[box type=’note’ fontsize=’16’] సిరికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. [/box]
మప్పిదాలండీ బాబూ మప్పిదాలు!!
చర్చ : సిరికోనీయులు
నివేదనం : లక్ష్మీనారాయణ గంగిశెట్టి
~
[dropcap]ఆ[/dropcap]మధ్య సిరికోనలో ఏదో చెబితే ఓ ఎన్నెలమ్మ “మప్పిదాలు” అంది.
వెంటనే నేను “ఈ మప్పిదాలంటే ఏమిటండీ!?” అని అడగకుండా ఉండలేకపోయాను.
ఎందుకంటే, నేను పుట్టి బుద్ధెరిగిన నాటినుండి ఈ మప్పిదాలనే మాటను విని ఎరుగను. మా వైపు ఆ మాట వాడుకలో లేదు. పోనీ చదువుకున్న కూసింత చదువులోనూ, ఎక్కడా తగల్లేదు. వాడుకలో సకృత్తుగా మెప్పిదాలు అనే మాట ఒకటి విన్నాను. ‘మప్పిచెబుతున్నారు’ అనే సందర్భంలో ఈ మాట విన్న జ్ఞాపకమూ ఉంది. అయితే అక్కడ “దాచి పెట్టి” అనే అర్థంలో!… కప్పి పెట్టి లాగా! … కప్పి మప్పి అనే మాటల్ని జంటగా వాడే వాడుక కూడా మా వైపు ఉంది… ఇప్పుడు కొత్త తరం తెలుగు వారు, ముఖ్యంగా తెలుగుభాషను కాపాడ్డం కోసం ఈ మాటను గత రెండున్నర దశాబ్దాలుగా పని గట్టుకొని వాడుతున్నారు…
కాపాడ్డం అంటే ఏమిటి? పరాయి భాషల తాకిడి నుంచి!
పరాయి భాషలంటే, ఈ ‘కాపు’దార్ల దృష్టిలో – బయటినుంచి వచ్చిన ఆంగ్లమో, పోనీ పొరుగుల్లో ఉన్న అరవమో, కన్నడమో, అదీ కాదంటే ఏ తురకమో (క్షమించాలి, ఈ మాటను వాడినందుకు. ఉర్దూను నేను విదేశ భాష అనలేను కనుక, ఆ మాట వాడేశాను), కాదు! “జనని సంస్కృతంబు” అని విజ్ఞానం కొద్దో, అజ్ఞానం కొద్దో అలనాటి పెద్దలన్న సంస్కృతం అనే ‘పరాయి భాష’ నుంచి!
గట్టిగా ఒక్క శాతం కూడా చదువరులు లేని ఆనాటి సమాజంలో సంస్కృతాన్ని కలబోసి తెలుగును వాడేసి, తెలుగుకు అన్యాయం చేసేసిన వాళ్ళు, మహా అంటే అయిదు శాతం కూడా ఉండి ఉండరు. అందరూ సాదా సీదా గ్రామీణ జనమే! వాళ్ళ మధ్య వ్యవహారం కోసం తెలుగునే వాడుకున్నారు.. కాస్త పాలనాపరమైన విషయాల్లో ప్రాకృత పదాలని వాడుకున్నారు… చరిత్రను తిరగేస్తే బుద్ధున్న ఏ రాజూ సంస్కృత పదాలను వాడుకలోకి తేలేదు. అవి నిలవవని తెలుసు. కనుక పన్నూ, రొక్ఖం వంటి వాటిల్లో ప్రాకృత పదాలనే వాడుకలో పెట్టారు. జనంలో అవే నిలిచాయి కూడా! ఆ ప్రాకృత పదాల సమ్మిశ్రణం తోనే, మొగలాయీ సైనిక శిబిరాల్లో నుంచి ఉర్దూ రూపు దాల్చింది. ఉర్దూ అంటేనే సైనిక శిబిరానికి సంబంధించింది అని అర్థం. మరీ కొత్త విధానాలైనప్పుడు పారశీక పదాలు ప్రవేశించాయి.. అవీ వీలైనంత వరకూ మన దేశీయ భాషల నుడికట్టును పాటిస్తూ!… అంచేతే అవి జన వ్యవహారంలో కలిసిపోయి, మన భాషల్లోనే భాగమైపోయాయి… ఆ తర్వాత యూరోపియనుల తోటి సంపర్కం మొదలై బలపడ్డాక, పాలనాత్మక విషయాల్లోనే కాదు, సామాజిక – సాంస్కృతిక విషయాల్లో అనేక కొత్త పదాలు రావటం అనివార్యమయ్యాయి. ప్రాచీన కాలంలో తాత్త్విక రంగంలోనూ, ఆధునిక కాలంలో వైజ్ఞానిక -సాంస్కృతిక రంగం లోనూ తెలుగులోకి ఆంగ్లం పదాల ‘ఎరవు’ అపారమైంది, ఆమోఘమైంది…
ఇప్పుడు ఈ తెలుగు కాపరులు, సంస్కృతం నుంచి తెలుగును కాపాడ్డానికి ఉద్యమిస్తూ, ఇంటా బయటా ఆంగ్లాన్ని గౌరవిస్తూ, ఆంగ్ల పదాలకు బదులు సంస్కృతాన్ని వాడకుండా, వాటి బదులు మన ‘నాడు’ (నాటు అనాలి, కానీ అలా అంటే బాగోదు కదా!) పదాల్ని వాడదాం అని కొన్ని కొత్త పదాల్ని సృష్టించి తెలుగుదేశం మీదికి వదిలారు. ఇదేమిటయ్యా, ఈ కృత్రిమ పదం అంటే, ఎవరూ సృష్టించకుండా పదాలు ఎలా పుడతాయి? భాష ఎలా పెరుగుతుంది? అని నిలదీస్తారు… అలా పుట్టుకొచ్చిందే ఈ ‘మప్పిదం’, ‘మప్పిదాలు’. ఉహూఁ! మప్పిదాలే! దీనికి ఏకవచన వ్యవహారం లేదు. నిత్య బహువచనరూపమే కదా!
ఈ వ్యవహారం కేవలం ‘ఆంధ్రప్రాంతానికి’ మాత్రమే ఒకటి రెండు వర్గాల్లో ముదిరిన జబ్బు అనుకున్నాను. ఇప్పుడు సిరికోనలో – అంటే సిలికాన్ బే ఏరియాలో – కూడా వినవచ్చేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఇక్కడా తెలుగు కావర్లు ఉన్నారని!
నిజానికి ఇక్కడా, కెనెడా, ఇంగ్లాండు, సౌతాఫ్రికా, సింగపూర్, ఆస్ట్రేలియా అన్ని చోట్లా తెలుగును సంస్కృతం దాడి నుంచి కాపాడుకోవాలనే ‘కూటమి వాళ్ళు’ బాగానే పెరుగుతున్నారని, కూటములో బాగానే ఏర్పడుతున్నాయని, వాటి వెనక కొన్ని సామాజిక కారణాలు కూడా ఉన్నాయని కొంత శోధిస్తే తేటపడింది. సమాజం–అదే కూటమి–అంటూ ఒకటి ఏర్పడిందంటే దాని వెనక సామాజిక కారణాలు తప్పవుగా! సామాజిక అనగానే రాజకీయ అనేదీ ముడిపడే ఉంటుందిగా! ఆ రెంటి కలయికకు ముడిపదార్థం – కుల, లేదా, వర్గదృష్టి!(నోట్: కులమనే మాటను నేడు బహిరంగంగా వాడడం అనాగరికం. వర్గ అనే వాడాలి).
ఈ ఉపోద్ఘాతాన్నంతా అటుంచి విషయంలోకి వస్తాను.
ఆ పదం వాడిన సదరు సభ్యురాల్ని “మీవంటి వైదేశిక తెలుగు కూటస్థులు ఈ పదాన్ని తరచూ వాడడం చూస్తున్నాను.. దయతో దీని భావం, మూలం వివరిస్తారా?” అని ఆ పదం యథార్థ అర్థం గురించి నిస్సిగ్గుగా నా అజ్ఞతను ఒప్పుకొని అడిగాను.
‘ఎన్నెల’ అనే కలం పేరున్న ఆ కెనెడా రాయవరపు లక్ష్మి, మరింత చొక్కపు తెలుగుదనాన్ని దట్టిస్తూ బదులిచ్చారు కదా!: “సంస్కృత పదాలు తప్పించి , తెలుగు పదాలని ఒప్పించే వైనంలో నాలాంటి వారికి మప్పబడిన పదాలివి. మూలములు గిట్ల ఎర్కలెవ్వు. తెలుగు భాషోద్యమ అయ్యోర్లు నేర్వవెట్టిన్రు. మస్తు గొచ్చినయి. మప్పిదాలు, మంగిడీలు, నేరేడల్లులు వాడేస్తున్నాము. మీకు తెలిసే ఉంటుంది. దయచేసి (మీరే) అర్థం వివరించమని ప్రార్థిస్తున్నాను. నేను కూడా నిఘంటువు వెతికాను. మప్పిదాలు పదం దొరకలేదు. మిగతావి కనబడ్డాయి. ముఖపుస్తకం, సీమరేగుపండు లాగా ఈ పదం కూడా ఎవరో కూర్చినదయి ఉండవచ్చు. నచ్చిందని వాడేస్తుంటా… వెన్నెలకోలు అనే పదం ఇంకా నచ్చుతుంది నాకు. కానీ నా కలం పేరు ఆ పదం వాడటానికి అడ్డుపడుతోంది.. జవాబు వివరిస్తారని ఆశిస్తూ విన్నపాలు” అంటూ బదులిచ్చి “వెన్నెలకోలు…” అన్నారు.
నాకు మాత్రం ఏం ఎరికె? అదే అన్నా! “మీ బదుల్లో ‘నాలాంటి వారికి మప్పబడిన పదాలివి’ అంటిరి. అక్కడ మప్పేదానికి అర్దమేంది? దానికీ ఈ మప్పిదాలుకి కనెక్సన్ యేంది? అట్లనే, మీరిప్పిన నుడిగంటులో ఆ నేరెడల్లుల అర్దమ్ కూడా ఎరికె కాలేదు. దాన్ని గూడా కొంచెం చెప్పండ్రి.” అని అడిగాను.
దానికి సికింద్రాబాద్ వద్ద ఆల్వాల్ నుంచి ఇంత దూరదేశానికి వచ్చిన ఆవిడగారు, నిజాయితీగా, “అలవాటు చేయడాన్ని మప్పడమంటారు మా వద్ద. మిగతావి మాత్రం నిఘంటువు లోంచే”. వాటి అర్థాలు తెలియవని దండం పెట్టారు..
ఆ నిఘంటువులు కూడా ఈ ఉద్యమ కారులు కూర్చినవే!
ఏ భాషలో నైనా పదాలు, భాష ముందు వచ్చి, తర్వాత ఆ పదాల అర్థం తెలియని బయటివారికోసమో, లోపలి వారికోసమో నిఘంటువులు వస్తాయి.. కానీ ఇది ఉద్యమం కదా! ఉల్టా వ్యవహారం. నిఘంటువులు ముందు వచ్చి వాటి ద్వారా దేశీయులకే– నేటివ్స్ కే, (నెటిజన్లు,?)– పదాలు నేర్పించడం!
భాష ఇప్పుడు సాంస్కృతిక దశ దాటి, సాంకేతిక దశలోకి ప్రవేశించింది కదా! ఈ మాత్రం సౌలభ్యం తప్పదు.. అందుకే వేమూరి అనే ఒక సాంకేతిక ప్రొఫెసర్ కూర్చిన నిఘంటువులోనే ఇవన్నీ దట్టించబడ్డాయి. సాంకేతిక యుగంలో భాష నైనా సాంకేతిక విజ్ఞానులు నేర్పినప్పుడే అందం, గౌరవం!
ఇంతలో డా.తిరుమల నీరజగారు-“మప్పితమే మప్పిదమైందేమో?ఈ పదాన్ని సాలూరు వారు ఒకరింట్లో విన్నాను. మప్పడం – మప్పితంగా మారిందని నా అనుమానం.” అన్నారు.
“లేదనుకుంటానండీ” అంటూ “ఇది పూర్తిగా ధన్యవాదాల ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు” లక్ష్మి గారు స్పష్టం చేశారు.
ఇంతలో ‘పరిశోధక సంచారి’ మోదుగుల రవికృష్ణ ఇలా తెలియచేశారు: “థాంక్స్‌కి ప్రత్యామ్నాయంగా తమిళనాడులో తెలుగుభాషాసేవకుడు స.వెం.రమేశ్ కనిపెట్టి ప్రచారం చేసిన మాట ఇది. అమ్మనుడి (పూర్వపు ‘నడుస్తున్న చరిత్ర’) పత్రిక ద్వారా నానుడిలోకి వచ్చింది. నాకు దీని అర్థంపై అనుమానం ఉంది. అతనితో స్వల్పపరిచయం ఉంది. ఎప్పుడు ఫోన్ చేసినా చాలా హడావుడిగా తొందర తొందరగా సమాధానాలు చెబుతుండటంతో, ఈ మప్పిదాలే కాదు, ఆయన ప్రచారం చేస్తున్న, రచనలో ఉపయోగిస్తున్న పదాల గురించి నాకున్న సందేహాలను అడగలేకపోయాను.
మప్పటం అంటే నేర్పటం కూడా. ‘వాడికి బాగా మప్పారు’.
మప్పితము అంటే నేర్పుగా, యింపుగా అనే అర్థాలు కూడా కలవు. ‘వాడు ఈ విషయంలో మాత్రం మప్పితంగా మాట్లాడాడు.’ ‘ఆమె అత్తవారింట్లో మప్పితంగా నడచుకొంది.’ ..
ఆయన మాట బాగుంది. కానీ ఇక్కడ, ఈ రెండో ఉదాహరణలో మప్పితం అంటే ఇంపు అని కాక, నేర్పుగా అనే తీసుకోవాలి. కానీ అందులో చిన్న మతలబు ఉందని నా అనుమానం.
దాన్నే ప్రస్తావిస్తూ “ఈ మప్పితం వెనుక మా రాయలసీమ పలుకుబడిలో నా ఎరుక పరిధిలో –చిన్నపాటి నెగటివ్ షేడ్ కూడా ఉంది.. అసలు మా వైపు దీని వాడుక తక్కువ. ఉన్నచోట ఆ నేర్పు, ఇంపు ఒక ‘జాణతనా’నికి సంబంధించినవి.. బాగా మప్పి పంపించారు–అంటే బాగా ‘నేర్పించి'(?) పంపించారు అని భావం. (కోడల్ని అత్తారింటికో, లేక అల్లున్ని ‘మామగారింటికో’. ఎందుకో ఊహ్యము!!). దాన్ని పట్టుకొచ్చి శిష్టార్థంలో ధన్యవాదాలు అని చెప్పటానికి వాడడం, మరీ మిగులబారిన నేర్పరితనం కదా!! అది యావదాంధ్రులకు రాని విద్య. వచ్చిన వారు, ఇతరులపై అలాటి దాన్ని రుద్దటం కూడా హర్షణీయం కాదు!!
“అసలు ఈ పదాలను ఇలా “తయారుచేసి”, తెలుగు జాతిపై నిఘంటువుల (నుడిగంట్లు) రూపంతో, ఈ తెలుగు కావలి కూటస్థులు మోది రుద్దటం ఏ పాటి పాడి? శతాబ్దాలుగా తెలుగున జీర్ణించి, దానికి అనల్ప విశిష్టతను కూర్చిన సంస్కృత పదజాలాన్ని -తత్సమ, తద్భవాలను- కాదనుకోవటం ఏమాత్రం వివేకం!?… అరవ కాడలను కాల్చి తెలుగుకు వాతలు పెట్టడం ఏమాత్రం విజ్ఞత?
“ఈ పైత్యం ఎన్నారైలలో కొందరికి పాకుతుండటం మరింత వింతగా ఉంది? దేనికైనా మందుంటుంది కానీ, భాషాపైత్యానికి మాత్రం-అది ఏ విపరీతపు అంచులకు వెళ్లినా- మందు లేదు కదా!
“భాషామమకారం కావాలికానీ, భాషాపైత్యాలు కాదు కావలసింది సంస్కృతి ప్రియులకి!” అని నా పైత్యం పూర్తి బయటపెట్టేశాను…
ఇంతలో నుడికారమే తన మమకారంగా కలిగిన ప్రముఖ పాత్రికేయులు ఎర్రాప్రగడ రామకృష్ణ గారు: “గోదావరి జిల్లాల్లో ‘మా కోడలికి వాళ్ళ అమ్మ బాగా మప్పి పెట్టి పంపింది కాపురానికి’ అంటూ నింద ధ్వనించేలా అనడం ఉంది” అంటూ స్పష్టపరిచారు. అంటే మా రా.సీమ వాడుకలోని అంతర్భావమే అటు తూర్పుగోదావరి జిల్లా పర్యంతం ఉందన్న మాట!
ఈ దశలో ‘మధురకవి’ బులుసు వెంకటేశ్వర్లు గారు ఒక అందమైన పదం విసిరారు:
ఆ.వె.
మప్పిదాలకన్న మంచిపదాలుండె;
ధన్యవాదములకు తగిన వరయ;
ఒగి నిఘంటు లోన ఉన్నవన్నియు కూడ;
వ్యావహారమునకు పనికి రావు;
డా. చొప్పకట్ల సత్యనారాయణ గారు తమిళనాట కూడా తెలుగు మాండలికాలున్నాయి. వాటి వ్యవహారంలో ‘నేర్పించు’ అనే అర్థంతో పాటు ఈ అర్థం ఉండే అవకాశం లేదా? అనే సందేహం వెలిబుచ్చారు. తమిళనాడు లోని సభ్యులు కానీ, తమిళ భాషా కోవిదులైన సభ్యులు కానీ ఆ మాటపై ప్రతిస్పందించ లేదు…
అప్పుడు మళ్లీ నేను నా మిడి మిడి జ్ఞానాన్ని చూపుతూ నా పైత్యం మరింత ఒలకబోశాను. “తమిళనాట కూడా రెండు మూడురకాల తెలుగు మాండలికాలున్నాయి. ఏ మాండలిక మర్యాదల్ని ఆ మాండలికాలకిద్దాం. యాసల పేరిట అవహేళనలు లేకుండా, భాషను హాస్యరసపు ముడిసరుకుగా మార్చుకోకుండా (ప్రస్తుతం వెండి/బుల్లి తెర వ్యాపారులు చేసే పని), ప్రతి మాండలికపు విశిష్టతల్ని కాపాడుకొందాం. మన మాండలికాన్ని మనం నిలుపుకొందాం. గౌరవించుకొందాం.. అన్ని మాండలికాల పదాల్ని సేకరించుకొని భద్రపరచుకొందాం. మాండలికాలకతీతమైన సకలశిష్టజన సమ్మతమైన వ్యావహారికాన్ని సామూహిక రంగంలో పాటిద్దాం.. ఇది మన భాషా దృష్టి కావాలి. అప్పుడే భాష, భాషలో దాగున్న తరతరాల సాంస్కృతిక సాధన మనగలుగుతుంది…
మిగిలిన భాషల వారందరికీ ఉన్న ఈ వివేక బుద్ధి తెలుగువారికొక్కరికే ఎందుకు తక్కువవుతోందో తెలియటం లేదు… తమిళనాడుతో సహా, మిగిలిన రాష్ట్రాల్లో భాష పేరిట యునైట్ అవుతారు. తెలుగువారొక్కరే డివైడ్ అవుతున్నారు… విశ్వామిత్ర సంతతి.. ఊరకేపోతుందా వారసత్వం??”
అప్పుడు తాటిపాముల మృత్యుంజయుడు గారు స్పందిస్తూ: “ఇంతమంది పండితులున్న సమూహంలో ఒక పదంపై ఇంతగా తర్జనభర్జన జరగడం, ఒక కొలిక్కి రాకపోవడం మొదటిసారిగా చూస్తున్నాను. పోనీ, ఏకంగా వేమూరి గారినే సంప్రదిస్తే కొంత బోధపడుతుందేమో” అన్నారు. అంతదాకా కోనలో మిత్రులు ఉదాహరించిన, ఈ పద రాజంబులు కలిగిన, ఏకైక నిఘంటువు వేమూరి వారిదే కావటం వల్ల, వారి ప్రస్తావన వచ్చిందన్న మాట!
మృత్యుంజయుడు గారు అంతటితో ఆగలేదు. “నావరకైతే, ఈ పదం తెలుగులో ఈ సందర్భంలో సరిగ్గా మప్పలేదు.” అని తన అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా వ్యక్తపరిచారు…
దానిపై నేను స్పందిస్తూ – ” వేమూరి గారిని సంప్రదించేటప్పుడు, వారు కూడా సృష్టించి తెలుగులోకి వదిలిన పదేంద్ర జాలాన్ని కాస్త లఘువుగా పరిచయం చేయమనండి!!
జై ఎన్నారై తెలుగు
జైజై ఎన్నెల తెలుగు
పలు వన్నెల తెలుగు” అంటూ మంగళ మహాశ్రీ చెబుదామనుకొన్నా!
** **
కానీ అంతలో, మొదట్లో నేను “థాంక్స్‌కు దండాలు, నమస్కారం అనడం మన తెలుగు శిష్టాచారం” అనే మాటల్ని గుర్తు పెట్టుకొని, శ్రీమతి విజయశ్రీముఖి: “నాకు చిన్న సందేహమండీ.. ‘దండం’ ‘దణ్ణం’ ఈ రెంటిలో ఏది సరైన పదం? మాకు(కృష్ణాలో) దణ్ణం అనటం అలవాటు” అంటూ ఒక మంచి అనుమానాన్ని వ్యక్తపరచి చర్చను మరో మలుపు తిప్పారు…
నల్లగొండసీమ వారైన రెబ్బారం రాంబాబు గారు “దండ వేసి దండం పెడితే గండం నుండి తప్పిస్తాడు అంటారు, తెలంగాణాలో.. కృష్ణా వాళ్లదే స్పష్టమైన తెలుగంటారు కదా!… కనుక దణ్ణమే సరైన పదమేమో!” అన్నారు..
ఏసీపీ శాస్త్రిగారు సాంప్రదాయిక విషయాల్లో దిట్ట. “అసలు మాట దండం. అంటే కర్ర. సాష్టాంగం చేసేటప్పుడు కర్ర మాదిరిగా వంకరలేకుండా, నేలమీద కర్ర పడేస్తే ఎలా ఉంటుందో అలా “దండవత్ పతతి” ..కర్ర మాదిరిగా సాష్టాంగ పడ్డాడు” అని అసలు మాటను తన భావాన్ని స్పష్టపరిచారు.
“దండమయా విశ్వంభర / దండమయా పుండరీక/ దళ నేత్ర హరీ” అంటూ సంప్రదాయ కీర్తనను స్ఫురణకు తెచ్చారు ఎర్రాప్రగడ గారు..
సిరికోనలో సంప్రదాయపు ప్రశ్న వస్తే, సప్రామాణికంగా తీర్చేవారు మా ఆచార్య రాణి సదాశివమూర్తి గారు. వారు “తెలుగు లో ‘దండం’… నమస్కారం. దండమే! సంస్కృతంలో ‘దణ్ణం’ అంటే శిక్ష.” అంటూ స్పష్టంగా తెలుగు, సంస్కృతాల్లో ఆ మాటల అర్థాన్ని విశదపరిచారు… నాకైతే ఈ రెండో విషయ వివరణ కొత్త. అందుకే ఆచార్యుల వారికి ధన్యవాదాలు సమర్పించాను…
కోనలోని మరో ఉన్నత స్థాయి సంస్కృత విద్వాంసులు డా.సూరం శ్రీనివాసులు గారు, ఏసీపీ శాస్త్రి గారి భావాన్ని, ఆచార్యుల వారి వివరణను సమన్వయపరుస్తూ, ఇలా తేటపరచి, ఒక చమత్కార విశేషంతో ముక్తాయింపు నిచ్చేశారు:
“దండం సంస్కృతంలో కఱ్ఱ అనే అర్థంలో…(ఉంది)
దండాలు ఎక్కువపెట్టిన కవి /లాక్షణికుడు
దండి అయ్యాడు సంస్కృతంలో…
(దండి విరచితమైన) ‘దశకుమారచరితమ్’..ప్రార్థనాశ్లోకం..(చూడండి)
బ్రహ్మాండచ్ఛత్రదండః శతధృతిభవనాంభోరుహో నాళదండః
క్షోణీనౌకూపదండః క్షరదమరసరిత్పట్టికాకేతుదండః౹
జ్యోతిశ్చక్రాండదండః త్రిభువనవిజయస్తంభదండో౽ఘ్రిదండః
శ్రేయస్త్రైవిక్రమస్తే వితరతు విబుధద్వేషిణాం కాలదండః౹౹”
(అన్ని దండాలు ప్రార్థనా శ్లోకంలో పెట్టాడు కనుక ఆయనకు దండి అనే పేరు స్థిరపడిపోయింది అని చమత్కారం. నిజానికి దండి అసలు పేరు అవునా కాదా అనే చర్చ ఒకటుంది లెండి! … ఇదీ ఇటీవల మా కోన ముచ్చట!! ― లనా)