Site icon Sanchika

శుభం సుబ్బయ్య

[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘శుభం సుబ్బయ్య’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సూ[/dropcap]ర్యుడితో పాటు స్కూటర్‌పై పరుగు మొదలు. ఉదయం లేవగానే చక్కగా స్నానం సంధ్యావందనం అన్నీ చేసి వాయ కుడుము, రాగి జావ ఆరగించి త్రేనుపు వచ్చాక లాప్‌టాప్ బ్యాగ్ భుజాన వేసుకుని మంచినీళ్ళ కూలింగ్ బాటిల్ పెట్టుకుని బయలుదేరి శకునం చూసుకుని స్టార్ట్ చేస్తాడు సుబ్బయ్య. ఒక్కో రోజు సంపాదన వేల మీదే వస్తుంది. రెండు ఏసీలు నాలుగు లాప్‌టాప్‌లుగా జీవితం సాగిపోతోంది.

ముగ్గురు అక్కల పెళ్లిళ్లు చేశాడు. తమ్ముడిని ఇంజినీరింగ్ చదివించాడు. తల్లి తండ్రికి ఇంట్లో ఏసీ, కూలర్, ఫ్రిజ్, ఓవెన్, వాషింగ్ మిషన్ లాంటి అన్ని సౌకర్యాలు అమర్చాడు.

కొత్త బిజినెస్ ఇదేమిటి అంటారా? అతని చేతిలో పడితే శుభశ్య శీఘ్రంగా పెళ్లి అయిపోతుంది. కొడుకు అంటే కుటుంబాన్ని చూసేవాడు. తన జీవితాన్ని కొవ్వొత్తుల మాదిరి కరిగిస్తూ డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని చూసే కొడుకులు ఎందరో ఉన్నారు. వాళ్ళని పావుల్లా వాడుకొనే తల్లి తండ్రులు ఎందరో ఉన్నారు.

మన సుబ్బు అటువంటి బుద్ధిమంతుడు. ఇంతకీ అతను చేసే ఉద్యోగం ఏమిటి అంటారా?ఇప్పటికీ వెయ్యి పైగా పెళ్లిళ్లు చేశాడు. ఇల్లు కట్టాడు. ముగ్గురు అక్కల పెళ్లిళ్లు చేసి హమ్మయ్యా అని కొన్ని అనుభవాలు పొంది స్వంతంగా పెళ్లిళ్లు బ్యూరో పెట్టాడు. ఒక ప్రక్క జ్యోతిష్యం, మరో ప్రక్క మారేజ్ బ్యూరో నడుపుతున్నాడు. అందులో నలుగురు ఉద్యోగులు కూడా ఉన్నారు.

మన సుబ్రహ్మణ్య శాస్త్రి పాలిటెక్నిక్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. ఆ రోజుల్లో ప్రైవేట్ కంపెనీలో నాలుగు వేలు మించి ఇవ్వలేదు. పిల్లాడు దూరంగా వెడితే కుదరదు. తండ్రి కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలో చేసేవాడు. పెద్ద సంపాదన కాదు. ఆడపిల్లలు ఇంటర్‌తో అపి ఇంటి పనిలో డాక్టరేట్ చేస్తూ ప్రైవేట్‍గా డిగ్రీలు చదివారు. పెళ్ళిళ్ళ పేరయ్య దగ్గరకు రోజు వెళ్ళి అన్ని ఊళ్లు తిరిగి సంబంధాలు సేకరించేవాడు సుబ్బు. అవన్నీ తెచ్చి పేరయ్యకు ఇచ్చేవాడు.

ఆయన కొంత కమిషన్ మరికొంత జీతం ఇచ్చేవాడు. అలా అక్కల ముగ్గురు పెళ్లిళ్లు చేశాడు సుబ్బు. అందరూ సుఖపడుతున్నారు.

డబ్బు వస్తోంది. ఉద్యోగం సెటిల్ అయ్యి కొంతమంది ఉపాధి పొందుతున్నారు. అందరూ శుభం సుబ్బయ్య అంటారు. కొందరు శుభం సుబ్బు అంటారు. ఏమన్నా సుబ్బు ప్రయోజకుడు అయ్యాడు.

ఒక పెళ్ళి చెయ్యడం మాటలా? అలాంటిది ముగ్గురు అక్కల పెళ్లిళ్లు చేశాడు. అయితే అతనికి పెళ్లి కుదరలేదు ఎండలో వెళ్ళడం వల్ల కొంచెం రంగు తగ్గాడు. అప్పటికే తల్లి వాయి కుడుము రాగి జావ పెట్టిచ్చినా కుదరడం లేదు.

సమయానికి తిండి ఉండదు. కొంచెం ఒళ్ళు చేశాడు. చిరు బొజ్జ అల్లా లారీ టైరు సైజ్ వచ్చింది. సుబ్బు కాస్త పెళ్ళిళ్ళ సుబ్బయ్య అయ్యాడు.

తల్లి తండ్రి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. అక్కలకి ఇద్దరేసి పిల్లలు. పురుల్లు పోశాడు. తమ్ముడు అన్నకి పెళ్లి కాలేదని తనతో జాబ్ చేసే పిల్లని చూసుకుని చేసుకున్నాడు.

మళ్లీ అన్నయ్య కమిషన్ కోసం పెళ్లి వాయిదా వేస్తూ ఉంటే కష్టం కదా. ఇంట్లో వాళ్ళు అవాక్కయ్యారు. కుటుంబ పోషణలో పెళ్లి వాయిదా వేశాడు.

ఈ మధ్య అందరూ సంగీతం వచ్చిన పెళ్లి కూతురు కావాలి అంటున్నారు. మరి ఆస్కార్ మోజులో ఉన్నారు. అందుకని మ్యూజిక్ కాలేజీలు అన్ని పరిశీలించి అక్కడ పెళ్లికి ఉన్న పిల్లల్ని ఏరుకుని కులాలకు తగ్గట్టుగా బాక్స్‌లో పెట్టుకుని లిస్ట్ తయారు చేసుకున్నాడు. అయితే అక్కడ ఓ నలబై ఏళ్ల ఆమె కనిపించింది. బాగా పాడుతోంది కూడా.

ఆమెను ఆపి “మీకు పెళ్లి కావాల్సిన వారు ఉన్నారా?” అన్నాడు. “మీరు బొట్టు పెట్టుకోలేదు” అంటూ సందేహం వెలిబుచ్చాడు.

ఆమె నవ్వింది. “ఎండాకాలం, కుంకుమ కరిగి పోయిందేమో” అన్నది.

“మీరు హిందువు లేనా?”

“ఆహా మేము పిన్ కులం వాళ్ళం” అన్నది

“ఇదేమిటి కొత్త కులం?” అన్నాడు

“మీకు అర్థం కాకూడదనే అలా చెప్పాను”

“చెప్పండి. తెలుసుకుంటాను” అన్నాడు.

“ఆ ఏముంది పప్పు నెయ్యి కులం. తెల్లవారింది మొదలు ఇంట్లో బియ్యం రవ్వ, ఉప్పు డు రవ్వ, గోధుమ రవ్వ, జొన్న రవ్వ, అన్ని రకాల రవ్వలు కొనడం సరిపోతుంది” అంది.

“ఆహ, ఇది ఒక కొత్త పదం. మీరు ఎంత మంది ఉంటారు?” అంటూ మాటలు కదిపాడు.

“మా పెద్దక్క పెళ్లి అయింది. బావగారితో నిత్య కురుక్షేత్రం. దానికి ఇద్దరు పిల్లలు. రెండో అక్క ఇది చూసి ప్రేమ పెళ్లి చేసుకున్నది. దానికి కూడా ఏదో రకంగా నిత్యం పాకిస్తాన్ యుద్ధం. మా అన్నయ్య పెళ్లి అయ్యింది. ఆమె ఉద్యోగస్థురాలు. విక్టోరియా మహారాణిలా ఇల్లు నడుపుతుంది. ఇంకా నేను చాలా డిగ్రీలు చదివాను. ఎన్నో కాన్వెంట్‌లలో ఉద్యోగాలు చేశాను. జీతం నచ్చలేదు. ఒక రోజు లీవ్‌కి రెండు రోజుల జీతం తగ్గిస్తారు. మా జీతాలు వారి కారు పెట్రోల్ ఖర్చు అంత లేవు. సంగీతం నేర్చుకుంటే ఆన్‌లైన్ పాఠాలకి చక్కని జీతం వస్తుంది. అందుకే నేను మ్యూజిక్ కాలేజీలో చేరాను” అన్నది

అహ మన సుబ్బు అదృష్టం ఎంత గొప్పది? తంతే బూర్ల బుట్టలో పడ్డాడు.

“నా ఇంటికి చాలా సార్లు పెళ్ళిళ్ళ పేరయ్యలు వచ్చేవారు. డబ్బు తీసుకుని వివరాలు పుచ్చుకుని వెళ్లేవారు. వాళ్ళకి ఎంత డబ్బు డొనేషన్ ఇచ్చినా కసురుకునేవారు. ముగ్గురు కూతుళ్లు మూడు వందలు ఇస్తే ఎలా? మేము కనీసం వెయ్యి పెట్టుకున్నాము. పెళ్లి కుదురిస్తే ఇస్తారు అంతే కాని ఇంత ఎక్కువ ఎక్కడ ఇస్తాము అనేవాళ్ళం. అలా డబ్బు అంతా మేరేజి రిజిస్ట్రేషన్ నంబరు కోసం ఆ వెనుక ఫాం ఫిల్ చెయ్యడం కోసం వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడానికి ఒక్కో పిల్లకి బోలెడు ఖర్చు చేసేవారు. నాకు విసుగు వచ్చి పెళ్లి మానేశాను” అంది.

“అయ్యో అందరికీ జీవితం ఒక్కలా ఉండదు. ఎవరి ప్రయత్నం వారిది. ఎవరికి వచ్చిన అదృష్టం వారిది” అంటూ నవ్వాడు.

“పెళ్లి, పిల్లలు ఇవన్నీ మిథ్య. చివరికి ఎవరు చూడరు సరికదా నీ అదృష్టం ఇంతే అంటారు. మా అమ్మ నాన్నకి కొంత వండి పెడతాను. నేను తింటాను. నాన్నకు పెన్షన్ వస్తుంది అధి చాలు మాకు” అని నిట్టూర్చింది.

సుబ్బు పరిస్థితి అర్థం చేసుకున్నాడు.

“శుభం మెరేజ్ లింక్స్‌లో ఇచ్చారా?” అడిగాడు.

“మా నాన్నను అడగాలి. ఒకటి సార్. ఏ వయసులో పెళ్లి చేసుకున్నా అత్తవారింట మెప్పు ఉండదు. వాళ్ల పిల్లలు మహారాణులు. ఎదురింటి పిల్ల ఆ ఇంటికి వంట మనిషి, పని మనిషి. ఏ పని నచ్చదు. నాలా చెయ్యలేవు అంటూ సతాయింపు సరిపోతుంది. మీకు నేను డబ్బు ఇవ్వను. నాకు సంబంధాలు చూడనవసరం లేదు. మీకు డబ్బు కావాలి కనుక అల్లిని బిల్లీ, బిల్లిని అల్లి చేసి చెపుతూ సంపాదిస్తారు. అది మీకు వృత్తి. ఆ తరువాత పెళ్ళి అయ్యాక ఏమీ పట్టించుకోరు. మీ పిల్ల అదృష్టం ఇంతే అంటారు. అంతేనా సార్? ఈ రోజుల్లో పద్ధతిగా పెరిగిన పిల్లలకి పెళ్లిళ్లు కావు. జీన్స్ స్కిన్ టైట్‌లు వేసుకుని ఎగురుతూ ఉండాలి. మేము అలా పెరగలేదు. అందుకే మాకు అమ్మాయి నచ్చలేదు అంటారు. ఇంతే, జీవితం వెళ్ళిపోతుంది” అన్నది.

“మీకు సంబంధం చూడటం నా ధ్యేయం. ఎవరు కావాలి, ఎలాంటి వారు కావాలి?” అని అడిగాడు సుబ్బు.

“నాకు పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు. మా అక్కలతో విసిగి పోయాను. వాళ్ల పిల్లల్ని పెంచి పిల్లులు కాదు పిడుగులు అని అనుకున్నాను.” అంది.

“లేదు, లేదు. మీకు కళ్యాణ తార వచ్చింది. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చేసుకుంటారు.”

“ఈ రోజుల్లో అన్నం పెట్టే మొగుడు దొరకడం లేదు. ఇంకా పిల్లను కని పెంచడానికి ఇష్టం లేని వాళ్ళు, అన్ని ఆవారా లక్షణాలే ఎక్కువ. వాళ్ల అమ్మ పట్టు చీర కట్టుకోవాలి. పెళ్ళానికి ఒక్క చీర కొనని వాళ్ళు ఉన్నారు. అబ్బే మాల్స్‌లో కొందామని అనుకున్నాను, కానీ సమయం లేదు అంటారు. కానీ అమ్మకి భార్యను తీసుకు వెళ్ళి బట్టలు కొంటే అక్కలు బాధ పడతారు అని చెప్పడు. ఎంతసేపూ వండి పెడితే తిని కూచుని వంకలు పెడతారు. కుర్చీలో కూర్చుని పీటపై కాళ్ళు పెట్టుకుని సోది వాగుడు వాగుతు ఉంటారు. ఉమ్మడి కుటుంబం కాదు కుమ్మరీ ఆవ అని మా బామ్మ చెప్పింది. అత్త వారి ఇల్లు ఒక అగాధమే. ఇది ముత్తమ్మ చెప్పింది. వదినా నీవెప్పుడు పుట్టావు, ఎందుకు పుట్టావు? మీ వాళ్ళు ఎవరు పెళ్లాడలేదా? మా ఇల్లు నచ్చిందా? వంటి వంకర మాటలు చెప్పడానికి రెడీ. అంతే కానీ మంచి మర్యాద లేదు కొందరికి. ఇటువంటి కుటుంబాలు పెళ్లి చేసుకున్నా, వంశం అక్కర లేదు. వాళ్ల కడుపు నిండితే చాలు కోడలు అవసరం లేదు” అంటూ గట్టిగా ఎడాపెడా వాయించింది.

సుబ్బు పని సబ్బు బిళ్ళ కాస్త కొత్తది నీటిలో పడ్డట్టు అయ్యింది. నయం రొచ్చు కుంటలో పడలేదు అనుకున్నాడు.

అయినా డబ్బు కోసం కాక సుబ్బు పెళ్లి కోసం ఆమె చుట్టూ చేతులు కట్టుకుని తిరిగి, పేరు వివరాలు గోత్రం నక్షత్రం పెళ్లి అంటే అన్ని కావాలి కదా అడిగాడు. కుదిరాయి ఇంకా ఇంటివేట పట్టాడు.

ఆమె పేరు కౌస్తుభ. ఎంత బాగుంది. కొత్తగా ఉన్నది అనుకుంటూ గుమ్మంలో అడుగు పెట్టాడు.

“మా పిల్ల లేదు. మీ పిల్లలకి సంగీతం నేర్పాలా? అన్నది వాళ్ళమ్మ.

“కాదండీ నేను శుభం సుబ్బును. నేను మీకు తెలియదా? అఖిల భారతదేశంలో అన్ని కులాల పెళ్లిళ్లు చేయిస్తాను. అతి తక్కువ డబ్బు మాత్రం అవసరానికి తీసుకుని చేస్తూ ఉంటాను. మీ కౌస్తుభ గారు పెళ్లికి ఉన్నారని తెలిసింది” అన్నాడు .

“అది పెళ్లి చేసుకోదు” అంటూ కుటుంబ విషయాలు ఏకరువు పెట్టింది వాళ్ళమ్మ.

“మీకు ఎలాంటి వాడు కావాలి?”

“ఎలాంటి వాడా? పిల్లకి అన్నం పెట్టేవాడు కావాలి”

“అంటే అన్నం కూడా పెట్టే వాళ్ళు లేరా?”

“అవును. పెళ్లి చేసుకుని నా పిల్లలు తినాలి, కోడలు తన కూరలు తను కొనుక్కుని వండి రుచి బాగుంటే మేము అంతా కలిసి తింటాము బాగా లేకపోతే నువ్వు తిను అంటుంది అత్తగారు. సత్రవు కొంపలు కోడల్ని ఇంటిపనికి పెళ్లి చేసుకునేవాడే ఉంటున్నారు” అంది.

సుబ్బు గతుక్కుమన్నాడు . అహ ఈవిడ తన తల్లికి ఎదురు వచ్చింది అని అనుకున్నాడు.

“ఆహా, మంచిదే చెపుతాను. మీ పిల్ల తెలివైనదే, ఎక్కడైనా నెగ్గుకు రాగలదు” అంటూ జాతకం లెక్క కట్టి “అన్ని కుదిరాయి” అన్నాడు.

“నువ్వు అంటే సరిపోతుందా? నీకు కమిషన్ కావాలి” అన్నది.

“అబ్బ వద్దండి. నేను పుణ్యం సంపాదించుకోవాలి, అందుకు. మీ అమ్మాయి పెళ్లి సంబంధం నేను చూస్తాను. పిల్లాడికి నెలకి లక్షన్నర రూపాయలు నికరంగా వస్తుంది. ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి. చదువుదేం ఉంది? బ్రతుకు తెరువు మంచిది. నిత్య పంట, విందు భోజనాలు” అన్నాడు

“రెండు వృత్తులు కాకుండా గౌరవప్రదమైన ఏ వృత్తి అయినా పర్వాలేదు” అన్నది.

“సరే పిల్లకి చెప్పు” అన్నారు వాళ్ళ నాన్న.

“సరే మంచి రోజు చూసి చెపుతాను” అన్నాడు సుబ్బు.

“అలాగే పుణ్యం కట్టుకో” అన్నది

కౌస్తుభ ఫోన్ నంబర్‌కి ఇంటికి వెళ్లి చేశాడు.

“మీరు ఒప్పుకుంటే పెళ్లి కుదిరినట్లే” అన్నాడు.

“ఏం, పెళ్లికొడుకు మీ జేబులో ఉన్నడా? మీ బొమ్మల పెట్టెలో ఉన్నాడా?” అన్నది కౌస్తుభ.

“అవును మేడం ఉన్నాడు. చక్కగా పెళ్లి చేసుకుంటే వదిన, మరదలు. అన్నయ్య గారు, మేనల్లుళ్లు అందరూ వస్తారు. ఒంటరి జీవితం కష్టం. వయసు వచ్చేటప్పటికి మనుమలు అందుకోవాలి” అన్నాడు.

“అన్నం పెట్టే మొగుడు దొరకడం లేదు అంటే మనుమలు అంటారు ఏమిటి?”

“అయ్యో ఏదో నూటికి కోటికి ఒకరు అలా ఉంటారు. మీ జాతకం మంచిది. మంచి సంబంధం వచ్చి సుఖపడతారు” అన్నాడు.

‘వీడు వదిలేలా లేదు, పెళ్లి చేసి దానికి కొంత సంభావన పుచ్చుకుంటాడు’ అనుకుంది కౌస్తుభ.

***

ఈ వృత్తి అన్ని వృత్తుల కన్నా బాగుంది. సమాజంలో మనుష్యులు స్థితిని బట్టి గతులు, మానవత్వపు విలువలు ఎలా ఉన్నాయన్నది అవగాహన అవుతుంది. ఇందులో ఆడామగా తేడా లేకుండా ఈ బిజినెస్ చేస్తున్నారు. వంటలు వార్పులూ పెళ్ళి వారి బంధువులే అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు.

ఇంకా మేరేజ్ బ్యూరో వారి పెళ్లి చూపుల మీటింగ్ అయితే లెక్క లేకుండా అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ వస్తున్నారు.

ఈసారి మీటింగ్‍౬లో కౌస్తుభ కచ్చేరి పెట్టాడు.

ఆడ పిల్లల, మగపిల్లల తల్లి తండ్రి ఉదయం ఎనిమిది గంటలకి వచ్చి టిఫిన్ కాపీ తాగి హాల్లో కూర్చుంటారు. ఆ సమయంలో కచ్చేరి పెట్టాడు. రిజిస్ట్రేషన్ వెయ్యి రూపాయలు పెట్టారు. అయిన జనం ఎగబడి వచ్చారు. పన్నెండు వందల మంది వచ్చారు. అంతా వచ్చి కూర్చున్నాక మీటింగ్ మొదలు. పెళ్లి యొక్క ముఖ్య ప్రయోజనం, ఇతర వివరాలు అన్ని కూడా పెద్ద జ్యోతిష్య పండితులు వివరించారు. దాని గురించి ఒక రచయిత రాసిన బుక్‍లెట్స్ కూడా పంచిపెట్టారు. ఆడపిల్లలు అత్తవారిల్లంటే భయపడుతున్నారంటే కారణం నేటి టీవీ సీరియల్స్ అంటూ తెగ విమర్శించారు. అందుకే పెళ్లి కాని ఆడపిల్లలు టివీ సీరియల్స్ చూడకండి అని కూడా చెపుతున్నారు. ఇలా సాగిన మీటింగ్ ఒంటిగంట ప్రాంతానికి ముగిసింది. భోజనాలు వడ్డించారు. కొందరు బఫేలో జాయిన్ అయ్యారు. అందరూ పెద్దవాళ్ళు. సమయానికి మందులు వేడుకోవాలి అంటూ భోజనాలు తొందరగానే పెట్టేశారు.

అన్నిటా మన సుబ్బయ్య శాస్త్రి నేను ఉన్నాను అంటూ దగ్గర ఉండి ఎవరికి అసౌకర్యం లేకుండా చూసుకున్నాడు. సమర్థుడు. శ్రీ రాజలింగము గారి శిష్యుడు. ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. పెళ్ళిళ్ళ పేరయ్య అయినా ఏ ఒక్కపిల్లని కొడుక్కు చెయ్యలేకపోయాడు. నాకు పెళ్ళొద్దు అంటూ వాడు ఒప్పుకొలేదు. ఊరి వాళ్ళు మాత్రం కొడుక్కు పెళ్ళి చెయ్యలేకపోయాడని అన్నారు. ఇంక వృద్ధాప్యం వచ్చింది అంటూ ఆయన బిజినెస్ మానేశాక వేరే రాష్టం పిల్లను పెళ్లి చేసుకున్నాడు కొడుకు. ఆ పిల్ల తండ్రి అతనితో పని చేస్తాడు.

మన సుబ్బు ఇప్పుడు నంబర్ వన్ స్థితిలో ఉన్నాడు. అన్ని ఊళ్ళలో పెద్ద పెద్ద ప్రకటన బోర్డులు పెట్టాడు. మూడు పువ్వులు అరు కాయల మాదిరి అరవై సంబంధాలు మూడు పెళ్లిళ్లు మాదిరి ఉన్నది. కౌస్తుభకు కొన్ని పాఠాలు ఇప్పించాడు. అతని సభల్లో పాడిస్తు ఉంటాడు. ఎప్పటికైనా ఆమె మనసు మారకుండా ఉంటుందా అనే ఆశతో ఉన్నాడు.

పట్టు వదలని విక్రమార్కుడిలా నాలుగేళ్లు వేచి ఉండి ఒక రోజు “మీ పెళ్లి ఎవరితో ఫిక్స్ చెయ్యాలి? అన్నాడు.

“మంచివాడు కావాలి కదా?” అంది.

“ఆహ, నా కంటే మంచివాళ్ళు ఎవరు ఉంటారు?” అన్నాడు.

“మీకు పెళ్లి కాలేదా?” అని వెర్రి మొఖం వేసింది.

“నేను నచ్చానా?” అడిగాడు.

“మీరైతే ఓకే” అన్నది.

“హమ్మయ్యా ఈ జేష్ఠం లోనే పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి” అంటూ తల్లికి తండ్రిని చెప్పి పెళ్లికి రెడీ చేశాడు.

అంతా చేతిలో పనే కదా. పెద్ద కచ్చేరి ఏర్పాటు చేశాడు. ‘వచ్చెను అలమేలు మంగ’ అని హిందోళ రాగంలో శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తన అద్భుతంగా పాడింది కౌస్తుభ.

పెళ్లి కూతురు ప్రజ్ఞ చూసి అందరూ అబ్బుర పడ్డారు. ఇంత మంచి సంబంధం ఏరుకున్నాడు అంటూ అంతా ఆశ్చర్యపోయారు.

ఎంతోమంది ఈ వృత్తిలో ఉన్నారు, అయితే సుబ్బు ఎంతో నిజాయితీగా ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని పట్టణాల్లో అతనికి గుర్తింపు వచ్చింది. చేసిన పెళ్లిళ్లు సవ్యంగా ఉండడం వల్ల అంతా అతని పద్ధతికి ఆనందపడ్డారు. ఇలాగే ఎంతో లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా అన్నీ సంబంధాలు మాటల గారడీతో అటు ఇటు ఒప్పించి పెళ్లి చేసేవాడు.

సుబ్బుకి ఇద్దరు ఆడపిల్లలు కవల పిల్లలు పుట్టారు.

‘అమ్మో వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలాగ?’ అనుకుని అందుకే వాళ్ళకే చదువుతో పాటు ఈ విషయాలు నేర్పాలి. ఇది జీవిత విద్య కదా అనుకున్నాడు.

***

ఎనెన్ని అనుభవాలు! ప్రతి ఇంటా పెళ్లి పిల్లలు ఉంటారు. అయితే పెద్దల్లో సమన్వయం లేక పిల్లల్లో అవగాహన లేక మా పిల్ల పెళ్లి కాలేదు, మీ పిల్ల ఎందుకు సుఖపడాలి అని కోడళ్లను అజమాయిషీ చేసే అత్తల వల్లే కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి. అత్తింటి కుక్కర్‌లో కూరల్లా ఉడికిపోయే కోడళ్ళు ఉన్నారు. ఎంత విద్యావంతులైనా ఈ సమస్య తప్పటం లేదని ఒక సర్వేలో చెప్పారు.

***

ఈ పెళ్ళిళ్ళ ప్రహసనం లోనే మన విహారి పెళ్లి కోసం సుబ్బు దగ్గరికి వచ్చాడు. అప్పుడు సుబ్బు తనకు విదేశీ సంబంధాల వాళ్ళు ఇచ్చిన మెడల్స్, సన్మానం ఫోటోలు చూపించాడు.

“ఇండియా పిల్లకే భయపడుతుంటే విదేశీసంబంధాలా?” అన్నాడు విహారి.

విహారి ఇంట్లో చాలా రకాల ప్రతిబంధకాలు ఉన్నాయి. ఒక ప్రక్క అక్క కూతురు, మరో ప్రక్క మేనమామ కూతురు ఉన్నారు. పెళ్లి వారు వచ్చేటప్పటికి ముందు వీళ్ళు వచ్చి మా పిల్లను కాదంటే మీరు చెప్పండి అనేవారు.

దానితో వచ్చిన వాళ్ళు వంక పెట్టేసివెళ్ళేవారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విహారి మన సుబ్బు దగ్గరికి వచ్చాడు.

విహారి సుబ్బు ఇల్లు చూసి ఆశ్చర్య పోయాడు. ఇంటిలో బీరువా నిండా మెడల్స్, సన్మాన పత్రాలు, మొమెంటోస్, ఖరీదైన ఫర్నీచర్ ఉన్నాయి. భార్య కచ్చేరి, సన్మాన ఫొటోలు ఉన్నాయి. ‘అహ ఎంత బావున్నాయి’ అనుకున్నాడు విహారి.

పెళ్లి విషయం చెప్పగానే నవ్వాడు. లాప్‌టాప్ తీసి ఫోటోలు, వివరాలు పెట్టాడు.

“ఈ రోజుల్లో భార్యను షోకేస్‌లో బొమ్మలా చూడాలి. అంతే కానీ కాఫీ లేట్ అయింది, టిఫిన్ బాగా లేదు, వంట రాదు అంటూ బయటినుంచి తెప్పించుకోవాలని అనకూడదు. మీరు జొమాటో వారికి ఫోన్ చేసి తెప్పించి చక్కగా కంచంలో పెట్టి ఇవ్వాలి. అలక వస్తే మీరే తినిపించాలి. అత్తగారు, ఆడపడుచు పెత్తనాలూ ఉండకూడదు. అలా అయితే సంబంధం చెపుతాను” అన్నాడు.

“అలాగే, సరే. మీరు అనుభవంతో చెపుతున్నారు” అంటూ విహారి తన వివరాలు చెప్పి, ఐదువేలు అతని చేతికి ఇచ్చాడు.

“ఇంకో ఐదు ఇవ్వండి. ఇవన్నీ ఇంతే. ఇంటర్నేషనల్ కాల్స్ కదా. హి హి హి హి”

విహారి అర్థం చేసుకున్నాడు.

నక్షత్రం ప్రకారం జాతకం నిముషాల్లో కంప్యూటర్‌లో వేసి ఏ పిల్ల కుదురుతుందో చెప్పేశాడు. పెళ్ళిలో డాక్టరేట్ చేసినట్టు ఉన్నాడు. ఎన్నో అవార్డ్స్ రికార్డ్స్ వచ్చిన సుబ్బు మనుష్యులు రూపాన్ని బట్టి మాటను బట్టి ఇట్టే అంచనా వేసి సంబంధాలు చూపిస్తాడు. బట్టల కొట్లో చీరల మాదిరి సెలెక్ట్ చేసి దేశ విదేసి సంబంధాలు కలిపేస్తాడు. ఇదంతా పెళ్లి వరకే, ఆ తరువాత ఎవరు ఇష్టం వారిది కదా. విధి రాతను బట్టి జీవితాలు అంటాడు. కానీ అందరిలోకి సామర్థ్యం కలిగి ఉంటాడు. సుబ్బు పద్ధతి విహారికి నచ్చింది.

***

విహారి పెళ్లి చూపులకి వెళ్లారు. విహారికి సుబ్బు ముందే చెప్పి ఉంచాడు, “నేను ఆలస్యంగా వస్తాను” అని.

వెళ్ళగానే పూల బొకేతో స్వాగతం పలికారు. బాదం పాలు ఇచ్చారు. కాబోయే అత్తగారు దుబాయ్ నైటీ అనండి లాంగ్ ఫ్రాక్ అనండి శాటిన్ పింక్ వేసుకున్నది. పైన ఎంబ్రాయిడరీ ఫ్రాక్ వేసుకున్నధి. చిన్న పిల్లలా అందంగా ఉన్నది. మంచి నాజూకుగా ఉన్నది. పెళ్లి చూపులన్నా చీర కట్టుకోలేదు. మెళ్ళో నల్ల పూసలు ఉన్నాయి.

ఆయన మాత్రం పైజమా లాల్చీ వేడుకున్నాడు. “రండి రండి” అని ఆహ్వానించాడు

విహారి తల్లిని తండ్రిని తీసుకుని వెళ్ళాడు. అక్కను రమ్మంటే “నా కూతుర్ని నువ్వు చేసి కోవడం లేదు, నేను రాను, పో” అన్నది.

విహారి పెద్ద ఆఫీసర్. అక్క కూతురు పద్దెనిమిది యేళ్ళు చిన్నది. దాన్ని చేసికొని, నేను ఎత్తుకుని అడించాలి అన్నాడు. అది చదివేది ఇంటర్. ఈ పిల్ల పిహెచ్‌డీ చేసింది. విహారి కన్నా రెండేళ్లు చిన్నది. ఒక్కతే కూతురు. గారంగా పెరిగింది. తల్లి తండ్రి దుబాయ్‍లో ఉంటారు. ఈ పెళ్ళి చూపుల కోసం వచ్చారు. ఈ పిల్ల ఎన్.ఆర్.ఐ కోటాలో ఇంటర్ దగ్గర నుంచి హైదరాబాద్ హాస్టల్ ఉండి చదువుకుంది.

బాబయ్య హైదరాబాద్‌లో డిడి సప్తగిరి ఛానెల్‌లో డైరెక్టర్. అప్పుడప్పుడు బాబయ్య వచ్చి చూసి వెళ్ళేవాడు. పండుగలు వచ్చినప్పుడు వచ్చి తీసుకు వెళ్ళేవాడు. హాస్టల్ భోజనంలో మసాలా వంటలు ఎక్కువ ఉండేవి.

పిన్ని కూడా ఉద్యోగస్థురాలు కనుక ఒక్కోసారి కృష్ణ తాజ్‌లో టేబుల్ బుక్ చేసేవారు. వాళ్ళకి ఒక్క కొడుకు. ఇంజినీరింగ్ చదువుతున్నాడు. పెద్ద కారుంది. పెళ్లి చూపులు పిల్ల బాబయ్య ఇంట్లో ఏర్పాటు చేశారు.

బాబయ్య మెడలో పెద్ద దుబాయ్ గొలుసు, చేతికి బ్రేస్‍లెట్, కళ్లకి కూలింగ్ గ్లాసెస్ ధరించాడు. సూటు ధరించి గ్రేడ్ వన్ ఆఫీసర్ మాదిరి వచ్చాడు. ఆయన భార్య పట్టుచీరతో వంటినిండా నగలు పెట్టుకుని వచ్చింది.

వాళ్ళంతా ఘన స్వాగతం పలికారు.

“పెళ్ళికూతురు పేరు సుప్రజ. పేరు బాగుంది కదా, పిల్ల కూడా బాగుంది. అన్ని బాగున్నాయి. మీరు ఒప్పుకుంటే తల్లి తండ్రి దుబాయ్ నుంచి వచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోతారు. కుదిరితే ఇక్కడే అందర్నీ పిలిచి నిశ్చితార్థం – ఫంక్షన్ హాల్‍లో కాని పెద్ద హోటల్ లో కాని ఏర్పాటు చేస్తారు” అన్నాడు సుబ్బు.

మర్యాదలు బాగా జరిగాయి. అన్ని బాగున్నాయి. అత్తగారు మాత్రం అతి ఆధునికంగా ఉన్నది, మరి పిల్ల ఎలా ఉంటుందో అనుకున్నారు విహారి తల్లిదండ్రులు.

వచ్చేది పెద్ద వయసు అత్త మామలు కనుక పిల్ల పట్టు లంగా లాంటి కుట్టిన చీర కట్టుకుంది. ఇప్పుడు కుట్టిన చీరలు, పట్టు పంచెలు వస్తున్నాయి.

ఇంకేమి బాగానే ఉన్నది. పది రకాల పళ్ళు, సీట్స్ హాట్స్ అన్ని పెట్టారు. ఒక విధంగా పుల్లారెడ్డి స్వీట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. పువ్వులు, స్ప్రే లు చల్లి రకరకాల ఫారిన్ పువ్వులు అమర్చారు.

హై క్లాస్ సొసైటీ లోంచి వచ్చిన పిల్ల అయినా నెమ్మదిగా ఉన్నది.

వృద్ధాప్యంలో ఉన్న అత్త మామ కొడుకుని గారంగా పెంచాము, లేక లేక పుట్టాడు అంటూ చెప్పారు. తెలివితో బాగా చదువుకుని ఎదిగాడని చెప్పారు.

ఇంకేమి పిల్ల నచ్చింది, పెళ్లి కుదిరింది.

విహారి తల్లి తండ్రి విజయవాడ దగ్గర పల్లెలో ఉంటారు. అక్కడ పెద్ద మేడ, ఏసీ అన్ని ఉన్నాయి. ఇల్లంతా సెంట్రల్ ఏసీ మాదిరి ఉంటుంది. వట్టివేళ్ళ కర్టెన్స్ ఉన్నాయి.

పెళ్లి తరువాత డైరెక్ట్‌గా పల్లెలో ఇంటికి తీసుకు వెళ్ళారు. ఒక వారం ఇక్కడ ఉండాలి అన్నారు. ఊరంతా భోజనాలు. శ్రీ రమా సత్యనారాయణ వ్రతము, అలిమేలు మంగ పద్మావతి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి దీపారాధన చేశారు. కొత్త పెళ్లి కూతురు అందరికీ నచ్చింది. వియ్యపురాలు కూడా కుట్టిన చీర కట్టుకుని వడ్డాణం, కాసుల పేరు అన్ని చక్కగా పెట్టుకుంది. తల్లి కూతురు అక్క చెల్లెళ్ళ మాదిరి ఉన్నారు.

పిల్లని అప్పచెపుతూ “మా పిల్లకి వేపాకుకి కరివేపాకుకి ఏమి తేడా తెలియదు. అలాగే పప్పులు కూడా తెలియవు. ఆకుకూరలు భేదం తెలియదు. అందుకే గోరింటాకో, గోంగూర పచ్చడో – ఎలా ఉంటుంది అన్నది రుచి చూస్తే కాని చెప్పలేదు” అంటూ నవ్వింది వియ్యపురాలు.

“మీ అమ్మాయి వంట చేయాల్సిన అవసరం లేదు. వంట మనిషి ఉంది. ఎప్పుడైనా మా అమ్మ వంటింట్లోకి వెడితే కోడలు సహాయం చెయ్యాలి అంతే, అంతే” అంటూ పెద్దక్క వంత పలికింది.

“ఆ ఉద్యోగం ఉళ్ళోనే ఉంటుంది. విజయవాడ లోనే కదా పిల్లాడు చేసేది?”

“అవును, అప్పుడప్పుడు వస్తాడు అంతే” అంటూ నవ్వుకున్నారు.

పిల్ల డైరెక్ట్‌గా హాస్టల్ నుంచి అత్తింటికి వచ్చింది. హనీమూన్ దుబాయ్‌లో ప్లాన్ చేశారు నెల తరువాత. అంతవరకు పిల్లాడు పిల్ల విజయవాడలో ఉంటారంటూ పెద్దలు నిర్ణయించారు.

“సరే కోడలికి వంట నేర్పాలి మీరే” అని అత్తగారికి సుప్రజ తల్లి చెప్పింది. వాళ్ళంతా వెళ్ళిపోయారు.

***

సుప్రజ మాత్రం ఒక రోజు జీన్ ప్యాంట్, ఒక రోజు పంజాబీ డ్రెస్, ఒక రోజు లంగా ఓణీ, ఇంకో రోజు గాగ్ర ఇలా కడుతోంది. ఒంటి నిండా బట్ట కట్టుకుని ఉన్నందుకు సంతోషపడింది అత్తగారు.

ఒక రోజు ఉప్మా చెయ్యాలి పోపు లోకి కరివేపాకు దొడ్లో చెట్టు నుంచి తెమ్మంది. కోడలు వెళ్ళి వేపాకు కొస తెచ్చి కడిగి ఇచ్చింది. కరెంట్ పోయింది. సాయం వేళ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఉప్మా రెడీగా ఉండాలని ఆశ.

ఓహో కోడలు తెచ్చింది అనుకుంటూ, కడిగిన వేపాకుని ఉప్మా పోపులో వేసింది. పోపు వాసనలో ఏమిటో తేడా వచ్చింది, కరివేపాకు ఘుమ ఘుమ లేదు; ఘాటు బాగా వస్తోంది- అనుకుని స్టౌ కట్టేసి మూకుడు దొడ్లోకి పట్టకారుతో తెచ్చింది అత్తగారు.

అంతా ముద్ద మాడు అయింది. నయం నీళ్ళు పోసి రవ్వ పొయ్యలేదు అనుకుంటూ కోడల్ని “ఏ చెట్టు నుంచి కోసావు?” అని అడిగింది.

రెండు చిన్న వేప చెట్లు కరివేప చెట్టు మొదట్లో లేచాయి. “పైకి ఎగిరి కొయ్య లేక ఈ చిన్న చెట్టు నుంచి కోసుకు వచ్చాను” అని చూపించింది

అత్తగారు తిట్టకుండా పక్కున నవ్వింది. అత్తగారంటేనే అహంకారానికి ప్రతిరూపంగా మనందరికీ తెలుసు.

మళ్లీ ఇంకోసారి గోంగూర పచ్చడి చెయ్యమని చెప్పి, ఎవరో స్నేహితులు వస్తే మాట్లాడుతూ ఉంది అత్తగారు.

సరే శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి అడి పోపు వేసి పెట్టింది.

అత్తగారు నవ్వుకుని “పోపు మూకుడులో చక్కగా మగ్గించాలి అని చెప్పాను నువ్వు వినలేదా” అంటూ రుబ్బిన పచ్చడిని నూనెలో వెల్లుల్లి వేయించి ఈ పచ్చడి వేసి మగ్గపెట్టి సజావుగా చేసింది.

కిచెన్ మధ్యగా గ్యాస్ పొయ్యి గట్టు పై పెట్టి ఉంటుంది. ఒక రోజు పెసరట్టు వెయ్యమని చెప్పింది. పెనంపై నూనె వెయ్యకుండా పిండి పోసింది సుప్రజ. అట్టు రాలేదు. అట్లకాడ పట్టుకుని గ్యాస్ గట్టు చుట్టూ తిరిగింది. అయినా అట్టు మాడింది. అత్తగారు నవ్వుకుని వెక్కిరించింది.

మరోసారి మినప్పిండి వడలు చేస్తూ చేతికి నీళ్ళు చేసుకోకుండా ముద్దలా నూనెలో వదిలింది సుప్రజ. వడలు ముద్దల్లా వచ్చాయి. దాంతో మళ్లీ అత్తగారి ప్రహసనం మొదలు.

హాస్టల్ నుంచి అత్త ఇంటికి వచ్చిన కోడలి అష్టావధానాలు ఇలా ఉంటాయి.

నానాటి బ్రతుకు నాటకములో ఇవన్నీ తప్పవు అని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో చెప్పాడు.

సుప్రజ నెల్లాళ్ళు అత్తగారి దగ్గర వంట నేర్చుకుని దుబాయ్ హనీమూన్‌కి వెళ్ళింది. మరి అత్త ఇల్ల మజాకా అన్నట్లు ఉన్నది. వంట నేర్చుకుని జీవితాన్ని ఆనందంతో. అందాలతో సరిదిద్దుకుంది సుప్రజ.

***

భార్యను విమర్శించడం కాదు మనల్ని నమ్ముకు వచ్చిన అమ్మాయిని ప్రేమగా చూడాలి అవసరం అయితే ప్రశంసలు ఇవ్వాలని సుబ్బు అంటాడు.

నేటి తరంలో ఎందరో అమ్మాయిలు మల్లెపూలు, జాజి పుల మాదిరి సున్నితం నుంచి ఎడారి మొక్కలు మాదిరి బోన్సాయ్ మొక్కల మాదిరి జీవితాల్లో సమస్యలు ఎదుర్కొని జీవిస్తున్నారు. దీని కారణం నేటి వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ కన్న అధికారం డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇలా జరిగిపోతుంది.

కొంత మంచీ జరిగి అటు ఇటు సర్ధి చెప్పే కొన్ని పెళ్లిళ్లు చేస్తున్నాము అంటారు శుభం సుబ్బు వంటి పెళ్లి అవధానులు.

చేతులకి కంకణాలు, మెడలో ఎన్నో రకాల గొలుసులు, ఫైల్‌లో ఎన్నో మెడల్స్ ఉన్నాయి. ఇదంతా పెళ్ళిళ్ళ వల్లనే. వృత్తి ఎంచుకోవడం కాదు దానిలో ప్రతిభ చూపి జీవితాలు అవగాహన చేసుకోడం వల్ల – ప్రభుత్వం నుంచి కూడా అవార్డ్స్ పొందాడు.

సుబ్బు విహారి మంచి ఫ్రెండ్ అయ్యారు. ఫోన్‌లో జీవిత విశేషాలు చెప్పుకుని హాయిగా నవ్వుకుంటారు.

ఇవ్వాళ మేరేజి బ్యూరోలు, లింక్స్ పెరిగాయి. పెళ్లి కొడుకులు 800 మందికి ఇద్దరు ఆడపిల్లలు ఉంటున్నారు. అమ్మనాన్నలే వస్తున్నారు.

సంస్థలు పెరిగాయి. ఎవరికి ఏ విధమైన నిజాయితీ లేదు. బురిడీ కబుర్లు వారే ఎక్కువ ఉన్నారు.

ఇప్పుడు అడపిల్లకి నచ్చితే మగాడికి నచ్చడం లేదు. ఇద్దరికీ నచ్చితే పెద్దలకి నచ్చదు. అందరూ యతీశ్వరులు, మునీశ్వరులు. ఏ ఒక్క పిల్లాడు డిగ్నిఫైడ్‍గా లేడు. కొందరు వెకిలిగా ఉన్నారు. ‘అబ్బా, ముక్కు మూతి బాగున్న పిల్లలు అసలు లేరా’ అంటూ ఇంట్లో బామ్మలు అమ్మమ్మలు తెగ నసుగుతారు. “ఈ రోజుల్లో సంబంధాలు చూడటం, మెప్పించడం మహా కష్టంగా ఉన్నది సర్” అంటాడు సుబ్బు.

సంఖ్య పెరిగింది. ఒక్క ఆడపిల్ల. తల్లి తండ్రులు ఎక్కువ. వారికి పిల్ల ఆస్తి కావాలి కానీ, కన్న తల్లి తండ్రులు అవసరం లేదు. ‘మిమ్మల్ని చూడము, పిల్లని చేస్తే చేసుకుంటాము’ ఇది నేటి సమస్య. ఆడపిల్ల తల్లి తండ్రి ఏమై పోవాలి? పిల్లకి అన్ని ఇచ్చే రిజర్వ్ బ్యాంక్ మాదిరి తయారయ్యారు. ఇంకా పిల్ల విషయంలో అన్ని సమస్యలు వస్తున్నాయి.

శుభం సుబ్బయ్యలు వీధికి ఒకళ్ళు వచ్చారు, దీనిలో కూడా డిస్కౌంట్ వ్యాపారం మొదలు పెట్టుకుని. ధనమే ధ్యేయంగా మారింది ఇప్పుడు.

శుభం సుబ్బయ్య ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.

శాంతి శుభము

Exit mobile version