[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని; యవ్వనప్రాయంలోని జ్ఞాపకాలను గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో పదిహేడవ ముచ్చట. [/box]
[dropcap]ఆ[/dropcap]శించిన సిరి రిజల్ట్ రానే వచ్చింది. ఆవేళ పండుగ. వాకిట్లో రంగవల్లలు దిద్దుతున్నది సిరి. రోజూ ప్రొద్దున్నే వచ్చే న్యూస్ పేపర్ ఉదయం 8 గావస్తున్నా ఇంకా రాలేదు. పేపర్ తెచ్చే అబ్బాయి కోసం సిరితో పాటు ఇంటిల్లిపాదీ ఎదురు చూస్తున్నారు. నాన్న అప్పటికే బయటకెళ్ళాడు. సిరి ముగ్గు వేస్తూనే పేపర్ కోసం ఆతృతగా చూస్తూనే వుంది. చూడగా – చూడగా ఎట్టకేలకు పేపర్ వచ్చింది.
తాతయ్య చేతికివ్వకుండా ఆ పేపర్‌ను సిరి తీసుకోబోయింది. అంతకన్నాముందే రాజు లాక్కున్నాడు పేపర్‌ను. సిరీ, రామూ కూడా రాజుతో పాటు పేపర్‌లోకి తొంగి చూడసాగారు. అమ్మా, నానమ్మ, తాతయ్యా ఆత్రంగా చూస్తూ నిలబడ్డారు.
వ్రేలితో నంబర్లను చూస్తూ, ఒక చోట ఆగిపోయి ‘హుర్రే’ అని అరిచాడు రాజు.
సిరి గుండె చప్పుడు వేగం పెరిగింది.
‘ఏమైంది?’ అని అందరూ ఒకేసారి అడిగారు.
‘ఏమవుతుంది? నా చెల్లి, బంగారు తల్లి ఫస్ట్ క్లాసులో పాసైంది’ అని సంతోషంగా అంటూ సిరిని దగ్గరికి తీసుకొన్నాడు రాజు.
‘అవునా?’ అని అమ్మ నాన్నమ్మ సంతోషంగా అడిగారు.
‘ఏదీ నన్ను చూడనీ అన్నయ్యా’ అంటూ రాము పేపర్‌ను అందుకొన్నాడు. తర్వాత సిరి కూడా చూసింది. “శుభం. ఈ పండగ వేళ మన సిరమ్మ తన సంవత్సర కష్టానికి తగిన చక్కని ఫలితాన్ని అందుకొన్నది. ఈ ఆనందాన్ని మన వీధి వారందరితో పంచుకోవాలి. పిండివంటలు మరిన్ని చేయాలి. అందరికీ మిఠాయిలు పంచాలి” తాతయ్య తొణికసలాడే సంతోషంతో చిన్న పిల్లాడిలా సంబరపడుతూ చెప్పాడు.
‘ఆ వంకతో తమరు డబుల్ లాగించాలనా?’ హాస్యమాడింది నానమ్మ.
“అదేం కాదులే. నీకే స్వీట్లంటే ఇష్టం కదా? నీవే డబల్ త్రిబుల్ లాగించేయి” ఎదురు దాడి చేసాడు తాతయ్య. “అది సరే గానీ, వాడు పేపర్ చూసాడో లేదో?” అని సిరి నాన్న గురించి అన్నది నానమ్మ.
“ఒక్క పేపర్‌లో కాదు నానమ్మా, నాన్న అన్ని పేపర్స్‌లోనూ చూసి వుంటాడు. షాప్‌కు అన్ని పేపర్స్ వస్తాయిగా?” అన్నాడు రాము.
“ఈయనగారూ వస్తే బాగుండేది గదా? పండగ వేళైనా పరిగెత్తుకొని వెళ్ళారు” నిష్ఠూరంగా అన్నది అమ్మ.
“ఓ గంటలోనే వస్తానన్నాడు గదమ్మా” సర్ది చెప్పింది నానమ్మ.
ఇరుగు-పొరుగు వాళ్లు కూడా వచ్చి సిరికి అభినందనలు తెలుపుతూ ఆనందం వెలిబుచ్చారు.
ఇంతలోనే సంతోషంతో వెలిగిపోతున్న ముఖంతో నాన్న వచ్చేసారు. “సిరీ, నా తల్లీ! నీ నెంబర్ ఫస్ట్ క్లాస్‌లో వచ్చిందమ్మా” అంటూ సిరిని దగ్గిరికి తీసుకొన్నాడు.
“ఇప్పుడే మేమూ చూసాంరా నీ గురించి అనుకొంటుండగానే నువ్వూ వచ్చేసావు” అన్నాడు తాతయ్య. “నాన్నా అసలు ఏమైందటే, సిరి ఫిజిక్స్ ఏమంత బాగా రాయలేదని చెప్పింది కదా అని నేను మొదట III క్లాస్‌లో తన నెంబర్ కోసం వెతికాను. కనబడలేదు. తర్వాత నేను II క్లాస్‌లో వెతుకుతుంటే నా ఫ్రెండ్ బాలాజీ లేడూ వాడు చూసి ‘ఏంటిరా నా కోడలి నెంబర్ అందులో ఎందుకుంటుంది I క్లాస్‌లో చూడు’ అన్నాడు. ‘అది కాదురా, తనొక సబ్జక్ట్ కొంచెంము సరిగా రాయలేదన్నది. అందుకే’ అని నేను అంటే ‘నీ ముఖంలే. ఏదో ఒకటి సరిగా రాయకపోతే మాత్రం మరీ III క్లాస్‌లో చూడాలా? ఎప్పుడూ సిరిదే I మార్కు రా. ముందు ఫస్ట్ క్లాస్‌లో చూడు’ అన్నాడు. నిజంగానే నా తల్లి నెంబర్ I క్లాస్‌లో వుంది. ఎంత సంతోషంగా వుందో, వాడికున్న నమ్మకం నాకు లేకపోయిందే! కొంచెం సిగ్గనిపించింది నాన్నా” అని ఆగకుండా తాతయ్యతో నాన్న చెప్పాడు. “సారీ రా బంగారు తల్లీ” అని సిరితోనూ అన్నాడు.
“అదేంటి నాన్నా మీరు సారీ చెప్పడమేంటి? పాసవుతాను గానీ 1st రాకపోవచ్చు అని నేనే అనుకొన్నాను కదా?” అన్నది సిరి.
“ముందుగా అందరం గుడికెళ్ళి వద్దాం. తర్వాత పసందైన విందు” అన్నది అమ్మ.
“అవునవును” అంటూ అందరూ తయారవడం మొదలు పెట్టారు.
తన విజయానికి అందరూ వ్యక్తపరుస్తున్న ఆనందానికీ, ఫస్ట్ క్లాస్‌లో తన నెంబర్ రావడం గొప్పగా భావిస్తున్నందుకు సంతోషంతో మురిసిపోయింది సిరి.
నిజంగానే అప్పటి విద్య ఎంతో కఠినంగానూ, విలువలతో కూడినదిగానూ వుండేది. 60% 70% మార్కులు రావడమే చాలా ఘనం ఆరోజుల్లో. మూల్యాంకనం కూడా చాలా నిశితంగా, నిష్పక్షపాతంగా వుండేది. లెక్కల్లో తప్ప ఎంత తెలివైన విద్యార్థికైనా 100 కు 100 మార్కులు వచ్చేవే కావు.
తన ఫ్రెండ్స్ విరజా, గిరిజల నెంబర్లు వెతికింది సిరి. ఇద్దరివీ II క్లాస్‌లోనే దొరికాయి. కొంచెము నిరాశ అనిపించినా ‘అందరం పాసయ్యాం’ అనుకొంటూ ఆ సర్వాంతర్యామికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొంది సిరి.