సిరి ముచ్చట్లు-14

0
2

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో పద్నాలుగవ ముచ్చట. [/box]

సిరి అంతకు ముందు ముఖానికి పౌడర్ కూడా సరిగా వేసుకొనేది కాదు. చూస్తూండగానే చిన్నారి సిరి అందాల సిరి చందనయింది. పరువాల సోయగాలు నిండిన యువతిగా మారింది చందన.

సిరి తన అందాలకు మరింత మెరుగులు దిద్దుకోవాలని గంటల కొద్దీ అద్దము ఎదుట నిలబడం, ముంగుర్లు చెదరకుండా తల దువ్వుకోవడం, పలుచని చున్నీలు ధరించడం, తరచూ పరధ్యానంగా వుండడం గమనించింది నానమ్మ.

ఆ వేళ తీరిగ్గా కూర్చుని అద్దంలో తనను తానే చూసుకొంటున్నది సిరి.

నానమ్మ దగ్గిరగా  వచ్చి “సిరీ, నా చేతిలో ఏముందో చెప్పుకో చూద్దాం” అంటూ కుడిచేతి పిడికిలిని చూపింది.

సిరి ఆసక్తిగా చూస్తూ ‘ఏముంది నానమ్మ?’ అని అడిగింది.

‘నువ్వే చెప్పాలి’ ఊరిస్తూన్నట్లుగా అన్నది నానమ్మ.

‘అదేమన్నా తినే వస్తువా?’ అని అడిగింది సిరి.

“అదీ నీవే చెప్పాలి” అన్నది నానమ్మ.

సిరి రకరకాల తినుండారాలు, వస్తువుల విలువైన వస్తువుల పేర్లు చెప్పింది. అన్నింటికీ నానమ్మ ‘కాదు-కాదు’  అనే జవాబిచ్చింది.

విసిగిపోయన సిరి ‘ఇంక నేనేం చెప్పలేను. నాకేమీ తెలియదు గాని అదేంటో నువ్వే చూపించు నానమ్మ’ అని బ్రతిమాలింది.

‘చూడాలని వుందా?’ అడిగింది నానమ్మ.

‘అవును నానమ్మ. చాలా ఎగ్జైటింగ్‌గా వుంది. ప్లీజ్ నానమ్మా అదేంటో చూపించవూ?’ అన్నది సిరి.

‘అయితే చూడు’ అని గుప్పెట తెరిచింది నానమ్మ. అందులో ఏమీ లేదు. ఖాళీ చెయ్యి.

కోపం ముంచుకు వచ్చింది సిరికి. ‘ఇంతసేపూ వుత్త చేతినే మూసివుంచి నన్నూరించావా? ఇంక నీతో మాట్లాడను ఫో నానమ్మ’ అన్నది కోపంగానే.

‘కోపం తెచ్చుకోకుండా నిదానంగా నేను చెప్పేది విను తల్లీ. అలా కూర్చో ముందు’ అని  తన ప్రక్కన  కూర్చోబెట్టుకొంది సిరిని నానమ్మ.

చిరాకును అణచి పెట్టుకొంటూ కూర్చున్నది సిరి.

“నేను గుప్పిట మూసి వుంచితే అందులో పోముందో తెలుసుకోవాలనీ, అదేంటో కళ్ళారా చూడాలనీ నీ మనసు తహతహలాడింది. అవునా? అలాగే గుప్పిట తెరిచి చూపితే ‘ఓస్ యింతేనా?’ అనిపించింది కదా?” అన్నది నానమ్మ.

‘అవును’ అన్నట్లుగా తలాడించింది సిరి.

“మన… అంటే ఆడవాళ్ళ అందాలు కూడా అలాంటివే తల్లీ. గుప్పిట మూసి వుంచినట్లుగా మన అందన్ని కూడా దాచి వుంచితేనే ఆకర్షణీయంగా, భద్రంగా వుటుంది. అందిరికీ గౌరవం కలుగుతుంది. అలా గాకుండా అందరూ చూసేట్లుగా, ప్రదర్శిస్తున్నట్లు మన శరీరాలంకరణ వుంటే, ఒక్కసారి ఆబగా చూస్తారేమో! అంతే ఆ తర్వాత ఎవ్వరికీ ఏ ఆసక్తి వుండదు, సరికదా, చులకన భావం ఏర్పడుతుంది. మన పట్ల గౌరవం అసలే వుండదు. నీ అందాలన్నీ ఎప్పుడో ఒక్కప్పుడు నిన్ను కట్టుకోబోయే వాడి కోసం దాచి వుంచాలమ్మా” అనునయంగా చెప్పింది నానమ్మ.

సిరి అప్రయత్నంగానే కంగారుగా “నానమ్మా” అన్నది.

“అవును తల్లీ. నువ్విప్పుడు ఇంటర్‌లో‌కి వచ్చావు. ఇంటర్ స్టేజ్ ఈజ్ లైప్ ఎంటరింగ్ స్టేజ్ అని నా చిన్నప్పుడెప్పుడో విన్న జ్ఞాపకం. ఈ వయసులో ప్రపంచమంతా రంగులమయంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా కనబడడం సహజం. కాని అవన్నీ నిజం కాదమ్మా. నా పెళ్ళిప్పటి ఫోటోలో నేనెలా వున్నాను? ఇప్పుడెలా వున్నాను?”  అడిగింది నానమ్మ.

బదులేమీ ఇవ్వకుండా మౌనంగా చూసింది సిరి.

“ఏ హీరోయిన్ కూడా నీ అంత అందంగా లేదు నానమ్మా అనే దానివి గాదా? మరిప్పుడు?  నా ముఖం పైనా, శరీరం పైనా ముడుతలు, తెల్లగా మారిన జుట్టూ, ఆ నేనే గదా?  మరి నా అందమంతా ఏమైంది? శరీర సౌందర్యం శాశ్వతంగా వుండేది కాదురా. మానసిక సౌందర్యమే గొప్పది. నిత్యమై నిలిచేది. మనసులో ఏ వికారాలకూ లోనుగాకుండా సాంప్రదాయాలను గౌరవిస్తూ, సంస్కారయుతంగా వుంటే అంతకు మించిన అందము వేరేదీ వుండదు. నువ్వీంకా చిన్న దానివేమీ కాదు. అర్థం చేసుకోగల తెలివి తేటలు నీకున్నాయని అనుకొంటున్నాను” అన్నది నానమ్మ.

సిరి తప్పు చేసినదానిలాగ, తలదించుకొని కూర్చున్నది.

అప్పటి వరకూ ఆ ప్రక్కనే కూర్చుని అత్తగారి మాటలన్నీ వింటున్న అమ్మ కూడా సాభిప్రాయంగా సిరి వైపు చూసింది. “బాగా చెప్పారత్తయ్యా” అని నానమ్మతో అన్నది.

తలెత్తి అమ్మ వైపు చూసింది సిరి.

నానమ్మ చెప్పినవన్నీ అక్షరాలా నిజం అన్నట్లుగా చూసింది అమ్మ.

“అమ్మ నానమ్మ నేను ఏం తప్పుచేసానో నాకు అర్థమైంది. ఇంత మంచి నానమ్మనూ, అమ్మనూ కలిగివుండి కూడా నేనేదో భ్రమలకు లోనుకాబోయాను. నన్ను క్షమించండి. ఇంక నుండీ నా వల్ల మీకెవరికీ ఏ రకమైన మనస్తాపమూ కలుగదు. నన్ను నమ్మండి. ప్లీజ్” అన్నది సిరి.

“మాకు తెలుసమ్మా. నవ్వు ఏ తప్పూ చేయవని. కాని ఆకర్షణలు బలంగా వుంటాయి. మనస్సును నీ ఆధీనం నుండి ప్రక్కకు జరుగనీయరాదు. అందుకు చాలా నిగ్రహం కావాలి. అది నీలో పెరగాలి. అందుకే ఇంత సేపు చెప్పాల్సి వచ్చింది” అన్నది నానమ్మ.

“మీ నమ్మకాన్ని వమ్ము చేయను నానమ్మా” అన్నది సిరి.

అన్నట్లుగానే అనూహ్యంగా మారి, చదువుల తల్లికి ముద్దు తనయగా ఎదిగింది సిరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here