[dropcap]సి[/dropcap]రికొన (సిలికాన్) సాహితీ అకాడమీ, డల్లాస్, యు.ఎస్ వారు నిర్వహించిన నవలల పోటీ 2023 విజేతలకు సన్మాన/అభినందన సభ (జూమ్)
~
8 జూన్ 2024వ తేదీ రా. 8-30 గంటలకు అంతర్జాల సమావేశం జరిగింది. సిరికోన సంస్థ, నటసామ్రాట్ అక్కినేని శత జయంతి సందర్భంగా, కళాకారుల జీవిత నేపథ్యంగా, స్వర్గీయ ‘జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ గారల స్మారక నవలా రచనల పోటీ 2023’ ను నిర్వహించింది. దీనిలో ప్రథమ బహుమతిని రెండు విశిష్ట బహుమతులుగా, శ్రీ పాణ్యం దత్తశర్మ గారి నవల ‘శ్రీమద్రమారమణ’కు, శ్రీమతి ఉమా భారతి కోసూరి గారి నవల ‘హృదయ రాగం’ కు సంయుక్తంగా, 30 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిరికోన హైదరాబాద్ ప్రతినిధి శ్రీ ఎన్. సి. చక్రవర్తిగారు పాణ్యం దత్తశర్మగారి యింటికి విచ్చేసి, వారిని, వారి సతీమణి శ్రీమతి హిరణ్మయి గారిని, శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
సభక ప్రయోక్తగా శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు వ్యవహరించి, సభను ఆద్యంతమూ ఆసక్తికరంగా నడిపారు. శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యంగారు సభ్యులకు స్వాగతం పలికి, సిరికోన పురస్కారాల గురించి తెలిపారు. గంగిశెట్టివారు విజేతలను సభకు పరిచయం చేసి అభినందించారు. ప్రత్యేక బహుమతిని డా. మంథా భానుమతి గారి నవల ‘కచ్ఛపినాదం’కు అందజేశారు. నవలల వక్తలుగా, సమీక్షకులుగా తాటిపాముల మృత్యుంజయుడు, డా. రాయదుర్గం విజయలక్ష్మిగారు వ్యవహరించారు.
తాటిపాముల వారు పాణ్యం దత్తకర్మ నవలను లోతుగా సమీక్షించి, ఒక కళారూపాన్ని ఎలా నవీకరించి, పునరుజ్జీవితం చేయాలో నవలా రచయిత సూచించారని అన్నారు. నవలలోని ముఖ్యపాత్ర ‘దస్తగిరి’ని ఆయన, పొరపాటున ‘సులేమాన్’ అని పేర్కొన్నారు. రాయదుర్గం వారి సమీక్షలో సరిగ్గా చెప్పారు. ఆమె, రాయలసీమ నేపథ్యంలో, వారి యాసను, భూస్వామ్య వ్యవస్థలోని దోపిడీ, దౌష్ట్యాలను, దత్తశర్మ గారు అద్భుతంగా చిత్రీకరించారని ప్రశంసించారు.
తాటిపాములవారు, కేవలం ఐదారు పాత్రలకే నవలను పరిమితం చేయకుండా, మరి కొన్ని సమకాలీన పాత్రులను సృష్టించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాని, ఇతివృత్తం పరిధిని బట్టి పాత్రల సంఖ్య ఉంటుంది కదా! పాత్రల కోసం పాత్రలను సృష్టించడం అభిలషణీయం కాదు. ముఖ్యపాత్రను పెద్ద ఎత్తున గ్లోరిఫై చేసి, నవలను వేగంగా ముగించినట్లు అనిపించిందని, సమస్యకు పరిష్కారం సూచించలేదని, ముఖ్యపాత్రను వివాహమాడిన అమ్మాయికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని, తాటిపాములవారన్నారు. ఒక యానాదుల కుటుంబంలో, అతి బీద కుటుంబంలో పుట్టి, దైవదత్తమైన సంగత జ్ఞానాన్ని, గురువుల అనుగ్రహ సౌజన్యాలతో పెంపొందించుకొని, ‘ఇంతింతై వటుడింతయై’ అన్నట్లుగా ఎదిగిన protagonist వైనతేయ. అదే స్థాయిలో అతనికి భార్య లభించాలని ఏముంది? ఒక లుప్తమవుతూన్న కళకు ఎలా జీవం పోయాలో నవలంతానే గాక, చివర, వైనతేయ పాత్ర ద్వారా పరిష్కారం కూడా సూచించడం జరిగింది. ఏది ఏమైనా, సమీక్షలు వారి అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేయడం ముదావహం.
తర్వాత పురస్కార గ్రహీతలు తమ కృతజ్ఞతలను తెలియజేశారు. పాణ్యం దత్తశర్మ గారు మాట్లాడుతూ, పోటీకి ఇచ్చిన ఇతివృత్తమే, సిరికోన వారి ఉత్తమాభిరుచికి నిదర్శనమన్నారు. ‘విద్యానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం’ అన్న ఆర్యోక్తి ప్రకారం తన కృషిని గుర్తించి పురస్కారమునిచ్చిన సిరికోన సారథులకు ఆయన జోతలర్పించారు. డల్లాస్, న్యూజెర్సీ, లాస్ ఏంజల్స్. ఇండియా మొ॥ ప్రాంతాల నుండి దాదాపు 40 మంది సాహిత్యాభిమానులు, సాహితీవేత్తలు సమావేశంలో పాల్గొన్నారు. సభ దాదాపు 2 గంటల 30 నిముషాలు సాగింది.
వరంగల్, ‘సహృదయ’ సారథి శ్రీ డా. గన్నమనేని గిరిజామనోహర బాబు గారు ప్రసంగిస్తూ తమ ఆత్మీయ మిత్రులు దత్తశర్మ అని, వారికి ఈ పురస్కారం రావడం చాలా సంతోషదాయకమని అన్నారు. లెనిన్ గారు తమ స్పందన తెలియజేస్తూ, ఇలాంటి నవలల వల్ల పాఠకులు ఎంతో నేర్చుకుంటారన్నారు. శ్రీ శంకరకుమారశర్మగారు ప్రసంగిస్తూ నవలలోని కీర్తనలు, పద్యాలు చాలా మటుకు దత్తశర్మగారి స్వంత రచనలేనని చెప్పారు. ‘శ్రీమద్రమారమణ’ అనే పేరు నవలకు సరిగ్గా సరిపోయిందన్నారు. నవలలో వచ్చే హరికథ ‘శంకరవిజయం’ నుండి, ఆదిశంకరులను చండాల రూపంలో వచ్చిన పరమేశ్వరుడు అధిక్షేపించిన సందర్భంలోని, దత్తశర్మ విరచితపద్యాన్ని, రాగయుక్తంగా, మధురంగా ఆలపించి, సభకులను ముగ్ధులను చేశారు. డా. జెట్టి యల్లమంద గారు సభకు హాజరై, తమ చిరకాల మిత్రునికి అభినందనలు తెలిపారు. డా. వైరాగ్యం ప్రభాకర్ గారు హాజరై సభను సుసంపన్నం చేశారు. ఎందరో సభను వీక్షించి, ఆనందించారు. దీని ప్రత్యక్ష ప్రసారం యుట్యాబ్‌లో కూడా వచ్చింది.
చివర్లో గంగిశెట్టి వారు మాట్లాడుతూ, దత్తశర్మగారి సాహితీప్రస్థానం తనకు అబ్బురాన్ని కల్గిస్తూ ఉంటుందని, కథ, నవల, సాహిత్యవిమర్శ, నాటక, పద్యరచన, ఉత్ప్రేరక ప్రసంగాలు ఇలా ప్రతివారం ఏదో విధంగా, అన్ని జానర్‌లలో దత్తశర్మగారు కనబడుతుంటారని ప్రశంసించారు. నోబెల్ పురస్కార గ్రహీత E. M. Forster గారి ‘Aspects of the Novel’ (1927) నుండి, నవల యొక్క లక్షణాలను ఉటంకించి, బహుమతి పొందిన నవలలతో అన్వయించి చూపి, సభికులను ఆశ్చర్యచకితులను చేశారు. ఆ లక్షణాలను బట్టి, రచయితలు తమ నవలలను మెరుగుపరచుకోవాలన్నారు. ప్రతిభావంతులైన రచయితలు, ఏ లాక్షణిక గ్రంథాలను చదవకుండానే, తమ రచనలలో వాటిని వెలయిస్తారు. గ్రంథాల ఆధారంగానే లక్షణాలు ఏర్పడతాయి.
సభ చివర, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యంగారు వందన సమర్పణ చేశారు.