[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
ఏ దారెదురైనా ఎటు వెళుతుందో
~
చిత్రం: జాను
గీతం: ఏ దారెదురైనా.. (లైఫ్ ఆఫ్ రామ్)
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: సి.ప్రేమ్ కుమార్
గానం: ప్రదీప్
~
సాహిత్యం
ఏ దారెదురైనా ఎటు వెళుతుందో.. అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ.. పోతున్నా
ఏం చూస్తూ వున్నా నే వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ యేవేవో కనిపిస్తూ వున్నా
కదలని ఓ శిలనే అయినా, తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై వుంటానంటున్నా..
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు వున్నా..
నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు.. అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా వూపిరిని యిన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది?
నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి?
చరణం:
ఉదయం కాగానే తాజాగా పుడుతూ వుంటా
కాలం యిపుడే నను కనగా..
అనగనగా అంటూనే వుంటా, ఎపుడూ పూర్తవనే అవక.. తుది లేని కధ నేనుగా
గాలి వాటం లాగ ఆగే అలవాటే లేక కాలు నిలవదు యే చోటా..నిలకడగా
ఏ చిరునామా లేక ఏ బదులూ పొందని లేఖ ఎందుకు వేస్తోందో కేక.. మౌనంగా..
నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు యెరగరు నా వూపిరిని యిన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది?
నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి..?
చరణం:
లోలో యేకాంతం , నా చుట్టూ అల్లిన లోకం, నాకే సొంతం అంటున్నా..
విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా..
అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో వూరిస్తూ వుంది జాబిల్లి అంత దూరానున్నా ..
వెన్నెలగా చెంతే వున్నా అంటూ ఊయలలూపింది జోలాలి..
తానే నానే నానినే.@.. తానే నానే నానినే ..
♠
ఏ దారెదురైనా.. ఎటు వెళుతుందో.. అడిగానా?.. జాను చిత్రంలోని అద్భుతమైన ఈ లైఫ్ ఆఫ్ రామ్ పాటని, 14 కోట్ల మంది వీక్షించారంటే, ఆ పాట సాహిత్యం ఎంత గొప్పదో ఊహించగలరు! పైకి చూడడానికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయిన చిత్ర కథానాయకుడు, ఒంటరిగా చేస్తున్న ప్రయాణాన్ని, అతని స్వభావాన్ని, జ్ఞాపకాలను, వివరించినట్టు కనిపిస్తుంది, ఈ పాటలో. అంత సాధారణ విషయమయితే, ఇన్ని కోట్ల మంది మనసులను గెలుచుకోవడం సాధ్యమేనా? కానీ దాన్ని సుసాధ్యం చేసింది, ఈ పాటలో దాగివున్న అంతరార్థం! Supreme Indian Philosophy/ Spirituality ని అలవోకగా ఒక సినీగీతంలో సిరివెన్నెల రంగరించి అందించిన ఆధ్యాత్మిక-సాహిత్యం ఇది. ఇందులో అంతర్లీనంగా ఉన్న, ఉన్నతమైన సాహిత్యాన్ని, అవగాహన చేసుకుంటే ఈ పాట మన మనసుకు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది.
ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు, సిరివెన్నెల గారి ఉద్దేశమేమిటంటే, పాటలోని పదాల్లో, దాని అర్థాల్లో కాకుండా, భావాన్ని అనుభూతి చెందగలిగితే ఆ పాట ఎక్కువమంది శ్రోతలను రంజింప చేస్తుంది. ‘చందమామ రావే, జాబిల్లి రావే..’ అంటూ, తల్లి మాధుర్యంగా పాడే పాటలోని భావంతో పసిబిడ్డలకు పనిలేదు. దానిలోని మార్ధవాన్ని ఆస్వాదిస్తూ వాళ్లు సేద తీరుతారు. అదే విధంగా, సిరివెన్నెల సాహిత్యం Basic Human Emotions ని స్పృశించడం వల్ల, ఆ పదాలకు పదకోశాల్లో అర్థాలను వెతుక్కుంటూ, సాహిత్యంతో సహా ఆస్వాదించగలుగుతున్నారు.
అందరూ మాట్లాడే “జనాలు, క్లాసు, మాసు, పాట అర్థం కాకపోవడం, స్థాయి..” లాంటి పదాలను సిరివెన్నెల ససేమిరా అంగీకరించరు. ఎందుకంటే మనిషి మూలాల్లోని సరోజినీయనమైన భావోద్వేగాలు అందరికీ సమానంగానే ఉంటాయి. కాబట్టి, సరియైన అనుభూతిని వారికి కలిగించకగలిగితే, డిక్షనరీలు వెతుక్కుని అయినా, ఆ పాటను తప్పకుండా అర్థం చేసుకుంటారని, ఆయనకు గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని వేలాదిగా వ్రాసిన ఆయన పాటలు, వాటిని ఆదరించిన కోట్లాది ప్రేక్షకులు, నిరూపించడం జరిగింది.
అయితే, ఇంత లోతైన ఆధ్యాత్మిక విలువలు కలిగిన పాటకు అన్ని కోట్ల మంది ఎలా స్పందించారు? అన్న ప్రశ్న మనకు రాకమానదు.
అమెరికాకు చెందిన డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ అయిన Howard Gardner ప్రకారం ప్రతి మనిషికి పుట్టుకతోనే తొమ్మిది రకాల మేధస్సులు ఉంటాయి. అవి; సహజ, సంగీత, తార్కిక- గణిత, అస్తిత్వ, వ్యక్తిగత, భాషా, శారీరక (కైనస్తెటిక్), వ్యక్తి అంతర్గత, ప్రాదేశిక మేధస్సు.(Naturalistic, Musical, Logical- mathematical, Existential, Interpersonal, Linguistic, Bodily-kinesthetic, Intra- personal and Spatial intelligence). వాటిలో Existential, అంటే ‘నేను ఎవరు?’ అన్న ఉనికిని కనిపెట్టే జ్ఞానం, మనలోకి మనం ప్రయాణించే మార్గం(intra-personal), పుట్టుకతోనే మనందరికీ ఉంటాయి. అందుకే మన హృదయాన్ని సరిగ్గా స్పృశించగలిగితే, అలాంటి విషయ జ్ఞానం, వెంటనే మనల్ని ఆకట్టుకుంటుంది. అందుకే ఎవరైనా, ధృవుడు, ప్రహ్లాదుడు వంటి మహా భక్తులలాగా, ఏ వయసులో అయినా భక్తి పరిపక్వత చెందవచ్చు!
గొప్ప సాహితీ విలువలు కలిగిన ఈ పాటని, సినీ కోణంలో కాకుండా, ఆధ్యాత్మిక కోణంలోనే విశ్లేషించాలని ప్రయత్నం చేశాను. ఇక పాట విశ్లేషణలోకి వెళ్దాం.
ఏ దారెదురైనా యెటు వెళుతుందో.. అడిగానా?
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ.. పోతున్నా
ఏం చూస్తూ వున్నా నే వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ యేవేవో కనిపిస్తూ వున్నా
కదలని ఓ శిలనే అయినా, తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై వుంటానంటున్నా..
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు వున్నా..
భగవంతునికి తన్ను తాను సంపూర్ణ సమర్పణ చేసుకున్న ప్రకృతి లాగా జీవనం గడిపే ఏ వ్యక్తి అయినా, సహజంగా, స్వేచ్ఛగా ఉంటాడు. ‘నా జీవన గమనంలో ఈ దారి ఎదురైనా, అది ఏ గమ్యానికి నన్ను చేరుస్తుందో, అన్న భయం నాకు లేదు. నాకు భగవంతుడే మార్గదర్శి అయినప్పుడు నేను ఎందుకు భయపడాలి! అందుకే నేను, భగవంతుడు నిర్దేశించిన ఓ జీవనదిలాగా, ఏ ఆలోచన చేయకుండా, ముందుకు సాగిపోతూనే ఉన్నా. చుట్టూ ప్రపంచంలో ఎన్నో వింతలు కనిపిస్తున్నా, నాకేం కావాలి, అని నేను వెతకడం లేదు.’ అంటూ కవి తన complete surrender ని వివరిస్తున్నాడు.
కలకాలం నిలిచిపోయే శిలనైనా, క్షణంలో కరిగిపోయే కలనైనా, నాకు ఏ బేధము లేదు. ఎందుకంటే ప్రకృతిలో జడమూ.. చైతన్యమూ.. అంతా భగవంతుడే! ‘నేను ఎవరిని?, అనే నిర్వచనం కోసం నేను తాపత్రయపడి నాకు నేనే బంధనాల్లో చిక్కుకోను,’ అంటున్నాడు కవి. అనంతమైన చైతన్యం కలిగిన ఏ ఆత్మ అయినా, ఒక పరిధిలోకి తనను తాను పరిమితం చేసుకోకుండా, శక్తి మేరకు విస్తరించడానికి ప్రయత్నించాలి. చివరిదాకా తనను ఒక సమాధానం దొరకని ప్రశ్నలాగే ఉంచమని, తనకు ఏ రకమైన tags తగిలించవద్దని, కాలాన్ని ప్రార్థిస్తున్నాడు, ఈ జ్ఞాన శిఖరం.
నిజంగా ఆలోచిస్తే, సరళమైన జీవితం సహజంగా, ఎలాంటి చిక్కులకు లోబడకుండా ఉంటుంది. ‘నేను ఫలానా, నాది ఫలానా స్థాయి, నేను ఈ స్టేటస్ లోనే బతకాలి, నేను ఇలాగే ఉండాలి, నలుగురు నన్ను గురించి గొప్పగా అనుకోవాలి’.. అని ఎప్పుడైతే మనల్ని మనం నిర్వచించుకోవడానికి తాపత్రయ పడతామో, అప్పటినుండి జీవితం సింపుల్ నుండి కాంప్లెక్స్‌కి మారిపోతుంది. మునులు, ఋషులు, సాధువులు, మహనీయులు అందరూ సాదాసీదా జీవనం గడుపుతూ, మనం ఎలా జీవిస్తే సుఖంగా, హాయిగా ఉంటామో.. మనకి నేర్పుతున్నారు. కానీ, ఆ నిజాన్ని మనం గుర్తించలేక, భగవంతుని రాజ్యాంగానికి విరుద్ధంగా, సొంత ఆలోచనలతో, పరిపరి విధాల కష్టాలు, మనస్థాపాలకు గురవుతున్నాము. తుంచుకోవలసిందాన్ని పెంచుకొని, పెంచుకోవలసిన దాన్ని తుంచుకుంటున్నాము. అందుకే ఆదర్శ, సుఖమయ జీవితానికి గొప్ప నిర్వచనం; Simple Living and High Thinking.
నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు.. అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు,
నా వూపిరిని యిన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది?
నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి?
సద్వినియోగం చేసుకుంటే, ఏకాంతం, దానితో వచ్చే మౌనం రెండూ వరాలే. ఒంటరినని నేను అస్సలు భావించడం లేదు, నాకు తోడుగా నా ఆత్మ నిరంతరంగా నాతోనే ఉంది. అందుకే, “నా వెంటపడి, ‘నువ్వు ఒంటరివి’, అని ఎవరూ దెప్పిపొడవకండి. ఈ ఒంటరితనంలో, నాలోకి నేను ప్రయాణించి కొన్ని జన్మలకు సరిపడా స్మృతుల్ని పేర్చుకుంటున్నాను. ‘అయినా నేను ఒంటరిని, అని మీకు ఎవరు చెప్పారు?’ నాలో శ్వాసను నింపి, నా ఎదలోనే కొలువై, నా వెన్నంటే ఉంటూ, నా ఎదలయ క్షేమాన్ని చూసుకుంటూ, నా గుండెలో గుసగుసగా కబుర్లు చెబుతూ, నన్ను నడిపిస్తున్న ఆ చైతన్యం ఎవరో? ఆ జ్ఞాన పుష్ప పరిమళాల గుమగుమలు ఎవరివి?” అని, తన స్వయాన్ని ప్రశ్నించుకుంటున్నాడు కవి.
అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే।|
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్॥ (భగవద్గీత 9-22)
“వేరే ఇతర ఆలోచనలు ఏవీ లేకుండా నిత్యమూ తనను తానే నమ్ముకొని, తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే వుంటూ, తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను.” అని వాగ్దానం చేస్తాడు గీతాచార్యుడు. ప్రాపంచికంగా, భౌతికంగా, మనకు ఇచ్చే రక్షణ ‘క్షేమం’ అనబడుతుంది. ‘యోగం’ అంటే ఆధ్యాత్మిక పురోగతి. ఇదే భావాన్ని, గీతా సారాన్ని, ఈ అనుపల్లవిలో సున్నితంగా వివరిస్తున్నారు సిరివెన్నెల. మనం చెయ్యవలసిందల్లా ఒక్కటే.. ఆత్మధర్మాన్ని నిర్వర్తించడం.. మన ధ్యానంలో మనం ఉండడం!
భక్తిప్రపత్తులు.. ఆధ్యాత్మిక పరిభాషలో ఎక్కువగా వినిపించే పదబంధం ఇది. భక్తి.. ప్రపత్తి.. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. అయితే, ఈ రెండూ భగవదనుగ్రహాన్ని పొందడానికి, మోక్షసాధనకు గల భిన్నమైన మార్గాలు. దైవాన్ని ఆరాధించడం, ప్రేమించడం, పూజించడం, ప్రార్థించడం, మొదలైనవన్నీ ‘భక్తి’. కానీ, భక్తి కంటే ఉన్నతమైనది ‘ప్రపత్తి’. భారమంతా భగవంతునిపై వేసి సంపూర్ణ శరణాగతి వేడే విధానాన్నే ప్రపత్తి అంటారు. ‘నీట ముంచినా.. పాల ముంచినా నీవే స్వామి.. మంచి జరిగినా, చెడు జరిగినా నీవే దిక్కు’ అంటూ సాగిలపడే పద్దతి ఇది. ఈ పద్ధతిలో పరమాత్మను కొలిచేవారు తమ గురించి తాము పట్టించుకోరు. తమ అవసరాల గురించి పట్టించుకోరు. అందువల్ల దేవుడే వారి భారం వహిస్తాడు.
ఉదయం కాగానే తాజాగా పుడుతూ వుంటా
కాలం యిపుడే నను కనగా..
అనగనగా అంటూనే వుంటా, ఎపుడూ పూర్తవనే అవక.. తుది లేని కధ నేనుగా
గాలి వాటం లాగ ఆగే అలవాటే లేక కాలు నిలవదు యే చోటా..నిలకడగా
ఏ చిరునామా లేక ఏ బదులూ పొందని లేఖ ఎందుకు వేస్తోందో కేక.. మౌనంగా..
చరణం మనల్ని మరింత ఆధ్యాత్మిక లోయల్లోకి తీసుకువెళ్తుంది. ‘ఉదయించే సూర్యుడిలాగా, ప్రతిరోజూ కాలం నన్ను ఇప్పుడే కన్నట్టు, తాజాగా పుడతాను’.. అత్యున్నతమైన ఆత్మజ్ఞానం ఇది. చీకటి పడగానే తనలోకి తను ముడుచుకుపోయే సూర్యబింబం లాగా, ఉదయాన్నే మళ్లీ వికసిస్తాను. ఎందుకంటే నా కథకు (ఆత్మ ప్రయాణానికి) మొదలూ లేదు తుదీ లేదు. అందుకే వేల జన్మల స్మృతులన్నీ నింపుకొని, అనగనగా అంటూ.. నా కథలు.. తిరిగి.. తిరిగి చెబుతూనే ఉంటాను. కాలు నిలవని గాలిలాగా, ముందుకు సాగిపోతూనే ఉంటాను. నన్ను తనలో ఐక్యం చేసుకోమనే నా ప్రార్థనలను మౌనంగా భగవంతునికి వినిపిస్తూనే ఉంటాను. కానీ, నేను రాసిన ఈ లేఖను సరి అయిన చిరునామాకు, పంపలేకపోవడంతో, బదులు రాక జన్మజన్మాలుగా ఆర్తితో కేకలు పెడుతూనే ఉన్నాను.. ఆ పరమాత్ముని కృప కోసం! అన్న భావాన్ని సిరివెన్నెల గారు అందించారని, నా మనసుకు అనిపిస్తోంది.
లోలో యేకాంతం, నా చుట్టూ అల్లిన లోకం, నాకే సొంతం అంటున్నా..
విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా..
అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో వూరిస్తూ వుంది జాబిల్లి అంత దూరానున్నా..
వెన్నెలగా చెంతే వున్నా అంటూ ఊయలలూపింది జోలాలి..
ఈ ప్రపంచంలో మనం ఉన్నా, నిజానికి ఎవరి ప్రపంచం వారిది. ఒక్కొక్క వ్యక్తిది ఒక ప్రపంచం. అందుకే మన లోలోపల చెప్పలేనంత ఏకాంతం. కానీ నా చుట్టూ నేను అల్లుకున్న లోకం! ఆ లోకం నాకే సొంతం! నా లోకంలో నా అంతరాత్మ, దానికి తోడుగా నడవడానికి శరీరం అనే నా నీడ, ఈ రెండే చాలు ఈ ప్రయాణంలో. మా మధ్యలోకి ఇంకెవరూ రాకండి, అని హెచ్చరిస్తున్నారు సిరివెన్నెల. నా సరికొత్త ప్రయాణంలో, మొన్న అమ్మ ఒడిలో ఉన్నాను.. నేను పెరుగుతూ ఉంటే.. అందనంత ఎత్తుకు నా ఆశలు పెరుగుతూ ఉన్నాయి.. గతమంతా వాటిలోనే గడిపాను. చిన్నతనంలో అందని చందమామలా, యుక్త వయసులో దరిచేరని ప్రియురాలిలా జాబిలి అనిపించినా, తన ప్రియురాలి జ్ఞాపకాల వెన్నెలే తనకు తోడుగా జీవిస్తున్నాననీ, తాను ఒంటరిని కానని, చెప్పే కథానాయకుడి అంతరంగాన్ని ఆవిష్కరించారు సిరివెన్నెల ఈ చరణంలో. ఇక నా కోణంలో చూస్తే అంత దూరాన ఉన్న జాబిలి, నా చిరుప్రాయం నుండి ఇప్పటిదాకా నన్ను ఊరిస్తూనే ఉంది అందకుండా.. అని తన బాధను వ్యక్తం చేస్తూనే.. దానికి అద్భుతమైన సానుకూల సమాధానాన్ని కూడా అందిస్తున్నారు మన ఆప్త కవి. జాబిల్లిలాగా పరమాత్ముడు అల్లంత దూరంలో ఉన్నట్టు నీకు అనిపిస్తూ ఉన్నా, తన వెన్నెల అనే కిరణాలతో నిన్ను చేరుకుంటున్నాడు.. నిన్ను సేద తీర్చి, జోలపాడి జో కొడుతున్నాడు, ఓ అమ్మలా. నీవే ఇది గమనించి ఎరుకలోకి రావాలి! అన్న సందేశాన్ని, రెండో చరణంలో అమృతపు ఝల్లులా మన ముందు కురిపిస్తున్నారు..
మొత్తం మీద ఈ పాట కూడా, జగమంత కుటుంబం నాది, నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా, ఎంతవరకు ఎందుకొరకు, ఇంత పరుగు అని అడక్కు.. పాటల. క్యాటగిరిలోనే అద్వైత సూత్రాన్ని ప్రబోధిస్తుంది. “నాతో నేను రమిస్తూ.. నాతో నేను సహగమిస్తూ../తెలిస్తే నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా?..” లాంటి అభివ్యక్తులతో, ఆత్మ- పరమాత్మల అభేదాన్ని వివరిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ పాట, ఎందరి మనసులను గెలుచుకొని, అందరి హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసింది.
ఈ విధంగా ఒక రస రమ్యమైన పాట, ఆ గాన మాధుర్యం వల్ల, సంగీతం వల్ల ఎందరినో ఆకట్టుకోగలుగుతుంది. అద్భుతమైన సాహిత్యానికి అతి మధురమైన సంగీతం తోడైతే, అది మన ఎదలోతుల్లోకి వెళ్లి, మన చైతన్యాన్ని తట్టి లేపగలిగితే.. ఆ పాట.. సిరివెన్నెల బాట. సరస్వతీ దేవి రెండు స్థనాలలోని క్షీరంలో, ఒక దానిలో ఆలోచనమృతం ఉంటే, మరొక దానిలో ఆపాత మాధుర్యం ఉంటుందట. అందుకనే సిరివెన్నెల గారి పాట, మనసును హత్తుకొని, మనిషిని ఆలోచింపజేసే ఆపాత మధుర కావ్యం. ఆయన జ్ఞాన సాగరంలో నుండి, మనము ఏ కాస్త అమృతాన్ని స్వీకరించగలిగినా, ఆయన సాహితీ తపస్సు సఫలమైనట్టే!.
Images Courtesy: Internet