Site icon Sanchika

సిరిముచ్చట్లు-19

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని; యవ్వనప్రాయంలోని జ్ఞాపకాలను గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో 19వ ముచ్చట. [/box]

[dropcap]తా[/dropcap]ము దరఖాస్తులు యిచ్చిన 3 కాలేజీల్లోనూ లిస్ట్ పెట్టారనీ, అన్నింటోలోనూ సిరి పేరే ముందున్నదనీ చాలా సంతోషంగా చెప్పాడు చిన్నన్నయ్య.

“విమెన్స్ కాలేజీ అయితే మనకు దగ్గిర కూడా” అన్నాడు పెద్దన్నయ్య.

“కానీ అన్నయ్యకింకా జాబ్ ఆర్డర్స్ రాలేదు. 200/- వుంటే గానీ కాలేజీలో చేరడం కుదరదు. ఎలా?” కన్నీళ్ళతో అనుకొంది సిరి.

“నా గొలుసు తాకట్టు పెట్టకూడదూ? తర్వాత మెల్లగా విడిపించుకొందాము” అని అమ్మ నాన్నతో చెప్పడం విని మరింత బాధ పడింది.

“ఛ అసలు నేనెందుకు పుట్టానో?” అని తన పైన తనే విసుక్కుంది. పెరట్లో సన్నజాజి పందిరి క్రిందికెళ్ళి కూర్చుని తన చదువు గురించీ, ఇంట్లోని ఆర్థిక స్థితిగతుల గురించీ చాలా సేపు ఆలోచిస్తూ గడిపింది సిరి.

“చెల్లీ సిరీ! నువ్వు చదవాలనుకొంటే ప్రైవేటుగానైనా చదువుకోవచ్చమ్మా. మా ఫ్రెండ్ దగ్గిర బుక్సన్నీ వున్నాయిట. తెచ్చిస్తాను. అటెండెన్స్ ఫీజ్ కొంచెముంటుంది. ఎగ్జామ్ ఫీజ్ ఒక్కటీ అప్పుడు కడితే చాలు” నచ్చచెప్పుతున్నట్లుగా, తల నిమురుతూ చెప్పిన పెద్దన్నయ్య మాటలు విని నిర్ఘాంతపోయింది సిరి.

“సిరినెలాగైనా చదివించాలి” అని గట్టిగా వాదించిన అన్నయ్య అలాగనే సరికి ఏమనాలో అర్థంకాక బిత్తరపోయింది. అందరూ నిస్సహయలే.

“డబ్బు ఎంత పాపిష్టిదో? ఎంత వారినైనా మార్చి వేస్తుందిగా? ” అనుకొని నిట్టూర్చింది.

ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించారందరూ. ఆ విధంగా సిరి కాలేజీ చదువు గగన కుసుమంగా మారిపోయింది. పెద్దన్నయ్య తెచ్చిన బి.ఎ. పుస్తకాలను నిరాసక్తంగా తిరగేస్తూ, వీలైనంత వరకూ మౌనం పాటిస్తూ కాలం గడుపుతున్నదామె. ఇది అందరూ గమనించినా తేలుకుట్టిన దొంగల్లాగా ఎవరికి వాళ్ళు మౌనాన్నే ఆశ్రయించారు. అప్పుడుప్పుడూ నానమ్మ సిరిని ఏదో ఒక పనితోనో, మాటలతోనో తన వైపు త్రిప్పుకొనేది. రోజులిలాగే గడుస్తున్నాయి.

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రాజన్నయ్య జాబ్ ఆర్డర్స్ వచ్చాయి. 250 జీతం. సంవత్సరానికోసారి ఇంక్రిమెంట్ కూడా వుంటుంది. అది తెలిసి అందరూ హమ్మయ్య అనుకున్నారు. అనుకోకుండా చిన్నన్నయ్య రాముకు కూడా అంతే జీతంతో ఒక కార్పోరేషన్‌లో ఉద్యోగం వచ్చింది. ఇంటిల్లిపాదీ సంతోషంతో పొంగిపోయారు. అన్నాళ్ళుగా ఆ ఇంట్లో పేరుకుపోయిన స్తబ్ధత తొలిగింది. సిరి కళ్ళలో చెప్పలేని ఆనందం. తనను చదివిస్తారేమోననే ఆశ దీపమై ఆమె ముఖాన్ని వెలిగించింది. కానీ ఎవ్వరూ ఆ మాటే ఎత్త లేదు. నిరాశగా చిన్నబోయింది సిరి మనసు.

“ఇప్పుడేగా ఉద్యోగాలు వచ్చాయి? కొన్నాళ్ళయ్యాక సమయం చూసి నేనే అడుగుతాను” అని మనసులోనే నిర్ణయించుకొంది సిరి. అన్నయ్య లిద్దరూ చక్కగా తయారై అమ్మ పెట్టిచ్చిన లంచ్ బాక్స్‌లు తీసుకొని తమ తమ ఆఫీసులకి వెళ్తుంటే అమ్మ నాన్నా, నానమ్మ తాతయ్యా గర్వంతో పొంగిపోయారు. సిరికి తన మనసులోని మాట చెప్పే అవకాశం ఎప్పుడు వస్తుందా అన్న ఆతృత, ఆనందమూ కలుగుతున్నాయి.

ఈ లోగానే పిన్ని దగ్గిరి నుండి ఉత్తరం వచ్చింది. “అబ్బాయి తల్లీ, మెనత్తా వస్తున్నారని” అని అందులోని సారాంశం. ఆ ఫలానా రోజు ఎల్లండే అయింది.

ఎలాగూ సిరి ప్రైవేటుగానే చదువుతున్నది గదా అన్నీ బాగుండి కుదిరితే పెళ్ళిచేద్దాం అని పెద్దలంతా నిర్ణయించుకొని సిరికి చెప్పారు. వాళ్ళు తన అభిప్రాయం ఏమీ అడగడం లేదనీ, తమ నిర్ణయం చెప్పారనీ గ్రహించింది సిరి.

చిన్నప్పటిలాగా అల్లరి చేసి, పేచీ పెట్టి తన మాట నెగ్గించుకొనేందుకు ఆమె సంస్కారం ఒప్పుకోలేదు. ఎప్పటిలా మౌనంగానే విని, వూరుకొంది.

రాజన్నయ్య సిరి అంతరంగం కనిపెట్టిననట్లుగా దగ్గిరికి వచ్చి జేబులో నుండి అబ్బాయి ఫోటో తీసి చూపుతూ “అబ్బాయి బాగున్నాడు చెల్లీ. మంచివాడట. పైగా పిన్ని నీ పెళ్ళి తర్వాతైనా చదివించేందుకు ఒప్పిస్తానంది గదా? ఆ కండీషన్ పైనే మాట్లాడ్తాం. నువ్వేమీ కంగారుపడకు. ముందిది చూడు” అని ఫోటో సిరి చేతిలో పెట్టాడు. అప్రయత్నంగానే ఆ ఫోటో చూసిన సిరికి ఒక్క క్షణం గుండె లయ తప్పినట్లునిపించింది. నిజంగానే ఉంగరాల ముంగురులతో తీరైన కనుముక్కుతో, హుందాగా, చాలా అందంగా హీరోలాగే వున్నాడు వరుడు. చిలిపిగా నవ్వుతున్నట్లున్న అతడిని చూస్తే సిగ్గనిపించింది సిరికి. ఆ ఫోటోని నానమ్మ చేతిలో పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. చూద్దాం ఏమవుతుందో? అనుకొందామె. సిరి ఏమీ అడ్డు చెప్పనందుకు స్థిమితపడ్డారు పెద్దలంతా.

అన్నట్లుగానే అబ్బాయి మేనత్తా, తల్లీ వచ్చారు. సిరిని చూసి ముచ్చట పడింది అతని తల్లి. అయితే అతని మేనత్త మాత్రం “అమ్మాయి చాలా బాగుంది.” కాని “మావాడు తన ముందు తేలిపోతాడు” అనేసింది. ఆ మాట అర్థం కాని అమ్మ ‘అంటే?’ అన్నది అయోమయంగా. “మరేం లేదండీ. మావాడు కాస్త సన్నగా వుంటాడని మా వదిన అభిప్రాయం” అన్నది వరుడి తల్లి నవ్వి. “ఆ అదే అదే” అన్నది మేనత్త. “అయినా ఆడ పిల్లలదేముంది వదినా? ఒకరిద్దరిని కనగానే తీసిపోతారు గదా?” అన్నది ఆడపడుచుతో ఆ అబ్బాయి తల్లి.

ఈ తీసిపోవడమంటే ఏమిటో? అనుకొంది అమ్మ. సిరికి చాలా సిగ్గునిపించింది. నానమ్మ, అమ్మలతో చాలాసేపు వంశ చరిత్రంతా ముచ్చటించి కాఫీ, టిఫిన్లు ఆరగించి “వెంటనే కబురు చేస్తాం” అని వెళ్ళిపోయారు. వాళ్ళు.

“పెళ్ళి కుదిరితే బాగుండును” అని ఆశపడుతూనే కుదిరిదితే డబ్బులెన్ని కావాలో? ఎలా తేవాలో? అని కాడా ఇంటిల్లి పాదీ ఆలోచించసాగారు. ఒక వారం భారంగా గడిచాక నాన్న పేరున ఇన్లాండ్ కవర్ వచ్చింది. అది తెరిచి చదివిన నాన్న భావరహితంగా నిట్టూర్చి దానిని అమ్మ చేతికిచ్చాడు. అమ్మ కూడా చదివి “అయ్యో” అన్నది బాధగా. నానమ్మ తాతయ్యయలిద్దరూ ఆదుర్దాగా “ఏమైందిరా?” అన్నరొకేసారి.

“ఆ అబ్బాయే వ్రాసాడు. వాళ్ళమ్మ చెప్పిన దానిని బట్టి తనకూ ఎంతో యిష్టంగానే వున్నప్పటికీ గవర్నమెంట్ జాబ్ లేదుగాబట్టి యిప్పట్లో పెళ్ళి వద్దనుకొంటున్నాడట. అదీ గాక ఈ మధ్యనే అతని ఇద్దరు చెల్లెళ్ళకు పెళ్ళియిందిట. ఒకే ఏడాదిలో ఒకే ఇంటిలో మూడు పెళ్ళిళ్ళు జరగకూడదని వాళ్ళ మేనత్త చెప్పిందిట. అందుకే “ఆగితే ఒక ఏడాదాగడండి లేదా మీ ఇష్టం అని వ్రాసాడు” అంటూ వివరించాడు నాన్న.

“నేనప్పుడే అనుకొన్నాను. ఆవిడ పడనివ్వదని” అన్నది నానమ్మ.

“ఇంతకూ ప్రాప్తం లేదంతే” అని నిట్టూర్చాడు తాతయ్య.

ఆ అబ్బాయి అందమైన ముఖం గుర్తొచ్చి, కొంచెము మనసు చివుక్కుమనిపించినా వెంటనే తేరుకొన్నది సిరి. “ఇప్పుడు నాకు పెళ్ళి కుదిరితే ఎక్కడైనా డబ్బులు సమకూర్చేవాళ్ళు కదా? అలాగే అనుకొని నన్ను కాలేజీలో చేర్పించండి, లేకపోతే నేను అన్నం తిననంతే” అని చిన్నప్పటి సిరి లాగే గట్టిగా హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయింది.

అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకొన్నారు. మెల్లగా నాన్న, అన్నయ్యలు నవ్వుకొన్నారు. సిరికి ఒక ఏడాది చదువు ఆగిపోయినా అన్నయ్యలూ, నాన్నా డబ్బు దాచి సిరిని కాలేజీలో చేర్పించారు. అదీ సిరి కాలేజీ చదువుల ప్రహసనం.

Exit mobile version