సిరి ముచ్చట్లు-12

0
2

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో పన్నెండవ ముచ్చట. [/box]

[dropcap]సి[/dropcap]రికీ, అన్నయ్యలకు కూడా పాటలంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో రేడియో లేదు.

“నెలకో సినిమా చూస్తున్నాం గదా? ఇంటికి పేపర్ వస్తుంది. ఇంక రేడియో కొని పిల్లల చదువులకు ఆటంకం ఎందుకు కలిగించాలి?” అనుకున్న నాన్న రేడియో కొనలేదు.

ఇంటికి దగ్గిరలోనే సిటీ లైబ్రరీ వుంది. అందులో నాన్నకు మెంబర్‌షిప్ కూడా వుంది కావలసిన మంచి – మంచి పుస్తకాలు ఇంటికే తెచ్చుకొని పెద్ద వాళ్ళంతా చదువుకొంటారు. వాళ్ళ కాలక్షేపానికేమీ కొదవలేదు. ఎటొచ్చీ పిల్లలకే ఇబ్బంది. ఎంతసేపలా ఆ స్కూలు, ఆటలు, నెలకో సినిమా, అప్పుడప్పుడు చందమామో, బాలమిత్రో చదవే అవకాశం. ఇవి తప్ప వాళ్ళకి వేరే కాలక్షేపం లేదు.

చిన్నప్పుడు ప్రక్కింటిలో వాళ్ల రేడియోలో బాలానందం కార్యక్రమం చూసి (విన్న) సిరికి ఆ మనుషులు రేడియోలో వున్నారేమోననే అనుమానం కలిగింది. భోషాణమంత వున్న ఆ రేడియో చుట్టూ తిరిగి చూసింది. ఎవ్వరూ కనబడకుండానే మాటలెలా వినిపిస్తున్నాయో అర్థం కాలేదు సిరికి. ధ్వని తరంగాల గురించి ఇంట్లో నాన్న, బళ్ళో సైన్స్ టీచర్  చెప్పాక గానీ రేడియో పని తీరు అర్థం కాలేదామెకు. తరచుగా ఎదురింట్లోకెళ్ళి వాళ్ళ రేడియోలో నుండి వచ్చే పాటలు విని సంతోషించేవారు అల్ప సంతోషులైన సిరీ, అన్నయ్యలూను.

ఒకసారెందుకో ఎదురింటి పిల్లలతో అన్నయ్యలకు ఏదో గొడవైంది. దాంతో ఆ పిల్లలు సిరీ, రాజూ, రాములు వస్తారని తలుపులు మూసుకొని మరీ రేడియో పాటలు వినసాగారు. బయట నిలబడే చిత్రరంజని, పాటలు విన్నారు సిరీ, అన్నయ్యలు. సిరికి చాలా ఇష్టమైన భాగ్యరేఖ చిత్రంలోని “నీవుండేదా కొండపై” అనే పాట వస్తోంది అప్పుడు. సరిగ్గా అప్పడే ఆ పిల్లలు వాళ్ళు పాటలు వింటున్నారని తలుపు సందులో నుండి చూసి రేడియోను టక్కున ఆఫ్ చేసారు. సిరికి చాలా బాధ కలిగింది. ఏడుపు కూడా వచ్చింది. అన్నయ్యల నిద్దరినీ చెరో చేయిపట్టి లాక్కుని ఇంట్లోకి వచ్చేసింది.

“నాన్నా! మీరు రేడియో కొంటారా లేదా?” అని సీరియస్‌గా నాన్నను అడిగింది.

“ఉన్నటుండి ఏమైందే?” అడిగింది అమ్మ.

“మనింట్లో కూడా రేడియో వుంటే వాళ్ళింటికీ వీళ్ళింటికీ వెళ్ళాల్సిన అవసరం వుండదు గదా? పెద్ద గొప్ప, వాళ్ళకే రేడియో వుందని బడాయి చూపిస్తున్నారు. మేం పాటలు వింటున్నామని తెలిసి రేడియో కట్టేసారు” ఏడుపూ, కోపం, రోషం ధ్వనించాయి సిరి గొంతులో.

“అవును నాన్నా, బళ్ళో ఆటలప్పుడు ఏదో చిన్న గొడవైందని వాళ్ళు తలుపులు పెట్టుకున్నారు. పోనీలెమ్మని బయటే నిలబడి వింటుంటే కావాలనే రేడియో ఆఫ్ చేసారు. మనకి కూడా ఒక రేడియో వుండే ఇలా జరగదు గదా” అన్నాడు రాజు.

టీనేజి దాటబోతున్న కొడుకు మాటలు విని నాన్న ఆలోచనలో పడ్డాడు.

“నిజమేరా బాబూ? ఒక రేడియో కొనేయరాదూ? ” అని నానమ్మ కూడా అన్నది.

“మీరు రేడియో కొనే దాకా నేను అన్నం తినను అంతే” అన్నది సిరి.

“అమ్మమ్మ, అంత పని చేయకు తల్లీ. రేపే నేనూ, మీ అమ్మ వెళ్ళి రేడియో కొంటాంలే” అని మాటిచ్చాడు నాన్న. అన్నట్లే మరునాడే పెద్ద ఫిలిప్స్ రేడియో తెచ్చారు. పిల్లల ఆనందానికి అంతులేదిక. ఇంట్లో వున్నంత సేపూ హిందీ, తెలుగు పాటలే పాటలు. అదీ పెద్ద సౌండ్‌తో. సైనికుల కోసం వినిపించే బినాకా గీత్‌మాలా  అయిపోయి జనగణ ఆలపించే వరకూ పాటలు వినేది సిరి. హరికథా కార్యక్రమాలు నాన్నమ్మకూ, వార్త విశేషాలు తాతయ్యకూ, వనితా కార్యక్రమాలు అమ్మకూ నచ్చడంతో రేడియో ఆ ఇంట్లో ఒక పెద్ద ఆకర్షణయి పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here