సిరి ముచ్చట్లు-16

0
4

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని; యవ్వనప్రాయంలోని జ్ఞాపకాలను గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో పదహారవ ముచ్చట. [/box]

[dropcap]‘సి[/dropcap]రీ! నీ రిజల్ట్ వచ్చింది. కానీ పేపర్‌లో నీ నెంబర్ కనిపించలేదు’ అని ప్రక్కింటి ఆంటీ వాళ్ళ తమ్ముడు ‘రఘు అన్న’ చెప్పాడు.

‘నిజంగానా?’ చేతిలో వున్న పని వదిలేసి, దాదాపుగా ఏడుస్తున్నట్లుగానే కీచుగా అరిచింది సిరి.

‘అవును ఒట్టు’ నమ్మకంగా చెప్పాడు రఘు.

3, 4 రోజుల క్రితమే +2 రిజల్ట్స్ రాబోతున్నాయని తెలిసి సిరి చాలా ఆశగా, ఆతృతగా ఎదురుచూస్తూన్నది. ఒక్క ఫిజిక్స్ తప్ప అన్నీ చాలా బాగా వ్రాసింది. ఫిజిక్స్‌లో మార్కులు తగ్గుతాయేమో! అని అనుకుందే, గాని ఫెయిలవుతానని ఏ మాత్రం అనుకోలేదు సిరి. తను తప్పకుండా పాసవుతాననే నమ్మకంతో తన నెంబర్‌ను అందరికీ ధైర్యంగా చెప్పేసింది.

ఇప్పుడు తను ఫెయిలైందనే విషయం ఆమెకు పిడుగుపాటులాగే తోచింది. ఆమె ఏడుపు విని ఇంట్లో లోపలెక్కడో పని చేసుకొంటున్న నానమ్మ అమ్మ పరిగెత్తుకొచ్చారు.

‘ఎమైందమ్మా?’ అని గాభరాగా అడిగారు.

‘అమ్మా! నా నెంబర్ పేపర్‌లో లేదట. రఘు అన్నయ్య చెప్పాడు’ అని బావురుమన్నది సిరి.

‘ఈ వేళ మీ రిజల్ట్ వచ్చిందా?’ కంగారుగా అడిగింది అమ్మ.

‘అవునంట ఆంటీ’ అన్నాడు రఘు.

‘అట ఏంటీ? నా నెంబర్ కనబడలేదన్నావుగా? ఏడుపు ఆపి లా పాయింట్ లాగింది సిరి.

‘అదీ, ఇందాక మా ఫ్రెండ్ చెప్పాడు’ తడబడ్డాడు రఘు.

ఈ లోగా ఆమూలాగ్రం పేపర్ తిరగేసే తాతయ్య రంగప్రవేశం చేశాడు.

‘ఏంటమ్మా గొడవ?’ అని అడిగాడు తాతయ్య. ఆయనను చూడగానే రఘు మెల్లగా జారుకొన్నాడు.

‘మా రిజల్ట్ వచ్చిందా తాతయ్యా?’ అడిగింది సిరి.

‘లేదే రేపు వస్తుందిట’ అన్నాడు తాతయ్య. రఘు పైన పట్టరాని కోపం వచ్చింది సిరికి.

‘రఘు అన్నా’ అని గట్టిగా అరుస్తూ రఘును వెంబడించింది సిరి.

రఘు నవ్వుతూ ‘నువ్వెలా ఫీలవుతావో చూద్దామని చిన్న ప్రాక్టికల్ జోక్ ప్లే చేసాను సిరీ’ అన్నాడు.

‘ఇదా ప్రాక్టికల్ జోక్, నిన్నూ’ అంటూ రఘును కొట్టడానికన్నట్లు చెయ్య ఎత్తింది సిరి.

‘సారీ.. వెరీ.. వెరీ సారీ… నన్నొదిలేయి’ అని తప్పించుకొని బయటపకి పరిగెత్తాడు రఘు.

మొదట రఘు చేసిన అల్లరి పనికి అందరికీ కోపం వచ్చినా, సిరి నవ్వేసరికి వాళ్ళకీ నవ్వు వచ్చింది.

‘ఇదేం జోక్ రఘూ?’ అని సున్నితంగానే మందలించింది అమ్మ. అప్పుడే వచ్చిన అన్నయ్యలిద్దరూ విషయం విని రఘుతో ‘ఏరా ఎలా వుంది ఒళ్ళు? నీ మాట నమ్మి సిరి ఎంత భయపడిందో చూసావా? తనేమన్నా చేసుకుంటే ఏమయ్యేది?’ అన్నారు.

‘సారీ రా. నేనంత దూరం ఆలోచించ లేదు. అయినా సిరి పరీక్ష తప్పడం ఎప్పడైనా వుందా? తన మీద తనకు నమ్మకం వుండొద్దా? సిరి అనాలోచితంగా ఏ పనీ చెయ్యదులేరా’ అన్నాడు రఘు.

‘ఆ మాట నిజమేలే’ అని అన్నయ్యలూ ఒప్పుకొన్నారు. అందరినీ కంగారు పెట్టినా అదొక తీపి గుర్తుగా సిరి జీవితంలో మిగిలిందా సంఘటన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here