Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 10 – నవ్వులతో అన్ని బాధలను తరిమేయమనే గీతం

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

మరీ అంతగా మహా చింతగా

~

చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: మిక్కి జె. మేయర్

గాత్రం: శ్రీరామచంద్ర

~

సాహిత్యం

మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా..

పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా

మతోయేంతగా శ్రుతే పెంచక విచారాల విలవిల

సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా

కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా

ముస్తాబే చెదరాలా నిను చూడాలంటే అద్దం జడిసేలా

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా

కదా మరెందుకు గోల

అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృథా ప్రయాస పడాలా ॥ మరీ అంతగా ॥

చరణం:

ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలినెటో తరిమేస్తామా ఛీ పొమ్మని

కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా

రోజులతో రాజీపడమా సర్లెమ్మని

సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం

పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం ॥ ఎక్కిళ్ళే పెట్టి ॥

చరణం:

చెమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా

పెదవిపై చిగురించేలా చిరునవ్వులు

కండలను కరిగించాలా కొండలను కదిలించాలా

చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు

మనుషులనిపించే ఋజువు మమతలను పెంచే ఋతువు

మనసులను తెరిచే హితవు వందేళ్ళయినా వాడని చిరునవ్వు ॥ ఎక్కిళ్ళే పెట్టి ॥

నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం.. అంటారు జంధ్యాల. ‘నవ్వుతూ బ్రతకాలి రా తమ్ముడు, నవ్వుతూ చావాలి రా, చచ్చినాక నవ్వలేవురా..’ అని బ్రతికినంత కాలం హాయిగా నవ్వుకుంటూ ఉండమన్నది ఆత్రేయ గారి సందేశం (మాయదారి మల్లిగాడు చిత్రంలోని పాటలో)

‘He who smiles, achieves.’ అన్నది ఒక ఆంగ్ల సామెత.

తెల్లారి లేచిన దగ్గర్నుంచి ప్రతివారికీ ఏవో సమస్యలూ, ఏవేవో బాధలు, టెన్షన్లు. అవి లేనిదెవరికీ? వాటిని తప్పించుకోలేం కాబట్టి చేయాల్సిందేమిటి? ఈతిబాధల్లోనే ఈదులాడాలి. ఆ ఈతనే ఆనందించాలి. వేరే దారి లేదు. ఒకవేళ, దాని నుండి తప్పించుకుంటే, తలెత్తకుండా మొబైల్ ఫోన్లు, తలెత్తితే శిక్ష పడుతుందేమో అనే లాగా! అన్ని వయసుల వారిని వేధిస్తున్న అతి పెద్ద అడిక్షన్ ఇది. వీటన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలంటే, మనసారా వీలైనంత నవ్వుకోవాలి!

“సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు,

చిరకాలముండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు..

…………

చిరుగాలి తరగల్లె మెలమెల్లగా.. సెలయేటి నురగల్లె తెలతెల్లగా

చిననాటి కలలల్లె తియతియ్యగా.. ఎన్నెన్నో రాగాలు రవళించగా.. రవళించగా.. “

సిరిమల్లె పువ్వు లాగా, చిన్నారి పాప లాగా, చిరుగాలి లాగా, సెలయేటి గలగలలాగా, చిన్ననాటి తీయటి కలల లాగా.. నవ్వుతూ బ్రతికేయమంటారు ఆచార్య ఆత్రేయ ‘జ్యోతి’ చిత్రం కోసం రాసిన ఒక మధురమైన పాటలో.

~

“Are you worsened in a fight..

Laugh it off,

Are you cheated in a right

Laugh it off,

Don’t make tragedy of triffles

Don’t shoot butterfly with rifles

Laugh it off..” -Bolton Hall

ఒక పోరాటంలో ఓడిపోయినా, ఒక హక్కును కోల్పోయినా, నవ్వేసేయ్. చిన్న చిన్న బాధలకు కుంగిపోకు, సీతాకోకచిలుకలని రైఫిల్స్‌తో కాల్చాలని చూడకు (అంత చిన్న కీటకాలకు అంత పెద్ద ఆయుధం అక్కర్లేదుగా!).. హాయిగా నవ్వుకోమన్నది” బోల్టన్ హాల్ సందేశం.

అసలు ఇప్పుడు ఉన్న అసంఖ్యాకమైన శారీరక, మానసిక వ్యాధులకు ఆల్టర్నేటివ్ మెడిసిన్ రూపంలో GELOTOLOGY (జెలటాలజీ) అని హాస్య శాస్త్రం రూపొందించబడింది.. అందుకే ఇవాళ నవ్వుతూ సాధించగలిగిన, నవ్వుతో విజయం పొందగలిగిన రహస్యాలను సిరివెన్నెల గారి పాట ద్వారా అర్థం చేసుకుందాం. నవ్వులతో అన్ని బాధలను తరిమేద్దాం. పాటను విశ్లేషించుకుంటూ మానసిక ఆరోగ్యం కోసం laughter tonic తాగేద్దాం.

మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా..

పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా

మతోయేంతగా శ్రుతే పెంచక విచారాల విలవిల

సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా

కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా

ముస్తాబే చెదరాలా నిను చూడాలంటే అద్దం జడిసేలా..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేష్‌కు కథానాయికగా నటించిన అంజలి ఏదో కాస్త చిరాగ్గా బుంగమూతి పెడితే, కన్నీళ్లు పెట్టుకుంటే మామ పాత్రధారి అయిన ప్రకాష్ రాజ్ ఆమెను ఓదార్చే సమయంలో వచ్చే నేపథ్య గానం ఇది. సరదా ట్యూన్లో సాగిపోయే ఈ పాట ద్రాక్ష పాకంలా తీయతీయగా రోజూ మనం మాట్లాడుకునే సాధారణమైన మాటలతోనే ఎంత సందేశం ఇవ్వాలో అంత సందేశాన్ని మనందరికీ అందిస్తుంది. ఎవరిని కదిపినా, నూటికి 90% మంది తమకే కష్టాలు ఉన్నట్టు, ఆ కష్టం మరెవ్వరూ పడనట్టు, ఎంతో చింతగా, దిగులుగా మాట్లాడుతూ, కనిపిస్తూ ఉంటారు.

అందుకే సిరివెన్నెల అంటారు, ఏ పని తోచనట్టుగా, ఒకే విషయమై నిరంతరం చింతిస్తూ, గడబిడ చేస్తూ పరేషాన్ పడుతూ ఉండకండి. ఎదుటి వాళ్లకు మతి పోయేలాగా, మీ విచారాల విలవిలలు వినిపించకండి అని. మనం ఆనందాలని పంచాలి కానీ, మన చుట్టూ ఉన్నవాళ్లని మన బాధలతో బరువెక్కించకూడదు. సిరివెన్నెల ఆ విషయాన్ని ఎంత చమత్కారంగా చెప్పారో చూడండి. కన్నీరు కురిపించి చుట్టూ ఉండే లోకాన్ని తడిపేయకండి అని! అందులో బుంగమూతి పెట్టినది అమ్మాయి కాబట్టి, వెక్కివెక్కి ఏడుస్తే మీ ముస్తాబు కరిగిపోతుంది, మిమ్మల్ని చూడడానికి మీ అద్దమే భయపడుతుంది అని మెత్తగా బెదిరించారు.

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా

కదా మరెందుకు గోల

అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృథా ప్రయాస పడాలా ॥ మరీ అంతగా ॥

ఏడవడం వల్ల ఎటువంటి కష్టాలు తీరవు. ఎవరో మన మీద జాలి చూపించడం వల్ల మనకి ఏమైనా లాభం వస్తుందా? ఒకరి జాలి కోసం వృథాగా ప్రయాస పడాలా? అని ప్రశ్నిస్తూ, దుఃఖాన్ని జయించడమే జీవితంలో విజయానికి కారణం, అనే బలమైన సత్యాన్ని తన సాహిత్యంలో తేల్చి చెప్పారు సిరివెన్నెల. తరతరాలుగా మనిషి ఏడ్చి ఏడ్చి తన దుఃఖంతో సప్త సముద్రాలను ఉప్పు నీటితో నింపేశాడని, ఇకముందు అ దుఃఖాన్ని echo చేయవద్దని ఒక ఆంగ్ల కవి అంటాడు.

Smile a little smile a little

As you go along

Not alone when life is pleasant

But when things go wrong

……….

Why sit down in gloom and darkness

With your grief to sup

As you drink fate’s bitter tonic

Smile across the cup..

………..

Smile a little smile a little

Even through your tears..

-Ella wheeler Wilcox

జీవితం ఆనందంగా ఉన్నప్పుడే కాదు, ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా నవ్వాలి, విధి మనకి ఇబ్బందికరమైన చేదు మందు ఇచ్చినప్పుడు కూడా, నవ్వుతూ తాగాలి.. కన్నీళ్లు వస్తున్నా ఆపుకొని నవ్వాలి అన్న Wheeler సందేశం కూడా సిరివెన్నెలగారి భావాలకు ఎంత దగ్గరగా ఉందో చూడండి.

ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలినెటో తరిమేస్తామా ఛీ పొమ్మని

కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా

రోజులతో రాజీపడమా సర్లెమ్మని

సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం

పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం ॥ ఎక్కిళ్ళే పెట్టి ॥

ఇలాంటి కష్టాలు, కన్నీళ్లు తట్టుకోవడం కోసమే ప్రకృతి ఆరు రుతువులను సృష్టించింది. ఎండను, వానను, చలిని కాస్త నిందించుకున్నా.. వాటి నుండి దూరంగా పారిపోనూలేము.. వాటిని దూరంగా తరిమివేయనూలేము. అప్పుడు ఏం చేస్తాం, ఈ వానలు కొద్ది కాలమే కదా, ఈ ఎండ కొంతకాలమే కదా, చలి ఎప్పుడూ ఉండిపోదు కదా అని ప్రకృతితో మనం సర్దుకుపోతూనే ఉంటాం కానీ బాధపడుతూ ఉండము కదా. ప్రకృతితో సర్దుకుపోయే మనం, సాటి మనుషులతో ఎందుకు రాజీ పడడం లేదు? మన తోటి వారితో నిరంతరంగా పేచీ పడుతూ, మన జీవితాన్ని ఎందుకు నరకప్రాయంగా చేసుకుంటున్నాం? అలా సర్దుకు పోతే జీవితం ఎంత ఆనందంగా సాగిపోతుంది.. అని ఆలోచింపజేస్తుంది శాస్త్రి గారి సాహిత్యం.

చెమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా

పెదవిపై చిగురించేలా చిరునవ్వులు

కండలను కరిగించాలా కొండలను కదిలించాలా

చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు

మనుషులనిపించే ఋజువు మమతలను పెంచే ఋతువు

మనసులను తెరిచే హితవు వందేళ్ళయినా వాడని చిరునవ్వు ॥ ఎక్కిళ్ళే పెట్టి ॥

హాయిగా నవ్వడానికి అందరూ ఎందుకు శ్రమ పడతారు అన్నది సిరివెన్నెల గారి అనుమానం. అసలు నవ్వు అనే concept మీద కవితలు కానీ పాటలు కానీ రాయని రచయితలు ఉండదు అంటే అతిశక్తి కాదేమో. ఎందరో సినీ కవులు నవ్వు గురించిన గొప్పదనాన్ని వర్ణిస్తూ మధురమైన గీతాలు రాశారు. ఈ పాటలో కూడా సిరివెన్నెల, హాయిగా నవ్వడం నేర్చుకోండి అని చెప్పడానికి మనల్ని దెప్పుతూ, పెదవి పైన నవ్వుల పంటలు పండించడానికి, దుక్కి దున్ని, సాగు చేసి శ్రమ పడాలా అని మనల్ని ప్రశ్నిస్తారు. మనసారా నవ్వుకుంటే వచ్చే సుఖశాంతుల కోసం కండలు కరిగించేలా కష్టపడాల్సిన పని లేదు, చేయాల్సిన అవసరం లేదు అ అంటూ సూటిగా బాణాన్ని మన పైకి సంధించారు.

అసలు ఆ చివరి రెండు లైన్లలో నవ్వుకు ఆయన ఇచ్చిన నిర్వచనం ఎవరి మనసునైనా కట్టిపడేస్తుంది. నవ్వు మనల్ని మనుషులు అని రుజువు చేస్తుందట! కఠినమైన మనసులను కూడా తెరిపిస్తుందట! మనుషుల్లో మమతలను పండించే ఋతువుగా నవ్వుని వర్ణిస్తారు సిరివెన్నెల. ఆ చిరునవ్వు వందేళ్లయిన వాడకుండా ఉండాలని మనసారా కోరుకుంటారు! ఎంత చల్లని దీవెన!

When the weather suits you not

Try smiling..

When you are coffee isn’t hot

Try smiling.. Unknown..

మనకు వాతావరణం సరిపడకపోయినా, మనకు నచ్చినట్టు, మనం అనుకున్నట్టు అన్నీ నడవకపోయినా.. ఏడుస్తూ కూర్చోకుండా, హాయిగా నవ్వుకోవాలి.

‘జ్యో అచ్యుతానంద’ సినిమాలో, ఒక నవ్వుతోనే మనుషుల మధ్య విభేదాలు దూరం చేసుకోవచ్చని, అనుబంధాలలో వసంతాలు పూయించుకోవచ్చనీ అంటారు భాస్కరభట్ల.

……..

‘పెదవంచు మీదా నవ్వునీ పూయించుకోడం నీ పనీ..

నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమనీ..’

~

‘ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు,

ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు’

అంటారు చంద్రబోస్ ‘అశోక్’ సినిమా కోసం రాసిన ఒక పాటలో.

నవ్వి నవ్వి కన్నీళ్లు వస్తే హృదయం చల్లబడుతుందట! నవ్వుతుంటే పెదవులు విప్పారి, విస్తరిస్తాయి కాబట్టి.. మనసు విశాలమవుతుందట!

సిరివెన్నెల గారి సాహిత్యాన్ని ఆరాధించే మనమందరం, ఆయన సందేశాలను అమలు చేస్తూ, ఆయన ఇచ్చిన సూచనలను అమలు పరుస్తూ, హాయిగా నవ్వేస్తూ.. బ్రతుకును ఆనందమయం చేసుకుందాం. ఇదే మనం ఆయనకు అర్పించే నిజమైన సాహితీ నివాళి.

Images Courtesy: Internet

Exit mobile version