Site icon Sanchika

సిరి ముచ్చట్లు-3

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో మూడవ ముచ్చట. [/box]

[dropcap]సి[/dropcap]రి వాళ్ళింట్లో పెద్ద గంగిరేగుపళ్ళ చెట్టుంది గదా? సీజన్‌లో దానికి పెద్ద – పెద్ద పళ్ళు పండి, నేలపైన రాలి పడ్తాయి. తిన్నన్ని తిని, మిగిలినవి ఇరుగుపొరుగులకి ఇచ్చేవాళ్ళు. సిరి బడికి కూడా చాలా పళ్ళు తీసుకెళ్ళి ఫ్రెండ్స్‌కి ఇచ్చేది.

ఒకసారి సిరి బడి దగ్గరికి మొక్కజొన్న పొత్తులు తీసుకుని ఒక అవ్వ వచ్చింది. అవి తినాలనిపించింది సిరికి. అమ్మను అడిగితే, రోజూ ఒక్క కాణీ కన్నా ఎక్కువివ్వదు. అది నాన్న పెట్టిన నియమమే. తాతయ్యా, నానమ్మలు ఆ రూల్‌ని అతిక్రమించరు. ఆ మొక్కజొన్న కండె ధర అర్ధణా. అంటే మూడు రోజులు ఏమీ కొనుక్కోకుండా, కాణీలు దాచుకోవాలి. ‘అప్పుడీ అవ్వ వస్తుందో, రాదో? ఏం చేయాలి?’ అని తీవ్రంగా ఆలోచిస్తున్నది సిరి.

అప్పుడే రేగిపళ్ళ బండి అటుగా వచ్చింది. అవ్వ ఆ బండి వాడిని పలకరిస్తూ “ఎట్లిస్తున్నవ్ నాయనా?” అని అడిగింది. అతడేమో “అణాకి పావుశేరు” అని చెప్పాడు. అది వింటున్న సిరికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. “అవ్వా! నా దగ్గిర యింతకన్నా పెద్ద రేగుపళ్ళున్నాయి. అవి తీసుకుని నాకు మొక్కజొన్న కండెలిస్తావా?” అన్నది సిరి అవ్వ దగ్గరికెళ్ళి. అవ్వ ఆశ్చర్యంగా చూసింది. సోషల్ టీచర్ చెప్పిన ‘వస్తు వినిమయం’ పాఠం గుర్తు చేసుకుని తన ఆలోచనను అమలు పరిచింది. “మా ఇంట్లో పెద్ద రేగు చెట్టుంది. ఇదిగో నా బ్యాగ్‌లో ఎన్ని పళ్ళున్నాయో చూడవ్వా” అంటూ తన దగ్గరున్న రేగుపళ్ళను అవ్వకు చూపించింది. ఎర్రగా, నవనవలాడుతూ చిన్న సైజు నిమ్మకాయలంత వున్న ఆ రేగు పళ్ళను చూడగానే అవ్వకు నోరూరింది. ఇదంతా చూసిన రేగుపళ్ళబండి వాడు ‘బేరం చెడిందే’ అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.

తన దగ్గరున్న రేగుపళ్ళన్నీ అవ్వ ముందున్న పట్టా పైన గుమ్మరించింది సిరి. “బాగున్నాయి బిడ్డా. ఇంగో, ఇవి తీసుకో” అని మూడు పెద్ద మొక్కజొన్న పొత్తులను సిరి చేతికిచ్చింది.

సిరి కళ్ళు మెరిసాయి. “నాకొకటి, మా అన్నయలిద్దరికీ చెరొకటి” అని అవి తీసుకొని సంతోషంగా బ్యాగ్‌లో పెట్టుకుని ఇంటికెళ్ళింది సిరి.

అప్పుడే బడి నుండి అన్నయ్యలూ తిరిగి వచ్చారు. తను తెచ్చిన మొక్కజొన్నలను వాళ్ళిద్దరికీ చెరొకటిచ్చి, తన ఘనకార్యం వివరించింది సిరి. పదేళ్ళన్నా లేని కూతురి తెలివితేటలకి ముచ్చట పడింది అమ్మ. “పూర్వం పైసలు లేనప్పుడు వస్తువులను ఇలాగే ఇచ్చి పుచ్చుకునేవారట. దీనినే ‘వస్తు వినిమయం’ అంటారట” అన్నాడు రాజు. “అవును. మా సార్ కూడా చెప్పారు” అన్నాడు రాము. “మొన్ననే మా టీచర్ చెప్పారు” అన్నది నాల్గవ తరగతి చదువుతున్న సిరి.

అంతా విని “మా చిన్నప్పుడు మేమిలాగే అవసరమైనవి తీసుకునేవాళ్ళం” అన్నాడు తాతయ్య. నానమ్మ నవ్వుతూ, “మనం చిన్నప్పుడు చేసిన బేరం తనకు తెలియకుండానే ఇప్పుడు మన మనుమరాలు చేసింది. ఎంతైనా మన సిరితల్లి తెలివైనది కదూ!” అంటూ సిరి బుగ్గలు పుణికి ముద్దాడింది. “నిజమే సుమా!” అన్నాడు తాతయ్య.

అత్తామామలు తన కూతురినలాగ మెచ్చుకొంటూ వుంటే మురిపెంగా చూసింది అమ్మ. తాను చేసిన మారుబేరం సంగతి నాన్న రాగానే చెప్పాలని ఎదురు చూస్తునే నిద్రకొరిగింది సిరి.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version