Site icon Sanchika

సిల్కు దుపట్టా

[box type=’note’ fontsize=’16’] అహమద్ ఈసప్ వ్రాసిన దక్షిణాఫ్రికా కథకి వంకాయల శివరామకృష్ణారావు తెలుగు అనువాదం ఈ “సిల్కు దుపట్టా”. [/box]

[dropcap]జో[/dropcap]హానెస్బర్గ్ నగరం, ఫోర్డ్స్‌బర్గ్ ప్రాంతంలోని ఓరియంటల్ ప్లాజా ఒక పెద్ద మాల్. నిత్యమూ రద్దీగానే ఉంటుంది.

ఉదయం పదకొండు గంటలకి ‘బొంయి’మని హారన్లు మోగించుకుంటూ వచ్చి రెండు తెల్ల మెర్సిడిస్ బెంజి కార్లు కీచుమంటూ ఆగాయి. మొదటిదానిలో ఇద్దరు నల్లజాతి మహిళలున్నారు. రెండో దానిలో కేవలం ఇద్దరు సెక్యూరిటీ గార్డులున్నారు. వారివద్ద తుపాకులు కూడా ఉన్నాయి. డ్రైవరు తలుపు తీసిపట్టుకోగా మొదటి కారులోంచి ఖరీదైన దుస్తులూ, డిజైనర్ నగలూ ధరించిన ఆ మహిళలిద్దరూ దిగారు. వారిలో నల్లగా, లావుగా, ఠీవిగా ఉన్నామె ఆఫ్రికన్‌ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లోని ప్రముఖ నాయకుడు జాకబ్ నేబో సతీమణి. నెల్సన్‌ మండేలా నాయకత్వంలో శ్వేతజాతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, ఆ ప్రభుత్వాన్ని దించి నల్లజాతివారి ఆధిక్యంగల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోయేది ఆ పార్టీయే. జాకబ్ నేబో విదేశాంగ మంత్రిగా నియమితులవుతారని అందరి అంచనా!

శ్రీమతి నేబో నలభై ఐదేళ్ళ మహిళ. జోబర్గ్ (జోహాన్నెస్‌బర్గ్ కి పొట్టిపేరు, అందరూ జోబర్గ్ అనే పిలుస్తారు) లోని బ్యూటీపార్లర్లన్నీ ఆవిడకి కొట్టినపిండే! వారందరూ తోమగా తోమగా ఆవిడ ముఖం నిజంగానే చాలా నునుపు తేలింది. నిగనిగలాడుతూ ఉంటుంది ఆమె నల్లటి మేను. ఆమె కూడా ఉన్నామె మార్గరెట్. శ్రీమతి నేబోకి ప్రియమైన స్నేహితురాలు, లౌక్యం తెలిసిన స్త్రీ. ఆవిడ శ్రీమతి నేబో అన్నదానికి విరుధ్ధంగా యేదీ అనదు. తెల్లటి పలువరుస ఆమె నవ్వినప్పుడు చీకటిరాత్రిలోని చందమామలా వెలిగిస్తుంది ఆమె ముఖాన్ని.

వాళ్ళిద్దరూ ఆ రోజు ఉదయమే షాపింగుకి బయలుదేరారు. జోబర్గ్ లోని మరోచోట కొన్ని వస్తువులు కొని, ఇప్పుడు ఓరియంటల్ ప్లాజాకి వచ్చారు. నగల దుకాణాలూ, బట్టల షాపులూ, గృహోపకరణాల అంగళ్ళూ అన్నీ చుట్టేశారు. చివరికి పేవ్‌మెంట్ల మీద అమ్మే చిన్న చిన్న పిన్నులు కూడా కొన్నారు. చేతిలో పరిమితంగా సొమ్ములున్నవాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి కాని కొనని వస్తువులన్నీ బరువైన పర్సు చేతిలో ఉన్న శ్రీమతి నేబో కారు డిక్కీలో చేరిపోయాయి. ఆవిడ నివాసం జోబర్గ్ శివారులో ఉన్న హౌటన్‌ అనే ధనవంతులుండే ప్రదేశం. అక్కడున్న స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొట్టే అనుమతి ఉన్న ఏకైక నల్లజాతి వ్యక్తి శ్రీమతి నేబోనే. అందుకని ఆవిడ ఇప్పుడు రెండు స్విమ్మింగ్ సూట్లు కూడా కొన్నది. ఈ వనితలిద్దరూ షాపింగు పనిలో ఉండగా, సాయంత్రందాకా తమని భోజనానికి కూడా పంపరని తెలిసిన బాడీగార్డులిద్దరూ చెరో ఐదు చిప్సు పాకెట్లూ కొనుక్కుని వాటిని తింటూ వీరి వెనుకే నడుస్తున్నారు, అప్రమత్తంగానే.

ఒక బట్టల దుకాణంలో చూసిన భారతీయ సాల్వార్ కమీజుని ఎంతో మోజుపడి కొంది శ్రీమతి నేబో. గులాబీ రంగు క్రేప్ వస్త్రం మీద చిన్నచిన్న నీలిరంగు పువ్వుల డిజైన్లతో ఆమెను చాలా ఆకట్టుకొంది అది. వెంటనే దాన్ని ఖరీదు చేసిందావిడ. దాని మీదికి సరిగ్గా సరిపోయే దుపట్టా (తలమీద చుట్టుకోడానికి! ఆఫ్రికన్‌ మహిళలు చాలా మంది అలా దుపట్టాలు ధరిస్తారు) కూడా దొరికితే బాగుండునని అక్కడ వెతికినా నచ్చినది దొరకలేదు.

అలా వెతుకుతూనే శ్రీమతి నేబో, మార్గరెట్ ‘మొగల్ బోటిక్’ అనే షాపులోకి వచ్చారు. దాని యజమాని సాకూర్ భారతీయ సంతతికి చెందిన ముస్లిం. సన్నగా, రోగగ్రస్తుడిలా ఉంటాడు. బెల్టులున్నబూడిద రంగు పంట్లాం, దానికింద టక్ చేసిన లేత నీలిరంగు పొట్టిచేతుల చొక్కా ధరించి ఉన్నాడు. సాకూర్ చాలా ఓపిగ్గా తనవద్దనున్న దుపట్టాలన్నింటినీ వారికి చూపించాడు. చివరికి శ్రీమతి నేబోకి ఆమెకి కావలసిన దుపట్టా దొరికింది. ” అబ్బ, ఎంత బావుందో, ఈ డ్రస్సు వేసుకుని, తలకి దుపట్టా చుట్టుకుంటే ఎంత బావుంటుందో, భలే దొరికింది కదూ” అంటూ చాలా ఆనందించింది ఆవిడ.

“ఇదిగో బాబూ, దీని ఖరీదెంత?” అడిగింది మార్గరెట్.

“నూట ఇరవై రాండ్లు. దానిమీద సేల్సుటాక్సు పన్నెండు రాండ్లు. మీకు పన్ను తగ్గించికుని నూట ఇరవై రాండ్లకే ఇస్తాను” అన్నాడు సాకూర్.

“ఓ, ధన్యవాదాలు” అంటూ శ్రీమతి నేబో పర్సు తీసింది, డబ్బు లెక్కపెట్టి చూస్తే ఇరవై రాండ్లు తక్కువున్నాయి. సరుకులు కొనే హడావిడిలో ఆవిడ డబ్బుగురించి చూడకపోవడంవల్ల, కొన్ని వస్తువులు చెక్కులిచ్చి కొనడం వల్లా ఆమెకి డబ్బు ఎంత ఉందో ఆలోచించుకునే అవసరం రాలేదు. తీరా ఇప్పుడు ముచ్చటపడి కొన్న దుపట్టాకి డబ్బు తక్కువ అయింది.

“ఇదిగో, బాబూ, నా దగ్గర డబ్బు కొంచెం తక్కువ అయింది. చెక్కు ఇస్తాను తీసుకో” అంది శ్రీమతి నేబో.

“కుదరదు మేడం, నా దగ్గర అన్నీ డబ్బిచ్చే తీసుకోవాలి. నేను చెక్కులు తీసుకోను” అన్నాడు సాకూర్. అంటూనే తన సీటు వెనకనే ఉన్న ఒక నోటీసు బోర్డు చూపించాడు. దాని మీద “అరువు లేదు. రొక్కం చెల్లించి సరుకు తీసుకోవలెను. చెక్కులు అంగీకరించబడవు” అని రాసి ఉంది.

శ్రీమతి నేబో తనకి అవమానం జరిగినట్టు అనిపించింది. తన హోదా, సంపద అన్నీ ఆ బోర్డు మీద రాసి ఉన్న అక్షరాల మంటల్లో బూడిదైనట్టు అనిపించింది.

“అయ్యో, నా చెక్కులెప్పుడూ బాంకులో చెల్లకుండా పోలేదయ్యా” అని సాకూరుతో.

“అమ్మగారూ, ఆ మాట నేను అనలేదుకదండీ” అంటూ సాకూర్ దుపట్టాని మడిచి దాని డబ్బాలో పెట్టేశాడు.

“ఇదిగో బాబూ, ఈవిడెవరో నీకు తెలీదులా ఉందే! హౌటన్‌లో అందరికన్న ధనవంతురాలు ఈవిడే. అదీకాక, చాలా షాపుల్లో చెక్కులిచ్చే మేం సరుకులు తీసుకుంటాం” అంది మార్గరెట్.

“ఈవిడ ఎవరైతే నాకెందుకు. నా షాపులో డబ్బిచ్చే సరుకులు తీసుకోవాలి. నేను చెక్కులు తీసుకోను”

షాపు అతను అలా అనేసరికి శ్రీమతి నేబోకి ఒళ్ళుమండింది. “ఏంటయ్యా, నేనేమీ బికారిదాన్ని కాను తెల్సా! బాంకులో డబ్బుల్లేకుండా చెక్కులిస్తాననా నీ ఉద్దేశం? నీలాంటివి వంద షాపుల్ని కొనగలను నేను” అని అరిచింది.

ఈ కేకలు విని బయట నిలబడి చిప్సు తింటున్న ఆమె బాడీగార్డులు లోపలికి తొంగిచూశారు. శ్రీమతి నేబో వారిని బయటనే ఉండమని సైగ చేసింది.

“అమ్మగారూ, నేను అననివన్నీ మీరే అంటూ ఉంటే నేనేం చెప్పను. మా షాపు పధ్ధతి మీకు చెప్పాను. చెక్కు తీసుకోనని మళ్ళీ చెబుతున్నాను. ఈ దుపట్టా మీకిష్టమైతే సొమ్ము తెచ్చి ఇచ్చి తీసుకెళ్ళండి. అంతే” అన్నాడు విసుగ్గా సాకూర్.

“ఏం? చెక్కెందుకు తీసుకోవు?” గట్టిగా అడిగింది మార్గరెట్.

“నా కారణాలు నావండీ. అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు”

“ఏంటి నీ కారణాలు? కస్టమర్లని ఇబ్బంది పెట్టడమే నీ కారణమా?”

సమాధానం చెప్పకుండానే తన సీట్లో కూర్చున్నాడు సాకూర్. తన వ్యాపారం, తన ఇష్టం. అతని వ్యాపారం అతని పద్ధతిలోనే నడుస్తుంది. తనని ఇలా ఎవరూ ఇంతవరకూ ప్రశ్నించలేదు. తనకి బాంకుల చుట్టూ తిరగడం ఇష్టం ఉండదు. తన వ్యాపారమంతా న్యాయబధ్ధంగా, నగదు రూపంలోనే నడుస్తుంది. ఇప్పుడు ఈవిడకోసం తన పధ్ధతి ఎందుకు మారాలి? ఒక బేరం పోయినంత మాత్రాన తానేమీ నష్టపోడు.

“ఇక్కడికొచ్చేముందు పక్కనున్న చార్లీ బ్రదర్స్ కొట్లో కూడా చెక్కే ఇచ్చాను. కావాలంటే అడుగు వాళ్ళని” అంది శ్రీమతి నేబో.

“నాకేం అవసరం అమ్మా! వాళ్ళ పధ్ధతి వాళ్ళది, నా పధ్ధతి నాది” అన్నాడు సాకూర్. ఇలా ఇంటూనే ఇందాకా మడిచి దాని అట్టపెట్లో పెట్టిన దుపట్టాని షోకేసులో ఎక్కడనించి తీశాడో అక్కడ పెట్టేశాడు.

శ్రీమతి నేబోకి భరించరాని అవమానం జరిగినట్టనిపించింది. తన గౌరవమంతా ఈ షాపులో ఆవిరై పోయినట్టనిపించింది. ‘లక్షల రాండ్లు తన బాంక్ ఖాతాలో మూలుగుతుంటే ఈ చిన్న షాపువాడు ఇంతలా అవమానిస్తాడా నన్ను’ అంటూ ఒకరకంగా ఖిన్నురాలయింది కూడా. తన భర్త జాకబ్ నేబో త్వరలో అధికారాన్నందుకోబోతున్న ఆఫ్రికన్‌ నేషనల్ కాంగ్రెస్‌లో ముఖ్య నేత, కాబోయే మంత్రి. ఇక ముష్టి దుపట్టా, కేవలం నూట ఇరవై రాండ్ల ఖరీదైనదాని కోసం…వీడు ఇలా…అనుకుంటూ ఒక్కసారి కోపాన్ని ఆపుకోలేక సాకూర్ మీద కస్సుబుస్సులాడం మొదలెట్టింది. సాకూర్ మాత్రం నిమ్మకి నీరెత్తినవాడిలా తన సీట్లో కూర్చొని ఏవో పద్దులు చూసుకుంటున్నాడు. తమ యజమానురాలు గట్టిగా అరవడం విన్న బాడీగార్డులిద్దరూ చిప్సు పాకెట్లు జేబుల్లో కుక్కుకొని లోపలికొచ్చారు, తుపాకుల్ని బారుగా పట్టుకొని! సాకూర్ ఒక సారి తలెత్తి వాళ్ళని చూసాడు. ఏమీ మాట్లాడకుందా మళ్ళీ తనపనిలో మునిగిపోయాడు. వీళ్ళేం చేస్తారులే అనుకున్నాడో యేమో!

“మేం హౌటన్‌లో ఉంటామయ్యా” అంది మళ్ళీ మార్గరెట్. తాను పక్కనుండగా శ్రీమతి నేబో ఆ దుపట్టాని కొనుక్కుంటే, తామిద్దరం వెళ్ళి దాన్ని కొన్నామని శ్రీమతి నేబో అందరితోనూ చెబుతుంటే విని ఆనందించాలని ఆమె కోరిక.

“ఐతే నాకేంటమ్మా, డబ్బుతెచ్చి తీసుకెళ్ళండి, లేకపోతే బయటికి వెళ్ళండి” అన్నాడు సాకూర్ చిరాగ్గా మొహం పెట్టి. ఇది విన్నారు బాడీగార్డులు. ఒక్క సారి సాకూర్ మీదికి రాబోయారు. ఐతే వారిని శ్రీమతి నేబో వారించింది.

ఈ గొడవ అంతా గమనిస్తున్నాడు ఎదుటి షాపు యజమాని. నెల చివరి రోజులు కావడం వల్ల ఎవరికీ పెద్దగా బేరాల్లేవు. అతని పేరు ఇర్ఫాన్‌ సాదర్. ఓరియంటల్ ప్లాజా వర్తక సంఘానికి సెక్రెటరీ. పక్కనున్న మరో రెండు షాపుల వారిని వెంటపెట్టుకొని అతను సాకూర్ షాపులోకి వచ్చి గొడవేంటని అడిగాడు.

“చూడండి, ఇతను నన్ను అవమానిస్తున్నాడు. ముష్టి వంద రాండ్ల సరుకుని తీసుకొని డబ్బు ఎగ్గొట్టేదానిలా చూస్తున్నాడు నన్ను” అని శ్రీమతి నేబో అంటుంటే మార్గరెట్ చెక్కిస్తామంటే కుదరదంటున్నాడు అని ఫిర్యాదు చేసింది.

“ఏమమ్మోయ్, మీరు మోసం చేస్తారన్న మాటే నేను అనలేదు. చెక్కు కుదరదు అన్నానంతే” అని మొత్తుకున్నాడు సాకూర్.

“ఈవిడెవరో ముందు తెలుసుకోమనండి ఇతన్ని. ఈవిడ జాకబ్ నేబో గారి భార్య. ఆయన మనకి కాబోయే మంత్రి. ఈ ప్రాంతంలో అందరికంటే ధనికురాలు ఈవిడే” అంది మార్గరెట్.

దుకాణదారులు ముఖాలు చూసుకున్నారు. ఏదో కూడబలుక్కున్నట్టు అంతా బయటికి పోయారు. వారంతా రెండువందల యేండ్ల క్రితం భారతదేశం నించి వలస వచ్చిన గుజరాతీ ముస్లింల సంతతివారు. ఇక్కడి తెల్లవారి, నల్లవారి సంగతి బాగా తెలిసినవారు. శ్వేతజాతీయులు గాంధీ మహాత్ముడినే రైల్లోంచి కిందికి తోసేసిన వర్ణాహంకారులు. వారి వర్ణవివక్షకి ఏమాత్త్రం తీసిపోనివి అక్కడి నల్లజాతివారి నేరప్రవృత్తి, మూర్ఖత్వం, మొరటుదనం. ఈ ఇద్దరి ధాష్టీకాలకీ తామంతా ఎంతో నష్టపోయారు ఇప్పటికే! కాపిటల్ హిల్‌లోనున్న తమ దుకాణాలని తెల్లవారు కూలదోస్తే ఇక్కడికి వచ్చి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. ఈ మహిళ జాకబ్ నేబో భార్యే అయితే కొరివితో తల గోక్కున్నట్టే అవుతుంది. అతడు ANC లో ముఖ్య నేత. అతని భార్యని అవమానిస్తే, నల్లవారు పగబట్టి ఏ ఆఘాయిత్యాలు చేస్తారో! ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే రాబోతోంది కూడా. వాళ్ళ ఆగ్రహం తమకి ఎంతమాత్రం మంచిది కాదు అని వర్తకులంతా ఏకగ్రీవంగా అనుకున్నారు.

ఇర్ఫాన్‌ సాదర్ మళ్ళీ సాకూర్ దుకాణంలోకి వెళ్ళి, అతనితో గుజరాతీలో ఈ విషయాన్నే చెప్పాడు. ఈ ఒక్కసారికీ చెక్కు తీసుకోమన్నాడు. ఐతే సాకూర్ ఒక సారికి ఒకరిదగ్గర చెక్కు తీసుకుంటే అందరి వద్దా తీసుకోవాల్సి వస్తుందనీ, అది తనకి పడదనీ పాత పాటే పాడాడు. ఇర్ఫాన్‌ కోప్పడ్డా ఇతడు వెనక్కి తగ్గలేదు. శ్రీమతి నేబో ఒక్కడున్న ఒక స్టూలుమీద బైఠాయించింది. పక్కనున్న మరో స్టూలుపై చతికిలపడింది మార్గరెట్. “ఇతనేమనుకుంటున్నాడు? ఈ ఓరియంటల్ ప్లాజాలో షాపు నడుపుకునే ఉద్దేశం లేదులా ఉంది ఇతనికి! శ్రీమతి నేబోనే అవమానిస్తాడా” అంటూ పిచ్చిదానిలా అరుస్తోంది మార్గరెట్. శ్రీమతి నేబో ఒక్కసారిగా లేచి,

“ఏయ్, ఇండియన్‌, మర్యాదగా చెక్కు తీసుకుని దుపట్టానిస్తావా లేదా?” అని అధికారస్వరంతో అరిచింది. మార్గరెట్ కూడా రెచ్చిపోయి ‘నువ్వేమన్నా తాగి ఉన్నావా? మేము మెర్సిడిస్ కార్లో తిరిగే బికార్లం అనుకున్నావా? మా చెక్కు చెల్లదని నీకెందుకు భయం?’ అని హుంకరించింది.

“నువ్వొక ఫూల్‌వి. నీలాంటి వాళ్ళకి కొత్త దక్షిణాఫ్రికాలో స్థానం లేదు. కొత్త ప్రభుత్వం రాగానే నీలాంటి వాళ్ళని మూటకట్టి ఇండియన్‌ ఓషన్‌లో విసిరేస్తాను జాగ్రత్త” అని శ్రీమతి నేబో అరుపుల స్థాయిని పెంచింది.

దుపట్టా తీసుకెళ్ళకుండా వాళ్ళక్కడినించి కదలరని, గొడవ ముదురుతుందనీ పసిగట్టాడు ఇర్ఫాన్‌ సాదర్. శ్రీమతి నేబోని శాంతించమని వేడుకుని, మిగిలిన వారిని తీసుకొని మళ్ళీ బయటికెళ్ళి మాట్లాడి, ఒక నిర్ణయానికి వచ్చాడు.

అదేమంటే, ఆ దుపట్టాకి పైకం చెల్లించి, తామే దాన్ని తీసుకుని, శ్రీమతి నేబోకి బహుమతిగా ఇవ్వాలని. దాని వల్ల రెండు ప్రయోజనాలుంటాయి. మొదటిది ఇప్పటి గొడవ సద్దుమణుగుతుంది. రెండోది రాబోయే నల్లవారి ప్రభుత్వంతో తమకి పేచీ ఉండదు. అందరూ ఒప్పుకున్నారు దీనికి.

సాకూర్‌కి సొమ్ము చెల్లించి, ఇర్ఫాన్‌ దుపట్టా తీసుకున్నాడు. అక్కడే దానికి గిఫ్టు రాపర్ చుట్టించాడు. శ్రీమతి నేబో వద్దకెళ్ళి, “అమ్మగారూ, జరిగినదానికి ఇతన్ని మన్నించండి, మర్చిపోండి. దయచేసి, మా వర్తకులందరి కానుకగా దీన్ని స్వీకరించండి. మా కస్టమర్ల సంతోషమే మాకు కావలసింది. తెల్లవారి దుశ్చర్యలకి నష్టపోయిన వారమే మేమంతా. మీకు తెలుసుకదమ్మా! కొత్తగా యేర్పడే మీ ప్రభుత్వంలో మమ్మలనందరినీ దయతో చూడమని జాకబ్ నేబోగారితో మా తరపున విన్నవించడి. ఇదే మా మనవి. మీకూ, జాకబ్ గారికీ మా అభినందనలు” అన్నాడు.

శ్రీమతి నేబో ముఖం వికసించిన నల్లకలువలా అయింది. ఆమె ఇర్ఫాన్‌ సాదర్‌కి, మిగిలిన దుకాణదారులకీ ధన్యవాదాలు చెప్పి, మార్గరెట్‌తో కలిసి మునుపటి ఠీవితోనే బయటికి నడిచింది.

వెడుతూ, వెనక్కి తిరిగి సాకూర్‌తో “దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాకా నీ లాంటి మూర్ఖులకి ఇక్కడ స్థానం లేకుండా చేస్తాను” అంది శ్రీమతి నేబో! ఎప్పట్లాగే ఎటో చూస్తూ నిలబడ్డాడు సాకూర్!

ఐతే శ్రీమతి నేబోకి తెలియని విషయం – తన తోటి వర్తకుడే ఆ దుపట్టాని కొన్నందుకు తన లాభాన్ని మినహాయించుకొని తొంభై రాండ్లకే సాకూర్ ఇర్ఫాన్‌కి ఇచ్చాడన్నది. అది ఆమెకి తెలుసుకునే అవసరం కూడా లేదు.

మూలం: అహమద్ ఈసప్

అనువాదం: వంకాయల శివరామకృష్ణారావు

Exit mobile version