సిరివెన్నెల పాట – నా మాట – 19 – నిండు భావుకతను వ్యక్తీకరించే పాట

1
2

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు..

~

చిత్రం: ఖడ్గం

గీతం: నువ్వు.. నువ్వు..

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం : దేవిశ్రీప్రసాద్

గానం : సుమంగళి

~

గీత సాహిత్యం

పల్లవి:
నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు..
నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు..
నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు
నా పెదవి పైన నువ్వు, నా మెడవంపున నువ్వు, నా గుండె మీద నువ్వు, ఒళ్ళంతా నువ్వు,
బుగ్గల్లో నువ్వు, మొగ్గల్లే నువ్వు, ముద్దేసే నువ్వు, నిద్దర్లో నువ్వు, పొద్దుల్లో నువ్వు, ప్రతినిమిషం.. నువ్వు.. నువ్వు
చరణం:
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు నాప్రియ శత్రువు నువ్వు నువ్వు
మెత్తని ముల్లె గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వు నువ్వు
చరణం:
నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వు నువ్వు
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు॥ నువ్వు ॥
చరణం:
మైమరపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు అయినా ఇష్టం నువ్వు నువ్వు
నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్వింస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వు నా పంతం నువ్వు నా సొంతం నువ్వు నా అంతం నువ్వు ॥నువ్వు ॥

“Prose is the words in their best order; Poetry is the best words in their best order”-Coleridge.

పాట కూడా కవిత్వ రూపమే అనేది సిరివెన్నెల ధృడ విశ్వాసం. సినిమా పాట సాహిత్యప్రక్రియ కాదని చాలామంది అభిప్రాయపడినట్టే, సినీ రంగంలోకి అడుగు పెట్టక ముందు ఆయనకి కూడా అపోహ ఉండేదట. పాటలు వినడం తప్ప, అందులోని సాహితీ విలువలను ఎక్కువ శాతం మంది పట్టించుకోరని అందరూ అనుకుంటారు. కానీ, ఎందరో సినీ కవులు రచించిన భావ కవిత్వంతో కూడిన సినీ గీతాలు, అత్యంత ఆదరణ పొంది, చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి ఎన్నో భావ కవితా కుసుమాలను సినీ గీతాల పూదోటలో పరిమళింపజేశారు, సిరివెన్నెల.

మంచి గీత సాహిత్యం ఎలా ఉండాలి, అని ఆలోచిస్తే, సరళమైన భాషలోనే అనంతమైన భావాన్ని పొదిగేలాగా ఉండాలి. పాట వినూత్న శైలి, రూపంలో ఉంటూ, బలమైన భావోద్వేగాలను ప్రభావితం చేయగల అంశాన్ని theme గా కలిగి ఉండాలి. ఆహ్లాదకరమైన లయ, రంజింప చేసే రాగంతో, మధురభావ పూర్వకంగా సాగిపోవాలి. పండితులను, అతి సామాన్యుడి మనసుని సైతం ఒక గొప్ప పాట తాకగలిగి, అందరి ప్రశంసలు పొంది, విస్తృతంగా వ్యాపించాలి. ఒక నిర్దిష్టమైన భావానికి కట్టుబడకుండా, విభిన్న కోణాల్లో(Out of box Thinking) ఆలోచింపజేసేలాగా, అనుభూతి చెందేలాగా ఉండాలి. అన్నిటికన్నా మించి, మనిషిలోని ‘మనిషితనాన్ని’ స్పృశించేలా ఉండాలి. ఈ లక్షణాలన్నీ సిరివెన్నెల గారి పాటలు మనకు సుస్పష్టంగా దర్శనమిస్తాయి.

A good poem surprises your senses, shakes you awake, stirs your emotions, and startles your imagination. Each poem is an act of discovery. Poetry helps us widen our vision and our hearts. -Joan Bransfield Graham.

“సినీ సాహిత్యానికి కొత్త సొబగులద్ది సినిమా పాటకు పట్టాభిషేకం చేసి, 56 అక్షరాల తెలుగు భాషని అర్థవంతంగా, సమర్థవంతంగా పేర్చి అద్భుతాలు సృష్టించిన శిల్పి సిరివెన్నెల సీతారామశాస్త్రి. సినిమా పేరుని తన ఇంటి పేరుగా మార్చుకుని ఆయన ప్రారంభించిన సినీ పాటల యజ్ఞం ఆయన్ని ఈ శతాబ్దపు మేటి తెలుగు రచయితల సరసన నిలిచిపోయేలా చేసిందంటే అతిశయోక్తి కాదు”,అని తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ప్రశంసించారు.

ఈ రోజు మనం విశ్లేషించుకునే పాట, ఇలాంటి నిండు భావుకతను వ్యక్తీకరించే, ‘ఖడ్గం’ చిత్రంలోని హృద్యమైన ఒక గీతం.

ఇందులోని పాటలన్నీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీకాంత్, సోనాలీ బింద్రేలపై చిత్రీకరించిన ‘నువ్వు నువ్వు’ అంటూ సాగే ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్, 20 ఏళ్ల తర్వాత కూడా యూత్‌కి ఒక ఫేవరెట్ సాంగ్‌లా నిలిచిపోయింది. అమాయకంగా టెర్రరిస్టుల చేతిలో బలైపోయే ఆ పాత్ర ఫీలింగుకు తగినట్టు సుమంగళి పాడిన పాట, దేవి శ్రీప్రసాద్ అందించిన మధురమైన నేపథ్య సంగీతం, ఈ పాటకి మరింత వన్నెని తెచ్చిపెట్టాయి..

ఈ పాటలోని ప్రత్యేకత ఏమిటంటే, ‘నువ్వు’ అన్న పదం దాదాపు ఇందులో 100 సార్లు వినిపిస్తుంది. ప్రేమ గీతాలు రాసినప్పుడు, రచయితలు ‘నువ్వు.. నేను..’ పదాలను విరివిగానే వాడుతుంటారు. మచ్చుకు కొన్ని పాటలను ఇప్పుడు చూద్దాం.

~

నీవని నేనని తలచితిరా, నీవే నేనని తెలిసితిరా.. సముద్రాల జూనియర్.. (పాండురంగ మహత్యం)

~

నీవు లేని నేను లేను.. నేను లేక నీవు లేవు..

నేనే నువ్వు.. నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో.., ఈ జగమే లేదు- ఆచార్య ఆత్రేయ, (మంచి మనుషులు)

~

తాను నేను మొయిలు మిన్ను

తాను నేను కలువ కొలను

తాను నేను పైరు చేను

తాను నేను వేరు మాను

శశి తానైతే నిశినే నేను

కుసుమం తావి తాను నేను

వెలుగు దివ్వె తెలుగు తీపి

తాను నేను మనసు మేను – అనంత శ్రీరామ్ (సాహసం శ్వాసగా సాగిపో..)

~

ఇప్పుడు మనం, శైలీ పరంగా కూడా ఎంతో ప్రత్యేకతను కలిగివున్న ‘నువ్వు.. నువ్వు..’ పాట విశేషాల్లోకి వెళ్దాం.

నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు

నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు

నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు

నా పెదవి పైన నువ్వు, నా మెడవంపున నువ్వు, నా గుండె మీద నువ్వు, ఒళ్ళంతా నువ్వు,

బుగ్గల్లో నువ్వు, మొగ్గల్లే నువ్వు, ముద్దేసే నువ్వు, నిద్దర్లో నువ్వు, పొద్దుల్లో నువ్వు, ప్రతినిమిషం.. నువ్వు.. నువ్వు

లలితమైన పదాలతో, పిల్ల తెమ్మెరలాగా, అలా అలా సాగిపోయే ఈ పాట పల్లవిలో, ప్రాణంగా ప్రేమించిన తన ప్రియుడిని, ఒక ప్రియురాలు ఎంత సన్నిహితంగా భావిస్తుందో, ప్రతిక్షణం తన ఆలోచనలలోనే గడుపుతూ, ఎలా పరవశిస్తుందో వివరిస్తుంది.

నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు

నా మనసును లాలించే చల్లదనం నువ్వు

పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు

బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు

నా ప్రతి యుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు నాప్రియ శత్రువు నువ్వు నువ్వు

మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు

నచ్చే కష్టం నువ్వు నువ్వు..

ఇక చరణంలో, ‘నా సర్వస్వం నువ్వే’, అన్న భావాన్ని ‘నా ప్రతి యుద్ధం నువ్వు’, ‘నా సైన్యం నువ్వు’, ‘నా ప్రియ శత్రువు నువ్వు’, ‘నచ్చే కష్టం నువ్వు’.. అన్న వినూత్న పదబంధాలతో, ఒక ప్రేయసి, తనకు నచ్చిన వ్యక్తిని ఎలా ఆరాధించగలదో, అభివ్యక్తీకరించారు, సిరివెన్నెల.

పచ్చిదనం, పిచ్చితనం, చల్లదనం, వెచ్చదనం.. లాంటి ప్రాసలతో చెవులకు ఇంపుగా సాగుతుంది గానం.

“For me, good poems, ones that I like to read over and over, can bring delight in many ways. Wit, word-play, unexpectedness of word and thought, depth of feeling, word- music, vivid images, the shape of the poem on the page, all bring me joy,” అన్నది Patricia Hubbell అభిప్రాయం. ఇందులో చెప్పిన లక్షణాలన్నీ.. సిరివెన్నెల పాటలలో మనకు సలక్షణంగా కనిపిస్తాయి.

నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు

నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు

ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు

నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు

తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు

తప్పని స్నేహం నువ్వు నువ్వు

తీయని గాయం చేసే అన్యాయం నువ్వు..

ప్రేయసి ప్రియుల మధ్య ఉద్భవించే శృంగార భావాన్ని, శృంగార రసాన్ని, చెప్పీ చెప్పక, విప్పీ.. విప్పక, సున్నితంగా, అందంగా అక్షరీకరించారు సిరివెన్నెల.

మైమరపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు అయినా ఇష్టం నువ్వు నువ్వు

నే కోరుకునే నా మరోజన్మ నువ్వు

కైపెక్కిస్తూ నువ్వు కవ్వింస్తుంటే నువ్వు

నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు

నా అందం నువ్వు ఆనందం నువ్వు

నేనంటే నువ్వు నా పంతం నువ్వు నా సొంతం నువ్వు నా అంతం నువ్వు ॥నువ్వు ॥

నువ్వు నేను వేరు కాదు అన్న అద్వైతాన్ని చూపిస్తూ, ‘నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు’, అంటారు సిరివెన్నెల. ప్రేమ లోతులను స్పృశిస్తూ, ‘నే కోరుకునే నా మరో జన్మ నువ్వు’, అంటూ గాఢమైన ప్రేమ తత్వాన్ని ఆవిష్కరిస్తారు. తన ప్రియుడిలో, అతని ప్రేమలో లీనమైపోయిన ప్రేయసితో.. అతడిని, నా సొంతం/నా పంతం/నా అంతం.. కూడా నీవే.. అన్న ప్రేమైక భావనను పలికించడం సిరివెన్నెల భావుకతకు, ఒక మెచ్చుతునక.

ఈ పాట ఒక ప్రేయసి తన ప్రియుడితో పాడుకునే, ఒక అద్భుత ప్రేమ గీతం. అయితే, ప్రేమ సార్వజనీయమైనది. సిరివెన్నెల గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ పాట ప్రేయసి ప్రియుల ప్రేమనే కాకుండా, ఏ ప్రేమనైనా వ్యక్తపరచగలదు, అంటూ… “ధృతరాష్ట్రుడు, తన కొడుకైన దుర్యోధనునికి కూడా ఈ పాటను అన్వయించవచ్చు.‌ నా యుద్ధం నువ్వు/ నా సైన్యం నువ్వు/ నా పంతం నువ్వు/ నా అంతం నువ్వు.. అన్న వ్యక్తీకరణ, ధృతరాష్ట్రుని భావాలను కూడా ప్రకటించగలదు”, అన్నారు. అది విన్నప్పుడు, నాకు కూడా ఒక ఆలోచన స్ఫురించింది.

ఒక శరీరం, తన ఆత్మతో, తన బంధాన్ని వివరించడానికి కూడా, ఈ పాటను ఎంతో చక్కగా అన్వయించవచ్చు కదా? అనిపించింది. ఎందుకంటే, Marilyn Singer అన్నట్టు, గొప్ప సాహిత్యంలో అంతర్లీనంగా, ఆధ్యాత్మికత దాగే ఉంటుంది.

A good poem may also ask philosophical questions. In its condensed form, poetry gives these questions an immediacy, a great power to startle and grab the imagination. Poetry is great for asking -and sometimes answering-those questions that come to you just as you’re falling asleep. -Marilyn Singer.

పైన మనం మాట్లాడుకున్న, నా కొత్త పేరు నువ్వు, నే కోరుకునే నా మరో జన్మ, నా ప్రియ శత్రువు, నచ్చే కష్టం, తప్పని స్నేహం.. అందం, ఆనందం,‌ పంతం.. అంతం, అన్నీ కూడా శరీరానికి ఆత్మతో ఉన్న బంధాన్ని స్పష్టంగా వివరిస్తాయి. అసలు ఆత్మ లేని శరీరానికి, ఒక ఉనికి, ఒక పేరంటూ ఎలా వస్తుంది? శరీరాన్ని విసిగించినా, లాలించినా, బుజ్జగించినా.. అన్నీ మనసే. శరీరం, ఆత్మల మధ్య ఉన్నది కూడా విడదీయలేని అనుబంధమే కదా? అసలు మనల్ని అందరూ నువ్వు.. నువ్వు… అంటుంటారు. ఈ మేనును ‘నేను’ అని భ్రమించేలా చేసేది, ఆ ‘నువ్వే!’ అందుకే.. నేనంటే నువ్వు.. నా చుట్టూ నువ్వు.. నేనంతా నువ్వు..

సినిమా పాటను కూడా విడిగా చదువుకుంటే దానిలో ఒక సమగ్రమైన భావం వుండాలని సిరివెన్నెల ఎలా అభిప్రాయపడ్డారో అలాగే శైలి కూడా ప్రత్యేకంగా వుండాలని ప్రయత్నించారు. ప్రతి పాటలోనూ మనకు పనికి వచ్చే, అర్థవంతమైన, ఆదర్శవంతమైన ఏదో ఒక సందేశాన్ని, అందిస్తూనే ఉన్నారు.

మన భావ కవివర్యులు, సిరివెన్నెల. Samuel Johnson అన్నట్టు, ప్రతి పాటలోనూ ఒక ఉల్లాసంతో పాటు ఒక నిత్య సత్యాన్ని, నిష్ఠుర సత్యాన్ని మన మనసు canvas పై అందమైన రంగులద్దుతూ, ఆవిష్కరిస్తారు సిరివెన్నెల. వాటిని తనివితీరా ఆస్వాదించడమే మనకు మిగిలే అందమైన అనుభవం!

“Poetry is the art of uniting pleasure with truth.” Samuel Johnson

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here