[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో పదమూడవ ముచ్చట. [/box]
[dropcap]సి[/dropcap]రి నాల్గవ తరగతిలో జరిగిన విషయమిది.
ఆ రోజు బడిలో క్లాస్ టీచర్ “రేపు అందరూ 4 అణాలు (చారానా) తీసుకొని రండి. సినిమాకి తీసుకొని వెళ్తాము” అని ప్రకటించింది.
సంతోషంగా ఇంటికి వచ్చిన సిరి అమ్మ, నాన్నలకు విషయం చెప్పింది.
‘అన్నయ్యలు మొన్న వాళ్ళ బడి నుండి వెళ్ళి చూసిన సినిమానే,’ ‘కాబూలీ వాలా’ అట, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినదట. రాజన్నయ్య చాలా బాగుందని చెప్పాడు. నేనూ వెళ్తాను. నాకు చారానా యిస్తారుగా?’ అని అడిగింది.
‘అలాగేలే’ అన్నాడు నాన్న.
మర్నాడుదయమే బడికి ఉత్సాహంగా బయల్దేరింది సిరి.
అమ్మ పెట్టిన టిఫిన్ తినకుండానే, ‘ఆకలేయడం లేదుమ్మా’ అని సినిమా కెళ్ళాలన్న ఉబలాటంతో నాన్న యిచ్చిన 5 అణాలు తీసుకొని పరిగెత్తింది సిరి. బాక్స్‌లో అన్నం పెట్టి ‘సిరికిచ్చేసి, మీ బడి కెళ్ళండి’ అని అమ్మ రాజూ, రామూలకు చెప్పింది.
అసలైతే రోజూ ఇల్లు దగ్గిరే కాబట్టి మధ్యాహ్నం లంచ్‌కి యింటికే వస్తుంది సిరి. కానీ ఆ రోజు ‘మేము సినిమా కెళ్తున్నాం కదా? మధ్యాహ్నం రానమ్మా’ అని చెప్పింది. అందుకే అమ్మ అన్నయ్యలతో సిరికి లంచ్ పంపించింది.
అయితే సినిమా ఉత్సాహం సిరిని నిలువనీయడంలేదు. ఇంట్లో వాళ్ళతో వెళ్ళడం వేరు. ఇప్పుడు ఫ్రెండ్సందరితో కలిసి వెళ్ళడం వేరు కదా! ఆ సంతోషంలో సిరి లంచ్ బాక్స్ తెరవను కూడా లేదు. ఉదయమూ తినకుండానే వచ్చినా సిరికి నిజంగానే ఆకలిలేయడం లేదు.
బడి నుండి నలుగురు టీచర్స్ రెండు కిలోమీటర్ల దూరం పిల్లలందరినీ నడిపించి కాబూలీవాలా సినిమాకు తీసుకొళ్ళారు. ఇంటర్వెల్‌లో సిరికి ఆకలిగా అనిపించి తన కిష్టమైన మిర్చిబజ్జీలు కొనుక్కుని తిన్నది. అణాకి 3 పెద్ద పెద్ద మిర్చీ బజ్జీలిచ్చాడు. సిరికి అవంటే చాలా యిష్టం. ప్రెండ్స్‌కి కూడా యివ్వకుండా తినేసింది.
కడుపు నిండా మంచి నీళ్ళు త్రాగి మిగిలిన సినిమానెంతో ఉత్సాహంగా చూసింది సిరి.
సినిమా ముగిసాక మళ్ళీ నడిచే తిరుగు ప్రయాణమయ్యారు.
వెళ్ళేప్పుడున్న ఉత్సాహం వచ్చేప్పుడు ఆ చిన్న పిల్లల్లో లేదు. ప్రాథమిక పాఠశాల విద్యార్థినులు వాళ్ళు. టీచర్లు పెద్దవాళ్ళు గాబట్టి చకచకా నడిచారు. ఈసురోమంటూ బడికి చేరుకొన్నారు పిల్లలు. అక్కడి నుండీ మళ్ళీ ఎవరిళ్ళకు వాళ్ళెళ్ళారు.
నీరసంగా వచ్చిన సిరిని చూసి కంగారుపడింది అమ్మ.
బాక్స్‌లో అన్నం అలాగే వుండడం చాసి ‘అన్నం తినలేదేం?’ అని అడిగింది అమ్మ.
‘అప్పుడు ఆకలేయలేదమ్మా’ చెప్పింది సిరి.
‘సరే సరేలే ముందు స్నానం చేసిరా. వేడిగా అన్నం తిందువుగాని’ అని అమ్మ చెప్పగానే బాత్‌రూమ్‌కెళ్ళింది సిరి.
‘తిండి మానేసి ఎప్పుడూ సినిమా ముఖమెరుగనట్టు, సినిమా చూడడమేంటో చోద్యం గాకపోతే’ అని మందలించింది.
అమ్మ పెట్టిన అన్నం గబగబా తినేసింది సిరి. నాన్న అప్పుడే వచ్చాడు. చేయి కడుక్కోవడాని కెళ్ళగానే సిరికి చాలా వికారం కలిగింది. గబగబా పెరట్లోకి పరిగెత్తింది. భళ్ళున వాంతి చేసుకొంది సిరి.
అందరూ కంగారుపడి, సిరి దగ్గిరికి పరిగెత్తుకొని వచ్చారు. వాళ్ళందరి ప్రేమాభిమానాలకు కళ్ళనీళ్ళు తిరిగాయి సిరికి.
కానీ వాంతయ్యాక ఎంతో రిలీఫ్‌గా అనిపించింది.
‘ఏం సినిమానో, ఏం పాడో. తిండి తిప్పలు లేకుండా వెధవ సినిమా కని వెళ్ళింది. పగలు కూడా ఏం తినలేదు’ విసుక్కొంది నాన్నమ్మ.
‘ఏం తిన్నావమ్మా’ అడిగాడు నాన్న.
‘మిర్చిబజ్జీలు తిన్నాను నాన్నా’ బుద్ధిగా నిజం చెప్పింది సిరి.
‘ఏమీ తినకుండా ఆ నూనె పదార్ధాలు తినేసరికి కడుపులో తిప్పుతుందలాగే’ అంది నాన్నమ్మ.
‘గడ్డి తినలేకపోయావా’ తెచ్చిపెట్టుకొన్న కోపంతో అన్నాడు నాన్న.
అది గమనించిన సిరి పక్కున నవ్వేసింది. సిరి నవ్వు చూసి నాన్న కూడా నవ్వాడు.
సిరి హూషారుగా వుండడం చూసి అందరూ కూడా నవ్వారు.