శృతి లేని రాగం

10
3

[dropcap]సి[/dropcap]గ్గుతో తల వంచుకుని, సంతోషంగా నవ్వుతున్న పెళ్లికూతురి  మెడలో మంగళ సూత్రం ముడి వేస్తున్నాడు రాజు. పెళ్లి మండపం అంతా సన్నాయి, డప్పుల శబ్దంతో మారుమ్రోగి పోతోంది. ప్రపంచం లోని ఆనందం అంతా ఒక్కసారిగా శృతి మనసంతా నిండిపోయి, గుండెల మీద వేలాడుతున్న మంగళ సూత్రం తడుముకుని రాజు కళ్ళ లోకి తలెత్తి చూసింది. నిండుగా, కొంటెగా నవ్వుతున్న రాజుని చూసి మనసులో ఎగిసిపడుతున్న ఆనందాన్ని అదుపు చేసుకుంటూ తల వంచుకుంది శృతి.

పెళ్లయిన రెండవ రోజు అత్తారింట్లో అడుగు పెట్టిన శృతి, ఆ చిన్న ఇల్లు చూసి నిట్టూర్చింది. అయితే ఆర్థికంగా కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇంట్లో వారి ప్రేమాభిమానాలతో జీవితం హాయిగా గడుస్తూ వుంది.

అప్పుడప్పుడే వ్యాపారంలో నిలదొక్కుకుంటున్న రాజు డబ్బులు బాగా సంపాదించాలని, మంచి ఇల్లు కట్టి అందులోకి మారాలని బలంగా నిశ్చయించుకున్నాడు..

కాలం వేగంగా పరుగెడుతోంది.

“శృతీ.. వెంటనే రెడీ అవ్వాలి.. సినిమా టైం అవుతోంది” అన్నాడు రాజు ఇంట్లోకి వస్తూనే.

“ఇంత అర్జెంటుగా అంటే ఎలా? కాస్త ముందు చెప్పచ్చుగా” అంది నవ్వుతూ.

“నాకదంతా తెలీదు.. క్విక్” అన్నాడు.

“ఇదుగో అయిదు నిమిషాలు” అని ఆనందంగా గదిలోకి నడిచింది. చీర మార్చుకోసాగింది శృతి.

“అమ్మ గారు కాఫీ” అన్న వంట మనిషి రంగమ్మ పిలుపుతో గతంలో నుండీ తేరుకుంది శృతి. డబ్బు లేకున్నా ఆ రోజులే బావున్నాయి అనుకుంది.

కాఫీ కప్పు అందుకుని టీవీ చూడసాగింది. కాఫీ తన చేతులతో పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు దాటిందో? అనుకుంది.

ఇంతలో పక్కనున్న మొబైల్ ఫోన్ రింగ్ మొదలయ్యింది..

ఫోన్ తీసుకుని “హలో చెప్పండి” అంది.

‘‘కాఫీ త్రాగావా?” అన్న భర్త గొంతు విని “ఇప్పుడే.. చెప్పండి” అంది నిరాసక్తంగా.

“నిన్న వచ్చిన ఆ యాభై లక్షలకు మరో పది కలిపి పంపించేసేయి..” అన్నాడు.

“సరే.. ఇంకా” అంది.

చెప్పసాగాడు రాజు. చేతి పుస్తకంలో అన్నీ రాసుకుని “సరే.. మీరెళ్ళి నెల రోజులయ్యింది. ఇంటికెప్పుడొస్తారు” అంది.

అటునుండి సమాధానం లేదు. ఫోన్ వేపు చూసింది శృతి. కాల్ కట్ అయిపోయినట్లుగా కనపడింది..

నిరాశగా ఫోన్ పక్కన పెట్టి నిట్టూర్చింది. పైన పడగ్గదికి వెళ్లి లాకర్ తీసి, దాన్నిండా పేర్చిన డబ్బుల  కట్టల నుండీ కొన్ని తీసి బ్యాగులో వేసి లాకర్ తలుపు వేస్తూ ఒకసారి అందులో వున్న వజ్రాల సెట్లను, బంగారు నగలను నిర్వికారంగా చూసింది. అక్కడే టేబిల్ మీద వున్న భర్త ఫోటో చూసింది. నవ్వుతూ కనిపించాడు. ఇలా ఆయన నవ్వి ఎన్నాళ్ళయింది అని అనుకుంది.

ఇంట్లో పనివాళ్ళందరూ నవ్వుకుంటూ పనులు చేయటం గమనించి, సుఖాలు, సౌకర్యాలున్న తనకెందుకు సంతోషం లేదు? అని ప్రశ్నించుకుంది.

ఇంటినిండా డబ్బు, కార్, డ్రైవర్, కాలు కింద పెట్టాల్సిన అవసరం లేని జీవితం, అసలు వంటింటి వేపు వెళ్లి ఎన్నో సంవత్సరాలు గడిచాయి. అయినా మనసంతా దిగులు. విలాసాలకు పనికొచ్చే స్నేహితులు వున్నారు కానీ రాజు ఎక్కడ? అనుకుంది., డబ్బులు తక్కువగా ఉన్నప్పటికీ, హాయిగా రాజుతో గడిపిన సాయంత్రాలు, రాత్రులు గుర్తొచ్చి శృతి మనసు మూగగా రోదించింది.

సరిగ్గా ఆ సమయంలో రాజు ఫోన్ మ్రోగింది. “హలో.. చెప్పండి” అంది శృతి.

“ఏంటీ.. నీరసంగా వున్నావ్ బంగారం?” అన్నాడు రాజు, భార్య గొంతులో వినిపించే బాధ కనిపెట్టి.

“ఏమీ లేదండి. చాలా రోజులయ్యింది మీరు ఢిల్లీకి వెళ్లి.” అని ఆగి పోయింది.

“మనమిద్దరం ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు మాట్లాడుకున్నాం. దాదాపుగా మూడు వేల ఉద్యోగులు మన మీద ఆధారపడి పని చేస్తున్నారు. ఇలా నేను పని చేయకుంటే కంపెనీ మూల పడిపోతుంది.. డబ్బులు సంపాదించటం చాలా ముఖ్యం.. తప్పదు.. అన్నట్లు ఇంకో విషయం, టాక్స్ ఆఫీసర్‌తో కాస్త ప్రాబ్లెమ్ అయ్యేట్లుంది. నువ్వొకసారి వెళ్లి కలిసి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రా. ఇంటికి పిలిచి మంచి డిన్నర్ ఇవ్వటానికి ట్రై చేయి. సరేనా” అని సమాధానం కొరకు ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసాడు రాజు.

ఫోన్ తీసుకుని క్లబ్ స్నేహితులందరికీ వరసగా ఫోన్లు చేసింది. ‘అందరూ సరదాగా మాట్లాడేవారే కానీ మనసుతో మాట్లాడేవారే కరువయ్యారు. డబ్బుల ప్రపంచం. అందరూ ఏదో ఒకటి ఆశించి స్నేహం చేసేవారే’ అనుకుంది.

దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని, లేచి గదిలోకి వెళ్లి, మరో అరగంటలో ఖరీదైన చీర, ఒంటినిండా వజ్రాల నగలతో కారెక్కి కూర్చుని, డ్రైవర్‍తో “టాక్స్ ఆఫీసు” అంది.

***

ఆ రోజు సాయంత్రం ఫ్లైట్ దిగి ఇంట్లోకి అడుగు పెట్టాడు రాజు. శృతి ఇచ్చిన కాఫీ తాగి ముందు హాల్‌లో నేల మీద తల వాల్చాడు.

“ఇది వేసుకోండి” అంటూ మెత్తని తల గడ ఇచ్చింది శృతి.

దాన్ని తీసుకుని తలకింద సర్దుకుని రెండు క్షణాల్లో నిద్రలోకి జారుకున్న భర్తను జాలిగా చూసి, నిరాశగా సోఫా పైన పడుకుంది శృతి.

గంట తర్వాత లేచి కూర్చున్న భర్త వేపు చూసి “మీరు ఎక్కువగా అలసి పోతున్నారు. ఇలాగయితే ఆరోగ్యం దెబ్బతింటుంది” అంది ప్రేమగా.

అది విని చిన్నగా నవ్వి “భోజనం పెట్టేయి. రాత్రి రెండు గంటలకు ఫ్లైట్‌లో బొంబాయి వెళ్ళాలి. చెప్పటం మరిచాను, మన లావాదేవీలు చూడటానికి కొత్తగా ఒకరిని తీసుకున్నాను. రేపటినుండి పనిలోకి వస్తాడు. నీకు చేదోడు వాదోడుగా. నీకు కాస్త రిలీఫ్” అన్నాడు రాజు.

అది విన్న శృతి నిస్పృహతో నిట్టూర్చి “ఇప్పుడే వచ్చారుగా.. రెండు రోజులుండి వెళ్ళొచ్చుగా” అంది.

అసహనంగా భార్య వేపు చూసి మొహం పక్కకు తిప్పుకున్నాడు రాజు. భోజనం చేసి వెంటనే కారెక్కి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయాడు..

టీవీ ముందు కూర్చొని రాత్రి దాదాపుగా అర్ధరాత్రి లేచి నీరసంగా నడుస్తూ వెళ్లి మెత్తని పరుపు మీద వాలి పోయింది శృతి. చాలా సేపు నిద్ర పట్టక అటూ ఇటూ తిరిగి పడుకుంది. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర లోకి జారుకుంది..

మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో బద్దకంగా లేచి కిందకు వచ్చింది శృతి.

“అమ్మా.. కాఫీ కలపనా?” అడిగింది వంట మనిషి.

“ఊఁ” అంది అన్యమనస్కంగా.

మొబైల్ మ్రోగసాగింది. తీసుకుని “హలో” అంది.

“ఏరా శృతి.. చాలా సార్లు చేసాను. నువ్వింకా లేవలేదని చెప్పింది” అన్నాడు అటునుండి రాజు.

“అవునండీ.. చెప్పండి” అంది పేపర్ పెన్ను చేతిలోకి తీసుకుని.

“బంగారు.. కొత్తగా మనం పెట్టుకున్న మేనేజర్ బయట వున్నాడు, పిలిచి బ్యాంకు పనులు, నీకవసరమైన పనులు చేయించుకో. మనకు వ్యాపారం, డబ్బుల సంపాదన ముఖ్యం, చుట్టాలు,స్నేహితులు అంతా వేస్ట్. అమ్మా, చెల్లెలు, తమ్ముళ్లకు ఫోన్లు చేయటం మానెయి. టైం వేస్ట్. అందంగా సింగారించుకుని తిరగటం.. అది కాదు ముఖ్యం. పని మీద ఆసక్తి చూపించు” అన్నాడు రాజు.

“సరే, ఎప్పుడొస్తున్నారు” అంది. వెంటనే అటువైపు కాల్ కట్ అయ్యింది. ఫోన్ వేపు ఒకసారి చూసి పక్కన పడేసింది. సంపాదన పెరిగినప్పటినుండీ భర్త ఇలా మాట్లాడటం ఎందుకూ?, అవసరాన్ని మించిన సంపాదన మానవ సంబంధాలను మరుగున పడేస్తుంది అనుకుంది. సుఖాలు, సంపద ఉన్నప్పటికీ భర్త ఇన్ని వారాలు ఇల్లు విడిచి ఉండటంతో ఒంటరితనం బాధిస్తూ వుంది. ఆలోచనల నుండీ బయట పడి, పనబ్బాయిని పిలిచి బయట కూర్చున్న కొత్త మేనేజర్‌ను లోపలి తీసుకు రమ్మని చెప్పింది.

ఏమీ తోచటం లేదు. ఈ రోజు లేడీస్ క్లబ్ వైపు వెళ్ళాలి అని కళ్ళు మూసుకుని ఆలోచించసాగింది.

“గుడ్ మార్నింగ్ మేడం” అన్న మాట విని ఉలిక్కి పడి కళ్ళు తెరిచి ముందు నిలబడ్డ యువకుడిని చూసింది.

మెరుస్తున్న కళ్ళతో నవ్వుతూ నిలబడ్డ అతడిని చూసి “మీ పేరు?” అంది.

“నా పేరు మనోజ్. ఈ వారమే మేనేజర్‌గా రిపోర్ట్ చేసానండి. రాజు గారు మిమ్మల్ని కలవమన్నారు” అని చెప్పి నిలబడ్డాడు.

ఒకసారి చూసి చూడనట్లుగా అతన్ని గమనించింది శృతి. తెల్లని షర్ట్, ఖాకీ రంగు మీద టక్ చేసుకుని, మంచి బెల్ట్ వేసుకుని, ఎనలేని ఆత్మ విశ్వాసంతో నిలబడ్డ అతడిని చూసి తృప్తిగా తల పంకించింది.

కొన్ని చెక్కులు, పేపర్‌లు అతడి చేతిలో పెట్టి “బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకుని.. వీటికి కట్టేసి రండి. జాగ్రత్త. పెద్ద మొత్తాలు” అంది సూటిగా అతని కళ్ళలోకి దృఢంగా చూస్తూ.

కాసేపు వాటిని సీరియస్‌గా చూసి “నో ప్రాబ్లెమ్ అండీ” అని మళ్ళీ చిన్న మందహాసం చేసాడు అతను.

“మన కారులో వెళ్లండి. డ్రైవర్ ను తీసుకెళ్లండి” అంది ఏ మాత్రం నవ్వకుండా.

వెను తిరిగి వెళ్తున్న అతడిని కాసేపు చూసి ‘మంచి కుటుంబం నుండీ వచ్చినట్లుంది’ అనుకుని, ఫ్రెండ్స్‌కు ఫోన్ చేయటానికి మొబైల్ చేతిలోకి తీసుకుంది..

బంగాళా బయటకు వచ్చి కారెక్కి కూర్చోగానే డ్రైవర్ “ఎక్కడికి సార్ “అన్నాడు

“బ్యాంకు, టాక్స్ ఆఫీస్” అన్నాడు మనోజ్. అతనికి – కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న శృతి గుర్తొచ్చి ‘ఏమి ఠీవి, దర్పం? ఇలాంటి అందమైన అమ్మాయి దొరికితే, ఇక కట్న కానుకలు అనవసరం’ అనుకున్నాడు.

మరుసటి రోజు ఉదయం వెళ్లి వరండాలో కూర్చొని న్యూస్ పేపర్ తిరగేయ సాగాడు మనోజ్.

అరగంట తర్వాత బయటకు వచ్చిన శృతి అతన్ని చూసి “అదేంటి ఇక్కడున్నారు. మీరు లోపలి వచ్చి పని చేసుకోవచ్చు. రండి” అని లోనికి దారి తీసింది.

శృతికి ఎదురుగా కూర్చుని ముందు రోజు చేసిన పనులన్నీ చూపించాడు. ఏ మాత్రం మొహంలో భావాలు లేకుండా సీరియస్‌గా వింటున్న శృతిని చూసి ‘ఈవిడ మామూలు స్త్రీ కాదు’ అనుకున్నాడు.

ఒక్క రోజులోనే చాలా పనులు పూర్తి చేసుకొచ్చిన మనోజ్ ను చూసి ‘పరవాలేదు’ అనుకుంది శృతి.

“ఏంటి ఆలోచిస్తున్నారు?” అంది శృతి అతన్ని తీక్షణంగా చూసి.

“అబ్బే ఏం లేదండి. ఈ రోజు మన రెండవ ఫ్యాక్టరీకి వెళ్ళాలి” అని శృతిని చూసాడు మనోజ్. చక్కని అందమైన కళ్ళు, కోటేరు ముక్కు, అసలు అందమంటే ఇలా ఉండాలి అనుకున్నాడు.

“పది నిముషాల్లో వెళదాం. డ్రైవర్‌ను కార్ తీయమని చెప్పండి. కాఫీ తీసుకుంటారా?” అని అడిగి సమాధానం చెప్పే లోగా, అక్కడ నిలబడ పనిమనిషికి కాఫీ ఇవ్వమని చెప్పి వెళ్ళింది.

కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి ఫ్యాక్టరీ ఆఫీసులో కూర్చొని అకౌంట్స్ చూడసాగారు.

పుస్తకాలు మూసి మనోజ్‌ను చూసి “మధ్యాహ్నం రెండు సమయం కావస్తోంది. మీరెళ్ళి లంచ్ చేసి రండి.” అంది.

“మీరు వచ్చే వరకూ ఆగుతానండి” అన్నాడు. అతని గొంతులో గౌరవం ఉట్టిపడుతోంది.

కాసేపు చిరాకుగా చూసింది శృతి. మనోజ్ ఈసారి కూడా ఏ మాత్రం నవ్వకుండా చూసాడు.

“సరే పదండి” అని డైనింగ్ రూమ్ వేపు నడిచింది.

భోజనం చేస్తున్నంత సేపు, తాను తినటం ఆపి శృతికి వడ్డించ సాగాడు మనోజ్. అప్పుడప్పుడూ కాస్త బలవంతం చేసి వడ్డించాడు.

“చాలా రోజులయ్యింది ఇలా ఫుల్లుగా తిని” అంది తృప్తిగా.

లేచి వెళ్లి వాష్ బేసిన్‍లో చేతులు కడుక్కుని వెనక్కు తిరిగి మనోజ్ చేతుల్లోనుండీ నాప్‌కిన్ అందుకుని “థాంక్స్” అని ఆఫీసు గదిలోకి అడుగులు వేసింది శృతి.

పెళ్లయిన కొత్తలో బాత్ రూమ్ దగ్గర టవెల్ పట్టుకుని ఆట పట్టించే భర్త గుర్తొచ్చాడు. వెంటనే ఆమె మనసులో ఏదో తెలియని బాధ ఆవరించుకుంది. తల విదిల్చి,ఆలోచనలు పక్కకు నెట్టి పనిలో నిమగ్నమైంది.

సాయంత్రం ఆఫీసు నుండీ ఇంటికి బయలుదేరారిద్దరూ. కారులో, మౌనంగా, వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శృతి.

ఇంటి ముందు కారు ఆగ గానే కళ్ళు తెరిచి, కారు దిగి ఇంటి మెట్లెక్కి ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి “మనోజ్.. కాఫీ తీసుకుని వెళ్ళండి” అంది.

లోని కెళ్ళి సోఫాలో కూర్చున్నాడు మనోజ్. డ్రెస్ మార్చుకుని వచ్చి ఎదురుగా కూర్చుంది శృతి. లేచి నుంచున్నాడు మనోజ్.

“అరెరే.. పర్లేదు కూర్చోండి.” అంది శృతి.

“థాంక్ యు” అని కూర్చున్నాడు.

“మీ కుటుంబం ఎక్కడ ఉండేది” అడిగింది శృతి.

వివరాలు చెప్పసాగాడు మనోజ్. ఆసక్తిగా వినసాగింది.

పనమ్మాయి తెచ్చిన కాఫీ కప్ చేతుల్లోకి తీసుకుని, శృతి ముంజేతులకున్న వజ్రాల గాజులు చూస్తూ ‘ఈవిడ ఒంటి రంగులో కలిసి పోయింది బంగారు గాజు’ అనుకున్నాడు.

“ఏంటి మనోజ్ ఏదో ఆలోచిస్తున్నారు. గాజుల గురించా” అంది.

దొరికి పోయాను అనుకుని “అదేనండి.. అవీ చాలా బాగా సెట్ అయ్యాయి మీకు” అన్నాడు తడబడుతూ.

కాసేపు అతని కళ్ళలోకి చూసి “పర్లేదే.. మీకు టేస్ట్ వుంది. కాబోయే భార్యకు చేపిద్దురు గాని” అంది నవ్వుతూ.

తల వంచుకుని నవ్వాడు మనోజ్.

“మీరు సినిమాలకు వెళ్తుంటారా మేడం?” మాట మారుస్తూ అడిగాడు.

“చాలా ఏళ్ళు గడిచాయి” అంది శృతి. ఆమె మొహంలో కాంతి తగ్గింది.

“ఎందుకనీ?” అన్నాడు ఆశ్చర్యంగా చూసి.

“మీ సార్ బిజీ అయి పోయారు కదా, అంతకు ముందు వెళ్లే వాళ్ళం” అంది. ఆమె స్వరంలో నిరాశ తొంగిచూసింది.

“ఫ్రెండ్స్‌తో వెళ్లొచ్చు కదా” అన్నాడు మెత్తగా, అనునయిస్తున్నట్లుగా.

“వెళ్లొచ్చు.. ఏదీ ఎప్పుడూ ఈ వ్యాపార గొడవలే కదా” అంది నవ్వేస్తూ.

“మీరు ఎంబీఏ చదివారా?” అన్నాడు మనోజ్.

అది వినగానే బిగ్గరగా నవ్వేసింది శృతి. కాసేపు నవ్వుతూనే వుంది. నవ్వుతుంటే రెట్టింపయిన ఆమె అందాన్ని కళ్ళార్పకుండా చూడసాగాడు మనోజ్.

నవ్వుతో బాటు వచ్చిన కళ్ళ నీరు తుడుచుకుని “ఎందుకలా అడిగారు?” అంది.

“మీరింత పర్ఫెక్ట్‌గా వ్యాపారాన్ని, లెక్కలను చూసుకుంటుంటే అనుమానం వచ్చిందండి” అన్నాడు సంజాయిషీ ఇచ్చినట్లుగా. అతని కళ్ళలో ఆమె పట్ల అభిమానం కనపడుతూ వుంది.

“అవన్నీ మొదటినుండీ,కంపెనీ మొదలయ్యినప్పటినుండీ చూస్తూ వున్నాగా,అలా అలా నేర్చుకున్నా.” అంది.

ప్రశంసాపూర్వకంగా చూశాడామెని.

“అనుభవం మీద అన్నీ వస్తాయి.” అంది.

చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. రాత్రి ఎనిమిది కావొచ్చింది.

“నేనిక వస్తానండీ” అని లేచాడు మనోజ్.

“అరే.. చాలా సేపు గడిచి పోయింది. మాట్లాడుతూ ఉంటే టైమే తెలీలేదు మనోజ్. థాంక్యూ ఫర్ కంపెనీ. ఎలాగూ డిన్నర్ చేయాలి. మీరూ ఇక్కడే చేసెయ్యండి” అంది. ఆమెలో ఏదో తెలీని నూతనోత్సాహం మొలకెత్తింది.

“ఇంట్లో అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందండి” అన్నాడు.

“ఫోన్ చేసి చెప్పండి, ఇక్కడ చేస్తున్నానని” అని సమాధానంకై ఎదురు చూడకుండా తన సహజమైన దర్పంతో వంటింట్లోకి వెళ్లి పనివాళ్లని పురమాయించ సాగింది.

ఇద్దరూ డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చొని, దగ్గర్లో చూడదగిన కొన్ని ప్రదేశాలు, సినిమాలు, పిచ్చాపాటి మాట్లాడుకుంటూ భోజనం పూర్తి చేశారు.

అలా కొన్ని నెలలు గడిచి పోయాయి. ప్రతి పని మనోజ్‌కు అప్పచెప్పసాగింది. కొన్ని ఫంక్షన్స్‌కు మనోజ్‌ను వెంట తీసుకెళ్లి, అర్ధరాత్రి తిరిగి ఇంటికి చేరుకునేది శృతి. రోజు రోజుకి ఇద్దరూ స్నేహితుల్లాగా మారిపోయారు.

ఒక రోజు మనోజ్ వెళ్ళిపోయాక, రాత్రి పడుకుని తన పట్ల అతని కళ్ళలో కనపడే ఆరాధనా భావం గుర్తొచ్చి అర చేయి చెంప కింద పెట్టి నిద్రకుపక్రమించింది. పెళ్లయిన తాను వేరే మగాడి గురించి ఆలోచించటం తప్పు అనుకుని కళ్ళు మూసుకుంది.

మరికొద్ది సేపటిలో మళ్ళీ మనోజ్ ఆలోచనలు ఆమె మనసు నిండా ముసురుకున్నాయి.

‘ఇతనిలో ఉన్నఆకర్షణ ఏంటి? జీవితం పట్ల మంచి అవగాహన వుంది. పనిలో మంచి పట్టుదల, అదే సమయంలో ఆనందించే మనసుంది’ అని మనోజ్ గురించి ఆలోచించ సాగింది. సరిగ్గా అదే క్షణంలో రాజు నుండీ ఫోన్ మ్రోగసాగింది.

కళ్ళు బలవంతంగా తెరిచి ఫోన్ తీసుకుని భర్త పేరు చూసి “హలో.. చెప్పండి.. పొద్దున్నుండీ చేయలేదు” అంది.

“అవును.. ఈ రోజంతా ఆ లైసెన్సుల గురించి ఆఫీసులో మినిస్టర్ కొరకు ఎదురు చూడటమే సరిపోయింది. ఇంతవరకూ మధ్యాన్న భోజనం చేయలేదు. ఇదుగో ఇప్పుడు కాస్త స్నాక్స్ తీసుకుంటూ ఫోన్ చేశా.. ఏంటి ఈ రోజు.. ఎంత రెవిన్యూ? రేపు బ్యాంకుల వాయిదాలు కట్టెయ్యి. పనులు చేసుకో. నగలు.. ఖరీదైన చీరలు ఊరికే రావు. దానాలు ధర్మాలు చేయకు. పొద్దస్తమానం గుడులు గోపురాలు తిరగకు. హుండీలో డబ్బులు వేయటం దండగ’’ అన్నాడు రాజు.

అవి విని, ఆ రోజు జరిగిన వ్యాపార లావాదేవీలు చెప్పటం పూర్తి చేసి, ఊపిరి తీసుకుంది “హలో ఏమండీ.. ఎప్పుడొస్తారు?” అంది ఆశగా. అయితే అటునుండి సమాధానం లేదు. ఫోన్‍ను చూసింది. లైన్ కట్ అయి పోయినట్లుగా కనపడింది.

‘జీవితమంటే డబ్బు సంపాదన మాత్రమేనా? వైవాహిక ఆనందం, ప్రేమలు.. మూన్నాళ్ళ ముచ్చటేనా? మూసుకు పోయిన ఆనందపు తలుపులు ఇక జీవితంలో తెరుచుకోవా? ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా, భర్త పక్కనుంటే అన్నీ మాయమయ్యేవి అని’ ఆలోచిస్తూ మనసంతా నిరాశ నిండి పోయి, నిద్ర పట్టక చాలా సేపు కళ్ళు మూసుకుని అటూ ఇటూ తలగడలు మారుస్తూ నిద్ర పోయింది.

“గుడ్ మార్నింగ్ బంగారం.” అన్నాడు రాజు.

“అబ్బో ఏంటండీ.. చాలా సంతోషంగా వున్నారు” అంది శృతి భర్త సంతోషాన్ని చూసి.

“ఇక ఈ వ్యాపారాలు తగ్గించేసి.. మనిద్దరం హాయిగా ముందులాగా ఉందామని నిర్ణయించుకున్నాను. చాలు కోట్లు సంపాదించాను.” అన్నాడు రాజు భార్యను ఆనందంగా చూసి.

“నిజంగానా..!! అమ్మయ్య” అంటూ భర్తను గట్టిగా, తృప్తిగా కౌగిలించుకుంది. భార్యను ఎత్తుకుని గిరగిరా తిప్పసాగాడు రాజు. అలా తిప్పుతుంటే ఆమె కళ్ళు తిరగ సాగాయి

 “అమ్మో అమ్మో” అంటూ సంతోషంతో అరుస్తూ నవ్వసాగింది శృతి. అంతలో అలారం మోత విని ఉలిక్కి పడి నిద్ర లోనుండీ లేచి చుట్టూ చూసింది. ఎవరూ కనపడలేదు. పడగ్గది చీకటిగా వుంది. నీరసంగా లేచి కిటికీ తెర తీయగానే సూర్య కిరణాలు గది నిండా పరుచుకున్నాయి.

ఇప్పటి వరకూ జరిగింది కల అని తెలిసి దిగాలుగా నిలబడి పోయింది కొద్ది సేపు. మనసంతా ఖాళీ అయిపోయింది.

కాసేపటి తర్వాత గదిలో నుండీ కిందకు దిగి వచ్చి, నీరసంగా నడుస్తూ వెళ్లి, సోఫాలో కూర్చుని టీవీ రిమోట్ తీసుకుని టీవీ పెట్టుకుని, దూరంగా వెళ్తున్న ట్రైన్‌ను చూస్తూ, టీపాయ్ మీదున్న నిమ్మరసం త్రాగుతుండగా “అమ్మగారు మేనేజర్ సార్ వున్నారు బయట” అంది పనమ్మాయి.

అది వినగానే శృతి మనసు సంతోషంతో పరుగులు తీసింది. “లోపలికి రమ్మను” అంది.

“గుడ్ మార్నింగ్ మేడం” అంటూ చెరగని చిరునవ్వుతో కనపడ్డాడు మనోజ్.

ఎంత సంతోషంగా వున్నాడు.. డబ్బులు ఎక్కువగా లేవు కదా, అందుకే అయ్యుంటుంది అని అనుకుంది. అతన్ని చూస్తుంటే మనసుకి, వెన్నెల్లో స్నానం చేయిస్తున్నట్లుగా వుంది.

మనసులో తన భావాలను కనపడనీయకుండా అదుపు చేసుకుని “గుడ్ మార్నింగ్.. త్వరగా వచ్చారు.. ఏమైనా అత్యవసరమా?” అంది, సోఫా లో కూర్చోమని సైగ చేస్తూ.

“ఈ రోజు పనులేమీ లేవు.. ఉదయం తొందరగా రాణి కోటకు వెళదామనుకున్నాం కదా? మర్చిపోయారా?” అన్నాడు మనోజ్.

“అరెరే.. నిజమే కదా.. కూర్చోండి, నేనిప్పుడే రెడీ అయ్యి వస్తాను. డ్రైవర్‌కి ఫోన్ చేసి రమ్మని చెప్పండి” అని లేచి పై గది మెట్ల వేపు హడావిడిగా నడిచింది.

“డ్రైవర్‌కు జబ్బు చేసింది.. నేను నడుపుతాను.” అన్నాడు మనోజ్. సరేనని చేయి ఊపి, గదిలోకి వెళ్లి అరగంటలో బయటకు వచ్చి కారెక్కింది..

మరి కొద్ది క్షణాల్లో కారు రాణి కోట వేపు పరుగులు తీసింది. కారు దిగగానే కోట గోడలు దాటి హుషారుగా కొన్ని మెట్లెక్కి, ఆయాస పడుతూ నిలబడి, వెనక వస్తున్న మనోజ్‌ను చూసి, “త్వరగా రండి” అంది శృతి.

జేబులోనుండీ మొబైల్ తీసి శృతి ఫోటోలు తీయసాగాడు మనోజ్.

పంజరంలో నుండీ వదిలిన పక్షి లాగ శృతి మనసు గాలిలో విహరిస్తూ వుంది.

రెండు గంటలు పాటు, పాడుబడ్డ శిధిలాల మధ్యన, పిచ్చిగా పెరిగిన మొక్కల మధ్య తిరిగి అలసిపోయి, సగం కూలిన ఒక మంటపం కింద కూర్చున్నారు.

“చాలా రోజుయింది.. ఇలా రిలాక్స్‌డ్‌గా సమయం గడిపి” అంది శృతి నుదుటి మీదున్న స్వేద బిందువులను తుడుచుకుంటూ.

చేతి సంచీలో నుండి టిఫిన్ డబ్బాలు తీసి ప్లేట్స్‌లో స్వీట్స్, ఖారా పెడ్తూ సమాధానంగా నవ్వు నవ్వాడు మనోజ్.

తిన్న తర్వాత లేచి బాటిల్ తీసుకుని పక్కకు వెళ్లి చేయి కడుక్కుని తిరిగి అడుగు వెనక్కి వేయగానే శృతి కాలిలో ముళ్ళు దిగబడింది. దాంతో అబ్బా అని అరిచి కూర్చుండి పోయింది శృతి.

మనోజ్ వెళ్లి ‘‘కదలకండి’’ అని చెప్పి పాదాన్ని చేతిలోకి తీసుకుని ఒడుపుగా ఆ ముల్లుని బయటకు లాగాడు.

నొప్పితో కళ్ళు మూసుకుని కూర్చున్నశృతి చేయి పట్టుకుని లేపి మంటపం అరుగు మీద కూర్చోపెట్టాడు. నీటితో పాదం కడిగి గాయం మీద తన జేబు రుమాలును కట్టాడు మనోజ్.

బంగారు రంగుతో మెరిసిపోతున్న శృతి పాదాన్ని చూసి ‘ఎంత నాజూకుగా వున్నాయి’ అనుకుని, రుమాలుని సరి చేసి కొన్ని క్షణాలు మెల్లిగా పాదాన్ని నిమిరి “నొప్పి తగ్గిందా శృతి గారు” అన్నాడు.

“పరవాలేదు. వెళదాం” అంది.

“సరే కాసేపు కూర్చోండి” అని పాదాన్ని ప్రేమగా నొక్కాడు.. అతని స్పర్శతో తృప్తిగా కళ్ళు మూసుకుని స్తంభానికి ఆనుకుని కూర్చుంది శృతి.

ఇద్దరి మధ్య మౌనం తాండవించింది. మనసులు మాట్లాడుకుంటున్నాయి. అతను తన హృదయానికి దగ్గరయినట్లుగా మధురమైన భావనతో, పక్కన కూర్చున్న అతని భుజం మీద తల వాల్చింది శృతి.

తల కిందకు వంచి శృతి పాపిట రేఖను ముద్దాడాడు మనోజ్. శృతి మనసుకి మండే ఎడారిలో చల్లని నీడ దొరికినట్లుగా అయ్యింది. ఇంకాస్త తన తలను మనోజ్ గుండెలకు ఆనించింది. కొన్ని క్షణాలు గడిచి పోయాయి.

“బంగారం.. ఏం చేస్తున్నావ్?” అని భర్త రాజు పిలిచినట్లు అనిపించి ఉలిక్కి పడి మనోజ్ నుండీ జరిగి చుట్టూ చూసింది.

వెంటనే తల విదుల్చుకుని లేచి నిలబడి “పదండి వెళ్దాము” అని మనోజ్ వేపు చూడకుండా వేగంగా అడుగులు వేసింది.

ఆకస్మాత్తుగా ఏం జరిగిందో మనోజ్‍కు అర్థం కాలేదు.

‘వివాహితను ఐన తాను భర్త ఉండగా ఇలా అదుపు కోల్పోవడమేంటి? తానెందుకిలా అయిపోతోంది?’ అని ఆలోచనల్లో కూరుకుపోయింది శృతి.

కారులో కూర్చున్నంత సేపు శృతి మాట్లాడలేదు. ఆమె మనసంతా అల్లకల్లోలంగా వుంది. ఇంటికెళ్లి గదిలో పడుకుని ఆలోచనల్లో మునిగి పోయింది.

ఇంతలో పక్కన మ్రోగుతున్న మొబైల్ తీసుకుని “హలో చెప్పండి” అంది.

“నేనండీ.. మనోజ్” సంకోచిస్తూ అన్నాడు.

“చెప్పండి మనోజ్” అంది నిలకడగా.

“సారీ” అని ఆగాడు.

“..ఇట్స్ ఓకే” అంది. శృతి మాటలో కాస్త కాఠిన్యం వినపడింది.

“కాస్త హద్దు మీరాను. క్షమించండి. ఉదయం ఎప్పుడు రమ్మంటారు “అన్నాడు.

“ఎప్పుడూ వచ్చే సమయానికే రండి. గుడ్ నైట్” అని కటువుగా చెప్పి ఫోన్ కట్ చేసింది. మనసుని అదుపులో పెట్టుకోవాలి. చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంది.

మరుసటి రోజు ఉదయం శృతి ముందు కూర్చొని ఫైల్, లెడ్జెర్ చూపిస్తూ వివరించసాగాడు. అప్పుడప్పుడూ ఇద్దరి చూపులు కలుసుకుని అందులోని భావాలను చదవటానికి యత్నించసాగాయి. తేనె రంగు కళ్ళు అనుకున్నాడు.

పనమ్మాయి తెచ్చిన మొబైల్ అందుకుని “లలితా చెప్పు ఏంటి విశేషం?” అంది శృతి.

“హ్యాపీ మ్యారేజ్ డే శృతి” అంది లలిత అటునుండి

“థ్యాంక్యూ లలిత” అంది బలవంతంగా నవ్వు తెచ్చుకుని.

“ఏం గిఫ్ట్ ఇచ్చారు మీ వారు?” అంది.

“అన్నీ వున్నాయి. ఇంకా ఏమిస్తారు” అంది లేని నవ్వు తెచ్చుకుని.

కొద్ది సేపు మాట్లాడి పెట్టేసి, బయటకు వస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకుంది శృతి. డబ్బులు, హోదా పెరగక ముందు ఆ రోజు ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళటం, ముందు వారం స్కూటర్ పైన వెళ్లి నచ్చిన చీర తెచ్చుకుని, పెళ్లి రోజున పొద్దున్నే స్నానం చేసి కొత్త చీర కట్టుకుని, పాయసం చేసుకుని తినటం వగైరాలన్నీ గుర్తుకొచ్చి దిగాలుగా కూర్చుండి పోయింది.

ఇంతలో రాజు నుండి ఫోన్ మ్రోగింది. అది చూసి ఆనందంగా “హలో ఏవండీ” అంది.

“నిన్న చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా, జాగ్రత్త. తిని, నగలేసుకుని ఊరేగటం ముఖ్యం కాదు. పని ముఖ్యం. ఇంకా ఏంటి?. ఏవైనా సమస్య వస్తే ఫోన్ చేయి. ఓకే” అని ఫోన్ పెట్టేసాడు రాజు.

ఫోన్ పక్కన పెట్టేసింది శృతి. దుఃఖం ఆగటం లేదు. ‘రాజు ఇలా మారిపోయాడేంటి? పెళ్లి రోజు అన్నది రాజుకి గుర్తే లేదు’ అని అర్థం అయిన కొద్దీ కడుపులోనుండి బాధ తన్నుకు రాసాగింది.

“హ్యాపీ మ్యారేజ్ డే” అన్న మనోజ్ వేపు నీళ్లు కారుతున్న కళ్ళతో చూసి లేచి గదిలోకి పరుగెత్తింది.

ఈ పరిణామంతో విస్తుపోయిన మనోజ్ కాసేపు అలాగే కూర్చుని, లేచి ఏం చేయాలో తోచక శృతి వెళ్లిన గదిలోకి అడుగు పెట్టి మంచం మీద వెక్కి వెక్కి ఏడుస్తున్న శ్రుతిని చూసి కంగారుగా దగ్గరికి వెళ్లి ‘‘ప్లీజ్ శృతి గారు.. కంట్రోల్ చేసుకోండి. ప్లీజ్ ఏడవకండి” అని, నిలబడి తన రుమాలుతో కళ్ళు తుడవటానికి ప్రయత్నించాడు.

కానీ శృతి ఏడుపు ఆగలేదు.

శృతి రెండు చేతులు పట్టుకుని “ప్లీజ్ ఆపండి. ప్లీజ్ ఏడవకండి” అన్నాడు.

అలాగే చాలా సేపు ఏడ్చి, అతని చేతులు విడిపించుకుని, మౌనంగా పక్కకు ఒరిగింది శృతి.

కళ్ళు మూసుకుని వెక్కిళ్లు పెడుతున్న శృతి నుదుట అరచేతితో నిమిరాడు. అతని చేయి తన చేతులతో పట్టుకుని కాసేపటికల్లా నిద్ర లోకి జారుకుంది శృతి. వాచీ చూసాడు మనోజ్. పదకొండు కావస్తోంది.

మెల్లిగా చేయి విడిపించుకుని, దుప్పటిని మెల్లిగా పైన కప్పి, ఒక నిముషం శృతిని చూసి మౌనంగా బయటకి వెళ్లి పోయాడు.

గదిలో నుండీ బయటకు వెళ్తున్న మనోజ్‍ను చూసిన పనమ్మాయి రంగమ్మ వెళ్లి తలుపులు వేసుకుంది.

తెల్లవారు జామున మెలకువ వచ్చి లేచి గడియారం వేపు చూసింది. శృతి. మనోజ్‌కు ఫోన్ చేయాలనపించి ఫోన్ తీసుకుని నెంబర్ కలిపింది.

“హలో.. శృతి.. గుడ్ మార్నింగ్ మేడం” అన్నాడు నిద్ర మత్తు వదిలించుకుంటూ. దూరంగా ట్రైన్ కూత వినపడ సాగింది అటునుండి.

“రాత్రి ఇంటికి ఎప్పుడెళ్లారు” అంది మెల్లిగా.

“మీరు నిద్ర పోయిన కాసేపటికి వెళ్లిపోయానండి” అన్నాడు మంచం మీద నుండీ లేచి కూర్చుని.

“ఈ రోజు ఒక పెళ్ళికి వెళ్ళాలి, మధ్యాహ్నం. మీరు రాగలరా?”

“వస్తానండి. ప్రొద్దున ఆఫీసులో ఒక గంట పని వుంది. అది ముగించి వస్తాను.” అన్నాడు.

“నిద్ర చెడగొట్టానా?”

“లేదండి. ఆల్రెడీ లేచాను” అబద్ధం చెప్పాడు.

“లేదు. మీరు మంచి నిద్ర లోనుండి లేచారు” అంది చిన్నగా నవ్వుతూ.

“నాది సరే… మీరసలు ఇంత త్వరగా లేవడమేంటి.. విచిత్రం” అన్నాడు

చాలా సేపు మాట్లాడుతూ వుండిపొయారలాగే. రెండు గంటలు రెండు నిమిషాల లాగా గడిచి పోయాయి.

ఫోన్ పెట్టేసి, మనోజ్ మాటలు, అతని స్నేహంలో వున్న మాధుర్యం గురించి ఆలోచనల్లో మునిగి పోయింది. శృతి మనసంతా ఉల్లాసంగా వుంది. కళ్ళు మూసుకుని ఊహల్లో తేలియాడసాగింది. మనసంతా వింతగా,రంగుల మయం అయిపోయింది.

ఇంతలో మొబైల్ మ్రోగసాగింది. చేతుల్లోకి తీసుకుని “హలో ఎవరూ” అంది అన్యమనస్కంగా. “నేనే బంగారం.. నిన్న చెప్పిన పనేం చేశావు.” అన్నాడు రాజు అటునుండి.

భర్త గొంతు వినగానే చెళ్ళున కొట్టినట్లయి ఈ లోకం లోకి వచ్చి పడ్డట్లయ్యింది. “ఆ చెప్పండి..” అంది కంగారుగా.

“ఏంటి చెప్పడం.. ఏ లోకంలో వున్నావ్.. తినటం తిరగటం కాదు.. డబ్బులెలా సంపాదించాలి అన్నది ముఖ్యం.” అన్నాడు అదోరకంగా.

“సరేనండి”అంది. ఆమె కాళ్ళు భయంతో నీరస పడిపోయాయి.

“ఏంటి సరే.. సుఖాలు ఎక్కువ అయ్యి, బద్ధకం పెరిగి పోయిందనుకుంటాను. ” అని కోపంగా అరిచాడు.

ఏమీ మాట్లాడ లేదు శృతి. కళ్ళ లో నీరు గిర్రున తిరగసాగాయి.

“మొగాడు డబ్బులు సంపాదిస్తుంటే చాలు.. నీకేం అక్కర లేదు. హాయిగా వున్నావ్. పని చేయటం మాత్రం చేత కాదు. ”

మౌనంగా ఫోన్ పట్టుకుని కూర్చుంది శృతి. పది నిముషాల పాటు భర్త అంటున్న అసహ్యకరమైన మాటలు వింటూనే వుంది. వున్నట్లుండి ఫోన్ కట్ చేసాడు రాజు.

ఫోన్ పక్కన పడేసి, ఆలోచించ సాగింది. మొదట్లో తన దగ్గరున్న మొత్తం బంగారు నగలన్నీ వ్యాపారానికి భర్త చేతిలో పెట్టినప్పుడు, కళ్ళ నీరు పెట్టుకున్న ఆ మనిషేనా ఇలా మారిపోయింది? అనుకుంది. వ్యాపార ఎదుగుదలలో ప్రతి కష్టంలో తాను చేదోడు వాదోడుగా వున్నప్పుడు ఎంత ప్రేమించాడు. ఇప్పుడెందుకిలా మారిపోయాడు? అకారణంగా తనను ఎందుకిలా అసహ్యించుకుంటాడో అర్థం కాలేదు.

ప్రేమ రాహిత్యంతో తన జీవితానికి అర్థం లేకుండా పోయింది. ఒంటరితనం నరకం అనుకుంది.

ఇంతలో “గుడ్ మార్నింగ్” అన్న మాట విని కళ్ళు తెరిచింది శృతి.

ఎదురుగా చిరునవ్వుతో నిలబడి చూస్తున్న మనోజ్‍ను చూసి కంగారు పడి కళ్ళు తుడుచుకుని “కూర్చోండి” అంది.

కళ తప్పిన శృతి మొహం చూసి చలించిపోయి మౌనంగా కూర్చున్నాడు.

“మనమీ రోజు పెళ్లికి వెళ్ళాలి అన్నారు కదా” అన్నాడు చిరునవ్వుతో, శృతిలో కనిపించే బాధను మరిపించటానికి.

“అవును.. కాసేపటిలో వెళదాం” అని చెప్పి గదిలోనికి వెళ్ళింది.

కార్లో వెళ్తున్నంత సేపూ కళ్ళు మూసుకుంది శృతి.

“ఇక్కడ ఆపమంటారా, ఈ గుడి బావుంటుంది.” అడిగాడు కార్ ఒక పక్కకు ఆపుతూ.

దర్శనం చేసుకుని బయటకు వస్తూ “వెళ్లి పోయే ముందు,కాసేపు కూర్చోవాలంటారు” అని మెట్ల పక్కన అరుగు చూపించి.

శృతికి కాస్త దూరంగా కూర్చున్నాడు మనోజ్. “ఈ గుడి చోళులు కట్టించారని అంటారు” అని చెప్పి, బాధతో కళ తప్పిన, అలసిపోయిన శృతి కళ్లను చూసాడు.

ఒక క్షణం మనోజ్ ను చూసి తల వంచుకుంది.

“వెళ్దాము పదండి” అని లేచింది శృతి.

మంటపం చేరుకోగానే అక్కడి పెద్దలు శృతిని తీసుకెళ్లి వేదిక ముందు వరసలో సోఫాలో కూర్చోపెట్టారు.

మనోజ్ కేసి చూసి పక్కన కూర్చోమని సైగ చేసింది శృతి. ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చోగానే అతని మనసు జలపాతంలా ఉరుకులు పెడుతూ వుంది. శృతి హృదయం రాగాలు పలుకుతోంది. మనసుకి ఎన్నడూ లేనంత హాయిగా అనిపించి ఓరగా ఒకసారి మనోజ్‌ను చూసింది. అతనిలో మర్యాద వుట్టిపడుతున్న గాంభీర్యత కనపడింది.

చాలా మంది బంధువులు ఒక్కొక్కరిగా వచ్చి శృతిని పలకరిస్తున్నారు. “అతనెవరు?” అని అడిగిన కొందరికి, మా మేనేజర్ అని చెప్పకుండా “మనోజ్ అని మాకు బాగా కావలిసిన వారు” అని చెప్పటం విన్నాడు, మనోజ్.

తిరుగు ప్రయాణమయ్యేటప్పటికీ సాయంకాల సమయం చేరువయ్యింది.

“ఎలాగూ ఇంత దూరం వచ్చాం.. కాసేపు బీచ్‍లో కూర్చుందామా?” అంది తేలిక పడ్డ మనసుతో.

కార్ బీచ్ వేపు తిప్పాడు.

కార్ దూరంగా ఆపి సముద్రం తీరం వేపు నడిచారు. దూరంగా కొన్ని పడవలు తిరిగి వస్తున్నాయి. బీచ్ చాలా వరకూ నిర్మానుష్యంగా వుంది.

“అక్కడ కూర్చుందాం” అంటూ సముద్రపుటలలు తాకుతున్న ఇసుకలో అంచుల దగ్గర కూర్చున్నారు. ఆకాశంలో కొన్ని పక్షులు బారులుగా ఎగురుతున్నాయి. ఎండ తగ్గిపోయి, చల్లని గాలి హోరున విసురుతోంది.

ఆ గాలికి ఎగురుతున్న ముంగుర్లను వెనక్కి తోసి “సముద్రం లోతు తెలుసుకోలేము కదా?” అంది శృతి.

శృతి చీర కొంగు ఎగిరి మనోజ్ మొహాన్ని చుట్టేసింది. దాన్ని మెల్లిగా దూరంగా లాగి “సారీ” అంది శృతి.

“ఇది నా అదృష్టం” అన్నాడు మనోజ్, చీరకంటుకున్న ఆమె పరిమళాన్ని గుండెల నిండా నింపుకుని.

“నీ వయసెంత మనోజ్?” అంది.

చెప్పాడు మనోజ్.

“నాకంటే కాస్త చిన్న వయసే” అంది

ఇబ్బందిగా కదిలాడు మనోజ్. “అదంత పెద్ద విషయం కాదులెండి” అన్నాడు

“అబ్బా..” అంది శృతి.

‘‘సూర్యుడు సముద్రం లోకి మునిగి పోతున్నాడు” అన్నాడు మనోజ్.

“నువ్వెక్కడ చదివింది” అంది శృతి వెనక్కి రెండు చేతుల పైన ఒరిగి.

చెప్తూ వున్నాడు మనోజ్. వింటూ వుంది శృతి. చుట్టూ చీకటి మెత్తగా పరుచుకోసాగింది. సముద్ర గాలి ఎక్కువయ్యింది. చాలా సేపు ఇద్దరూ మాట్లాడుతూ ఉండిపోయారు. చంద్రుడి వెన్నెల సమద్రం పైన మెరుస్తూ వుంది.

ఇద్దరూ ఇసకలో వాలిపోయారు. ఇద్దరి మనసులు మధురమైన భావాల సముద్రంలో మునిగి పోయాయి. పైనుండీ అప్పుడే మినుక్కు మంటున్న నక్షత్రాలు మాత్రమే వీరిని గమనిస్తున్నాయి.

తన చేయి ముందుకు జరిపి శృతి అరచేతిని వేళ్ళతో నిమురుతూ అన్నాడు “అద్భుతమైన అందం సుమా మీది”

శృతి నోట మాట పెగల్లేదు. తన చేతి వేళ్ళని ముడిచి మనోజ్ వేళ్ళని పట్టుకుని వ్యక్తపరచలేని భావోద్యోగానికి లోనయ్యింది. కాసేపు ఇద్దరి చేతులు సంభాషించుకున్నాయి. అవధులు లేని కోరికలు మొలకెత్తసాగాయి.

చంద్రుడు పక్కనే వున్న నల్లని మబ్బుల చాటున దాక్కున్నాడు. అంతా చీకటి.

చటుక్కున లేచి “నో మనోజ్.. నో నో” అంటూ కారు వేపు వేగంగా అడుగులేస్తున్న శృతి వెనకాల విస్తుపోతూ తాను నడిచాడు.

ఇంటికెళ్ళేవరకూ కారులో ఇద్దరూ మౌనాన్ని ఆశ్రయించారు. ఇంటికెళ్ళేసరికి రాత్రి పదకొండు దాటింది. కార్ ఆపగానే ఇంట్లోకి వెళ్లిపోయింది శృతి. తాను కూడా మెల్లిగా అనుసరించాడు.

గదిలో లైట్ వేసుకోకుండా మంచం మీద పడిపోయింది శృతి. మనసంతా అల్లకల్లోలంగా వుంది. ఏది మంచో ఏది చెడో తెలియని మానసిక సందిగ్ధంలో ఊగిసలాడుతోంది. గుండెలు గతి తప్పి కొట్టుకుంటున్నాయి.

ఆమెకు తెలీకుండా కళ్ళలో నీరు కారిపోతున్నాయి. మనసంతా మెత్తగా అయిపోయింది.

ఇంటి ముందు కార్ ఆపి లోపలి కెళ్ళి కార్ కీస్ టేబుల్ మీద పెట్టి, వెనక్కి తిరిగాడు మనోజ్. ఇంతలో గదిలోనుండీ శృతి ఏడుపు చిన్నగా వినిపించింది. ఒక క్షణం ఆలోచించి శృతి గది వేపు నడిచాడు.

మెల్లిగా గది తలుపు నెట్టి లోనకొచ్చాడు మనోజ్.

పడుకుని కళ్ళు మూసుకున్న శృతి దగ్గరగా వెళ్లి, పక్కన కూర్చొని కళ్ళు తుడుస్తూ ఆమెను చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. మంచం మీద పడుకుని ఏడుస్తున్న శృతిని చేతులతో లేపి, “ప్లీజ్ బాధపడకండి. నాదే తప్పు” అన్నాడు.

ఆ మాటతో పూర్తిగా హద్దులు తెంచుకున్న దుఃఖంతో మనోజ్ చేతుల్లో వాలిపోయింది. చాలాసేపు అలాగే వుండి పోయింది శృతి. కొద్దిసేపటికి ఒకరి కౌగిలిలో మరొకరు పెనవేసుకు పోయారు.

అతని స్పర్శతో వివశురాలయిన శృతి “వద్దు వద్దు మనోజ్, నాకు నీ సాహచర్యం ఇష్టం, ఇది కాదు నే కోరుకున్నది. నేను గీత దాటి రాలేను. ప్లీజ్.. మన స్నేహాన్ని కోరికగా మార్చవద్దు” అంటూ బలహీనంగా ప్రతిఘటించసాగింది.

“ఏమీ కాదు.. నేను నిన్ను వదలలేను “అంటూ ఆమెను వివశురాలను చేయసాగాడు

అయోమయ పరిస్థితుల్లో, అదుపు తప్పిన మనసు ఊగిసలాటలో, అతని కౌగిల్లో కరిగిపోయింది. వాళ్ళిద్దరి మధ్య కాలం ఆగిపోయింది. కానీ గోడకున్న గడియారంలో ముళ్ళు కదిలిపోసాగాయి.

సరిగ్గా అదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో బయటకొస్తున్న రాజు మనసంతా సంతోషంతో ఊగిసలాడిపోతోంది. ఈ రోజుతో తాను జీవితంలో కన్న కల నిజమయ్యింది. ఇక మీదట ఇంత పరుగెత్తాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ టెన్షన్‌తో శృతిని చిరాకు పెట్టిన విషయాలు గుర్తుకొచ్చి, ఇంటికి వెళ్ళగానే ముందుగా తనకు తన బాధ చెప్పుకోవాలి అని ఆలోచించుకుంటూ కార్ ఎక్కాడు.

ఇంట్లోకి అడుగు పెట్టి గది తలుపు తోసాడు. అది తెరుచుకోలేదు. వాచీలో సమయం చూసుకున్నాడు. తెల్లవారు నాలుగు కావస్తోంది. ‘మంచి నిద్రలో వుండి ఉంటుంది శృతి’ అనుకుని హాల్‌లో లైట్స్ తీసేసి ఒక మూలనున్న సోఫాలో పడుకుని ఒక నిమిషంలో గాఢ నిద్ర లోకి జారుకున్నాడు రాజు.

అప్పుడు వున్నట్లుండి నిద్ర లేచాడు మనోజ్. అలసి సొలసి పోయి నిద్ర పోతున్న శృతిని చూసి లేచి బట్టలు సరిచేసుకుని, శృతి పైన దుప్పటి కప్పి మెల్లిగా గది తలుపులు తీసుకుని చీకటిగా వున్న హాల్ దాటి బయటకు వెళ్లి పోయాడు. హాల్‌లో హాయిగా నిద్రపోతున్న రాజుని గమనించలేదు మనోజ్.

బయటకు వచ్చి మోటార్ సైకిల్ తీయబోతుండగా, మరో వేపు ఆగి వున్న రాజు కార్ కనిపించింది. అది చూడగానే వెన్నులో నుండి వణుకు వచ్చిందతనికి. భయంతో మోటార్ సైకిల్‌ను వేగంగా పరుగెత్తించాడు.

కిటికీ తెరల నుండీ మొహం మీద పడుతున్న సూర్యుడి వెచ్చని కిరణాలతో మెలకువ వచ్చి చటుక్కున లేచి కూర్చుంది శృతి. మంచం పక్కన పడివున్న చీరను భయంగా చూసింది. కళ్ళు తిరిగినట్లయి మెల్లిగా లేచి గోడ గడియారం చూసింది. దాని పక్కనే భర్త ఫోటో కనపడింది. జరిగింది తలచుకుని మంచం మీద కూర్చుని తల పట్టుకుని ఏడవసాగింది.

జీవితంలో చేసిన పొరపాటు అర్థం అయ్యిన కొద్దీ దుఃఖం ఎక్కువ కాసాగింది. వెక్కి వెక్కి రోదిస్తూ కూర్చుంది. కొద్ది సేపటికి తలెత్తి చూసింది. ఎదురుగా తదేకంగా నిలబడి చూస్తున్న భర్త రాజు కనపడ్డాడు. శృతి కాళ్ళ కింద నేల కదిలినట్లయ్యింది. లేచి భర్తను గట్టిగా పట్టుకుని పెద్దగా అరుస్తూ ఏడవసాగింది.

భార్యను పొదిగి పట్టుకుని మంచం మీద కూర్చోపెట్టి, “బంగారం.. ఏం జరిగింది.. ముందు కంట్రోల్ చేసుకో.. ప్లీజ్” అంటూ కౌగిలించుకున్నాడు.

“లేదు లేదు.. నేను బంగారం కాదండి.” అని అరుస్తూ భర్తను దూరంగా నెట్టేసింది శృతి.

“బాధపడకు శృతి.. ఇక మన ఇబ్బందులు తొలగి పోయాయి. నేనెటు వెళ్ళను. మనమిద్దరం ఇక దూరంగా ఉండవలసిన అవసరం లేదు. నువ్వింక మీదట ప్రశాంతంగా ఉండొచ్చు” అని శృతిని పట్టుకున్నాడు.

“ఆలస్యమయిపోయింది..” అంటూ పెద్దగా ఏడుస్తూ దూరంగా జరిగింది.

అప్పుడు చూసాడు గమనించాడు భార్య పరిస్థితి. మంచం పక్కన పడేసి వున్న చీరను, రేగి పోయిన జుట్టు, సగం తొలగి పోయిన బట్టలను చూడగానే అనుమానంగా, అపనమ్మకంగా భార్యను చూసాడు.

అవును అన్నట్లుగా కళ్ళలో కారుతున్న నీటితో సమాధానం చెప్పింది.

రాజు తల మీద పిడుగు పడ్డట్లుగా నిశ్చేష్టగా నిలబడి పోయాడు. అప్పుడు గుర్తొచ్చిందతనికి బయట మెట్ల పక్కనున్న మనోజ్ బండి.

“ఎవరూ? మనోజ్?” అని అడిగాడు. అతని గొంతులో ఏమాత్రం బలం లేదు.

అవునన్నట్లుగా తల ఊపి ఇంకా పెద్దగా ఏడవ సాగింది. కొద్దిసేపు భార్యను చూసి, జీవం లేని మనిషిలాగ వెనక్కి తిరిగి పైన గదిలోకి వెళ్ళిపోయాడు రాజు. ఆ రోజంతా ఇద్దరూ గదుల్లొనుండీ బయటకు రాలేదు.

సాయంకాలం చీకటి పడుతున్న వేళకి పనిమనిషి శృతి గది లోకి వచ్చి “అమ్మ గారు.. మధ్యాహ్నం వండిన వంట అలాగే వుంది.. నే వెళ్ళొస్తాను” అని నిర్వికారంగా చూస్తున్న శృతిని చూసి, వెళ్లిపోయింది

ఒక గంట తర్వాత శృతి పడుకున్న గదిలోకి వచ్చాడు రాజు. భార్య వేపు ప్రేమగా, జాలిగా చూసాడు. భర్తను చూడగానే పిచ్చిదానిలా మళ్ళీ ఏడవ సాగింది.

“బాధ పడకు బంగారం.. అన్నింటికీ నాది బాధ్యత, నాదే బాధ్యత. ఆస్తి, ఫ్యాక్టరీ, భూములు అన్నీ నీ పేరు మీద వున్నాయి. ఆ అబ్బాయంటే నీకంత ప్రేమ ఉంటే నీవు హాయిగా అతనితో ఉండిపో. నాకెలాంటి కోపం లేదు. నేను కష్టపడుతూ దూరంగా వున్నది సంపాదన కోసమే. నిన్ను ఒంటరితనానికి గురి చేసింది నేనే కాదనను, కానీ నువ్వేమో శారీరక సుఖం కోసం వెంపర్లాడావు.” అతని గొంతు వణుకుతోంది.

“లేదు.. నాకు తోడు లేక.. ప్రేమించే మనిషి లేక, ఒంటరితనంలో నరకం అనుభవించాను. నాకు కావలిసింది అర్థం చేసుకునే మనిషి, అభిమానించే మనసు, అంతే కానీ శారీరక సుఖం.. డబ్బూ, నగలు కాదు.” హిస్టీరికల్‍గా అరిచింది

“సరే ఇక మనకు కలిసి ఉండటం కుదరని పని. చాలా ఆలోచించాను. డబ్బు విలువ నీకు తెలీటం లేదు. సంపాదించటం ఎంత కష్టమో తెలీదు. ఎటైనా వెళ్ళిపో. నీక్కావలిసిన డబ్బులు ఆస్తి నే పంచేస్తాను” అన్నాడు బాధగా.

“మీరు నా పేరు మీద రాసిన ఆస్తులు నాకక్కర లేదు. నా జీవితమే నాకు కాకుండా పోయింది” అంది విరక్తిగా.

“నీకెక్కడ ఇష్టమైతే అక్కడికే వెళ్ళు. ఇంక ఈ ఇంట్లో నీకు స్థానం లేదు.” అని చెప్పి జీవం లేని శరీరం లాగా తన గది లోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు.

ఆ మాటలు విని మళ్ళీ హిస్టీరికల్‌గా అరుస్తూ ఏడవసాగింది. అలా రాత్రంతా ఏడుస్తూనే వుంది. చావాలని కోరిక బలంగా వేళ్లూనుకోసాగింది. ఇల్లంతా ఆమె ఏడుపుతో ప్రతిధ్వనించింది. కానీ రాజు బయటకు రాలేదు.

తెల్లవారుజామున పక్షుల కిలకిలారావాలతో తూర్పున కొద్దిగా వెలుగు రేఖలు పరుచుకున్నాయి.

మొబైల్ తీసుకుని “హలో మనోజ్.. నేనింట్లోనుండీ ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కలుస్తావా ఒకసారి” అంది శృతి ఆర్తిగా.

కొద్దిసేపు ఆలోచించాడు మనోజ్. పరిస్థితి అర్థం అయిందతడికి. మౌనంగా వున్నాడు.

“మనోజ్” అని పిలిచింది శృతి.

అటు నుండి సమాధానం రాలేదు శృతికి.

అంతే ‘అందరూ స్వార్థపరులు. ఎవరి జీవితం వారిది. ప్రేమ ఆప్యాయతలు కరువైన బ్రతుకు నాది’ అని అనుకుని, ఒకమారు ఫోన్ కేసి చూసి విరక్తిగా నవ్వి లేచింది.

దూరంగా నది వంతెన మీదుగా వెళ్తున్న రైలు కూత వినిపించింది. ఇక ఈ జీవితం చాలు. రైలు పట్టాలే తన గమ్యం అని నిశ్చయించుకుంది. ఒక్క క్షణం ధైర్యంగా కళ్ళు మూసుకుంటే చాలు రైలు తనను ఈ బాధల నుండీ విముక్తురాలిని చేస్తుంది అని అనుకుని, ఒంటి మీదున్న నగలన్నీ తీసి బీరువాలో పెట్టేసింది. మంగళ సూత్రం కూడా తీసి పెట్టి, భర్త గది వద్దకు నడిచి వెళ్లి తలుపు దగ్గర నిలబడి ఒకసారి చూసి, ఏదో చెప్పాలనుకుని ఆగిపోయి, వెను తిరిగి ఇంటి బయటకు, గమ్యం లేని తన ప్రయాణం మొదలు పెట్టింది.

రైలు వంతెనను ఒకసారి చూసి, బంగాళా మెట్లు దిగుతూ కిందికి చూసింది. కింద మోటర్ సైకిల్ ఆపి నిలబడి చూస్తున్నాడు మనోజ్. ఆమె కళ్ళల్లో ఆశా కిరణాలు.

ఆమెను ప్రేమగా చూస్తూ ముందుకు వచ్చి ఆమె చేయి గట్టిగా పట్టుకుని మోటర్ సైకిల్ వేపు నడిచాడు. శృతి కళ్ల నుండీ నదులు పారుతూనే వున్నాయి. వారెక్కిన మోటర్ సైకిల్ మెత్తగా సాగిపోయింది.

అప్పుడే తూర్పున ఉదయభానుడు ఎర్రగా వెలుగులు చిమ్ముతూ పైకి వస్తున్నాడు. ఉషా కిరణాలు రంగుల రాగాలు పలుకుతూ నాట్యం చేస్తున్నాయి..

***

నిరాశా, నిస్పృహలతో దిగి వెళుతున్న శృతిని పై గదిలోంచి గమనించాడు రాజు.

వెంటనే ఫోన్ తీసుకొని నంబర్ డైల్ చేశాడు.

“హలో” అంది స్త్రీ గొంతు అటువైపు నుండి.

“అంతా నువ్వు ఊహించినట్లుగానే జరిగింది. తను ఇప్పుడే వెళ్లిపోయింది. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తికాగానే మనం హ్యాపీగా కలవచ్చు.” అన్నాడు రాజు.

“థాంక్యూ డార్లింగ్” అని వినిపించింది స్త్రీ గొంతు అవతలి వైపు నుండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here