‘సిరికోన’ చర్చాకదంబం-7

0
2

[box type=’note’ fontsize=’16’] సిరికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. [/box]

3 గొప్ప శబ్దార్థ చర్చలు

1.శారదశబ్దం రూప-అర్థ నిష్పత్తి ;

2. “స్నేహంమైత్రి సమానార్థకాలేనా?”

 ― ఆచార్య రాణీ సదాశివమూర్తి

 (అనుబంధం : శ్రీ కొలిచాల సురేశ్)

3. రాముడి “ఏకపత్నీత్వం” శబ్ద విచారం

 ― డా. సూరం శ్రీనివాసులు, డా.పాలపర్తి , శ్రీ పాలడుగు,

 డా.చొప్పకట్ల & డా. తుమ్మలపల్లి వాణీకుమారి చర్చ

 చర్చా కదంబ నివేదన : గంగిశెట్టి ల.నా

***

1.శారదా రూపం – భావం మీద ‘సిరికోన’లో మార్చిలో గంభీర చర్చ జరిగింది. అప్పుడు ఆచార్య రాణీ సదాశివమూర్తి గారు ఇచ్చిన అపూర్వ వివరణ ఇది:

“మంత్ర శాస్త్రం లోని జ్ఞానం పాదంలో చెప్పిన విధంగా…

*శార* శబ్దానికి మోక్షము అని అర్థం… “శారం దదాతీతి శారదా” అంటే “మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక శారద” అని చెప్పారు.

అలాగే తిథ్యాది తత్త్వార్థంగా ‘పురాణాలలో’… “శరత్కాలే పురా యస్మాత్ నవమ్యాం బోధితా సురైః। శారదా సా సమాఖ్యాతా పీఠే లోకే చ నామతః ॥” అని చెప్పారు.

అంటే… శరత్కాలంలో నవమీతిథినాడు దేవతల చేత తమ రక్షణార్ధం స్తుతుల ద్వారా ప్రబోధింపబడింది కనుక పీఠమునందునూ, లోకము నందునూ “శారద”అని పిలువబడుచున్నది. అని చెప్పారు.

ఇక్కడ “పీఠం” అంటే మఠాదులు కావు. 51శక్తిక్షేత్రాలకు “పీఠములు” లేక “శక్తి స్థానములు” అని పేరు. కనుక “పీఠే” అంటే “శక్తిస్థానే” అని అర్థం చెప్పుకోవాలి.

ఈ అపూర్వ వివరణకు జోహార్లు చెప్పడం కంటే మరేం చెప్పగలం?

***

2. అలాగే “స్నేహంమైత్రి సమానార్థకాలేనా?” అనే ప్రశ్న మొన్న నవంబరులో ఓ ప్రశ్న ఉత్పన్నమైంది.

 – సంస్కృతంలో కాదనే చెప్పారు ఆచార్య రాణీ సదాశివమూర్తి గారు. వారి మాటలివి:

“భర్తృహరి సుభాషితాలలో… ఈ విషయంలో చెబుతూ స్నేహాన్ని, మైత్రిని వేరుగా చూపారు.

అమరంలో…. స్నేహం … అంటే ప్రేమ అని, మైత్రి అంటే మిత్రబంధం (చెలిమి) అని చెప్పారు.

దౌర్మన్త్ర్యాన్నృపతిర్వినశ్యతి, యతి స్సఙ్గాత్సుతో లాలనా

ద్విప్రోऽనధ్యయనా,త్కులం కుతనయా,చ్ఛీలం ఖలో పాసనాత్

హ్రీలర్మద్యా దనవేక్షణాదపి కృషిః *స్నేహః ప్రవాసాశ్రయా*,

*న్మైత్రీ చాప్రణయా,* త్సమృద్ధి రనయా,త్త్యాగా త్ర్పమాదాద్ధనమ్. 33

దుష్టమంత్రాంగముచే రాజు, సన్యాసి లోకసంగముచేత, లాలనవల్ల పుత్రుడు, అనధ్యయనమువలన పండితుడు, వంశము చెడ్డ కుమారుని వలన, దుష్టులసహవాసముచేత శీలము, మద్యమును త్రాగుట చేత సిగ్గు, అలక్ష్యము వలన వ్యవసాయము, *ప్రేమ (స్నేహం) దూరదేశములందు* *నివసించుట చేతను*, *చెలిమి (మైత్రి) ఇష్టము తగ్గించుకొనుటచేతను,* సంపదలు దుష్ట రాజనీతి వలననూ, విడిచిపెట్టుట, జాగ్రత్తలేమి వలన ధనము – నశించును.

దీనిని ఏనుగు లక్ష్మణ కవి కొన్ని మార్పులు చేసి చెప్పారు:

యతి సంగంబున, బాలుఁ డాదరముచే, జ్యాభర్త దుర్మంత్రిచే,

శ్రుతిహానిన్ ద్విజుఁ, డన్వయంబు ఖలుచేఁ, గ్రూరాప్తిచే శీల, ము

ద్ధతిచే మిత్రత, చూపులేమిఁ గృషి, మద్యప్రాప్తి చే సిగ్గు, దు

ర్మతిచే సంపదలున్, నశించుఁ, జెడు నర్థంబుల్ ప్రమాదంబునన్.

[(వనితా) సంయోగము వలన సన్యాసియు, ఆదరించుటచే బాలుడును, దుష్టమంత్రిచే రాజును, శాస్త్రము రాక బ్రాహ్మణుడును, దుర్మార్గునిచే వంశమును,దుష్టులను చేరుటచే శీలమును, గర్వముచే స్నేహమును, చూడకపోవుటచే సేద్యమును, కల్లు త్రాగుటచే లజ్జయును, చెడుబుద్ధిచే సంపదలును, పరాకుచే కార్యము (ధనము)ను చెడిపోవును.]

లక్ష్మణకవి స్నేహాన్ని విడిచి మైత్రి ఉద్ధతివలన చెడుతుంది అని స్వేచ్ఛతీసుకున్నారు

అలాగే ఇద్దరు పూర్వమిత్రులు ఎలా శత్రువులౌతారో చెప్పేదే

పంచతంత్రం లోని *మిత్రభేదం*

అంటే ఏనుగు లక్ష్మణకవి నాటికి తెలుగులో స్నేహం, మిత్రత (మైత్రి) సమాన/ పర్యాయ శబ్దాలుగా రూఢి పడ్డాయన్నమాట! ఈ మాటకు ‘అవును’ అన్నారు ఆచార్యుల వారు!

***

ఈ మాటలకు అనుబంధంగా అట్లాంటా లోని కొలిచాల సురేశ్ గారు ఈ తెలుగు మహా కవుల ప్రయోగాన్ని చూపి తెలుగులో కలిగిన అర్థ పరిణామ భేదాన్ని చారిత్రకంగా నిరూపించారు :

“నన్నయ్య స్నేహాన్ని “ప్రేమ” (స్త్రీపురుషుల మధ్య ప్రేమ) అన్న అర్థంలోనే వాడాడు. (1-8-1, 145 – ” రురుండు…… ప్రమద్వరయన నొప్పుచున్న కన్యక నతిస్నేహంబున వివాహంబుగా నిశ్చయించి”)”

పోతన స్నేహాన్ని కృష్ణుని-కుచేలుని మైత్రి విషయంలో ప్రస్తావించాడు.

“అనఘ! మన మధ్యయనంబు సేయుచు నన్యోన్య *స్నేహ* వాత్స ల్యంబులం జేయు కృత్యంబులు మఱవవు గదా!” యని యవి యెల్లం దలంచి యాడు మాధవు మధురాలాపంబులు విని యతనిం గనుంగొని కుచేలుం డిట్లనియె.” (పోతన భాగవతం)

కాబట్టి తెలుగులో ఈ అర్థం నన్నయ-పోతన మధ్య కాలంలో మారిందని చెప్పుకోవచ్చు.”

***

  1. రాముడి “ఏకపత్నీత్వం” – శబ్ద విచారం

ఒకమారు డా. తుమ్మలపల్లి వాణీకుమారి గారు అడిగారు:

“మామూలుగా ‘ రాముడు ఏకపత్నీవ్రతుడు’ అంటాం కదా! సుందరకాండ 53 వ సర్గ 28 వ శ్లోకంలో సీతమ్మ అగ్నిదేవుని “యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః” అని ప్రార్ధిస్తుంది.ఇక్కడ ఏకపత్నీత్వమ్ అనే మాటను ఎవరిపరంగా అన్వయించుకోవాలి? దయచేసి సందేహనివృత్తి చేయవలసినదిగా ప్రార్థన.”

వారి గురువుగారు డా.చొప్పకట్ల సత్యనారాయణ గారు వెంటనే ఆ మాటల భావం ఇలా వివరించారు: “సతీత్వమే పత్నీత్వం! నే మనోవాక్కాయకర్మలతో ఒకరికే పత్నిగా నుండగోరితినేని ఓవీతిహోత్రా! చల్లబడుమని భావం!”

ఆపై ప్రశ్న భావాన్ని గ్రహించి డా. సూరం శ్రీనివాసులు గారు ఇలా సంశయ నివృత్తి చేశారు: “ఏకః పతిః యస్యాః సా ఏకపత్నీ.. ఒకే భర్త గల స్త్రీ.ఇది వ్యాకరణసమ్మతమైన అర్థం.

ఇక శ్రీరామునిలోని ఏకపత్నీవ్రతత్వం వ్యవహారసిద్ధం.అంతే!”

సూరం వారికి ఆత్మీయులు, శిష్యులు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ శతావధాని గారు. వారు చమత్కారంగా “దీనికి ఎందుకనో పాణిని ‘నో’ అన్నాడండీ” అన్నారు.

ఇలాటి సంస్కృత పండిత చమత్కారాలు అందరికీ ఒకపట్టాన అర్థమౌతాయా? అందుకే పాలడుగు శ్రీచరణ్ అవధాని గారు “పాలపర్తి వారి చమత్కారము! ఇది ఇంగ్లీషు No కాదు” అంటూ, ఆ ‘నో’ మర్మాన్నిలా విడమరిచి చెప్పారు : “‘పత్యుర్ నో యజ్ఞ సంయోగే’ అనే సూత్రము చే పతి శబ్దానికి (ఙీప్) స్త్రీ ప్రత్యయము చేర్చునపుడు, పతి చివరనున్న ఇ-కారానికి న-కారము వస్తుంది. పత్యుః నః యజ్ఞసంయోగే, లో సంధి జరిగి ‘నో’ అయినది.

పతి + ఙీప్ –> పత్న్ + ఙీప్ –>

పత్న్ + ఈ –> పత్నీ

అలాగే ‘నిత్యం సపత్న్యాదిషు’ అని తరువాతి సూత్రము చే సమాన, ఏక, వీర, పిణ్డ, భ్రాతృ, పుత్ర, దాస అనే శబ్దాలతో పతి శబ్దము సమాసము చేస్తే అప్పుడు కూడ ఈ న-కారాదేశము వస్తుంది, పై సూత్రమునుండి అనువృత్తిగా.

 ఏక + పతి + ఙీప్ –> ఏక పత్న్ ఈ –> ఏకపత్నీ. ఒక్కడే పతి కలిగిన స్త్రీ.”

బదులుగా తుమ్మలపల్లి వాణీ కుమారి “అయ్యో! అవధానుల చమత్కారాన్ని అర్థం చేసుకోలేకపోయానండి. మీకు ప్రత్యేక ధన్యవాదాలు.” అని ధన్యవాదాలు సమర్పిస్తోంటే , డా. చొప్పకట్ల గారు “సంస్కృతంలో ఉండే వెసులుబాటే అది. యెలాగైనా తిప్పుకోవచ్చు” అంటూ ముక్తాయింపు నిచ్చారు.

అయితే విషయం అంతటితో ముగిసిందా? ముగిస్తే, ‘సిరికోన ముచ్చట్ల’ సత్ఫల స్వరూపం ఎలా పూర్ణమౌతుంది..

పాలపర్తి గారు మరో రెండు చక్కటి చమత్కారాలతో మరి కాస్త సంస్కృత బోధ కలిగించారు:

“పాణినిమహర్షి తెలుగువారేనని వారికి ఆంగ్లం కూడా వచ్చుననటానికి చాలా బలమైన ఆధారాలు పాణినీయంలో ఉన్నాయి. మేం చదువుకునే రోజుల్లో అవన్నీ పట్టేసేవాళ్ళం. ప్రస్తుతానికి అందరికీ తెలిసే ఒకటి రెండు ఉదాహరణలు.

1.డు కృఞ్ కరణే ధాతుపాఠంలో మొదట ఆంగ్లంలోDoచెప్పిఅంటే కృఞ్ అనగా చేయుట అనిచెప్పి ఆంగ్లానికి పెద్దపీట వేశాడు.అందుకే ఇప్పుడు పిల్లలందరూ సంస్కృతాన్ని ఆంగ్లంలో రాసి వందకు వంద తెచ్చుకుంటున్నారు.

2.రాజాహస్సఖీభ్యః టచ్

ఈ సూత్రంలో మనం ఎప్పుడూ ఎవరితో టచ్ లో ఉండాలో సూత్రప్రాయంగా ఆంగ్లపదంతో సూచించాడు.

రాజుతో (పై అధికారులు)స్నేహితులతో రోజంతా టచ్ లో ఉండాలని నిర్దేశించారు.

3.అదేంగుణః అనే సూత్రంలో అది ఏం గుణం అని తెలుగులో గుణసంజ్ఞను వివరించారు.

 మీరు ఇలా ఎందుకు చేసారని ఒకవ్యక్తి అడుగుతున్నాడంటే

‘ఆడుత్తమస్యపిచ్చ’

(ఆడుత్తపిచ్చోడు)అని అౘ్చతెలుగులో అనేశారు.

ఇలాంటివి ఇంకా ఉన్నాయి కాని ఇవి చాలనుకుంటాను.

(మా ప్రాచ్య కళాశాలలలో ఇలాంటిదే మేం పుట్టించుకున్న హాస్యం)”

“అభ్యాసే చర్చ!” అని మరోసారి పాలడుగు గారు చమత్కరిస్తే ,

“అభ్యాసంలో చర్చ చేసే సంగోష్ఠులు(సెమినార్లు)కూడా ఆయన చలవే!” అంటూ పాలపర్తి గారు తన గురువుగారిని స్మరించుకొన్నారు..

మా లాటి వాళ్లకు ఆ సంస్కృత వ్యాకరణం ఒంటబట్టినా లేకున్నా, ఆ చివరి చమత్కారాలు మాత్రం బాగా రుచిగా వంటబట్టాయి… ఎంతయినా తెలుగు వంటకమే వంట!! **

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here