[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో తొమ్మిదవ ముచ్చట. [/box]
[dropcap]నా[/dropcap]న్నకు పుట్టిన రోజున ఎంతో ఖరీదైన బంగారు టిప్ పాళీ ఫౌంటెన్ పెన్ అమ్మ కొనిచ్చింది. అప్పట్లో 30/- రూపాయలంటే చాలా ఖరీదు క్రిందే లెక్క. ఒక చిన్నపాటి ఆఫీసర్ నెల జీతమది. అమ్మతో నాన్న ఎప్పుడో ఒకసారి ఆ పెన్ గురించి ‘ఆ పెన్ మా ఆఫీసులో ఒకతను కొన్నాడు, దానితో రాస్తుంటే ఎంత బాగుంటుందో? అలాంటిది కొనాలని నాకెంతగా మనసూగిసలాడ్తున్నదో చెప్పలేను. ష్.. కానీ దాని వెల 30/- రూపాయలట. అమ్మో, అంత ఖరీదైనది మనమేం కొనగలంలే’ అని చెప్పాడు. అమ్మ ఆరు నెలల పాటు నెలకి 5/- రూపాయల చొప్పున దాచి నాన్న ముచ్చట పడిన పెన్‌ను కొని బహుమతిగా యిచ్చింది.
అది చూసి నాన్న ఎంత సంతోషించాడో? నల్లరంగు అంచులున్న ఎర్రటి పౌంటెన్ పెన్ చూడగానే ముద్దొస్తున్నది. దాని పాళీకి చివరన చిన్న బంగారు టిప్ వుంటుంది. అది దాని ప్రత్యేకత. ‘చాలా బాగుంది నాన్నా’ అని పిల్లలు ముగ్గురూ మెచ్చుకొన్నారు. సిరికి ఆ పౌంటెన్ పెన్ మరీ మరీ నచ్చింది. ఒక్కసారన్నా ఆ పెన్‌ను ఉపయోగించాలని సిరికి చాలా కోరిక కలిగింది. ‘ఓ సారి రాసి చూస్తాను నాన్నా!’ అని నాన్నను అడిగింది. ‘చాల్లే అంత ఖరీదైన పెన్‌ను పిల్లల కివ్వడమే! పాడయిందంటే ఇంతే సంగతులు. మీరెవ్వరూ, ఎప్పుడూ దానిని ముట్టుకోవద్దు’ అని అమ్మ గట్టిగా హెచ్చరించింది.
అప్పటి నుండీ ఎంత ఆశగావున్నా ఆ పెన్ జోలికెళ్ళలేదు సిరి. 5,6 నెలలు వాడిన తర్వాత, నాన్నకు ఆ పెన్ పైన ముందున్నంత మోజు తగ్గింది. దానిని బీరువాలో ఒక జ్ఞాపకంగా, భద్రంగా దాచి పెట్టి వేరే పెన్ వాడుకోసాగాడు. అది కనిపెట్టిన సిరి ‘నాన్నా! ఈ ఒక్క రోజుకు నీ పెన్ ఇయ్యవా? మరెప్పుడూ అడగను. మా ఫ్రెండ్సందరికీ చెప్పాను. వాళ్ళంతా ఒక్కసారి చూస్తామంటున్నారు. ప్లీజ్, ఇయ్యవూ?’ అని బ్రతిమాలింది. అక్కడే వున్న అమ్మ ‘ఆ పెన్ ముట్టుకోవద్దని చెప్పానా, లేదా?’ అని గద్దించింది. ‘అబ్బ వురుకో అనూ, ఈ ఒక్క రోజుకేనటగాదా? తీసుకెళ్ళనిద్దూ?’ అన్నాడు నాన్న. ‘అదేమీ కుదరదు, ఆ పెన్‌ను మీరు వాడకపోయినా సరే, అది నేనెంతో కష్టపడి డబ్బులు కూడబెట్టి మీ పుట్టినరోజు బహుమానంగా ఇచ్చిన సంగతి మరువకండి. దానినలాగే ఒక గుర్తుగా దాచి వుంచండి’ అని చెప్పింది అమ్మ. ‘నాన్న అది కాదు అనూ, ఈ ఒక్కసారికి సిరి తీసుకెళ్ళి తెచ్చాక, నీవన్నట్లుగానే దాచి పెట్టవచ్చు. పాపం, దాని ముచ్చట కాదనడమెందుకు?’ అన్నాడు. ‘ప్లీజ్ అమ్మా! నేనిప్పుడు 5వ తరగతి చదువుతున్నాను కదా? ఏమీ పాడుచేయకుండా భద్రంగా తెస్తాను. ఈ ఒక్కరోజు కోసమే ఇవ్వమ్మా’ సిరి బ్రతిమాలడం విన్న నానమ్మ, తాతయ్యలు కూడా ‘పోనీలెమ్మా, చిన్నపిల్ల అంతగా అడుగుతున్నది. ఈ ఒక్కరోజుకీ ఇవ్వరాదూ?’ అన్నారు. ఇంక తప్పదు అన్నట్లుగా ఎన్నో జాగ్రత్తలు చెప్పి సిరికి పెన్ ఇచ్చింది అమ్మ.
కొండెక్కినంత సంబరడి అమ్మకు ముద్దు పెట్టి, ఆ పెన్‌ను ప్రాక్‌కు తగిలించుకొని బడికెళ్ళింది సిరి. గొప్పగా ఫ్రెండ్సందరికీ చూపి రోజంతా హుషారుగా గడిపింది. స్టైల్‌గా ఫ్రాక్‌కు తగిలిచుకొని ఇంటికి వచ్చింది. రాగానే ‘ఇదిగో అమ్మా పెన్. ఇంక దాచిపెట్టు’ అంటూ పెన్ తీయబోయింది. షాక్… పెన్ లేదు. పైన క్యాప్ మాత్రమే వున్నది. పెన్ ఎక్కడ జారిపడిందో సిరి చూసుకోలేదు. అది గమనించి అమ్మ సిరి చెంప చెళ్ళుమనిపించింది. తప్పు చేసానని గ్రహించినప్పటికీ ఏనాడూ చెయ్యెత్తని అమ్మ కొట్టిందని విషయం సిరికి మరింత షాక్ లాగే తోచింది. చెంపను చేత్తో పట్టుకొని, బిత్తరపోయి చూసింది సిరి. ‘నేను ఎంత చెప్పినా వినకుండా పట్టుకెళ్ళి, అంత విలువైన పెన్‌ను ఎక్కడో తగలేసావుగా?’ అన్నది అమ్మ. ఆ వేళెందుకనో ఇంట్లోనే వున్న నాన్న కళ్ళలోనూ బాధ, కోపం కలగలసిన భావం గమనించింది సిరి. తాతయ్య, నానమ్మ, అన్నయ్యలు, అమ్మా నాన్నా అందరి మథ్యా ముద్దాయిలా నిలబడిన సిరికి చాలా బాధ, పశ్చాత్తాపం, దుఃఖం కలగలిసి కలుగుతున్నాయి. ‘పోనీలేమ్మా, ఇప్పుడు దానిని కొడ్తే ఏం లాభం?’ అన్నాడు తాతయ్య. ‘డబ్బుల గురించి కాదు మామయ్యా. అది నేను ఎంతో ప్రేమగా మీ అబ్బాయికి కొన్నాను. దాని విలువ తెలియక మీరంతా యివ్వమనీ ఒత్తిడి చేస్తే తప్పనిసరై యిచ్చాను. ఇప్పడీ వుత్త డిప్ప మిగిలింది. వయ్యారంగా గౌనుకు పెట్టుకోకపోతే బ్యాగ్‌లో పెట్టుకోవచ్చుగా?’ కోపంగా, బాధగా అన్నది అమ్మ.
ఇంతలోనే ప్రక్కింటి ఐదేళ్ళ పాప ‘సిరక్కా నీ పెన్ను మా ఇంటి ముందు పడింది’ అంటూ పెన్‌ను తీసుకొని వచ్చింది. చటుక్కున అది అందుకొని ‘థాంక్స్ పాపా’ అన్నది సిరి. అంతరూ ఒక సమస్య తీరినట్లుగా రిలీఫ్‌గా ఫీలయ్యారు. ఆ పెన్‌ను అమ్మ చేతికిస్తూ ‘ఇంకెప్పుడూ ఈ పెన్‌ను అడగనులే అమ్మా’ అన్నది సిరి. మౌనంగానే ఆ పెన్ తీసుకొన్నది అమ్మ. అన్నట్లుగానే తన మాటను నిలుపుకొన్నది సిరి.
(మళ్ళీ కలుద్దాం)