Site icon Sanchika

సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో…

[dropcap]వి[/dropcap]విధ రకాల మనస్తత్వాలున్న వ్యక్తులు, వివిధ వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారు గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు నుండీ విజయవాడకు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో సీజనర్లుగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు పది మంది. వారందరూ కలసి ఒక బృందంగా ఏర్పడ్డారు.

ఆ పది మందిలో పి.వి.యన్. రావు ఒకరు. డయాబెటిక్ ప్రాడక్టైన రెలిష్‌ని మార్కెట్లో అమ్మడానికి సేల్స్ ఆఫీసరుగా చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న కారణంగా మాటలు బాగా మాట్లాడుతాడని, మంచి మాటకారని కితాబిస్తుంటారు తన తోటి మిత్రులందరూ.

***

గుంటూర్లో ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరే సింహాద్రి ఎక్స్‌‌ప్రెస్ తొమ్మిది, తొమ్మిదిన్నర మద్యలో విజయవాడ చేరుతుంది. “ఈ గంట, గంటన్నర ప్రయాణంలో ఎవరికీ బోరు కొట్టకుండా సరదాగా ఉండాలని మనందరం కలిసి ఇప్పుడొక ఆట ఆడుదాం” అని చెప్పాడు పి.వి.యన్.రావు.

ఆట ఆడటానికి బృంద సభ్యులందరూ అంగీకరించడంతో రావు ఆటకు సంబందించిన వివరాలు చెప్పాడు.

“సింహాద్రి ఎక్స్‌‌ప్రెస్ విజయవాడకు తొమ్మిదింబావు లోపు చేరితే మీ ఐదుగురు గెలిచినట్లు. అదే తొమ్మిదింబావు తర్వాత ఎప్పుడు చేరినా మీ ఐదుగురు గెలిచినట్లు. ఆ గెలిచిన బృందం పది మందికీ పార్టీ ఇవ్వాలి. మీలో ఎవరో ఒకరు సింహాద్రి ఎక్స్‌‌ప్రెస్ విజయవాడకు చేరే సమయాన్ని నెల రోజుల పాటూ మానిటర్ చెయ్యాలి” అని చెప్పాడు.

“అలాగే” నని చెప్పి నెల రోజులు మానిటర్ చేసిన తర్వాత తేలిన విషయమేమిటంటే సింహాద్రి ఎక్స్‌‌ప్రెస్ తొమ్మిదింబావు, తొమ్మిదిన్నర మద్య ఇరవై సార్లు విజయవాడకు చేరడంతో ఒక జట్టు సభ్యులను గెలిచినట్లు ప్రకటించారు. ఆ గెలిచిన జట్టులోని సభ్యులతో పాటు, మరో జట్టు సభ్యులందరూ కలసి ఒకటవ తేదీన పార్టి జరుపుకున్నాము. ఆ పార్టీ మెను – ఒక స్వీటు, ఒక హాటు, ఒక టీ. దాని కయ్యే ఖర్చును పదిమంది సమానంగా పంచుకున్నాము.

ఈ ఆట ఆడిన తర్వాత బృంద సభ్యుల మధ్య స్నేహ భావం ఏర్పడింది.

ఈ స్నేహ భావం మరింత బలపడాలన్న ఉద్దేశంతో పి.వి.యన్. రావుకు మరొక ఆలోచన తట్టి దానిని వెంటనే ఆచరణలో పెట్టాడు. అదేమిటంటే తనతో కలుపుకుని పది మంది పుట్టిన రోజుల్ని తన డైరీలో రాసుకున్నాడు.

“మిత్రులారా! మీరందరూ ఒక్కొక్కరు ఇరవై రూపాయలివ్వండి” అని అడిగాడు.

“దేనికి మిత్రమా?”

“ముందివ్వండి. ఎందుకనేది తర్వాత మీకే తెలుస్తుంది” అన్నాడు రావు బృంద సభ్యులనుద్దేశించి.

సభ్యులందరూ మారుమాట్లాడకుండా డబ్బులిచ్చేశారు.

రావు తన ఇరవై రూపాయలు కలిపితే రెండు వందల రూపాయలయ్యింది. మిత్రుడికి మంచి బహుమతి కొన్నాడు.

మిత్రుడు మూర్తిని విజయవాడలో ఉండగానే మధ్యాహ్న సమయంలో ఫోన్ చేసి అతడికి అడ్వాన్స్ విషెష్ చెప్పాడు రావు.

“థాంక్సండి” అని బదులు చెప్పాడు మూర్తి.

రావు మూర్తితో “రేపు మీ పుట్టినరోజు కాబట్టి పది మందికి ఓ స్వీటు, ఓ హాటు, ఒక టీ ట్రైన్ లోనే ఏర్పాటు చెయ్యగలవా మిత్రమా!”

“ఓ యస్. తప్పకుండా!”

***

మరునాడుదయం ఎప్పటిలాగే ఉదయం ఎనిమిది గంటలకు సింహాద్రి ఎక్స్‌‌ప్రెస్ గుంటూర్లో బయలుదేరింది. రైల్లోనే మేము తొమ్మిది మంది కలసి మూర్తికి పుట్టిన రోజు శుభకాంక్షలని లయబద్దంగా చప్పట్లు కొడుతూ “హేపీ బర్త్ డే టూ యూ! హేపీ బర్త్ డే టూ యూ! హేపీ బర్త్ డే టు మూర్తి గారు! మే గాడ్ బ్లెస్ యూ!” అని ముక్త కంఠంతో తెలియబరచాము. అనంతరం మూర్తి ఓ స్వీటు, ఓ హాటు, ఓ టీ రైల్లోనే ఇచ్చాడందరికీ.

టీ సేవనం పూర్తయిన తర్వాత బృంద సభ్యులందరి తరపున పి.వి.యన్. రావు మూర్తి గారికి పుట్టిన రోజు కానుకను ఇచ్చి అతడ్ని మరింత ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఈ పుట్టిన రోజు వేడుక పూర్తయిన తర్వాత బృంద సభ్యులు పి.వి.యన్. రావుని అభినందిస్తూ, ఈ రకమైన కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరుపుకోవాలని, అందుకు మా అందరి సహాయ సహకారాల్ని అందజేస్తామని చెప్పారు.

***

ఓ సాయంకాలం స్వచ్ఛంద సేవా సంస్థ దగ్గరకెళ్ళాడు పి.వి.యన్. రావు. అక్కడొక పెద్దాయన పది మంది అంధ విద్యార్థులతో అంధ పాఠశాలను నడుపుతున్నాడు. ఆ పాఠశాల కెళ్ళి అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయాడు. తన వంతు సాయంగా వాళ్ళకేదో ఒకటి చెయ్యాలనిపించి ఆ పెద్దాయనని కలసి “సర్! మీకు నేనేవిధంగా సహాయపడగలను?” అని అడిగాడు రావు.

అందుకాయన ఆ అంధ విద్యార్థులను చూపుతూ “వాళ్ళకొక రోజు టిఫిన్ పెట్టించండి చాలు” అని అన్నాడు. వెంటనే రావు తన జేబులో ఉన్న ఐదు వందల రూపాయలు తీసి ఆ పెద్దాయనకిచ్చి “ఈ డబ్బులతో రేపుదయం వాళ్ళకు టిఫిన్ పెట్టించండి” అని అన్నాడు.

అప్పుడు రావు పొందిన ఆనందం వర్ణనాతీతం. ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న మదర్ థెరస్సా మాటలు జ్ఞప్తికి వచ్చాయా సమయంలో.

మరికొంతసేపటి తర్వాత ఆ పెద్దాయన దగ్గర శెలవు తీసుకుని ఇంటిముఖం పట్టాడు రావు.

***

మరుసటి రోజు ఎప్పటిలాగే ఉదయం ఎనిమిది గంటలకు సింహాద్రి ఎక్స్‌‌ప్రెస్‌లో మేము మామూలుగా మాట్లాడుకునే మాటలు అయిన తర్వాత నిన్న సాయంకాలం రావు పొందిన అనుభవాన్ని బృంద సభ్యులతో పంచుకున్నాడు. అటు తర్వాత వారితో “పుణ్యం అనేది దేవుడికి దణ్ణం పెడితే వచ్చేది కాదు. ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టడం వల్ల, కష్టాల్లో వున్న వాడిని సమయానికి ఆదుకోవడం వల్ల వచ్చేది” అని అన్నాడు రావు.

ఆ మాటలు విన్న మిత్ర బృందం తలా యాభై రూపాయలు రావు చేతిలో పెట్టి ఈ డబ్బుల్ని ఆ అంధ పాఠశాలకిచ్చి మమ్మల్ని కూడా అందులో భాగస్వాములను చెయ్యండి” అన్నారు.

ఊహించని ఈ హఠాత్పరిణామానికి రావు మనసు చలించి కళ్లమ్మట ఆనందభాష్పాలు జలజలా చెక్కిళ్ళ మీదకు రాలాయి.

ఆ రోజనగా రావు విజయవాడలో త్వరగా తన పని ముగించుకుని గుంటూరొచ్చి ఆ పాఠశాలకు వెళ్ళి ఆ పెద్దాయనని కలసి ఐదు వందల రూపాయలిచ్చి “మీ పాఠశాలలో చదువుకుంటున్న అంధ విద్యార్థులకు మా బృంద సభ్యుల తరపున ఒక పూట భోజనం పెట్టించండి” అని అన్నాడు.

పెద్దాయన రావుతో “మీ లాంటి వాళ్ళు ఆర్థిక సహాయం చెయ్యడం వల్లనే నేను ఈ సంస్థను నడపగలుగుతున్నాను” అని అన్నాడు.

ఆ సమయంలో పెద్దాయన మాట్లాడిన మాటలకి రావు మనసు పొందిన ఆనందం వర్ణనాతీతం. ‘ఇచ్చుటలో వున్న హాయి వేరెచ్చటనూ లేనే లేదనీ’ అన్న సినీ కవి గీతం గుర్తుకొచ్చింది రావుకా సమయంలో.

ఆ రోజు రాత్రి నిద్రపోవడానికి మంచం మీద పడుకున్నాడో లేదో చటుక్కున మరో ఆలోచన తట్టింది రావుకు. ఆ ఆలోచనని రేపు రైల్లో బృంద సభ్యులతో పంచుకోవాలని అనుకుని నిద్రలోకి జారుకున్నాడు రావు.

***

మరునాడుదయం సింహాద్రి ఎక్స్‌‌ప్రెస్‌లో రాత్రి తనకు వచ్చిన ఆలోచనని వారితో పంచుకున్నాడు రావు. అదేమిటంటే “మనం ఈ టీ పార్టీలకు ఖర్చు పెట్టే డబ్బుని ఆ అంధ పాఠశాలకి విరాళంగా ఇస్తే పది మందికి సహాయం చేసినట్టుంటుంది” అని అన్నాడు. అందుకు బృంద సభ్యులందరూ అంగీకరించారు.

ఆ రోజు సాయంకాలం రావుతో పాటు బృంద సభ్యులందరూ అంధ పాఠశాలని సందర్శించి వారు పోగు చేసిన డబ్బుల్ని ఆ పెద్దాయనకిచ్చారు. ఆయన మహదానంద పడ్డారు.

ఇలా ఆ సంస్థకు ఆర్థిక సహాయం చేయడం వలన రావుకు ఆ అంధ పాఠశాలలోని అంధ విద్యార్థులతోటి, సంస్థ వ్యవస్థాపకుడైన ఆ పెద్దాయనతో చెలిమి మరింత బలపడింది.

***

స్నేహితుడింట్లో ఫంక్షన్ జరుగుతున్నది. ఆ ఫంక్షన్‌కి రావు వెళ్ళాడు. ఆ ఫంక్షన్‌లో రావుకు తెలిసిన మరికొంత మంది మిత్రులు కలవడం జరిగింది. వారితో పిచ్చాపాటి కబుర్లు చెబుతూ… “ఈ ఫంక్షన్‌లో మిగిలిపోయిన ఆహార పదార్థాలని నువ్వేమి చేస్తావు” అని అడిగాడు రావు.

“మిగిలిపోయిన ఆహార పదార్థాలని క్యాటరింగ్ వాళ్ళకు చెబితే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు” అని చెప్పాడా మిత్రుడు.

వెంటనే రావు తన ఆలోచనని మిత్రుడికి చెప్పాడు. “క్యాటరింగ్ వాళ్ళు తీసుకెళ్ళమని చెప్పడానికి బదులు ఆ అంధ పాఠశాలకు పంపితే ఓ పది మందికి అన్నం పెట్టిన వాడివవుతావు కదా!” అని అన్నాడు.

రావు మాటలు విన్న మిత్రుడు మహదానందపడి “ఇంతటి గొప్ప అవకాశం వస్తే వదులుకుంటానా!” అని రావు కిచ్చిన మాట ప్రకారం ఫంక్షన్ అయిన తర్వాత మిగిలిన ఆహార పదార్థాలని ఆటోలో పెట్టుకుని ఆ అంధ పాఠశాలకు తీసుకెళ్ళాడు. ఆ ఆహార పదార్థాలను చూడగానే ఆ పెద్దాయన తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

***

మరునాడుదయం సింహాద్రి ఎక్స్‌‌ప్రెస్ ఎక్కి కూర్చొని ఎప్పటిలాగే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం.

ఇంతలో మేము కూర్చున్న చోటుకి టిక్కెట్ కలెక్టర్ వచ్చి “మీ టిక్కెట్లను చూపించండి” అని అడిగాడు.

అందరూ వారి వారి సీజన్ టిక్కెట్లను చూపించారు. అటు తర్వాత పి.వి.యన్. రావు బృంద సభ్యులను టిక్కెట్ కలెక్టరుకు పరిచయం చేసి ఇప్పటిదాకా అందరూ కలసి చేసిన కార్యక్రమాలను ఆయనతో పంచుకున్నారు. వారి మాటలను విన్న టిక్కెట్ కలెక్టర్ వారు చేసిన కార్యక్రమాలను విని వారిని అభినందించాడు.

“మీరు ఇప్పటిదాకా చేసిన సేవా కార్యక్రమాలు నన్నెంతగానో ప్రభావితుణ్ణి చేశాయి. అటువంటి సేవా కార్యక్రమాల్లో నన్నూ భాగస్థుణ్ణి చెయ్యండి. కాస్తంత పుణ్యాన్ని మూటగట్టుకుంటాను” అని అన్నాడు నవ్వుతూ టిక్కెట్ కలెక్టర్.

“సరేనండీ. అలాగైతే మీ పేరు, మీ ఫోన్ నంబరు ఇచ్చారంటే మిమ్మల్ని కూడా భాగస్తుణ్ణి చేస్తాం” అని అన్నాడు రావు.

“ఇక ముందు నేను మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు కలుస్తానో, ఏమో గానీ” అంటూ కొంత డబ్బులు రావుకిచ్చి “మీరు చేయబోయే సేవా కార్యక్రమానికి వినియోగించండి” అని చెప్పి పక్క కంపార్ట్‌మెంట్ కెళ్ళిపోయాడు.

***

టిక్కెట్ కలెక్టర్ సింహాద్రి ఎక్స్‌‌ప్రెస్‌లో చెకింగ్‌కి వచ్చినప్పుడల్లా తన అనుభవాలను బృంద సభ్యులతోటి పంచుకోవడం ఆయనకో అలవాటుగా మారిపోయింది. అందులో భాగంగా “ఇటీవల జరిగిన సంఘటనను తల్చుకుంటే నా మనసు కకావికలమైపోయిందంటే నమ్మండి” అని జరిగిన సంఘటనని చెప్పాడు.

“నేను చెకింగ్‌కి వెళ్ళీన ప్రతి ట్రైన్ లోనూ తలుపుల దగ్గర, ట్రైన్ ఎక్కే మెట్ల దగ్గర కూర్చోవద్దని, ప్రయాణీకులకు చెబుతూనే వుంటాను. కానీ వాళ్ళు వినరు. అక్కడే కూర్చొని ప్రయాణం చేస్తూనే వుంటారు.

నేను చూస్తుండగానే మెట్ల దగ్గర కూర్చున్నతను మెట్ల నుంచీ జారి క్రింద పడ్డాడు. వెంటనే చైన్ లాగి ట్రైన్‌ని ఆపాను. నా వంతు బాధ్యతగా ట్రైన్ ఆగిన వెంటనే నేను ట్రైన్ దిగి పరుగెత్తుకుంటూ సదరు పడిపోయినతడి దగ్గరికెళ్ళి అతడి దగ్గర టిక్కెట్ ఉందేమోనని చెక్ చేశాను. అతడి దగ్గర టిక్కెట్టు లేదు. అతడి దగ్గర టిక్కెట్ వున్నట్లైతే రైల్వే చట్టం 1989, సెక్షన్ 124-A కింద నిర్వచించిన విధంగా, ప్రమాద వశాత్తు పడిపోవడం వంటి అవాంచనీయ సంఘటన పరంగా మరణించినట్లైతే, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా క్రింద పదిహేను వేల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి ఐదు వేల రూపాయలు, సాధారణ గాయాలు తగిలిన వారికి ఐదు వందలు రూపాయలు దక్షిణ మధ్య రైల్వే యాజమాన్యం నష్ట పరిహారం క్రింద చెల్లిస్తుంది. దావా పరిహారం యొక్క కాల పరిమితి ప్రమాదం/సంఘటన జరిగిన తేదీ నుండీ ఒక సంవత్సరం లోపు నష్ట పరిహారాన్ని పొందవచ్చు” అని టిక్కెట్ కలెక్టర్ చెప్పాడు.

“ఈ విషయం మీలో ఎవరికైనా తెలుసా!” అని అడిగాడు.

“మీరు చెప్పే దాకా ఈ విషయం మాకెవరికీ తెలీదండీ” అని బృంద సభ్యులందరూ పెదవి విరిచారు.

“మీకే కాదు. చాలా మందికి తెలీదు” అని సదరు టిక్కెట్ కలెక్టర్ చెకింగ్ చెయ్యడానికి పక్క కంపార్ట్‌మెంట్‌లో కెళ్ళాడు సింహాద్రి ఎక్స్‌‌ప్రెస్‌లో.

Exit mobile version