Site icon Sanchika

శ్రీవర తృతీయ రాజతరంగిణి-6

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ఏకయా తద్గుణాఖ్యానం జిహ్వయా వర్ణ్యత్యే కియత్।
రోమవత్ కోటిశశ్చేత స్యుస్తాస్తదా మదిగరః క్షమాః॥
(శ్రీవర రాజతరంగిణి, 13)

జైనులాబిదీన్ చరిత్రను చెప్పి, తన ఋణాన్ని తీర్చుకుందామనుకున్నాడు శ్రీవరుడు. అంతలోనే అతనికి ఓ సందేహం వచ్చింది. జైనులాబిదీన్ గుణాలను ఒక జిహ్వతో రచించటం అసాధ్యం. ఆయన గుణగణాలను వర్ణించాలంటే, శరీరంపై ఎన్ని రోమాలున్నాయో, అన్ని నాల్కలుండాలంటాడు శ్రీవరుడు.

జైనులాబిదీన్ పట్ల శ్రీవరుడికి ఉన్న గౌరవ ప్రేమాభిమానాలకు ఈ శ్లోకం చిహ్నం. కేవలం శ్రీవరుడే కాదు, ఆ కాలంలో ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదిలి పారిపోయిన పండితులు, మళ్లీ కశ్మీరు తిరిగి వచ్చి జైనులాబిదీన్ నీడలో చల్లగా భద్రంగా ఉన్న వారందరూ జైనులాబిదీన్‍ను దైవసమానుడిగానే భావిస్తారు. వేనోళ్ల అతడిని పొగిడినా వారికి సంతృప్తి కలుగదు. జైనులాబిదీన్ సాధించినది అనితర సాధ్యం. ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ జరగనిది. ఒకసారి తమ స్వస్థలాన్ని విడిచి పారిపోయి వచ్చి తరువాత మళ్ళీ తామే కాదు భవిష్యత్తులో ఏ తరం కూడా ఆ స్థలాన్ని మళ్ళీ తమదిగా చేసుకోలగటం వీలవదు.

జెరుసలేమ్ వదలి ప్రపంచం నలుమూలలా వెదజల్లినట్టయిన యూదులు మళ్ళీ జెరుసలేమ్‍ను సాధించగలిగారు. కానీ ఈనాటికీ వారికి శాంతి లేదు. ఎప్పుడు ఏ మూల నుంచి ఎవరు ముప్పు కల్పిస్తారో అన్న భయం వారిని వెన్నాడుతూనే ఉంటుంది. వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారు ఎదురు దాడులు ఎంతగా చేసినా కథ మారటం లేదు. వారికి శాంతి లేదు. ఇందుకు భిన్నంగా జైనులాబిదీన్ అండన పండితులు కశ్మీరులో శాంతిగా, భద్రంగా ఉండగలగటమే కాదు, ఐశ్వర్యాలు అనుభవించగలిగారు. గౌరవ మర్యాదలతో సుఖంగా జీవించగలిగారు. భవిష్యత్తుపై ఆశలు పెంచుకోగలిగారు. ఈనాడు కశ్మీరంలో ఇంకా కొందరైనా పండితులు నివసిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జైనులాబిదీన్. అందుకే రోమరోమం జైనులాబిదీన్ ఆదరణకు పులకరిస్తూంటే, ఎన్ని రోమాలున్నాయో, అన్ని నోళ్లు కావాలంటున్నాడు ఆయన గుణగణాలు వర్ణించేందుకు.

సత్యం నృపాంబరే అముష్మిన్  విపులే విమలాశయే।
గుణతారా పరిచ్చేదే న శక్తా భారతీ మమ॥
(శ్రీవర రాజతరంగిణి, 14)

రాజు గుణగణాలను ప్రస్తావించి కీర్తించటం అతని వల్ల కావటం లేదు. అన్ని శబ్దాలు ఆయన వద్ద లేవు. అంటే రాజు గుణగణాలను వర్షించేందుకు అతని వద్ద ఉన్న పదాలు సరిపోవటం లేదు. అవధి లేని ఆకాశంలోని అనంతమైన తారలంత గొప్పతనం జైనులాబిదీన్‍ది. అంత గొప్పతనాన్ని ఎలా వర్ణించగలడు?

తథాపి సకలం చిత్రపటాన్తే త్రిజగధ్యథా।
శ్రీ జైనోల్లాభదీనస్య న్య స్వామి గుణవర్ణనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 15)

అయినా సరే పర్వతశ్రేణులను చిత్రపటంలో ఒదిగించినట్టు శ్రీ జైనుల్లాభదీనుడి గుణగణాలను వర్ణిస్తాను అంటున్నాడు. నిజానికి శ్రీవరుడు వాడిన ఉపమానం చాలా విస్తృతమైనది, గొప్పది. ముల్లోకాలను ఒక్క చిత్రపటంలో చూపినట్టు ఆయన గుణాలను చూపిస్తాడట. అంటే, వీలైనంతలో అన్ని గుణాలను వర్ణించే ప్రయత్నం చేస్తాడు. ఈ శ్లోకాలను బట్టి చూస్తేనే జైనులాబిదీన్ పట్ల శ్రీవరుడికి ఉన్న భావనల లోతు తెలుస్తుంది. ఇది నాలిక పైపైని పొగడ్త కాదు. రాజు కాబట్టి పొగడటం కాదు. హృదయ లోలోతుల్లోంచి పెల్లుబికి వస్తున్న కృతజ్ఞతా భావానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఈ శ్లోకం.

కేనాపి హేతునా తేన ప్రోక్తం మద్గురుణా న యత్।
తచ్ఛేశవర్తినీం వాణీం కరిష్యామి యథామతి॥
(శ్రీవర రాజతరంగిణి, 16)

నా గురువు (జోనరాజు) కారణం ఏదైనా వర్ణించకుండా వదలిపెట్టిన గుణాలను నేను వర్ణిస్తాను.

శ్రీవరుడి గడుసుదనం ఈ శ్లోకంలో తెలుస్తుంది. ఒక శ్లోకంలో  జైనులాబిదీన్ గుణాలు గుణాలు వర్ణించేన్ని శబ్దాలు తన వద్ద లేవన్నాడు. మరో శ్లోకంలోనేమో ముల్లోకాలను చిత్రపటంలో చూపించినట్టు, తాము జైనులాబిదీన్ గుణాలను సూక్ష్మంలో చూపుతానన్నాడు. ఇప్పుడు నా గురువు వర్ణించకుండా వదిలిన గుణాలను వర్ణిస్తానని అంటున్నాడు.

ఈ శ్లోకం ద్వారా తెలిసేదేమంటే, తాను రాస్తున్న రచన – కల్హణుడు కానీ జోనరాజు కానీ రాసిన రాజతరంగిణులకు భిన్నమైనదని శ్రీవరుడికి తెలుసు. జోనరాజు వర్ణించకుండా వదిలిన గుణవిశేషాలను మొత్తంగా రాస్తాననీ చెప్తున్నాడు శ్రీవరుడు.

తనకూ, జోనరాజుకూ జైనులాబిదీన్‍ను చూసే దృష్టిలో తేడా ఉన్నదని శ్రీవరుడికి తెలుసు. జోనరాజు జైనులాబిదీన్ ఆస్థాన కవి అయినా వయసులో పెద్దవాడు. కానీ శ్రీవరుడు, జైనులాబిదీన్‍కు ఆంతరంగికుడు. జైనులాబిదీన్ బాధలను, మనోవేదనలను ప్రత్యక్షంగా చూసినవాడు. అతని ఆంతరంగిక సలహాదారు. జైనులాబిదీన్ చివరిదశలో అతనికి మోక్షం గురించి చెప్పినవాడు. కాబట్టి జోనరాజు జైనులాబిదీన్ గురించి రాజకీయ విశేషాలు రాయగలుగుతాడు. కానీ జైనులాబిదీన్‍ను రాజుగా మాత్రమే కాక ఒక తండ్రిగా, భర్తగా, మానవుడిగా, స్నేహితుడిగా, ఆంతరంగికుడిగా ,  సుల్తాన్‍గా అతి దగ్గరగా చూసిన శ్రీవరుడు, జోనరాజు వర్ణించని విషయాలకు కూడా వర్ణించగలడు. ఆ మాట చెప్పటం జోనరాజును అవమానించనట్లవుతుంది. అందుకని జోనరాజు వర్ణించకుండా వదిలినవి చెప్తానన్నాడు. జోనరాజు రాస్తున్నది చరిత్ర. తాను రాస్తున్నది జీవిత చరిత్ర అన్న గ్రహింపుతో ప్రతి శ్లోకాన్ని రాస్తున్నాడు శ్రీవరుడు.

సాత్మజస్య నృపస్యాస్య ప్రాప్యతే రాజ్య వర్ణనాత్।
ప్రతిష్ఠాదాన సమ్మాన విధాన గుణ నిష్కృతిః॥
(శ్రీవర రాజతరంగిణి, 17)

రాజు వల్ల లభించిన ప్రతిష్ఠ, రాజు నుండి లభించిన గౌరవం, సన్మానాల ఋణాన్నుంచి రాజు పాలన , అతని   సంతానం పాలనను వర్ణించటంతో ముక్తి పొందవచ్చు.

ఈ శ్లోకాన్ని, తరువాత శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే జైనులాబిదీన్ మరణం, అతని తరువాత అతని సంతాన పాలనా కాలాన్ని అనుభవించిన వరువాత దుఃఖిత మనస్కుడై విరక్తితో, శ్రీవరుడు రాజతరంగిణి రచన ఆరంభించాడనిపిస్తుంది.

స్వద్రుగ్ద్రుష్టామృతానేక విపద్విభవ సంస్ముతే।
సూతే కస్య న వైరాగ్యం నామ్ జైనతరంగిణీ॥
(శ్రీవర రాజతరంగిణి, 18)

తాను రచిస్తున్న కావ్యం జైన రాజతరంగిణి అని తానే ప్రకటించాడు. ఈ జైన రాజతరంగిణి చదివేవారికి మరణించినవారు అనుభవించిన ఐశ్వర్య వైభోగాలు గుర్తుకు వస్తాయి. వారు అనుభవించిన కష్టనష్టాలు కష్టనష్టాలు, దుర్దశలు గుర్తుకు వస్తాయి. తమ కళ్ళ ముందే, అత్యంత ఐశ్వర్యం అనుభవించిన వారెందరో కటిక దరిద్రంలో మరణించటం గమనించి ఉంటారు. అందుకే జైన రాజతరంగిణి చదివిన తరువాత ప్రతివారి మదిలో వైరాగ్య భావనలు జనిస్తాయి. ఇది శ్రీవరుడి నమ్మకం.

తండ్రి కొడుకుల పాలనను వర్ణించటం వల్ల ఋణ విముక్తుడనవుతానని మొదటి శ్లోకంలో చెప్పిన శ్రీవరుడు తరవాత శ్లోకంలో రాజుల ఉత్థానపతనాల గురించి చదివిన తరువాత ప్రతివారిలో వైరాగ్యం కలుగుతుందని అంటున్నాడు. ఇది గమనార్హం.  జైనులాబిదీన్ పతనాన్ని, అతని కొడుకుల ప్రవర్తన పట్ల అతని వేదనను శ్రీవరుడు ప్రత్యక్షంగా చూశాడు. అతని తరువాత రాజ్యానికి వచ్చిన కొడుకుల నడుమ పోరు, వారు ప్రదర్శించిన మతమౌఢ్యం, ఇతరుల చేతుల్లో కీలుబొమ్మల్లా ప్రవర్తించటం శ్రీవరుడు అనుభవించాడు. ఇది అతనిలో వైరాగ్య భావనలు కలిగించి ఉంటుంది. ఆ వైరాగ్య భావనల లోంచే ఆయన తృతీయ రాజతరంగిణి రచన ఆరంభించి ఉంటాడు. తనకు గౌరవమిచ్చి, ఐశ్వర్యమిచ్చిన రాజు పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచే రీతిలో, కావ్య రచన ద్వారా జైనులాబిదీన్ యశోకాయాన్ని చిరంజీవిగా నిలపాలని రచనను ఆరంభించాడు శ్రీవరుడు. కానీ తన ఈ రచన ఉత్తేజితులను చేసేకన్నా, వైరాగ్య భావనలను కలిగిస్తుందనీ, ఇలాంటి చరిత్రలు చదివితే వైరాగ్య భావనలే కలుగుతాయనీ శ్రీవరుడికీ తెలుసు.

శ్రీవరుడు తన రచనను, కల్హణుడు, జోనరాజుల్లా కేవలం ‘రాజతరంగిణి’ అనలేదు.. జైన రాజతరంగిణి అన్నాడు. పర్షియన్ సుల్తానుల జీవిత చరిత్రను, వారి పేర్ల మీదే రాయటం సుల్తానుల పాలనలో ఆనవాయితీ. అలాగే గతంలో బిల్హణుడు – విక్రమాంక దేవ చరిత్ర; నరపతి నాల్హ – విసలదేవ రాసో,  హమ్మీర్  రాసో వంటి రచనలు శ్రీవరుడికి ముందు ఉండనే ఉన్నాయి. అందుకే తమ రచనను రాజతరంగిణి అనకుండా జైన రాజతరంగిణి అన్నాడు శ్రీవరుడు.

(ఇంకా ఉంది)

Exit mobile version