Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 12 – అందమైన లోకాల్లో విహరింపజేసే గీతం

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ

~

చిత్రం: రాజా

సాహిత్యం: సిరివెన్నెల

గాత్రం: చిత్ర

సంగీతం: ఎస్ ఏ రాజ్ కుమార్

~

సాహిత్యం

పల్లవి:
ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా వూపిరి వూయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
చరణం:
అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
‘రా అమ్మా’ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్లల్లో అపుడపుడూ చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం॥ఏదో ఒకరాగం॥
చరణం:
గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు యెన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్లనే దాచే చోటు జ్ఞాపకం
జామపళ్లనే దోచే తోట జ్ఞాపకం ॥ఏదో ఒకరాగం॥

‘స్నేహం కోసం’ చిత్రంలో ‘మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ..’ అన్న సిరివెన్నెల పాటలో..

ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు
మర్రిచెట్టు చెబుతుంది పంచుకొని తిన్నచద్ది రుచులు
చెఱకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు
టెంటు హాలు చెబుతుంది ఎన్.టి.ఆర్. స్టంటు బొమ్మ కధలు
పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ
ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి
వయసంత మరచి కేరింతలాడె ఆ తీపి జ్ఞాపకాలు
కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి
మనలాగే అవికూడా విడిపోలేనంటాయి..

అంటూ మనల్ని.. మధురమైన చిన్ననాటి జ్ఞాపకాలలోకి తీసుకెళ్తుంది.

~

అలాగే ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ చిత్రం కోసం చంద్ర బోస్ గారు రాసిన పాట..

‘గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి/ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి..’. ఈ పాటకి కూడా మనమందరం ఎంతగానో కనెక్ట్ అయిపోతాము. ఎందుకని? మనందరి మనస్సు కూడా గతంలోకి ప్రయాణిస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కాబట్టి.. ఏదైనా గతానికి సంబంధించిన వస్తువుని చూసినా, వ్యక్తిని చూసినా, జ్ఞాపకాలు గతంలోకి పరిగెడతాయి. ‘Your memories five years ago/ten years ago.. అని Facebook/ Google గుర్తు చేస్తే చాలు.. ఆ పాత జ్ఞాపకాల్లోకి మనం వెళ్ళిపోతాం. మనసు గతంలోకి చేసే ప్రయాణం లేదా కనెక్టివిటీని Nostalgia అంటారు. జ్ఞాపకాలు తీపి అయినా కావచ్చు చేదైనా కావచ్చు..

Gold mine of old memories అని నిర్వచించుకొనే నాస్టాల్జియా మనలోని నెగటివ్ ఎమోషన్స్ తరిమేసి, anxiety, depression వంటి వాటికి దూరంగా ఉంచుతుంది. బాధాకరమైన గతం ఒక వ్యక్తిని హిట్లర్ లాంటి నియంతగానూ మార్చగలదు, Wilma Rudolf, సుధా చంద్రన్ వంటి వారిలాగా ఉన్నత శిఖరాలకూ తీసుకెళ్లగలదు. మొత్తం మీద నాస్టాల్జియా మనల్ని పాస్ట్ నుండి ప్రజెంట్‌కి కనెక్ట్ చేసి ఒక ఫ్యూచర్ పైపు లాంటిదన్నమాట.

సిరివెన్నెల గారు జ్ఞాపకమే.. జ్ఞాపకమే.. అంటూ మనల్ని జ్ఞాపకాల తోటలోకి తీసుకు వెళుతున్న పాటని మనం ఇప్పుడు విశ్లేషించుకుంటున్నాం కాబట్టి.. నాస్టాల్జియా గురించి కూడా కొంచెం చర్చించాను. బాల్య స్మృతులు ఎవరికైనా ఎంత తీయగా ఉంటాయో, రాజా చిత్రంలోని ఈ పాట ద్వారా మన మనసు కాన్వాస్ పై రంగుల చిత్రాన్ని అద్దుతున్నారు సిరివెన్నెల.

కథలోకి వెళ్తే హీరో రాజా (వెంకటేష్), అతని మిత్రుడు బాలు చిరుదొంగలు. వాళ్లిద్దరూ వినాయకుని విగ్రహాన్ని దొంగిలించి, జనం నుంచి తప్పించుకోడానికి కథానాయిక (సౌందర్య) అంజలి యింట్లోకి అనుకోకుండా ప్రవేశిస్తారు. అంజలి, ఆ యింట్లో వుండే పిల్లలు కలిసి వాళ్లను గమనించి వంటింట్లో బంధిస్తారు. వారం రోజులపాటు ఆ యిద్దరి చేత వంటలు చేయిస్తుంటారు. ఒక టీ.వీ. కార్యక్రమంలో అవయవ దానానికి సిద్ధమైన రాజాను చూసిన అంజలికి తనకు ముందూ వెనకా యెవరూ లేరని చెప్పుకున్న రాజా మీద సదభిప్రాయం యేర్పడుతుంది. అవయవ దానం ద్వారా రాజా త్యాగం తెలుసుకొని, తల్లి గుర్తొచ్చిన అంజలి బాల్య స్మృతుల్లోకి జారుకుంటుంది-

మంత్రముగ్ధమైన తన గళంతో చిత్ర ఆలపించిన ఈ గీతం మనందరినీ అందమైన లోకాల్లో విహరింప చేస్తుంది. చిన్ననాటి చిలిపి పనుల తీపి జ్ఞాపకాల్ని అందరికీ అన్వయించేలా ఆత్మీయతను, అనుభూతిని రంగరించి రాశారు సిరివెన్నెల.

ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా వూపిరి వూయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు,
జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు..

రాజా చేసిన త్యాగం చూసి, నిదిరిస్తున్న తన గతాన్ని, మళ్లీ ఒకసారి తట్టి లేపినట్టయిందని అంజలి భావిస్తుంది. అమ్మకు సంబంధించిన తన జ్ఞాపకాలని ఒకసారి అది కదిలించిందనీ. చీకటిగా ఉన్న తన దారుల్లో చిరునవ్వు దీపాలు వెలిగించిందనీ, ఆనందం కరువైన తన జీవితంలో మళ్లీ చిరునవ్వులు పూయించిందని, ఆమె మనోభావాల్ని మనకు అందించారు సిరివెన్నెల.

ఆ తరువాత ‘జ్ఞాపకాలు’ అనే సంక్లిష్టమైన మానసిక శాస్త్రానికి సంబంధించిన పదాన్ని ఎంతో చాతుర్యంగా నిర్వచించారు ఆయన. గత జ్ఞాపకాలే మనకు మైమరపు కలిగిస్తాయి, నిరాశలు ఉంటే నిట్టూర్పులు పుట్టిస్తాయి, ఒక్కోసారి అవే ఓదార్పునిస్తాయి, మరోసారి మనసు లోపలి పొరల్లోని ఆనందల్ని మేలుకొలుపుతాయి. ఎంతో నిశితమైన సిరివెన్నెల పరిశీలనా జ్ఞానం, ఈ విశాలమైన నిర్వచనానికి నిదర్శనం. ఇదే ‘జ్ఞాపకాలను’ విశ్వవిఖ్యాతమైన ఆంగ్ల కవులు ఎలా నిర్వహించారో ఒకసారి చూద్దాం.

~

When to the sessions of sweet silent thought

I summon up remembrance of things past,

I sigh the lack of many a thing I sought, And with old woes new wail my dear time’s waste…అంటారు William Shakespeare, Sonnet 30 అనే కవితలో.

~

సీతారామశాస్త్రి గారు ఏ విధంగా అయితే నిర్వచించారో.. అదే నిట్టూర్పు, అదే ఓదార్పు మనకు ఈ విలియం షేక్‌స్పియర్ కవితలో కూడా కనిపిస్తుంది. గతంలోని బాధలను తలుచుకొని టైం వేస్ట్ చేసుకుంటూ కొత్తగా విలపిస్తామని ఆయన చమత్కరిస్తారు.

~

Music when soft voices die,

Vibrates in the memory-

Odours, when sweet violets sicken,

Live within the sense they quicken…

-P.B.Shelley,

మధురమైన కంఠ స్వరాలు మాయమైనప్పుడు, షెల్లీ జ్ఞాపకాలలో రాగాలు వినిపిస్తాయట.. వాడిపోయిన పూలు కూడా జ్ఞాపకాలలో సువాసనలు చిందిస్తాయట.. అంటే మనసులో దుఃఖం గూడు కట్టుకున్నప్పుడు, గతంలోని ఆనందాలని గుర్తు చేసుకొని, ఉత్తేజితమవ్వాలని అర్థం.

~

 Thomas Hood కూడా I remember, I remember ..the house where I was born.. అంటూ తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

~

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
‘రా అమ్మా’ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్లల్లో అపుడపుడూ చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం

ఒక్కసారి మనసు గతంలోకి ప్రయాణించడం మొదలుపెడితే.. అనంతంగా అలా వెనక్కు వెళుతూనే ఉంటుంది. అంజలికి మొదటిసారి తను అమ్మను పిలిచిన పిలుపు, తనని అక్కున చేర్చుకున్న అమ్మ ప్రేమ, అమ్మ చీరను తన చుట్టుకున్నప్పుడు నవ్విన అమ్మ నవ్వు, ఆ నవ్వుతో తనకి వచ్చిన సిగ్గు.. దాంతోపాటు అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు బాధకో, సంతోషానికో కలిగే చమరింతలు.. అన్నీ జ్ఞాపకం వచ్చాయి.

అయితే సాధారణంగా ఆడపిల్లలు చిన్నతనం నుండి అమ్మదనం చూపించడం మొదలుపెడతారు. తన చేతిలోని పౌడర్ డబ్బా అయినా, దిండు అయినా, తనకి పాప అయిపోతుంది. నాన్న దగ్గరకు వెళ్లి, ‘నీకు జ్వరం వచ్చిందా ఈ మందు వేసుకో’.. అంటూ.. నాన్నకి కూడా అమ్మ అయిపోతుంది. ‘ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టినట్టే’. మనందరి జీవితాలలో సాధారణంగా జరిగే ఇలాంటి మనసుకు హత్తుకునే సంఘటనలను కూడా శాస్త్రి గారు ఎంతో అందంగా పాటలలో అల్లేసి.. మన మనసులను మెత్తగా గిల్లేస్తారు. అమ్మ మమకారాన్ని తలుచుకుంటూ ఆలివర్ టెర్లి ఇలా అంటారు..

~

Who sat and watched my infant head When sleeping on my cradle bed,

And tears of sweet affection shed?

My Mother.

-Dr.Oliver Tearle

~

గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు యెన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్లనే దాచే చోటు జ్ఞాపకం
జామపళ్లనే దోచే తోట జ్ఞాపకం..

~

చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఒక అందమైన ఆంగ్ల కవిత..

Childhood memories, forever cherished,

A time of innocence, never perished.

A time of joy, a time of wonder,

Filled with love, a time to ponder..

~

రెండో చరణంలో (ముందు తరానికి సంబంధించిన) చిన్ననాటి కొంటె పనులు, తీపి గుర్తులు అన్నిటిని మన ముందుకు తీసుకువస్తారు సిరివెన్నెల. ఇవి ఒక కథనాయకి జ్ఞాపకాలు మాత్రమే కాదు. మీవి, నావి మనందరివీ! బడిలో చదువూ, గుడిలో కథలూ, ఏటి గట్టున ఏరుకున్న గవ్వలూ, పుస్తకాలలో దాచే నెమలీకలూ, తోటలో దొంగతనంగా కోసుకున్న జామ పళ్ళూ.. మనందరినీ కూడా తీపి గతంలోకి తీసుకెళ్తాయి. ఇదే సిరివెన్నెల గారి మాయాజాలం.

ఇదే చిత్రంలో.. ఇదే పల్లవితో.. నాయకుడు వెంకటేష్.. పాడుకునే మరొక పాట ఉంటుంది. మన గంధర్వ గాయకులు, యస్.పి. బాలు గానం చేసిన జ్ఞాపకాలకు సంబంధించిన రెండవ పాట ఇది. అంజలి ప్రేమలో తేలిపోతున్న రాజుకు, ఒకానొక సందర్భంలో అంజలి అనుకోకుండా తన ప్రతిస్పందన తెలపడంతో, ఆనందంతో ఒప్పంగిపోయి, ఆమె జ్ఞాపకాల్లో తేలిపోతూ, ఒక భావజగత్తులో మునిగిపోతాడు. ఆ సందర్భంలో సిరివెన్నెల, వైవిద్య భరితంగా అదే పల్లవికి హీరో అంతరంగాన్ని ప్రతిబింబిస్తూ ఈ పాటను వ్రాశారు.

పల్లవి:
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా వూపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు , జ్ఞాపకాల ఓదార్పు
చరణం:
వీచే గాలులలో నీ వూసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం
చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం
చరణం:
మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపురాని నీ ప్రేమే మధురజ్ఞాపకం

చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేసుకునే ఆ పాటకి, ప్రేమికుడు భావుకతతో పాడుకునే ఈ పాటకి సమన్యాయం చేయడం సిరివెన్నెల గారి శిల్ప చాతుర్యం. ప్రేమికుడు కాబట్టి గాలిలో ఊసులను, పువ్వులలో నవ్వులను, సూర్య కిరణంలో కుంకుమ రేఖలను.. ఇలా ప్రతి వస్తువులో తన ప్రేయసినే ఊహించుకుంటాడు. ఆమె చూపులను తారలతో, ఆమె ఆశలను ఎగసే అలలతో.. పోల్చుకొని మురిసిపోతాడు.

ఇక చివరి రెండు లైన్లు.. ప్రియురాలి పేరు పలికిన పెదవుల పైన వెలసిన ఒక చిలిపి నవ్వు, మరువలేని తన ప్రేమే మధుర జ్ఞాపకం.. అంటూ, ప్రేమికుల మనోభావానికి మధురమైన భాష్యం చెప్పారు సిరివెన్నెల. ఇటు బాల్యస్మృతులను, అటు ప్రేమికుల మధుర స్మృతులను కలిపి, జ్ఞాపకాల ఊయలలో ముందుకి, వెనుకకి ఊపేసి, మనసుల్ని జోకొట్టే సాహితీ మిత్రుడు సిరివెన్నెల.

‘రాజు జీవించె రాతి విగ్రహములందు, సుకవి జీవించె ప్రజల నాల్కలందు’ అని గుర్రం జాషువా గారు అన్నట్టు, సిరివెన్నెల గారి వాణి, బాణి మన జ్ఞాపకాల పొరల్లో కలకాలం అలా నిక్షిప్తమై, A thing of beauty is a joy forever.. అన్నట్టు తలచుకున్నప్పుడల్లా మనకు ఉల్లాసపు చెలమ లాగా రసానందాన్ని ఊరిస్తూనే ఉంటుంది.

Images Courtesy: Internet

Exit mobile version