Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట -2 – ధనలక్ష్మి చరణాలే శరణం

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ

~

రచయిత – సిరివెన్నెల సీతారామశాస్త్రి

చిత్రం – మనీ, 1993

గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

~

పాట సాహిత్యం

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికి పాడెకట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా||చక్రవర్తికీ ||
*
ఇంటద్దె కట్టావ నా తండ్రి నో ఎంట్రీ వీధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెంట్లీ నీ ఇంట్లో చిమ్మచీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే కదా బ్రదర్ ప్రతీ పూటకీ
రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా||చక్రవర్తికీ ||
*
ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకొవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమ స్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది
బ్లాకులో కొనే వెలే సినీప్రేమది
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతినిమిషము సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా||చక్రవర్తికీ ||

ధనమూలమిదం జగత్’, అనే సత్యాన్ని మంచి ఇంగ్లీషు, తెలుగు, హిందీ పదాలను కలిపేసి, పెనపేసిన, పాటని ఊపేసిన సిరివెన్నెల గారి ‘ధనవేదం’ ‘మనీ’ సినిమాలోని ఈ టైటిల్ సాంగ్. వ్యంగ్య లేదా హాస్య ధోరణిలో కఠిన సత్యాలను వ్రాయడం సులభం కాదు. కానీ ఈ ప్రయోగంతో ఎన్నో పాటలను రక్తి కట్టించారు సిరివెన్నెల గారు. డబ్బు విలువను చెప్పడానికి, ఇతర భాషా పదాలను మన భాషలో కలిపి, ప్రాసలోకి అందంగా ఇమిడ్చి,  ప్రేక్షకులను మురిపించడం ఈ పాటలో కనిపిస్తుంది. ఆ సినిమాలోని పాత్రకి అనుగుణంగా, ట్రెండీగా ఈ పదాలు కూర్పు జరిగి వుండవచ్చు.

ఇదే అంశాన్ని చెబుతూ, ‘ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుటె మానవ ధర్మం’, ధనమన్నది మానవుడే సృజియించెనురా దానికి తానే తెలియని దాసుడాయరా, ధనలక్ష్మి అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడురా’ అని ఆరుద్ర గారు అంటే, ‘లక్షల కోసం అందని కొమ్ముకు నిచ్చెన వేస్తున్నాడు, పైసలేంది దేవుడైన పలకరించడే’, అని భలే రంగడు సినిమాలోనూ, ‘డబ్బులోనే ఉన్నదిరా లోకమంతా, అది లేని వాడి బ్రతుకంతా ఒకటే చింత.., అని మొదలుపెట్టి మంచి లోనే ఉన్నదిరా లోకమంతా అది లేని నాడు మనకంతా ఒకటే చింత’, అని ముగించి కొసరాజు గారు డబ్బు వేదాంతాన్ని వివరించారు. ‘డబ్బుకు లోకం దాసోహం గణనాథా’, అంటూ సినారె గారు వర్ణించారు.

ఇక ఈ పాట విషయానికి వస్తే, అటు చక్రవర్తికి, ఇటు బిచ్చగత్తెకీ ఉమ్మడి బంధువని డబ్బుని నిర్వచిస్తూ, చావు – పుట్టుకలు మధ్యన వున్నదంతా డబ్బేనని, జీవితమంతా పచ్చ నోటుతోనే ముడిపడి వుందన్న నిజాన్ని  తేల్చి చెప్పారు సిరివెన్నెల.

సరదా సరదా మూడ్‌లో  ఒక మంచి రైమింగ్‌తో సాగే ఈ పాటలో డబ్బు మహత్యాన్ని, తైలం తమాషా అని, రూపీ రూపాలని, సొమ్మనీ, మనీ అనీ రకరకాల పర్యాయపదాలు ప్రయోగించి వర్ణించారు సీతారామశాస్త్రి గారు. డ్రీమించుకోవడం, లవ్వాడడం లాంటి తెంగ్లీష్ (తెలుగు+ఇంగ్లీష్) ప్రయోగం కేకు మీద క్రీములా మరింత తీయగా సాగింది.

నిజానికి, మనీ వేటలో మనసులు, మమతలు అన్నీ మరుగున పడిపోతున్నాయి. మనీ మనతో వుంటే కాలాన్నయినా ఖరీదు చెయ్యగలం కాబట్టి, గుండె చప్పుడు లాగా జాగ్రత్తగా దాచుకోమని, పట్టుదలతో ధనలక్ష్మిలాంటి అమ్మాయిని ప్రేమించి, పెళ్ళి చేసుకొని అయినా, హాయిగా బ్రతకమని పాట ద్వారా సందేశం ఇస్తున్నారు సిరివెన్నెల గారు.

కాలాన్ని ఖరీదు చేయటం ఏమిటి? అంటే, ఎవరు మన కోసం తమ సమయాన్ని వెచ్చిస్తున్నా, మనం డబ్బుతోనే వాటిని కొనగలుగుతున్నాం. నిజంగా ‘ప్రేమించడం’ అంటే కూడా ఒకరి కోసం కాలాన్ని వెచ్చించడమే, డబ్బు వెచ్చించడం కాదు. మన చేతిలో సరిపడినంత ధనం ఉంటే ఆ తైలం చేసే తమాషాలు అన్నీ చూడొచ్చు, అన్నది సారాంశం.

సినిమాలో పేద హీరో కూడా ఖరీదైన ప్రేమనే ప్రదర్శించవచ్చు. పార్కులో కూర్చుని ఖరీదైన కలలు కనొచ్చు. బ్లాక్ లో టికెట్టుకొని, సినిమా మీద ప్రేమను ప్రదర్శించవచ్చు. ప్రేమికులైన సరే సినిమా టికెట్టు డబ్బుపెట్టే కొనాలి. ఎవరికి ఫ్రీ షోలు వేయరు. ఇలా జీవితంలో ప్రతి అంశాన్ని సొమ్ము ఇచ్చే పుచ్చుకోవాలనీ, పుచ్చుకోగలమనీ లోక రీతిని తేల్చి చెప్పారు. రోటి కపడా ఔర్ మకాన్ కూడా రూపీ రూపాలని, డబ్బు స్వరూపాన్ని వర్ణించారు.  అందుకే జీవితం హాయిగా గడవాలంటే ధనలక్ష్మి చరణాలనే శరణం అని పట్టుకోవాలంటారు సిరివెన్నెల గారు.

ఇంకా డబ్బు యొక్క విశ్వరూపాన్ని ‘చిలుకా ఏ తోడు లేక, ఎటేపమ్మ ఒంటరి నడక’ అని పాటలో ఎంతో గొప్పగా ఆవిష్కరించారు సీతారామశాస్త్రి గారు. ఆ పాటని మరోవారం విశ్లేషించుకుందాం.

Images Source: Internet

Exit mobile version