే!”. ఈనాడు ‘ఏక్ హైతో సేఫ్ హై’, ‘బటోగీ తో కటోగీ’ వంటి నినాదలు ప్రజలలో స్పందన కలిగిస్తున్నాయంటే, దాని వెనుక కొన్ని వేల, వందల సంవత్సరాల ‘హింస’, ‘దౌర్జ్యన్యం’ తాలూకు ఆనవాళ్ళు,  జ్ఞాపకాలు, అనుభవాలు ఉన్నాయి. కళ్ల ఎదురుగా నడుస్తున్న చరిత్ర తాలూకు అవగాహన ఉంది. అవకాశం దొరికితే చాలు, వరదలా ముంచెత్తే ‘మేచ్ఛ హింస’ పొంచి ఉందన్న  గ్రహింపు ఉంది. ఆ గ్రహింపునిస్తున్నది చరిత్ర ద్వారా  శ్రీవరుడి రాజతరంగిణి. అందుకే ‘గతాన్ని మరచిన వారికి వర్తమానం లేదు, భవిష్యత్తు ఉండదు’ అంటారు. గతంలో పొరపాట్లే, చేసిన పొరపాట్లే చేస్తూంటారంటారు.

(ఇంకా ఉంది)

Exit mobile version