సింహం చిట్టెలుక మధ్యలో నక్క

0
2

[dropcap]ఒ[/dropcap]క సింహానికి కథలు వినడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ తనకు ఆ రోజుకు కావలిసిన ఆహారవేట ముగించుకొని, తన నివాసానికి చుట్టుపక్కల ఉన్న జంతువులను పిలిచి, కథలు చెప్పమనేది. సింహం కుందేలు, సింహం చిట్టెలుక, సింహం జింకపిల్ల, తాబేలు కుందేలు, నక్క ద్రాక్షపండ్లు, కోతి మొసలి వంటి కథలను చక్కగా వినేది, సింహం మిత్ర బృందాలు కూడా సింహాన్ని మెప్పించడానికి, ఎక్కువగా సింహాల జాతి, స్నేహ గుణం గొప్పతనం, మంచితనం, వీరత్వం, త్యాగగుణం, అమాయకత్వం వంటి ఇతివృత్తాలు వుండే కథలనే ఎక్కువగా చెబుతుండేవి. అయితే సింహం తాను జీవితాంతం స్నేహం చెయ్యడానికి ఏదైనా జంతువును సూచించండి అని తోటి జంతువులను కోరింది. తనకు నిత్యం చేదోడు వాదోడుగా వుంటూ తాను తినగా మిగిలిన ఆహారాన్ని తినేసి ఏ కాయకష్టం లేకుండా సింహంతో కూర్చుంటూ కాలక్షేపం చేస్తుండే ఒక నక్కను ప్రత్యేకంగా కోరుతూ తనకు మంచి స్నేహితుడ్ని తెచ్చి పెట్టు అని అంది  టూకీగా… నేను ఉండగా మీకు మరో స్నేహితుడు ఎందుకని నక్క ప్రశ్నించగా… నువ్వు కేవలం నీ పొట్ట నింపుకోడానికే నా పంచన చేరావు, అవసరమైతే, అవకాశాలు కుదిరితే నువ్వు నన్ను చంపి తినేయడానికి కూడా వెనుకాడవు, నీ బుద్ది నాకు తెలుసు అయితే మీ పూర్వీకులు మా పూర్వీకులు వద్ద నమ్మిన బంటులు అనే విశ్వాసంతోనే నిన్ను చేరదీసాను. నిన్నునేను ప్రాణ స్నేహితుడుగా భావించడం లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది.

అప్పటినుండి నక్క సింహంపై అక్కసు పెట్టుకుంది. ఎలాగైనా సింహాన్ని హింసించాలి అని మనసులో అనుకుంది. చిట్టెలుకలు చిన్నవైనా తేడా వస్తే సింహాన్ని కొరికి హింసించగలవు అని మనసులో అనుకుంది.
ఒక రోజు ఆ నక్క సింహాన్ని అతిగా పొగుడుతూ… మీ జాతి స్నేహానికి పెద్దపీట వేస్తుంది. చిన్నా పెద్దా జంతువులు అన్న భేదాలూ జాతి భేదాలూ చూపకుండా అన్ని జంతువుల తోనూ స్నేహం చేస్తుంటుంది.
మృగరాజులుగా పేరు ప్రఖ్యాతులు వున్నా గర్వం లేకుండా చివరకు చిట్టెలుకతో కూడా స్నేహం చేశాయి గతంలో సింహాలు. అయితే చిట్టెలుకతో స్నేహం ఒక సింహానికే పనికివచ్చింది. వేటగాడి వలలో చిక్కుకున్న సింహాన్ని చిట్టెలుక దాని దంతాలుతో సింహం బంధించబడ్డ వలని పటాపట కొరికేసి సింహాన్ని విడిపించి, వేటగాడ్ని బురిడీ కొట్టించింది. అందుకే తమరు చిట్టెలుకతో స్నేహం చేస్తే మంచిది , మిగతా పెద్ద జంతువులతో స్నేహం చేస్తే మీకు ప్రాణహాని ఉండవచ్చు, జీవితాంతం అభద్రతా భావంతోనే తమరు బ్రతకాలి అని సూచన చేసింది.
సింహం చిట్టెలుక కథను చాలాసార్లు విన్న సింహం, నక్క మాటలను నమ్మింది. ఒక్క చిట్టెలుకే మా జాతిలోని ఒక సింహాన్ని సునాయాసంగా వేటగాడు వలనుండి కాపాడగలిగిందంటే నేను ఎక్కువ చిట్టెలుకలతో స్నేహం చేస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వెంటనే అడవిలో ఉన్న ఎలుకలనన్నింటినీ తన గుహలోకి ఆహ్వానించింది, చిట్టెలుకలు సింహం గూటికి చేరాయి. మృగరాజు మనకు ఇచ్చిన అరుదైన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి, సింహం మంచితనాన్ని చేతగానితనంగా భావించారాదు అని చిట్టెలుకలు కూడబలుకుకొని సింహం నివాసంలో అత్యంత క్రమశిక్షణతో వుంటూ సింహానికి కంటికి రెప్పలా కాపలా వుంటూ, సింహానికి ఆటపాటలతో కథలు కవితలతో మెప్పిస్తూ… సింహానికి నిజంగా మిత్రులయ్యాయి. సింహం మిగిల్చిన ఆహారాన్ని దాని అనుమతితోనే పంచుకొని తినేవి ఎలుకలు. తాను తినగా మిగిలిన ఆహారంలో నక్కే ఎక్కువగా తినేస్తూ… చిట్టెలుకలను బెదిరించి, దాబాయించి పబ్బం గడుపుకోవడం,కొన్ని చిట్టెలుకలను పోగేసుకొని సింహంపై చెడుగా చెప్పడం, వాటినుండి బూకరించుకొని ఆహారాన్ని కాజేయడం, ఎలుకలు చాలీ చాలని ఆహారంతోనే సర్దుకుపోవడం గమనించిన సింహం ఒకరోజు నక్కను పిలిచి,ఓ నా అనుచరుడా ఇకపై నీ తోడు నాకు అవసరం లేదు, నువ్వు అడవిలోకి పోయి స్వేచ్ఛగా బ్రతుకు అని హుకుం జారీచేసింది. సింహం ఒకసారి నిర్ణయం తీసుకుంటే అందులో మార్పు ఉండదు అని గ్రహించిన నక్క మారు మాటాడకుండా అక్కడ నుండి కదిలి ఆడివిలోకి వెళ్లిపోయింది, సింహంతో తన స్నేహంలో నిజాయితీ లేకపోవడమే ఈ నా దుస్థితికి కారణం అనుకుని మథన పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here