Site icon Sanchika

సిరి ముచ్చట్లు-11

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో పదకొండవ ముచ్చట. [/box]

[dropcap]ఒ[/dropcap]కసారి అమ్మా, నానమ్మలతో కలిసి గుడిలో హరికథ వినడానికెళ్ళింది సిరి.

హరిదాసు మధ్యమధ్యలో పిట్టకథలు చెప్పుతూ శ్రోతలను నవ్విస్తూ, రంజింప చేస్తున్నాడు.

“మాటలు తూటాల కన్నా ప్రమాదకరమైనవి. మూడంగుళాల నాలుక ఆరడుగుల మనిషినైనా చీల్చేయగలదు. తనువుకు తగిలే గాయాలు కొన్నాళ్ళకు మానిపోతాయి. కానీ మాటల ఈటెలతో కలిగిన గాయాలను మనసెన్నటికీ మరిచిపోదు. ఇంద్రియ నిగ్రహాల్లో నోటిని అంటే నాలుకను అదుపులో పెట్టు కోవడము చాలా ప్రధానమైంది. మృదువుగా, మంచిగా మాట్లాడడము వల్ల ఎంతటి విరోధులైనా దగ్గరవుతారు. అలాగ ఎప్పటికీ మాట్లాడగలగడం అభ్యాసంతో వచ్చే కళ. మంచిగా మాట్లాడితే సరే. లేదంటే అసలు మాట్లాడకుండా వుండడం చాలా మంచిది. వాచాలతను తగ్గించుకోవడము వల్ల అబద్ధాలడవలసిన అవసరం కూడా రాదు. అందుకని వారానికొకరోజు మౌనవ్రతం పాటించడం అన్ని విధాలా మంచిది” అని చెప్పాడాయన.

‘మనసుకు ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్యానికీ మేలు, దైవధ్యానము చేయగలిగితే మరీ మంచిది’ అని ఆయన చెప్పిన మాటలు సిరికి బాగా నచ్చాయి. అంతే… తాను ప్రతీ ఆదివారం మౌనవ్రతం పాటిస్తున్నట్లుగా ఇంట్లో డిక్లేర్ చేసింది.

“చాల్లే చాదస్తం. నాలాంటి వాళ్ళు చేయాలలాంటివి. చిన్న పిల్లవు, నీకెందుకమ్మా, ఇలాంటి పిచ్చి ఆలోచనవచ్చింది?” నవ్వుతూ కొట్టి పడేసింది నానమ్మ.

“అవునమ్మా రోజంతా మౌనంగా వుండాలంటే మాటలు కాదు. అది నీ వల్ల కాదులే” అన్నది అమ్మ.

“అదేమీ లేదమ్మా సండే మాకు బడి వుండదు. ఇంట్లోనే వుంటాను కాబట్టి, మీరంతా హెల్ప్ చేస్తే నేను మౌనవ్రతం చేయగలను. ప్లీజ్, కోఆపరేట్‌ విత్‌ మీ” అని అన్నది సిరి.

అన్నయ్యలిద్దరూ నవ్వారు, తాతయ్య కూడా నవ్వుతూ “ఎప్పుడూ గలగలా మాట్లాడే నువ్వు రోజంతా మౌనంగా వుండగలవా?” అన్నాడు. నాన్న కూడా సాభిప్రాయంగా చూసాడు.

“ప్రయత్నిస్తాను తాతయ్యా” అన్నది సిరి.

“పోనీలెండి సరదా పడుతున్నది కదా! చూద్దాం” అన్నాడు నాన్న.

ఆవేళ నుండీ ప్రతీ ఆదివారం మౌనవ్రతం మొదలు పెట్టింది సిరి. నానమ్మతో పాటుగా ఉదయం దేవుడి పూజకు కూర్చుని, ఎవ్వరితో మాట్లాడకుండా తన పనులు తాను చేసుకొంటున్నది. అత్యవసరమైతే పలకపైన చాక్‌పీస్‌తో వ్రాసి చూపించేది. అన్నయ్యలు మాత్రం సిరి నెలాగైనా మాట్లాడించాలని చాలా ప్రయత్నించే వారు. ముఖ్యంగా రాజుకు చాలా పట్టుదలగా వుండేది. ప్రక్క నుండే ఇరుగు పొరుగు పిల్లలను ప్రోత్సహించి ‘అక్కా నాకీ పద్యం చెప్పవా?’ అనో ‘అక్కా ఈ వర్డ్‌కి మీనింగేంటి’ అనో అడిగించేవారు. సిరి ఒకటి రెండుసార్లు గబుక్కున మాట్లాడుబోయి, మళ్ళీ గుర్తు వచ్చి ఆ పిల్లల ప్రశ్నలకు జవాబులు పలకపైనే వ్రాసిచ్చేది. లేదా ‘రేపు చెప్తాను’ అని వ్రాసేది. రాజుకు తన ఓటమిని అంగీకరించ బుద్ధి కాలేదు. ఓ వారం ఆలోచించి ఒక చిలిపి ప్లాన్ సిద్ధం చేసుకొన్నాడు.

ఇప్పటిలాగ సెల్‌ఫోన్ లేవప్పుడు. కనీసం ల్యాండ్‌ఫోన్‌లు కూడా చాలా అరుదుగా వుండేవి. విరజ వాళ్ళ నాన్న పెద్ద డాక్టర్. వాళ్ళింట్లో ల్యాండ్‌ఫోనుంది. సిరి వాళ్ళింటి కెదురుగా లైవ్‌స్టాక్ ఆఫీసని ఒకటి వెటర్నరీకి సంబంధించినది వుండేది. ఆ ఆఫీసర్ కుటుంబముతో అక్కడే వుండేవాడు. ఆయన పిల్లలతో సిరికి స్నేహము కుదిరింది. అందరూ చిన్న పిల్లలే. ‘అక్కా అక్కా’ అంటూ సిరి వెంట తిరిగే వాళ్ళు ఆ పిల్లలు. ఒకసారి ఆఫీసర్ భార్యతో ‘ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళింట్లో కూడా ఫోన్ వుంది, ఈ నెంబర్ తనకివ్వానా? ఎప్పుడన్నా అవసరమైతే తను మాట్లాడ్తుంది’ అని అడిగింది. దాని కావిడ ఒప్పుకొంది. అలాగ విరజకు ఆ ల్యాండ్ లైన్ నెంబర్ సిరి ఇచ్చింది. ఎప్పుడన్నా విరజ సిరికి ఆ నెంబర్‌కి కాల్ చేసేది, ఆఫీస్ ప్యూన్‌గానీ, ఆఫీసర్ పిల్లలు గానీ వచ్చి సిరిని పిలిచేవాళ్ళు, అప్పుడు సిరి వెళ్ళి మాట్లాడేది.

సిరి మౌనవ్రతం ఆరంభించిన నాలుగు వారాల తర్వాత ఒక ఆదివారం నాడు ఎదురింటి పాప వచ్చి “అక్కా నీకు ఫోన్ వచ్చింది” అని చెప్పింది. సిరి తను మౌనవ్రతంలో వున్న సంగతి మరిచిపోయింది. గబగబా పరిగెత్తి రిసీవర్ చేతిలోకి తీసుకొని ‘హలో విరజా’ అన్నది. అవతల నుండి రాజు పకపకా నవ్వి ‘హలో చెల్లీ, నీ మౌనవ్రతమేమైంది?’ అన్నాడు. అది వినగానే సిరి కోపంగా ‘నువ్వా’ అంటూ ఫోన్ టక్కున పెట్టేసింది. ఇంటికి వచ్చాక కూడా ఆమె కోపం తగ్గలేదు. ఏడుపు కూడా వచ్చింది. రూపాయి ఖర్చుపెట్టి మరీ ఫోన్ చేసి చెల్లికి వ్రత భంగం చేసినందుకు రాజును అందరూ మందలించారు. అయినా ‘హలో విరజా’ అని చెల్లిని అనుకరిస్తూ వెక్కిరించడం మానలేదు రాజు.

వీలైనంత తక్కువ మాట్లాడితే చాలనీ, అందుకే దేవుడు నోరు ఒక్కటే యిచ్చాడనీ ఇబ్బంది పడుతూ మౌనవ్రతం పాటించనవసరం లేదనీ అమ్మ, నాన్నలు నచ్చచెప్పడంతో సిరి అప్పటి నుండి మౌనవ్రతం మానేసింది. రాజు చేసిన అల్లరి పని తలచుకొని ఇప్పటికీ నవ్వుకుంటుంది సిరి.

Exit mobile version