[dropcap]మా[/dropcap]ట్లాడే ప్రతి మాటా
మెటా టాక్ గా మెలికలు తిరిగి
మళ్లీ దరి చేరినపుడు
మౌనమే తోడవుతుంది
పలకరింపుగా విచ్చుకునే పెదవులు
పలు అర్థాలకు తావిస్తాయని తెలిశాక
మందహాసం మాయమౌతుంది
అనుమానపు రంగుటద్దాలతో
అమాయకత్వాన్ని లౌక్యంగా చూడగల
మహామనీషుల ముందు
నిసర్గ స్నేహం నివురైపోతుంది
నిశ్చల తటాకంలోకి విసరబడ్డ రాయి
సృష్టించే బాధా తరంగాలు
ఏ కంటికీ కనబడవు
కత్తిరించుకున్న రెక్కలతో
విహంగం పాడే వేదనాగీతం
ఏ చెవులకూ చేరదు
మరపు పూతకి లొంగని
మానని గాయాల సలపరింత
ఏ మనసుకీ అందదు
ఎన్ని గొడ్డలి దెబ్బలు తిన్నాక
ఎన్నిసార్లు మంకెనపూలు వర్షించాక
ఒకానొక సజీవశిల్పం శిలగా మారిందో
ఎవరూ గుర్తించలేరు