Site icon Sanchika

సిరి ముచ్చట్లు-22

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని; యవ్వనప్రాయంలోని జ్ఞాపకాలను గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో 22వ ముచ్చట. [/box]

[dropcap]ఆ[/dropcap] అబ్బాయి పేరు చంద్రశేఖర్ అనీ, డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వోగానికి ప్రయత్నిస్తూనే, ప్రైవేట్‌గా జాబ్ చేస్తున్నాడనీ, ఇద్దరు తమ్ముళ్ళు చదువుకొంటున్నారనీ, ముగ్గురు చెల్లెళ్ళల్లో ఇద్దరికి అంతకు ముందే పెళ్ళవగా, చిన్నమ్మాయికి ఈ మధ్యనే పెళ్ళయిందనీ, పెద్దగా బాధ్యతలేమీ లేవనీ పిన్నీ, బాబాయి ఒకటే చెప్తుంటే, అమ్మ నాన్నా ఆసక్తిగా ఆనందంగా వింటున్నారు. పని గట్టుకొని వినకపోయినా వాళ్ళ మాటలు సిరికీ వినబడ్తూనే వున్నాయి.

“చంద్రశేఖర్ అంటే శివుడన్న మాట. నా కిష్టమైన దేవుడు. బాగుంది పేరు. ఎంచక్కా ‘చందూ’ అని పిలవ్వచ్చుగదా?” అనుకొంటూ నవ్వుకొంది. పదే పదే అతని అందమైన రూపం కళ్ళలో మెదలుతూ ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతున్నది సిరి. ఒక్క నిమిషమన్నా అతడిని సరిగ్గా చూడలేకపోయానే? అని అనుకొంది.

అమ్మానాన్నలు పిన్నీ బాబయ్యలతో కలిసి, వరుడి ఇంటికెళ్ళి వచ్చారు. ఆ బజారులో వాళ్ళ కుటుంబానికి వున్న మంచి పేరు గురించి విని సంతోషించారు. చంద్రశేఖర్ గుణగణాల గురించి కథలు కథలుగా చెప్పుకొన్నారు. చాలా దయగలవాడనీ, సేవా గుణం ఎక్కువనీ అందరూ చెప్పారట. మొత్తానికి ఈ సంబందం అందరికీ చాలా నచ్చింది. తన చదువు ఆగనందుకూ వరుడు అందంగా వున్నందుకూ సిరికి నచ్చింది. వయస్సుతో పాటు వచ్చిన మానసిక పరిణతి ఆమెను పెద్దల మాటకు తల ఒంచేలా చేసింది.

పండక్కి వచ్చిన అన్నయ్యలిద్దరూ కూడా వెళ్ళి చంద్రశేఖర్‌ను కలిసి వివరాలన్నీ కనుక్కొని వచ్చారు. వాళ్ళకు కూడా చంద్రశేఖర్ బాగా నచ్చాడు. మరోసారి వరుడి తల్లీ, మేనత్తలతో పాటు, అతని చెళ్ళెళ్ళిద్దరూ వచ్చారు.

“చదువుకొన్న కోడలు రావడం మాకెంతో ఆనందం వదినగారూ. మీ అన్నయ్యకైతే మరీ ఇష్టం” అని చంద్రం వాళ్ళమ్మ అనడం విన్న సిరికి చాలా సంతోషం కలిగింది. మంచి రోజు చూసుకొని వస్తామనీ, తాంబూలాలు తీసుకొందామనీ అన్నది వరుడి తల్లి. కట్నకానుకలు విషయం అసలు ప్రస్తావించలేదావిడ. ఉండబట్టలేక నాన్నే బయటపడి “మరి ఇచ్చిపుచ్చుకొనే మాటేమీ అనుకోలేదు కద అక్కయ్యగారూ?” అన్నాడు. దానికావిడ నవ్వి “అయ్యో, అన్నయ్యగారూ, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలా? మాకు వాడు మోయవలసిన బరువు బాధ్యతలేమీ లేవు. మీకు తోచిందిచ్చి, పెళ్ళి ఘనంగా చేయండి చాలు” అన్నది. అమ్మ నాన్నా కొండంత బరువు దింపుకొన్నట్లు ఫీలయ్యారు. ఆమె మంచితనానికి ఎంతో సంతోషించారు.

పిన్ని అమ్మతో “నేను చెప్పలేదూ?” అన్నది.

వాళ్ళు వెళ్ళాక, ఇంక ఏదీ ఆగలేదు. సెలవులైపోయి అందరూ ఇల్లు చేరారు. ఉన్నట్లుండి పిన్ని దగ్గరి నుండి ఎల్లుండి వస్తున్నారు అని ఉత్తరం వచ్చింది. అంటే ఆ ఉత్తరం అందే సరికి ఒక్కరోజే గడువుంది. అమ్మా నాన్న, అన్నయ్యలూ ఎంత కంగారు పడ్డారో? ఉన్నంతలోనే ఇల్లు శుభ్రం చేయించి, నీట్‌గా సర్దారు. బజారుకెళ్ళి అమ్మనాన్నలు స్వీట్స్, పళ్ళూ, క్రొత్త బట్టలూ తెచ్చారు.

వాళ్ళ హడావిడి చూస్తూ, రాబోయే శుభ సమయాన్ని తలంచుకొంటూ ఆలోచిస్తున్నది సిరి. వీధిలోని పిల్లలంతా వచ్చి “అక్కా నీకు పెళ్ళటగదా?” అని అడిగితే సిరికి సిగ్గు ముంచుకు వచ్చింది. “మీకెలాగ తెలిసింది?” అని అడిగింది.

“ఆంటీ వచ్చి మా అమ్మను పేరంటానికి పిలిచిందిగా?” అన్నదొకమ్మాయి.

“మా యింటికీ వచ్చింది ఆంటీ” అన్నారు మిగిలిన వాళ్ళు.

“ఇంకా వాళ్ళెవరూ రాందే, అందరికీ ఎందుకు చెప్పావమ్మా?” అని అమ్మను అడిగింది సిరి.

“తెల్లారితే రానే వస్తారు గదే? అప్పుడు చెప్పడానికి టైమెలా వుంటుంది? ముందే చెప్పి వుంచితే వాళ్ళంతా రెడీగా వుంటారుగా?” అన్నది అమ్మ. ఆ రాత్రి సిరికి సరిగా నిద్రే పట్టలేదు. కాసేపు సంతోషం, మరి కాసేపు తెలియని ఆందోళనతో గడిపింది. ఎప్పుడో తెల్లవారాక నిద్రపట్టింది.

మరునాడు ఉదయం తొమ్మిది గావస్తుండగా చంద్రం తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, బావలూ, తమ్ముళ్ళూ వచ్చారు. వారితో పాటు పిన్నీ, బాబాయిలూ, చిన్న తమ్ముళ్ళూ వచ్చారు. ఇందరిలో చంద్రం కనబడక ఒకింత నిరాశనిపించింది సిరికి.

“అబ్బాయేడీ?” అని అడిగింది అమ్మ.

“మీరందరూ వెళ్ళిరండి. నేను రాకపోయినా పర్వాలేదు అన్నాడు వదినగారూ. వచ్చే వారం హైద్రాబాద్‌లో ఏదో పని వుందిట. వీలైతే వచ్చేప్పుడు ఇక్కడికి వస్తానన్నాడు” అన్నది చంద్రం వాళ్ళమ్మ.

పిన్నితో పాటు ప్రక్కింటి ఆంటీ వాళ్ళు కూడా అమ్మకు సాయం చేసారు పనుల్లో. నానమ్మను తలచుకొని అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకొంది.

సలక్షణంగా బంధు మిత్రుల సమక్షంలో సిరి నిశ్చితార్థం జరిగింది. అమ్మనాన్నలు చంద్రంకే గాక వాళ్ళింటిపాదికీ బట్టలు పెట్టాలు. సిరికీ, అమ్మా నాన్నలకూ వాళ్ళు బట్టలు పెట్టారు. ముద్దుగా వున్న ముత్యపు ఉంగరాన్ని సిరి వ్రేలికి తొడిగింది చంద్రం వాళ్ళమ్మ. వరుడికి తెచ్చిన బట్టలతో పాటు, ఖరీదైన వాచీ కూడా వరిడి తండ్రికిస్తూ, “అబ్బాయి కూడా వచ్చి వుంటే బాగుండేది బావగారూ” అన్నాడు నాన్న. “చెప్పాం గదా బావగారూ, వాడొక నిర్ణయానికి వస్తే, ఎవరు చెప్పినా వినడిక. పొలోమంటూ యింత మంది వెళ్తున్నారు. వాళ్ళెంతా కంగారు పడ్తారో? అని కూడా అన్నాడు. మీరేమీ వర్రీగాకండి. నెక్ట్స్ వీక్‌లో వస్తాడు లెండి” అన్నాడు ఆయన.

“ఇంత మందిలో తనొక్కడే ఎక్కువయ్యాడా?” అనుకొంది సిరి. విందులో కొన్ని వంటకాల సిరే చేసిందని విని వాళ్ళంతా చాలా మెచ్చుకొన్నారు.

“మార్చిలో మంచి ముహుర్తాలున్నాయిట, నేను కనుక్కొని మీకు కబురు చేస్తాను. అప్పుడు లగ్నాలు పెట్టుకొందాము” అన్నాడు వరుడి నాన్న. అందరూ వెళ్ళిపోయారు.

క్రొత్త చీరెలో, తలనిండా పూలతో నుదుట ఎర్రని కుంకుమతో పెళ్ళికల ఉట్టిపడుతున్న సిరిని చూసి మురిసిపోయారు అమ్మా నాన్నాలు.

పిన్ని ఒక్కతీ ఆగిపోయింది అమ్మకు తోడుగా వుండేందుకు. అన్నయ్యలు చెల్లిని ఆటపట్టించారు. పిన్ని సిరికి దిష్టి తీసేసింది.

“మార్చిలో మాకు ఎగ్జామ్స్ వుంటాయి గదా?” అని దిగులుగా అన్నది సిరి.

“మరేం పర్లేదు. అవి తర్వాతైనా వ్రాయవచ్చు. ముందీ పెళ్ళి పరీక్షకు అటెండవు చెల్లీ” అన్నాడు రాజు. “అవునవును ఈ పరీక్ష పాసైతే అన్నీ అయినట్లే” అన్నాడు చిన్నన్నయ్య రాము.

“పొండి” అని సిగ్గు పడుతూ గదిలోకి పారిపోయింది సిరి.

అంతా నవ్వేసారు.

Exit mobile version