Site icon Sanchika

శ్రీవర తృతీయ రాజతరంగిణి-5

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

 

యేషాం కరోమి వపుర స్థిరమత్ర రాజ్ఞాం
తేషామయం జగతి కీర్తిమయం శరీరం।
అకల్పవర్తి కురుతే కిమితీవ రోషాద్
ధాతాహరద్ ధృవమతః కవి జోనరాజమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 5)

నశ్వర శరీర ధారులయిన రాజుల గురించిన రచన చేస్తున్నాను.  తద్వారా వారి కీర్తిమయ శరీరం  కల్పాంతం వరకూ సజీవంగా ఉంటుంది. బహుశా, ఇలా నశ్వర శరీరధారుల  కీర్తిమయ శరీరాన్ని సజీవంగా నిలిపినందుకేమో క్రోధంతో విధాత జోనరాజును తీసుకు వెళ్లిపోయాడు.

గమ్మత్తయిన శ్లోకం ఇది.

ఒకో  శ్లోకం చదువుతూంటే, జోనరాజు రచన పద్ధతికీ, శ్రీవరుడి శ్లోక సృజన పద్ధతికీ తేడా స్పష్టంగా తెలుస్తూంటుంది. పోలిస్తే, శ్రీవరుడు గొప్ప సృజనాత్మక కవి  అనిపిస్తుంది. కల్హణుడు రాజతరంగిణి కోసం తనలో కవిని అణచిపెట్టానని ప్రకటించినా, వీలు వెంబడి ఆయనలో కవి తొంగి చూస్తూనే ఉన్నాడు. జోనరాజు పండితుడు. ఆయన అయిష్టంగా రాజతరంగిణి రచన ఆరంభించాడు. కానీ శ్రీవరుడు స్వచ్ఛందంగా రాజతరంగిణి కొనసాగించాడు. పైగా ఆయన స్వయంగా కావ్యాలు రచించిన వాడు. ఈ శ్లోకంలో శ్రీవరుడి ఆలోచన కల్హణుడి భావ వ్యక్తీకరణతో  కలుస్తుంది.

మానవుడు నశ్వర శరీరధారి. శాశ్వతంగా నిలిచేది అతని కీర్తి మాత్రమే. కవి తన సృజన ద్వారా, మరణించిన రాజులను భావితరాల ముందు సజీవంగా నిలుపుతాడు. ఈ విషయాన్ని శ్రీవరుడు ‘కీర్తిమయ శరీరం’ అన్నాడు. కల్హణుడు ‘యశకాయం’ అన్నాడు. యశస్సు అంటే కీర్తి, కాయం అంటే శరీరం. అందుకే శ్రీవరుడు ‘కీర్తికాయం’ అన్నాడు. రాజులు ఎంత గొప్ప వారయినా వారిని కీర్తించి, భవిష్యత్తు తరాలకు వారి గురించిన కావ్యాలను అందించే కవులు లేకపోతే శరీరంతో పాటు వారి జ్ఞాపకాలు నశిస్తాయి. కావ్య దీపాలవల్ల  మిగిలేది ‘కీర్తిశరీరం’ మాత్రమే.

శ్రీజోనరాజవిబుధః కుర్వన్ రాజాతరంగిణీమ్।
సాయకాగ్నిమితే వర్షే శివసాయుజ్యమసదత్॥
(శ్రీవర రాజతరంగిణి, 6)

రాజతరంగిణిని రచిస్తూ హఠాత్తుగా తన 35వ సంవత్సరంలో జోనరాజు శివ సాయుజ్యం పొందాడు.

శ్రీవరుడు చెప్పటం వల్ల చరిత్ర రచయితలకు జోనరాజు క్రీ.శ. 1459లో మరణించాడని తెలిసింది. అందుకని అతని రాజతరంగిణి రచన అర్థాంతరంగా ఆగిపోయిందని తెలిసింది. దాన్ని శ్రీవరుడు కొనసాగించాడని తెలుస్తుంది.

శిష్యోస్య జోనరాజ్యస సోహం శ్రీవరపండితః।
రాజావళీ గ్రంథశేష పూరణం కర్తుం ముధ్యతః॥
(శ్రీవర రాజతరంగిణి, 7)

జోనరాజు శిష్యుడనైన నేను శ్రీవర పండితుడను, ఆయన అర్ధాంతరంగా వదిలిన రాజతరంగిణి రచనను పూర్తి చేయాలని నిర్ణయించాను. ఉద్యమించాను.

ఈ శ్లోకాన్ని బట్టి శ్రీవరుడు స్వచ్ఛందంగా రాజతరంగిణి రచనను పూర్తి చేయాలని సంకల్పించాడనిపిస్తుంది. ఈ రచనను కూడా జైనులాబిదీన్ జీవించి ఉన్నప్పుడు, అంటే, జోనరాజు మరిణించిన వెంటనే కాక, జైనులాబిదీన్ మరణం తరువాత, అతడి కీర్తికాయాన్ని భావి తరాలకు సజీవంగా అందిచటం ద్వారా ఇటు గురువు ఋణం, అటు సుల్తాన్ ఋణం తీర్చుకుంటున్నట్టువుతుందన్న ఆలోచనతో రాజతరంగిణి రచనను చేపట్టాడనిపిస్తుంది.

క్వ కావ్యం మద్గురోస్తస్య క్వ చ మన్దమతేర్మమ।
వర్ణమాత్రేణ మక్కోలం ఘనసారాయతే కథమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 8)

మా గురువు రచించిన కావ్యం ఎక్కడ? మందమతినైన నేను రచించిన కావ్యం ఎక్కడ? రెండింటి  నడుమ పోలిక లేదు. కర్పూరంతో సుద్ద ముక్కను ఎవరయినా పోలుస్తారా? కర్పూరం చేసే పని సుద్ద ముక్క చేస్తుందా?

గురువు ముందు తనను తాను తక్కువ చేసుకోవటం ఒక పద్ధతి. నాలాంటి శిష్యుడు దొరకటం మా గురువులు చేసుకున్న పూర్వజన్మ సుకృత ఫలం అనగల ఆత్మవిశ్వాసం అరుదు.

రాజవృత్తానురోధేన న కావ్యగుణవాంఛయా।
సన్తః శృణ్వన్తు మధ్వాచః స్యాధియా యోజయన్తుచ॥
(శ్రీవర రాజతరంగిణి, 9)

నా కావ్యం  గొప్పతనంతో సంబంధం లేకుండా, కేవలం రాజుల చరిత్రను వినాలనే ఉద్దేశంతో సజ్జనులు నా కావ్యం వింటారు (చదువుతారు). వారి వారి బుద్ధి ప్రకారం కావ్యాన్ని అర్థం చేసుకుంటారు.

అథవా నృపవృత్తాంత స్మృతి హేతురయాం శ్రమః।
క్రియతే లలితం కావ్యం కుర్వన్త్వన్యేపి పండితాః॥
(శ్రీవర రాజతరంగిణి, 10)

రాజుల చరిత్రలు తెలుసుకోవటం కోసమే ఈ కావ్యాని పఠించే కష్టమైన పనిని చేపట్టాలి. లలిత పదాలతో కూడిన కావ్యాలను ఇతర కవులు రచించవచ్చు. కానీ, నేను రాజుల చరిత్రను రచిస్తాను.

తత్త్వద్గుణగణా దానాత్ స్వ సంపత్తి సమర్పణాత్।
పుత్రకద్వర్థితో రాజ్ఞా గ్రామహేమాద్యనుగ్రహైః॥
(శ్రీవర రాజతరంగిణి, 11 )

రాజు నాకు బోలెడన్ని బహుమతులు ఇచ్చాడు. సంపత్తి నిచ్చాడు. గ్రామాలు, బంగారం, ధనం దానంగా ఇచ్చాడు. హోమాలు చేసుకోనిచ్చాడు. రాజు నన్ను స్వంత సంతానంలా పెంచి పోషించాడు.

అతో వాంఛన్నమేయస్య తత్ప్రసాదస్య నిష్కృతిమ్।
సోహం బ్రవీమి తదేవృత్తం తద్గుణాకృష్టమానసః॥
(శ్రీవర రాజతరంగిణి, 12)

రాజు నుంచి అందుకున్న అనేకానేక బహుమతుల ఋణం నుండి విముక్తుడయ్యేందుకు, రాజు గుణగణాలను వర్ణిస్తూ అతని సద్గుణాల వల్ల సంతోషమైన మనస్సుతో, రాజ వృత్తాంతాన్ని వర్ణిస్తాను.

ఈ శ్లోకం చదివితే శ్రీవరుడు, రాజు వల్ల తాను పొందిన లాభాలకు కృతజ్ఞతా భావంతో, అతని  కీర్తికాయాన్ని కల్పాంతం వరకు సజీవంగా నిలిపేందుకు రాజతరంగిణి రచనను  స్వచ్ఛందంగా చేపట్టాడనిపిస్తుంది. అది కూడా జైనులాబిదీన్ మరణం తరువాతనే, ఎందుకంటే, జైనులాబిదీన్ మరణం తరువాత కశ్మీరులో నెలకొన్న అనిశ్చింత పరిస్థితులు భవిష్యత్తు తరాలు జైనులాబిదీన్ ను మరచిపోతాయేమోనన్న శంక శ్రీవరుడిలో కలిగించి వుంటుంది. అందుకని  అతడిని సజీవంగా భావి తరాలకు అందించటం ద్వారా సుల్తాను  ఋణం తీర్చుకోవాలన్న ఆలోచనతో, గురువు అసంపూర్ణంగా వదిలిన కావ్యాన్ని పూరించాలన్న తపనతో రాజతరంగిణి రచన కొనసాగించి ఉంటాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version