Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 15 – జీవిత సారాన్ని రంగరించిన గీతం

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఎంత వరకు ఎందు కొరకు ఇంత పరుగు అని అడక్కు

~

చిత్రం: గమ్యం

సాహిత్యం: సిరివెన్నెల

గానం: రంజిత్

సంగీతం: ఈ.ఎస్.మూర్తి.

~

సాహిత్యం

పల్లవి:
ఎంత వరకు ఎందు కొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా ॥ఎంత వరకు॥
~
చరణం:
కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరు
సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా॥ప్రపంచం॥
~
చరణం:
మనసులో నీవైన భావాలే, బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యలే శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే. ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుటకా చావు రెండే రెండూ నీకవి సొంతం కావు, పోనీ..
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ..

ఈ భూమి మీద ప్రతి వారికి లైఫ్ చాలా బిజీ అయిపోయింది. ప్లే స్కూల్ వయస్సు పిల్లల నుండి, అన్ని వయసుల వారికీ, అన్ని రంగాల వారికి నిరంతర పరుగులా సాగుతోంది జీవితం. ఏ కొంతమందికో తప్ప అందరికీ అలుపెరుగని ఈ పరుగు భౌతిక లక్ష్యాల కోసమే. కానీ ప్రపంచ తత్వవేత్తలందరూ, జ్ఞానులందరూ తెలుసుకున్న, తెలియజేసిన లక్ష్యం భౌతికం కాదు ఆధ్యాత్మికం. మానవునికి అంతిమ లక్ష్యం, తానెవరో తెలుసుకోవడం.. తెలుసుకున్న తర్వాత ఆ గమ్యం వైపు పయనించడం. అలా తెలుసుకోవాలంటే, వేదాలు, ఉపనిషత్తులు వంటి ఆధ్యాత్మ గ్రంథాలు చదివి, వాటిని ఆచరించి, సఫలం పొందాలి. అంత సమయం మన దగ్గర లేదు అనుకున్నప్పుడు, అద్వితీయమైన సిరివెన్నెల గారి సాహిత్యం చదివితే సరి!

ప్రాచీన సాహిత్యం, భారతీయ సంస్కృతి అనే ఆలయానికి శిఖరం. వేదాలు, ఉపనిషత్తులు, భాష్యాలు, షడ్దర్శనాలు, అరణ్యకాలు, భగవద్గీత, శృతి, స్మృతి, పురాణాలు, ఇతిహాస గ్రంథాలు, మొదలైనవన్నీ మన సనాతన వాఙ్మయ గ్రంథాలు. వేల సంవత్సరాలుగా ఋషులు, మునులు, జ్ఞానులు తమ అనుభవ సారాన్నంతా మానవాళికి ఆధ్యాత్మజ్ఞానం రూపంలో అందిస్తూనే ఉన్నారు. దాని సహాయంతోనే ఆత్మోద్దరణ, ఆత్మోన్నతి కలుగుతోంది.. పండితులైన తండ్రి యోగి గారి శిష్యరికంలో భారతీయ సనాతన జ్ఞానాన్ని ఎంతో సముపార్జించారు సిరివెన్నెల.

ఒక సినీ గీతాన్ని విశ్లేషిస్తున్నప్పుడు, ఇంత గంభీరమైన ఉపోద్ఘాతం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అవునండీ! అంతటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది, సిరివెన్నెల గారి సాహిత్యం. ఎందుకంటే, సినీ మాధ్యమాన్ని ఉపయోగించుకొని, జన సామాన్యానికి ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని అందించవచ్చో, అంత జ్ఞానాన్ని అందించి.. తన మహా ప్రస్థానం చేరుకున్న ఋషితుల్యుడు ఆయన.

గమ్యం చిత్రంలోని ఈ పాట, సినిమా కథ నేపథ్యానికి తగినట్టుగా పైకి కనిపించినా, ప్రతి పదంలోనూ భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతిబింబిస్తోంది.

కథా నేపథ్యానికి వస్తే, నాయకుడు అభిరామ్ (శర్వానంద్), నాయిక జానకిని (కమలినీ ముఖర్జీ) కలుసుకోవడానికి చేసే ప్రయాణం, ఆమెను చేరుకునే ఘట్టాల సమాహారమే ఈ చిత్రం. అభిరామ్ చివరగా జానకిని కలిసి, తన ప్రయాణంలో గమ్యం చేరేలోపు ‘జీవితాన్ని’ చూశానని చెబుతాడు. చిత్రకథనంలో అనేకసార్లు ఫ్లాష్‌బాక్‌లో అభిరామ్, జానకిల పరిచయం, అది ప్రేమగా మారే లోపు వారు విడిపోవడం చూపించడం జరుగుతుంది.

స్నేహితుడిగా మారిన గాలి శీను (అల్లరి నరేష్)తో కలసి శర్వానంద్ జానకిని వెతుక్కుంటూ బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పాట మనకు వినిపిస్తుంది. లోతైన విశ్లేషణ చేసినప్పుడు, ఈ పాటలో దాగిన అనంతమైన జ్ఞానం మనల్ని ఆశ్చర్యానికి గురి చేయకుండా ఉండదు! తెరమీద కనిపించేది బైకు ప్రయాణమైతే, మనసు తెరమీద సిరివెన్నెల గారు ఆవిష్కరించింది, ఒక జీవన ప్రయాణం, ఒక ఆత్మ ప్రయాణం/గమనం, అది చేరుకోవలసిన గమ్యం. (Journey of the Soul).. “ప్రదేశాలను కాదు చూడాల్సింది ప్రపంచాన్ని”/ “ఈ ప్రయాణంలో నన్ను నేను చూసుకున్నాను”, వంటి చిత్రంలోని డైలాగులు ఈ పాటలోని సారాంశాన్ని మనకు సూచిస్తాయి.

ఎంత వరకు ఎందు కొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు

ఈ అనంత విశ్వం అవిశ్రాంతంగా సాగిపోతూ ఉంటుంది. భూమి పరిగెడుతుంది, గాలి పరిగెడుతుంది, నీరు పరిగెడుతుంది, కాలం పరిగెడుతుంది.. అదే విధంగా విశ్వంలోని ప్రతి అణువు ఏదో గమ్యం వైపు ప్రయాణిస్తూనే ఉంటుంది.‌ అందుకే ఈ పరుగు ఎందుకొరకు, ఎంతవరకు.. అని జ్ఞానులకు తప్ప ఎవరికీ తెలియదు. గమనమే నీ గమ్యం, నీ ప్రయాణం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళుతూనే ఉండాలి.. అదే విధంగా జీవితం ప్రశ్నల సమాహారం వెతకగలిగే నేర్పు ఉంటే ప్రశ్నలోనే సమాధానముంది.. దాన్ని గుర్తించడమే నీ పని, అనే పల్లవితో వేదాల సారాన్నంత ఒక చిన్న వాక్యంలో ఇమిడ్చి మనకందించారు సిరివెన్నెల.

ఈ జీవితం మన ఆత్మ ప్రయాణంలో ఒక చిన్న మజిలీ అని, మన ప్రయాణంలో మనం ఎక్కడి దాకా చేరుకున్నామో, ఖచ్చితంగా ఎవరికీ తెలియదనీ.. మన అసలైన గమ్యాన్ని చేరుకునే దాకా.. ఈ ప్రయాణం ఒక పజిల్ లాగా వుంటుందని అంటారు, టామ్ మాక్స్వెల్.

No one knows for sure,
Where we are, in our journey today,
A puzzle for our soul, along the way,
…………..
Most roads we explore, have been traveled down before,
We are to discover, creating, learning, and seeing new sights..
We each are here for a purpose, our roll,
To find, Peace, Happiness, & love, for our Soul,..
This life, one short stop of our travels,
As we prepare our soul, for our final goal.
-Tom Maxwell (The Original Tom Maxwell)

లెక్కలేనన్ని యుగాలుగా, నా ఆత్మ అనంత ఆకాశంలోని ఒక మేఘంలా, దైవత్వాన్ని చేరుకునే దిశగా ప్రయాణిస్తూనే ఉందని, లక్ష్యాన్ని సాధించే వరకు ఎంత కఠినమైన పరీక్షలనైనా ఎదుర్కొని అలాగే ముందుకు సాగుతానని, అమర్ అగర్వాలా తన ఇంగ్లీష్ కవితలో ప్రకటిస్తారు.

My soul wanders like a cloud
Across the vast and endless skies, Crossing infinite ages
Towards where divinity lies;
………….
Varying in shape and colour
It emerges through every test,
Wish and perception changing
In its endless spirited quest!
-Amar Agarwala

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

సత్యాన్వేషణే ఆత్మ విద్య. ప్రపంచం మనలో ఉందని తెలుసుకొనే నిజమే ‘ఎరుక.’ Know Thyself (నిన్ను నీవు తెలుసుకో) అంటుంది గ్రీకు తత్వశాస్త్రం. రమణ మహర్షుల వారు కూడా ‘నీవు ఎవరు?’ అన్నది తెలుసుకోవడమే జీవిత పరమావధి, అని బోధించారు. ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఎదురుపడే ప్రతి వారిలో నీకు నువ్వే కనిపిస్తావు.. నిన్ను నువ్వే పలకరించుకుంటావు..

ఇదే విషయాన్ని వేమన ఈ రకంగా మనకు తెలియజేస్తాడు.

ఎరుక కన్నను సుఖ మేలోకమున లేదు
యెరుక నెరుగ నెవని కెరుక లేదు
యెరుక సాటి యెరుక యెరుకయే తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమ.

(ఎరుకను మించిన సుఖం ఏ లోకంలోనూ లేదు. అయినా ఆ యెరుకను తెలుసుకోవాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు. ఎరుకకు సాటి యెరుక యెరుకయే. అదే తత్వం.)

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరు

సముద్రంలోని ఒక్కొక్క కెరటానికి ఒక్కొక్క పేరు పెట్టి పిలవరు. నీళ్లను, కెరటాలను అంతటినీ కలిపి సముద్రమంటారు. మనిషి కూడా సముద్రం లాంటివాడే. మనకు ఎదురు పడుతున్న ప్రతి వాళ్లు మనలోని కెరటాలే. కానీ ‘నేను’ అన్న అహంకారంతోనో, అమాయకత్వంతోనో, మూర్ఖత్వంతోనో, అల వేరు, సముద్రం వేరు.. అని భ్రమిస్తున్నారు. సత్యాన్ని తెలుసుకొని అర్థం చేసుకోండి, అనే లోతైన భావసంద్రం ఇది.

ఇంత చిన్న, సామాన్యమైన ఉదాహరణతో, ఈ పాట ద్వారా సిరివెన్నెల అందిస్తున్న ఆత్మజ్ఞానాన్ని ఒకసారి పరిశీలిద్దాం. జీవాత్మ, పరమాత్మ అని మనం వేర్వేరుగా చెప్పుకొంటున్నా, వాస్తవానికి ఆత్మ ఒక్కటే అని అన్ని శాస్త్ర ప్రమాణాలూ నిరూపిస్తున్నాయి. జీవులందరిలో వున్న ఆత్మ ఒక్కటే అయినా, మాయ (అజ్ఞానం) ప్రభావంతో వేర్వేరుగా తోస్తున్నది. ఎలాగైతే, ఒకే సూర్యుడు నీటి కుండలన్నింట్లోనూ వేర్వేరుగా కనిపిస్తున్నాడో అలాగే, ఆత్మ ఒక్కటే అయినా జీవుల రూపంలో వేర్వేరుగా కనిపిస్తుంటుంది.

ఈ ఆత్మ (బ్రహ్మం)కు సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలేవీ లేవు. చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది. అది ఏ విధంగానూ విభజితం కాలేదు. విభజితం అయినట్లుగా కనబడుతున్నది, అంతే.

‘తత్ త్వం అసి’ (అది నీవే),

‘అహం బ్రహ్మాస్మి’ (నేను బ్రహ్మమును)

‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ (అంతా బ్రహ్మ పదార్ధంతోనే తయారయింది) అన్న మహావాక్యాల నిరంతర చింతనలో తన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే అధ్యాత్మ విద్య. ఆత్మను గురించిన చింతనను, ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం.

ఇంత గంభీరమైన భావాన్ని నింపుకొన్నది పై చరణం. సిరివెన్నెల గారిని ఏమని కొనియాడగలం?

సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా..

నీ మదిగదిలో నువ్వే కదా ఉన్నది.. సరిగా చూస్తున్నావా?.. చుట్టూ ఉన్న ప్రతిబింబాలు.. విడిరూపాలని అనుకుంటున్నావా? అన్న శాస్త్రి గారి తత్వ బోధ, మనకు ఒక అద్భుతమైన త్యాగరాయ కీర్తనలో కనిపిస్తుంది.

తనలోనే ధ్యానించి తన్మయమే గావలెరా॥
తనగుహలో తానుండెడు – తావును దెలియగ వలెరా॥
నీ మర్మ మాక్షణమే – నిశ్చయమై తెలుసునురా॥
ఏనను-మాయావేళ – ఏ వంకో తెలియదురా॥
తొలికర్మమే బలము – తోయ కూడదు విధికి ॥
ప్రకృతి స్వభావములు – ప్రజ్వలించుచు నుండ॥

త్యాగరాజస్వామివారు రచించిన ఎన్నో ఆధ్యాత్మ కీర్తనలలో ఇది ఒకటి. తన మనసులో ఉండే ‘తన’ గురించి తెలుసుకోవాలంటే, తనలోనే ధ్యానించాలన్న రహస్యాన్ని విప్పి చెప్పే కీర్తన.

ఇదే భావాన్ని పలికించే ఒక వేమన పద్యం.

మనసులోని ముక్తి మరియొక చోటను
వెదుక బోవువాడు వెర్రివాడు
గొర్రె చంకబెట్టి గొల్ల వెదికినట్లు
విశ్వదాభిరామ వినురవేమ.
(గొర్రెపిల్లను చంకలో పెట్టుకొని గొల్లవాడు వెతికినట్లు, మోక్షం కోసం వెర్రి వాని వలె మనసుకు ఆవల వెదుకుతున్నాడు.)

ఆత్మవత్ సర్వభూతాన్ని.. సర్వభూతానిచాత్మని.. అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో..

మన శరీరం పంచభూతాత్మకమైనదని వివరిస్తూ ఊపిరిలో ఉండే గాలిని, కళ్ళల్లో ఉండే వెలుగును ఉదాహరణలుగా చూపిస్తూ, మనం ప్రకృతి కన్నా భిన్నం కాదని అలవోకగా సెలవిస్తున్నారు, సిరివెన్నెల.

మనసులో నీవైన భావాలే, బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యలే శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం

యద్భావం తద్భవతి.. దృష్టిని బట్టే సృష్టి వుంటుంది. నీ మనసులో ఏదైతే భావం ఉంటుందో, బయట కూడా నీకు అదే కనిపిస్తుంది. నిజం లేకుండా నీడ లేదు కాబట్టి భ్రమ ఉంది అంటే, అనిత్యమైనది ఉంది అంటే, నిజమైనది, నిత్యమైనది ఒకటి ఉన్నదని అర్థం. అద్దాలవంటిదే ఈ జగత్తు. నీ మనసులోని భావాలే నీకు ప్రతిబింబాలై కనిపిస్తాయి. నీలోని లోపాలే నీ బలహీనతలు, నీ శత్రువులు, నీ ఇష్టాలే నీకు మిత్రులు, నీ బలం. మనసులోని భావం మారుతూ ఉంటే, నీ జీవితంలోని ఋతువుల భావ చిత్రం కూడా మారుతుంది. అంటే నీ జీవితాన్ని ఎలా ఊహించుకుంటే, అలాంటి ఫలితమే వస్తుందన్నమాట! నీకు ఒకవేళ చిరునవ్వు ఎదురైతే, అది నీ స్నేహానికి ఒక పిలుపు అవుతుంది. మోసం, ద్వేషం వంటి చెడు తలుపులు కనిపించాయంటే, నీ ఆలోచనలలోనే ఆ మురికి/లోపం ఉందని అర్థం.

పుటకా చావు రెండే రెండూ నీకవి సొంతం కావు, పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ

ఇక చివరగా, జీవిత సారాన్ని రంగరించి జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో, ఎందుకు జీవితాన్ని అంత విలువైనదిగా పరిగణించాలో చెబుతున్నారు సిరివెన్నెల. పుట్టుక కానీ చావు కానీ మన చేతుల్లో లేవు. మన చేతుల్లో ఉన్నది ఈ రెండింటి మధ్య వున్న చిన్ని జీవితమే. జీవించే అపురూపమైన ఆ కాలాన్ని రంగుల మయం చేసుకోవడం నీ చేతిలోనే ఉంది! కానీ ఎలాంటి రంగులు వేస్తావో, అతి జాగ్రత్తగా నిర్ణయించుకో! అని హెచ్చరిస్తున్నారు, కవివర్యులు. ఇదే విషయాన్ని తెలియజేస్తుంది బ్రహ్మంగారి తత్వం.

తానే ఇచ్చినాడు, తానే దీసినాడు..
తాల్తాలె జీవాత్మ ఏడవాకుమా..

(మనకు జీవాన్ని ఇచ్చిన ఆ పరమాత్ముడే, ఆ జీవితాన్ని మళ్లీ తనే తీసేసుకున్నాడు.. నీ చేతుల్లో ఏమీ లేదని అర్థం చేసుకో.. అనవసరంగా దుఃఖించకు.)

జనన మరణములకు సర్వస్వతంత్రుడు కాదు
మొదలుగర్త కాదు తుదనుగాడు
నడుమగర్తననుట నగుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ..

అని సుద్దులు చెప్తాడు యోగి వేమన.

జీవిత పరమ గమ్యమైన ‘నేను’ అన్నదాన్ని తెలుసుకోవాలంటే ఎరుక కావాలి. ‘లోపలికి’ ప్రయాణించడం ద్వారానే ఆ ఎరుక వస్తుంది. యుగయుగాలుగా లోపలికి ప్రయాణం చేసినవాళ్ళు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక పరమాత్మ, తనలోనూ ఉన్నాడని, ఆ రెండూ వేరు వేరు కాదనీ తెలుసుకున్నారు. ఇన్ని మహా గ్రంథాలు, ఇంతమంది మహనీయులు చెప్పిన తత్వసారాన్నంత అవపోసన పట్టిన సిరివెన్నెల ఒక తత్వవేత్తగా, ఒక యోగిగా, ఈ సారాన్నంతా తన భావాలలో ఇముడ్చుకొని, సామాన్యమైన మాటలతో అనంతమైన, అంతులేని తత్వాన్ని మనందరికీ తరిగి పోని ఒక నిధిలాగా అందించారు. దివ్య లోకాల్లోని ఏ ఋషి పుంగవుడో మన కోసం భూమి మీదకు సీతారామశాస్త్రి గారి రూపంలో వచ్చి, తన సాహిత్యం ద్వారా అమృతమయమైన ఆధ్యాత్మ జ్ఞానాన్ని కాచి వడబోసి, తేనె కలిబోసిన తెలుగులో, మనకు అందించారు. ఆ మహర్షికి ఇదే నా అక్షర నివాళి.

Images Courtesy: Internet

Exit mobile version