[dropcap]సి[/dropcap]రికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ.
~
(అ) మూడు మాటల ‘పేచీ’లు
అడుగుడు : పాతూరి అన్నపూర్ణ, తుమ్మలపల్లి వాణీకుమారి, గలనా
నుడువుడు: సర్వశ్రీ ఉప్పలధడియం, టివి శేషగిరిరావు, కోడూరు ప్రభాకరరెడ్డి, బులుసు, సూరం శ్రీనివాసులుగారలు,
(ఆ) ‘ప్రశ్న పత్రమా?’ – ‘ప్రశ్నాపత్రమా?’/ ‘ఘనపాఠి’నా?–’ఘనాపాఠి’ నా? ఏది తప్పు? – ఏది ఒప్పు?
అడుగు : డా. డా. ఉపద్రష్ట
నుడువు : ఆచార్య రాణీ సదాశివ మూర్తి, డా. పాలపర్తి, ఆచార్య ఎ. ఉషాదేవి
కథనం: గంగిశెట్టి లక్ష్మీనారాయణ
***
(అ) మూడు మాటల ‘పేచీ’లు
౧. “పేచీ” పేచీ!
* నా మొదటి పేచీ ఈ ‘పేచీ’ అనే మాటతోనే ఉంది! దయతో తీర్చరా?* ఇదీ ఆ మధ్య నేను నిస్సిగ్గుగా మా సిరికోనీయులను అడిగిన ప్రశ్న!
ఆశ్చర్యపోతున్నారా? నిజం!! ఎందుకంటే, ఈ మాట మా రాయలసీమ సామాన్య వాడుకభాషలో లేదు. కేవలం మధ్యాంధ్ర భాషతో సంపర్కమున్న చదువరుల భాషలోనే ఉంది. ఆ మధ్యాంధ్రుల భాషలో దీని అర్థం : గొడవ, సమస్య.
ఈ అర్థం దీనికి ఎలా వచ్చింది?
తమిళంలో ‘పేశ్/చ్’ అనే మాట ఉంది. మాట్లాడ్డం అని అర్థం. తెలుగులో దాదాపు ఆ మాట పోయింది. మా రాయలసీమ దక్షిణప్రాంతాల్లో మాత్రం “అంతగా పేసొద్దు/ పేసింది చాల్లే పో!” అంటూ, వాక్ ఖండన సందర్భాల్లో మాత్రమే, మరీ పాత తరం వారు మాత్రమే, చాలా సకృత్తుగా వాడతారు. మధ్యాంధ్రంలో “పేలొద్దు/ ఏమిటి భలే పేలుతున్నావే!” అనే లాగా! నిందార్థం లోనే!
వాస్తవానికి, ఇది ఒకప్పుడు నిందార్థకమైన మాట కాదు. లక్షణంగా మాట్లాడ్డమనే మంచి మాటే!! ఇప్పటికీ కన్నడంలో దీని సాదృశ్యపు మాట ‘హేళు’, చెప్పటమనే మంచి అర్థంలోనే ఉంది. పాత కన్నడం లోని ‘ప’కారం, ఆధునిక కన్నడమనే ఏమిటి, నడు కన్నడం లోనే హ కారంగా మారిపోయింది. ‘పేళ్దు’ అని ప్రాచీన కావ్యరూపాన్ని ఇప్పటికీ అలానే చదువుకొంటారు, వ్యవహారంలో వాడుకోరు కానీ! ఆ ‘పేళ్’ పేచ్ కాలేదు. అక్కడ ఏ పేచీ తలెత్తలేదు…
తెలంగాణలో ‘పేషీ’ ఉంది. ఇది లక్షణంగా దక్ఖనీ ఉర్దూ నుంచి, నేటి ఉర్దూ లోకి చేరిన మాట. దక్ఖనీ అంటేనే, తెలుగు-కన్నడ-మరాఠీ మిశ్రమంతో తయారైన నాటి గోల్కొండ ఆది ముస్లిం పాలకుల (ప్రధానంగా కుతుబ్ షాహీల) కాలంలో తయారైన మిశ్రమ భాష, క్రియోల్! ఈ మాటలూ , వీటితో పాటు పారశీ, అరబ్బీ భాషలు కలిసి, స్థూలంగా ఉత్తరాది భాషల వ్యాకరణ సూత్రాలననుసరిస్తూ తయారైన నాటి దక్షిణ ‘సైనిక భాష’ దక్ఖనీ ఉర్దూ. లఖ్నో ప్రాంతాల్లో ఏర్పడ్డది లఖ్నవీ ఉర్దూ. కానీ వాళ్ళు దఖనీ ని ఒప్పుకోరనుకోండి. లఖ్నవీ నే ఉర్దూ అంటారు. ఏదేమైనా దక్ఖనీ నుంచి, అంటే నాటి గోల్కొండ పాలిత ప్రాంతం నుంచి ఉర్దూ లోకి, దరిమిలా నేటి తెలంగాణం లోకి ఎక్కిన మాట ‘పేషీ’. అంటే ‘ మాటామంతీ విచారించుకొనే కార్యాలయం’ అని అర్థం. ఆఫీసర్ గారి గది ముందు, వారి సహాయకులు కొలువుండే విచారణ కార్యాలయం. దాని గొడవ ఎలా ఉన్నా, ఇందులో పేష్ మాత్రం, ద్రవిడ ‘పేశ్’ కు సంబంధించిందే. అందులోనూ ఏ పేచీ లేదు.
మరి ఈ మధ్యాంధ్రం పేచీ ఎక్కడినుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనేది భేతాళ ప్రశ్న!
ఒకరోజు తీరిగ్గా అంచేతే మా సిరికోనీయ భాషాభిమాన విక్రమార్కులను, నిస్సిగ్గుగా దీనికి సమాధానం చెప్పమని భేతాలుణ్ణయి అడిగాను!
వెంటనే విద్వత్కవి పండితులు, హిందీలో డాక్టరేట్ చేసిన ఉప్పలధడియం వెంకటేశ్వర్లు గారు ఇలా వివరించారు: “హిందీలో పేచ్ అనే మాట ఉంది. దీన్ని పారశీక పదంగా హిందీ నిఘంటువులు పేర్కొంటున్నాయి. ఆ మాటకు చిక్కు అని అర్థం, పేచీదార్ మామ్లా – సమస్యాత్మక విషయం. మెలి, వంపులు కలిగిన చీల అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా భావపరంగా చిక్కుతో సంవదించేవే.
శరము పేచి అనే ఆరోపానికి తంటా అనే అర్థం ఇచ్చి కన్నడ పదంగా పేర్కొంది. అయినా ఇది కన్నడ పదం కాకపోవచ్చని నా అభిప్రాయం.”
నాకు ఈ చివరి మాట అర్థం కాలేదు. అంచేతే కన్నడ ఉదాహరణను ఇంకొంత విడమరిచి చెప్పవలసిందిగా కోరుతూ, “మధ్యాంధ్రం ‘పేచీ’ పారశీక మూలం కలిగిన దానిగానే భావించవచ్చన్న మాట!” అని వ్యక్తబరిచాను.
వృత్తిరీత్యా ఇంజనీరైనా, తెలుగు సంస్కృతాలలో దిట్ట, హైదరాబాద్ వాసి టి వి శేషగిరిరావు గారు ఇలా ప్రతిస్పందించారు: “హిందీలో “పేచ్” అంటే “Screw” అనే అర్థము సామాన్యము. సమస్యాత్మకము అనే అర్థము దీని నుండి పుట్టినది కావచ్చు. “పేచ్ కస్” అంటే “Screw Driver”. తెలుగులో కూడా “Screw” కి చక్కని మాటలు ఉన్నాయి, కాని మనకు అవి వాడితే, తెలిస్తే మన గొప్ప తగ్గి పోతుంది.”
దానిపై ఉప్పలధడియం గారి జవాబు: “ఆర్యా నిజమే. హిందీలో ‘పేచ్’ పదానికి అనేకార్థాలు ఉన్నాయి. ఇంకా, పేచీలా, పేచీదా మాటల్ని గందరగోళం అనే అర్థంలో వాడుతుంటారు. పేచక్ అంటే దారపు కండె. అన్నీ ఒకే కోవకు చెందిన పదాలే.” దాంతో పాటు నేను కన్నడం ఉదాహరణను విడమరచి చెప్పమన్నందుకు బదులుగా “అది శబ్ద రత్నాకరంలోని ఆకరం. కన్నడ ఉదాహరణ నాకు తెలిసినంతలో లేదు.” అని తెలిపారు.
ఇదీ పేచీ గురించిన పేచు…
***
౨. ‘ముందుంది ముసళ్ళ పండగ’
పాతూరి అన్నపూర్ణ: ముందుంది ముసళ్ల పండగ అంటారు కదా.. దాని అర్థం పరమార్థం ఏంటి.. వివరించగలరు!
డా.కోడూరి ప్రభాకరరెడ్డి: ‘మొసళ్ళ పండగ’. గడ్డు రోజుల కాలం, కష్టకాలం. ముసుళ్ళ పండగ అని కూడా అంటారు. ‘ముందుంది మొసళ్ళ పండగ’ అంటే ఇప్పటి పరిస్థితికే ఇలా అలమటిస్తున్నావు, ఇక రాబోయేవి మరింత గడ్డు రోజులు. వాటికి ఎలా తట్టుకుంటావు? అని భావం.
పా.అ.: మొసళ్ళ పండుగ అంటే గడ్డుకాలం అనేది నేనూ ఏకీభవిస్తాను. మొసళ్ళ పండగ అనే ఎందుకు అన్నారనేది నా సమస్య… దాని వెనుక ఏదైనా కథ వుందా అని…
బులుసు వెంకటేశ్వర్లు: తొలకరి వానలు సమయానికి పడితే రైతులకు పండగే. ఆకుమళ్ళు వేసుకుంటారు. అక్కడితో సంబరపడిపోతే కుదరదు. ముందు ముందు నిరంతర వర్షాలు పడితే పంటకు దెబ్బ. కనుక ప్రారంభపుటుత్సాహం కాదు. ముందుంది ముసుర్ల పండుగ …. కష్టాలు వస్తాయి.. ముసుర్లు…. మొసళ్ళు…
***
౩. ఇంగ్లీషు “సోఫా” మన వాల్మీకి నుంచి వెళ్లిందేనా?
డా. తుమ్మలపల్లి వాణీకుమారి గారు అడిగిన ప్రశ్నతో అది స్పష్టమైంది.
ఎలాగంటే ఒకమారు సిరికోనలో: “ఒక చిన్న సందేహం-ఎవరైనా నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను. అదేమిటంటే ―
“తస్యాం స వైడూర్యమయం ప్రియకాజిన సంవృతమ్
మహత్సోపాశ్రయం భేజే రావణః పరమాసనమ్”
(వాల్మీకి రామాయణం యుద్ధకాండ 11వ సర్గ లోని 17 వ శ్లోకం)
దీనిలోని సోపా మన సోఫా వంటి దేనా?” అంటూ అడిగారు.
దానిపై విద్వద్వరిష్ఠులు డా. సూరం శ్రీనివాసులు గారు ఇలా విశదపరిచారు.
“స+ఉపాశ్రయమ్= సోపాశ్రయమ్;
ఉపాశ్రయంతో కూడినది. ఆసనానికి అది విశేషణం.
ఉపాశ్రయ మంటే కూర్చొని ఆనుకోవటానికి అనువుగా అమర్చబడిన దిండు(ఆనిక) అని అర్థం.”
ఇంకేం!? మన వాల్మీకీయం నుంచే కదా, ఇంగ్లీషు వాడు సోఫా పట్టుకెళ్లింది! ఔరా!! అమ్మకచెల్లా!!
–ఇతి మార్చీయం
***
(ఆ) ‘ప్రశ్న పత్రమా?’ – ‘ప్రశ్నాపత్రమా?’ /
‘ఘనపాఠి’ నా? – ‘ఘనాపాఠి’ నా? : ఏది తప్పు? – ఏది ఒప్పు?
“ ‘ప్రశ్నపత్రం’ సరైన మాటనా? ‘ప్రశ్నాపత్రం’ సరైనా మాటనా?
‘ప్రశ్న’ అనేది హ్రస్వంతో అంతమయ్యే రూపం కదా, మరి “ప్రశ్నాపత్రం” అంటారు ఎందుకు?” అని అడిగారు, ఉపద్రష్ట సత్యం గారు, వారికి తెలిసే! మాలాటి పంతుళ్లకు తెలియాలని!!
దాంతోపాటు మరో ప్రశ్న కూడా అడిగారు: “ ‘ఘన’ కూడా అలాటి హ్రస్వాంత రూపమే కదా, మరి దానిపై ‘పాఠి’ చేరినప్పుడు ఘనపాఠి కావాలి కానీ, ‘ఘనాపాఠి’ అంటారేమిటి? అని!?” ఇదీ ఆయనకు తెలియదని కాదు; తెలిసీ ఏవి సరైన రూపాలు? అని ప్రశ్నించటం ఆయనకదో వినోదం. భాషా విషయకంగా చర్చ జరుగుతుంది కదా అని మాకు ఆనందం.
మొదటగా విశ్రాంత భాషాశాస్త్ర ఆచార్యులు ఎ. ఉషాదేవి: “నాకు తెలిసిన మేరకు…. 1. సమాసాలలో కొన్ని సార్లు మొదటి పదం దీర్ఘం అవుతుంది కదా, ఆ సాదృశ్యంలో ఏర్పడి నిలబడిపోయినట్లుంది. అలాగే కొన్ని ప్రయోగాలు తప్పులైనా స్థిరంగా నిలదొక్కుకుని ఎవరు చెప్పినా మారవు. ఉదా: ఆచార్య దొణప్ప గారు పత్రికల వారితో సమావేశం పెట్టి, ‘ పాత్రికేయులు ‘ తప్పు. రాధేయ, కౌంతేయ అంటే వారి పుత్రులని అర్థం. పాత్రికీయ అని రాయాలి అని చెప్పేవారు. కానీ పాత్రికీయులు మరుసటి రోజు , దీనిపై వార్త రాస్తూ “పాత్రికేయుల సమావేశంలో ఇలా అన్నారు” అనే రాశారు. తెలుగులో ఈ హ్రస్వ దీర్ఘాలు మంచి అధ్యయన అంశం. ప్రాచీన కవులు కూడా (భాషా లక్షణాలకు లోబడే) పదాలలో ఈ మార్పులు గణాలకోసం చేశారని ప్రత్యేకంగా చెప్పేపని లేదు కదా!” అన్నారు
ఆ తర్వాత అచ్చతెలుగు అవధాని శేఖరులు డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు స్పందిస్తూ: “సుందరకాండను సుందరాకాండ, అయోధ్యాకాండను అయోధ్యకాండ అనటం వింటూనే ఉంటాం. ప్రశ్నాపత్రం, ఘనాపాఠీ వంటివి ‘పదుగురాడుమాట పాడియై ధరచెల్లు’తో శిఖా వేయించుకున్నాయి. వ్యవహారంలో నుండి శిష్టవ్యవహారంలోకి చేరేశాయి. రేపో మాపో ఆధునిక నిఘంటువుల్లో కూడా చేరవచ్చు. సాధువులైపోతాయి. ఈ దీర్ఘం గొడవ ల్యుడంతాల వ్యస్తసమస్త ప్రయోగాల ప్రభావంతో లింగవివక్షతో దిగుమతి అవుతూ ఉంటుందని గురువాక్యం” అని తమ సహజ చమత్కార ధోరణిలో పేర్కొన్నారు…
***
ఆ పిమ్మట ఆచార్య రాణి సదాశివమూర్తి గారు, వైదిక విద్యాధ్యయన రీతుల గురించి తెలియనివారం చాలామందిమి ఉన్నాం కనుక, ఘనపాఠీ సంప్రదాయం గురించి, చాలా విపులంగా ఇలా విశదీకరించారు.
“వేదమంత్రాలను పఠించడంలో ఒక్కొక్క మంత్రాన్ని వివిధరీతులలో, వివిధ గతులలో వల్లె వేయాలి అని సంప్రదాయం.
ఇవి వాక్య, పద, క్రమ, జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ, ఘన వంటివి.
జటా మాలా శిఖా రేఖా
ధ్వజో దండో రథో ఘనః।
అష్టౌ వికృతయః ప్రోక్తాః
క్రమపూర్వా మహర్షిభిః।।
అని వైదికోపదేశం. ఇలా మంత్రపఠనరీతులలో ఒకటైన ఘనలో మంత్రాలను పఠించగలవారు ఘనపాఠీలు.
ఘనపాఠి ఎవరైనా ‘‘ఘన’’ పద్ధతిలో వేదాన్ని వల్లిస్తూంటే ఆయన పదాలని రకరకాలుగా ముందుకీ వెనుకకీ మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఇది కర్ణపేయంగా ఉండటమే కాక, మనస్సుకి ఒక ఉత్సాహాన్ని, పవిత్రతను కూడ కలిగిస్తుంది. ఇందువల్ల వేదమంత్రాలకి సహజంగానే గల శోభ ఇనుమడిస్తుంది.”
ఘంటశాల నిర్మల గారు ఘన కు ఒక ఉదాహరణ చూపి, సోదాహరణంగా వివరించమని అడిగారని తెలుపుతూ, వారే ఈ కింది ఉదాహరణ ఇచ్చారు:
“వేదఘన కు ఒక ఉదాహరణ (ఎప్పటిదో నోట్స్ నుంచి):
ఒక మంత్రంలో పదాలు ఈక్రమంలో ఉన్నాయి అనుకుందాం
1/2/3/4/5
ఆ మంత్రం ఘన ఇలా ఉంటుంది
12/21/123/321/123/
23/32/234/432/234/
34/43/345/543/345/
45/54/45/
5 ఇతి 5.
ఉదాహరణకు:
మంత్రం
ఏషాం పురుషాణామేషాం పశూనామ్ మాభేర్మారోమో ఏషామ్ కించనామమత్
అర్థం –
ఓం దేవా! ఈ మనుష్యులను కానీ, పశువులను కానీ భయపెట్టవలదు. వీరిలో, వీటిలో ఏ ఒక్కరూ, ఏ ఒక్కటి నశించరాదు. ఆరోగ్యమును కోల్పోరాదు.
ఈ మంత్రానికి పదపాఠం
ఏషామ్/పురుషాణామ్/ఏషామ్/పశూనామ్/మా/భేః/మా/
అరః/మో ఇతి మో/ఏషామ్/
కిమ్/చన/ఆమమత్/ఆమమద్-ఇతి-ఆమమత్/
దీనికి ఘనపాఠం
ఏషామ్ – పురుషాణామ్ – పురుషాణామ్ – ఏషామ్ –
ఏషామ్ – పురుషాణామ్ -ఏషామ్ – ఏషామ్ – పురుషాణామ్ -ఏషామ్ – ఏషామ్ – పురుషాణామ్ -ఏషామ్ – పురుషాణామ్ – ఏషామ్ – ఏషామ్ – పురుషాణామ్ –
పురుషాణామ్ – ఏషామ్ – పశూనాం
పశూనామ్ – ఏషామ్ పురుషాణామ్ – ఏషాం పశూనామ్
ఏషామ్ పశూనామ్ పశూనామ్ – ఏషామ్ – ఏషామ్ పశూనామ్ – మా మా పశూనామ్ – ఏషామ్- ఏషామ్
పశూనామ్ – మా –
పశూనామ్ – మా మా పశూనామ్ పశూనామ్ మా
భేర్ – భేర్ – మా పశూనామ్ పశూనామ్ మా భేః
మా భేర్ – భేర్ మా మా భేర్ – మా మా భేర్ – మా మా భేర్ – మా/
భేర్ – మా మా భేర్ – భేర్ – మారో అరో మా భేర్ – భేర్ మా అరః/
మా రో అరో మా మా రో మో మో అరో మా మా రో మో/
అరో మో మో అరో అరో మో ఏషామ్ – ఏషామ్ మో అరో అరో మో ఏషామ్/
మో ఏషామ్ – ఏషామ్ మో మో ఏషామ్ కిమ్
కిమ్ ఏషామ్ – మో మో ఏషామ్ కిమ్/ మో ఇతి మో/
ఏషామ్ కిమ్ కిమ్ – ఏషామ్ ఏషామ్ కిమ్ – చన చన కిమ్-
ఏషామ్ – ఏషామ్ కిమ్ – చన/
కిమ్ చన చన కిమ్ కిమ్ చనామమద్ – ఆమమత్ చన కిమ్ కిమ్ చనామమత్/
చనామమద్-ఆమమచ్ – చన చనామమత్/
ఆమమద్-ఇత్యామమత్.//”
***
ఇంతకీ ఘనపాఠి, ఘనాపాఠి ఎలాగయ్యారు అనే ప్రశ్న అలాగే ఉండిపోయింది కదా!
దానికి ముక్తాయింపు డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, తన పండిన అవధాన చమత్కార కుశలతతో ఇలా ఇచ్చారు: “జటాపాఠి వంటి దీర్ఘాంతాల సహజీవనంవల్ల ఘనకు దీర్ఘం అప్రయత్నంగా వచ్చిఉంటుందని భాషాశాస్త్రంలోని ఎనాలజీ!!”
అక్కడ కాదు ఆయన చమత్కారం, ఈ కింది దాంట్లో చూడాలి:
“మా ఊళ్ళో ఒక వేదపండితుడు సొంత వ్యవసాయం చేసేవాడు. ఆ రోజుల్లో కొత్తగా యూరియా అనే ఎరువు వచ్చింది. ఆయన ‘‘మా పొలంలో ఒఖ్ఖకట్ట ‘వీర్యా’ తగిలించా. ఇహ చేను నా ఎత్తు కొచ్చింది” అనేవాడు. ‘అయ్యా! దానిపేరు యూరియా అండీ!’ అంటే ‘పలకటం చేతకాక అలా అంటున్నారు. దాని అసలు పేరు వీర్యానే’ అని ఓ మంత్రభాగం వినిపించేవాడు. పైరుకు బలం ఇవ్వటమే సాక్షి అనేవాడు. ఆయన ప్రమాణాలు ఆయనవి. ఇటువంటి వైదికభాషాశాస్త్ర సంగతులు ఇంకా ఉన్నాయి. మరోసారి మనవిచేసుకుంటాను”
అదీ అవధానుల వారి వివరణ అంటే!
–ఇతి ఏప్రిలీయం: పుష్ప వికసనం
***
అధిక పాఠం:
‘ఏప్రిలీయం’ అంటూ పుష్ప వికసనం అని ఎందుకంటున్నా ననుకొంటున్నారా!?
దాని అర్థం అదే కాబట్టి!
ఏడాదికి పదినెలలే ఉన్న ప్రాచీన రోములస్ క్యాలెండర్ను జూలియస్ సీజర్ ఈజిప్షియన్ పద్ధతిలో పన్నెండు నెలల లోకి మార్పించాడు. నాలుగో నెల వసంతం రాగానే ‘పూలు ఓపెన్ అప్ అవుతామ’ని అంటున్నాయనే భావంలో ఏప్రిల్ అని దాన్ని పిలిచారుట. అంటే ఏప్రిల్ అనే మాటకు మూలతః ‘పుష్పవికసనం’ అనే అర్థం!! (క్యాలెండర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటారా? ప్రాచీన రోమన్ భాషలో క్యాలెండ్ అంటే ‘పొడుపు/నెల పొడుపు’. చంద్రుడు ఆకాశంలో పొడిస్తే, కొత్త నెల మొదలైనట్లు కదా!. అలా క్యాలెండ్స్ కలిగింది, కనుక అది క్యాలెండర్ అనిపించుకొంది!)
― గంగిశెట్టి లక్ష్మీనారాయణ (విశ్రాంత ఆచార్యుడు)