[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
~
చిత్రం: పట్టుదల
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గాత్రం: కే. జే. ఏసుదాస్.
~
సాహిత్యం (ఒరిజినల్ వెర్షన్)
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా
చరణం:
నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్పముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచివుండి రవిని మింగు అసురసంధ్య
ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గివుండ సాగరాల నీదుకుంటు తూరుపింట తేలుతుందిరా
నిశావిలాసమెంత సేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేరా
చరణం:
నొప్పిలేని నిముషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగుఅడుగునా
నీరసించి నిలచిపోతే నిముషమైనా నీదికాదు.
బ్రతుకు అంటే నిత్యఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
అంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాసనీకు శస్త్రమౌను ఆశయమ్ము సారథౌనురా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశపుట్టదా
ఆయువంటు వున్నవరకు చావు కూడ నెగ్గలేక శవముపైనె గెలుపు చాటురా ॥ ఎప్పుడూ ॥
♣
నాదు హృదయము వహ్ని గర్భము
వేగి, సల సల కాగి, కుతకుత మరిగి, జలజల కరిగి, గలగల పైకి దూకిన నాదు కవనము
కరడుగట్టిన సుప్త చైతన్యస్త చరితము
కాలగత కంకాళ రాసుల సృక్కి సోలిన గీతి మథనము,
కదలివచ్చే అనాగతమును నిర్థరించే నిగమ కథనము,..
నేను శాసిస్తాను కవితని,” ..సిరివెన్నెల
~
అగ్ని పర్వతం లాంటి తన హృదయంలో, మరిగి, కరిగి, పొంగిన లావా వంటిది తన కవనమనీ.. కొంత కాలంగా కరుడుగట్టి నిద్రాణంగా ఉన్న ఆ లావాను.. ఒక చైతన్య స్రవంతిలా, వసంత వికాస గీతికలా, అందరికీ అందిస్తాననీ.. తాను కవితలను శాసిస్తాననీ.. సిరివెన్నెల చెప్పుకున్నారు. అన్నట్టుగానే సాహిత్యాన్ని, కొంతమేరకు పరిశ్రమను మరి ముఖ్యంగా శ్రోతలను సంపూర్ణంగా ఆయన శాసించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన పాట ఇది. సినిమా కోసం సాహిత్యంలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చినందుకు సిరివెన్నెల ఎంతో ఆవేదన చెందారు. అందుకే దాని భావాన్ని వివరిస్తూ.. తన గళంతో స్వయంగా, యథాతథంగా పాడి అందరికీ అందించారు.
ఇంత పదునైన Motivational Song గురించి సిరివెన్నెల గారి అభిప్రాయం, తన సొంత మాటల్లో.. “ఈ పాట పట్ల నాకు ఎంతో మక్కువ. ఎందుకంటే ఇది ప్రతి వారి జీవితంలో ఉండే, ఉండవలసిన, ఉండి తీరాల్సిన ఒక దృక్పథం.. సానుకూల దృక్పథం. ఈ దృక్పథం ఎందుకు ఉండాలి అంటే.. జీవితం అనేది ప్రతిక్షణం ఒక పోరాటం.. Struggle for existence.. నీ ఉనికి కోసం ప్రకృతి తోటి, సమాజం తోటి, కాలంతోటి, ప్రతిక్షణం పోరాడుతూనే బ్రతకాలి.. బ్రతకాలి అని ఒక విచిత్రమైన ఆశే మనిషికి శ్వాస..
ఈ పోరాటమే జీవితం.. అందుకే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి”..
సిరివెన్నెల వ్రాసిన ఇలాంటి వ్యక్తిత్వ వికాస గీతాలు మరికొన్ని గమనిద్దాం.
~
పరుగులుతీయ్ పరుగులుతీయ్.. ఉరకలువేయ్ ఉరకలువేయ్..
కుత్తుకకోసే కత్తికొనలు దరిదాపుకుచేరని దూకుడువై
ఆయువుతీసే ఆపద కూడా అలసటతో ఆగేలాచేయ్..
ఎడారిదారుల తడారిపోయిన ఆశకు చెమటలధారలుపోయ్..
నిస్సత్తువతో నిలబడనీయ్యక ఒక్కోఅడుగు ముందుకువేయ్..
వందయేళ్ళ నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై
శతకోటి సమస్యల ఎదుర్కొనేందుకు బతికివుండగల సాహసానివై.. (మర్యాద రామన్న.. సిరివెన్నెల)
~
Hello Darling.. అనే సినిమాలో సిరివెన్నెల గారి మరొక వికాస గీతం.
బెదిరితే భయపెడుతుంది వెనుకనే లోకము తరిమితే పరిగెడుతుంది తెలుసుకో నైజము అడిలిపోతే అణిచివేసే అశ్వమే కాలము ఎగిరిదూకే తెగువ ఉంటే వెయ్యి నీ కళ్లెము!!
ఎవడున్నాడు క్రూరుడు యముడిని మించిన వాడు ఏముంటుంది చూడు చావుని మించిన కీడు! తల వంచేసి దాగినా వదిలేనా ఒకనాడు కలకాలం బ్రతికుండునా రోజు చచ్చే వాడు!
ఈ పాట కూడా నిరాశను జయించడానికి, బ్రతుకుపై పోరాటానికి ఉత్తేజాన్నీ.. కలిగిస్తుంది.
~
ముకుంద చిత్రంలో కూడా, ఎవరి జీవితానికి వారే నిర్వచనాన్ని ఇచ్చుకోవాలన్న సందేశంతో మనకు ఇలాంటి పాట ఒకటి కనిపిస్తుంది. (చేసేదేదో చేసేస్తుంటే..)
రాళ్లే ఉన్నా ముళ్ళే ఉన్నా దారేదైనా కానీ..
కోరే గమ్యం చూపించాలి
నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా..
~
దాదాపు ఇటువంటి సందేశంతోనే శ్రీశ్రీ గారి పేరుతో బాగా ట్రెండింగ్ అవుతున్న మరొక కవితను చూసి, పాట విశ్లేషణలోకి వెళ్లిపోదాం.
కుదిరితే పరిగెత్తు.. లేకపోతే నడువు.. అదీ చేతకాకపోతే.. పాకుతూపో.., అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు.. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని.. అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప, దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే.. తలుచుకుంటే.. నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా.. నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది, అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు.., పారే నది.., వీచే గాలి.., ఊగే చెట్టు.., ఉదయించే సూర్యుడు.. అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా.., ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు.., లే.. బయలుదేరు.. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్ళను తెంచేసుకో.., పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు.. నువ్వు పడుకునే పరుపు.. నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్.., నీ అద్దం.. నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో.., నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్.., మళ్ళీ చెప్తున్నా.. కన్నీళ్ళు కారిస్తే కాదు.., చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో.. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే… అస్త్రాలు..
~
‘జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా’ అన్న కొసరాజు గీతం నుండి ‘కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు’.. అన్న శ్రీశ్రీ గీతం దాకా ఎన్నో చైతన్య దీపికల లాంటి ఉత్తేజపరిచే గీతాలు తెలుగు సినిమా రంగంలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.
ఇక పాట విశ్లేషణలోకి వెళ్తే, ‘పట్టుదల’ చిత్రంలో, ఇళయరాజా సంగీత సారథ్యంలో జేసుదాసు పాడిన పాట ఇది. సినిమాలో ఈ పాట కొంత మార్పులతో కనిపిస్తుంది. కానీ మనం సిరివెన్నెల గారి own version ని యథాతథంగా చర్చిద్దాం.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా..
మన నిర్ణయాన్ని నిర్లక్ష్యం చేయకుండా, విశ్రాంతి లేకుండా, పోరాటం చేసినప్పుడే జయం కలుగుతుంది. అందుకే ఓటమిని ఎప్పుడు అంగీకరించకుండా… ఓర్పుతో సహనంతో గెలుపును సాధించాలి, అనే పల్లవితో సీతారామశాస్త్రి గారు ఈ పాటని ప్రారంభించారు.
ఇదే భావం మనకు“Never Despair” అన్న William Smith O’Brien.. కవితలోనూ, Keep Going అన్న Ella Wheeler కవితలోనూ కనిపిస్తుంది.
Never despair! Let the feeble in spirit
Bow like the willow that stoops to the blast.
Droop not in peril! ‘T is manhood’s true merit
Nobly to struggle and hope to the last.
~
“Keep Going” by Ella Wheeler Wilcox..
Is the goal distant, and troubled the road,
And the way long?
And heavy your load?
Then gird up your courage, and say ‘I am strong,’
And keep going…
~
నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్పముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచివుండి రవిని మింగు అసురసంధ్య
ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గివుండ సాగరాల నీదుకుంటు తూరుపింట తేలుతుందిరా
నిశావిలాసమెంత సేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేరా..
అంత సువిశాలమైన ఆకాశం.. చిన్న గువ్వ పిట్టకు, అంతులేని ఆ సముద్రం.. చిన్న చేప పిల్లకు.. భయాన్ని కలిగించడం లేదు. సూర్యుడిని మింగేసి చీకటి ఎంత కాలం ఉంటుంది? మళ్లీ తూరుపులో సముద్రాన్ని చేర్చుకుంటూ సూర్యుడు పైకి రాగానే.. వెలుగు గెలుస్తుంది చీకటి ఓడుతుంది. అదేవిధంగా మనల్ని చుట్టుముట్టే చీకట్లు, ఇబ్బంది పెట్టే బలహీనతలు కూడా ఎంతో కాలం ఉండవు. ఉదయించే సూర్యుడిలా, చీకట్లను చీల్చుకొని వెలుగులు వెదజల్లుతాయి. మనిషికి సంయమనం కావలసిన సమయం అదే. ఆ బలహీన క్షణంలో మన మనసును అదుపు చేసేది మన ఆశయమే, మన లక్ష్యమే! గెలుపు కోసం తపించే మనసు కూడా సూర్య గోళం లాంటిదే.. అందుకే దానికి ఓటమి లేదు.. అని సిరివెన్నెల గారి ఉపదేశం.
~
“I Am But a Small-Winged Bird” by Sidney Lanier
I am but a small-winged bird:
But I will conquer the big world
As the bee-martin beats the crow,
By attacking it always from Above.
సిరివెన్నెల గారి గువ్వపిట్ట స్థైర్యమే మనకు పై పద్యంలో కనిపిస్తుంది.
జాతి వివక్షకు గురైన, Maya Angelou.. స్ఫూర్తిదాయకమైన కవిత కూడా, ఎటువంటి నిరాశనైనా.. ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఎన్ని రకాలుగా హింసించినా.. తాను మళ్ళీ లేచి నిలబడతానని.. తనను తాను నిరూపించుకుంటానని చెప్పే.. కవిత ఇది.
~
Still I Rise.. Maya Angelou
–
You may write me down in history
With your bitter, twisted lies,
You may trod me in the very dirt
But still, like dust, I’ll rise.
…………
You may shoot me with your words,
You may cut me with your eyes,
You may kill me with your hatefulness,
But still, like air, I’ll rise.
Out of the huts of history’s shame..
I rise
Up from a past that’s rooted in pain
I rise…..
I am the dream and the hope of the slave. I rise.. I rise.. I rise.
~
నొప్పిలేని నిముషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగుఅడుగునా
నీరసించి నిలచిపోతే నిముషమైనా నీదికాదు.
బ్రతుకు అంటే నిత్యఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
అంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాసనీకు శస్త్రమౌను ఆశయమ్ము సారథౌనురా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశపుట్టదా
ఆయువంటు వున్నవరకు చావు కూడ నెగ్గలేక శవముపైనె గెలుపు చాటురా ..
జనన మరణాలు రెండూ నొప్పితో బాధతో కూడుకున్నవే. బ్రతుకంటే ఒక నిత్య సంఘర్షణ. మన దేహం, మన ప్రాణం, మన నెత్తురు, మన సత్తువే మన సైన్యంగా, ఆశయమే మన సారథిగా, ఈ బ్రతుకు పోరులో గెలుపు సాధించాలి, అని పిడుగులు కురిపించే చైతన్యంతో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు సిరివెన్నెల. ఈ యుద్ధంలో ఆశే మన అస్త్రం, శ్వాసే మన శస్త్రం. ఇంతకంటే ఇంక ఏ సైన్యం కావాలి? ఆశయమే మన ఆయుధం అయినప్పుడు.. ఇంతకంటే ఏ ఆయుధాలు మనకు కావాలి? అని ఆయన ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. అలుపెరుగని ప్రయత్నం జరుగుతూ ఉంటే.. నిరాశకే నిరాశ కలిగి మన జీవితాల నుండి తప్పుకుంటుంది.. అప్పుడు మన ఆశ నెగ్గుతుంది. అసలు ఆ చివరి వాక్యం చదువుతుంటే.. సిరివెన్నెల ఇచ్చే చైతన్య స్ఫూర్తికి.. ఆ మహానుభావుడిలో పెల్లుబికే ఆశావహ దృక్పథానికి.. గగుర్పాటు వస్తుంది. మన శరీరంలో ఆయువు ఉన్నంతవరకు, చావు కూడా మన మీద నెగ్గలేదట! అది ఓడిపోయి.. చివరకు ఒక మనిషి శవంగా మారాక.. తన గెలుపును చాటుకుంటుందట! అంటే శ్వాస చివరి క్షణం వరకు, పోరాటం ఆగదని ఘంటాపథంగా చెపుతూ, పోరాటాన్ని ఆపరాదని శాసిస్తున్నారు. ఇలాంటి ప్రేరణ కలిగించే ఒకటి రెండు ఆంగ్ల పద్యాలని ఇప్పుడు చూద్దాం.
~
Invictus..William Earnest Henley
Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds and shall find me unafraid.
…………
It matters not how strait the gate,
How charged with punishments the scroll,
I am the master of my fate;
I am the captain of my soul.
~
ఓటములన్నీ దాటి… తన విధిరాతను తానే శాసిస్తానని తేల్చి చెప్పే హెన్లీ సాహిత్యమిది.
~
“Persistence” by Walter Savage Landor
–
My hopes retire; my wishes as before
Struggle to find their resting-place in vain:
The ebbing sea thus beats against the shore;
The shore repels it; it returns again.
~
నిరాశకే నిరాశ కలిగి.. ఆశ తిరిగి వస్తుందని భావం..
సమాజంలో చైతన్యాన్ని రగల్చడానికి, నాడుల్లో రక్తాన్ని పొంగించడానికి, సానుకూల దృక్పథాన్ని తట్టి లేపడానికి సిరివెన్నెల సంధించిన అస్త్రం ఈ పాట. ఒక వ్యక్తిత్వ వికాసం నిపుణుడి స్థాయికి మించి మానసికంగా బలహీన స్థితిని నిరసిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, జీవితాన్ని యథాతథంగా స్వీకరించడానికి సిద్ధం చేస్తుంది గీతం. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. అనే ఈ పాట పది పదిహేను మందిని ఆత్మహత్య నుండి విరమింప చేసిందని, జీవించడానికి సంపూర్ణమైన ప్రేరణ కలిగించిందని సిరివెన్నెల గారు ఉప్పొంగే హృదయంతో, ‘సిరివెన్నెల తరంగాలు’, అనే గ్రంథంలో తెలిపారు. సాహిత్యానికి ఇంతకన్నా సామాజిక ప్రయోజనం ఉంటుందా? ఈ పాట ఎంతమందికి, ప్రేరణ కలిగించి ఉంటుందో ఊహించడం సాధ్యం కాదు.
తనదైన శైలిలో నిప్పురవ్వలని కురిపించి, ఎంతటి చైతన్యాన్నయినా రగిలించగలిగే వాడి, వేడి కలిగిన శాస్త్రిగారి కలమిది. ఆ సాహితీ భానుడు మన హృదయాలలో నిత్యం వెలుగులు పంచుతూనే ఉంటాడు, గమ్యాన్ని నిర్దేశిస్తూ ఉంటాడు, అడుగులు తడబడినప్పుడు చేయూతనందిస్తూనే ఉంటాడు.
అందుకే నా దృష్టిలో..
సిరివెన్నెల ఒక సామాజిక చైతన్య గ్రంథం
ఒక సానుకూల భావనా తరంగం..
ఒక అక్షర అక్షయం.. ఒక సాహితీ పరిమళం,
ఒక ఆత్మీయత, ఒక ఆప్యాయత,
ఒక ఆదర్శం.. ఒక స్నేహ చందనం..
పోత పోసిన ఉత్తేజం, ఊతమిచ్చే ఆవేశం.. మూర్తీభవించిన మానవత్వం,
పిడుగులు కురిపించే ఒక కవనం.. అలుపెరుగని ఒక గానం..
ఒక సాహితీ ఝంఝామారుతం..
బాధాతప్త హృదయాలకు ఓ ఉపశమనం, ఒక లేపనం..
ఆత్మస్థైర్యానికి ఒక చేయూత.. ఒక లాలింపు.. ఒక బుజ్జగింపు..
ఒక ఆచార్యత్వం.. ఒక అమరత్వం,
సాహితీ ప్రియుల హృదయాల్లో కొలువైన మరువలేని ఒక నిత్య వసంతం గీతం..
ఒక మధుర మలయ మారుతం..
Images Courtesy: Internet