Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 22 – అమ్మ విలువను తెలియజేసే పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఎవరు రాయగలరూ..

~

చిత్రం: అమ్మ రాజీనామా

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: సిరివెన్నెల

గాత్రం: చిత్ర

~

సాహిత్యం

పల్లవి:
ఎవరు రాయగలరూ.. అమ్మా! అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ.. అమ్మా! అను రాగం కన్న తియ్యని రాగం..
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి ||ఎవరు||
చరణం:
అవతారమూర్తియైనా అణువంతే పుడతాడు

అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు

అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి

అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ||ఎవరు||
చరణం:
శ్రీరామరక్ష అంటూ నీళ్లుపోసి పెంచింది

దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది (2)

నూరేళ్లు ఎదిగె బ్రతుకు అమ్మచేతి నీళ్లతో నడక నేర్చుకుంది

బ్రతుకు అమ్మ చేతివేళ్లతో ||ఎవరు||

అమ్మ’ అన్న పదం వినగానే మనందరి మనసులు పులకించిపోతాయి. మనసంతా ఏదో తెలియని హాయితో, ప్రేమతో, ఆనందంతో నిండిపోతుంది. అమ్మదనానికి సాటిరాగల వ్యక్తి గానీ, మాతృ స్థానాన్ని భర్తీ చేయగల మరొక శక్తిగానీ, ఈ భూమిపై మనకు కనిపించదు. ‘మాతృదేవోభవ! పితృదేవోభవ! ఆచార్యదేవోభవ! అంటూ సనాతన కాలం నుండి కూడా మానవ జీవితంలో, మాతృమూర్తికి తొలిస్థానం ఇచ్చారు. లోకమనే ఈ కోవెలకు తొలి వాకిలి అమ్మే! అమ్మ ప్రేమకోసం దేవుడు కూడా మానవ జన్మ ఎత్తాడని అంటారు. వెలకట్టలేని మాతృభక్తిని చాటేలా వెలలేని సాహిత్యాలు వెలువరించారు ఎందరో సాహితీకారులు.

న గాయత్ర్యాః పరమో మంత్రః
నా మాతుః పర దైవతం..

గాయత్రీ మంత్రానికి మించిన మంత్రం, తల్లికి మించిన దైవం లేదంటుంది వేదం.

అమ్మ ప్రేమను, త్యాగాన్ని తెలియజేస్తూ.. మనస్సును కదిలించే ఆదిశంకరాచార్య మాతృ పంచకంలో తల్లి పట్ల తనకు ఉన్న భక్తిని చాటుకున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు.

అందులోని ఒకానొక శ్లోకంలో తల్లి రుణం తీర్చగలమా అని ప్రశ్నిస్తారు.

ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః

‘అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంత విపరీతమైన పురిటి నొప్పులను అనుభవించావో కదా? కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా? ఎవరూ అలాంటి బాధను సహించలేరు. ఎంత గొప్పవాడైనా, కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? తల్లీ! నీకు నమస్కరిస్తున్నాను’, అని దీని భావం.

ఇక ఆర్తితో భగవంతుని వేడుకునేటప్పుడు కూడా, దేవతా స్వరూపమైన మాతృమూర్తులకు, తమ ప్రార్థనలు వినిపించిన మహా భక్తులందరో!

‘అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ..’ అంటూ దుర్గమ్మకు ప్రణతులు అర్పిస్తూ, భాగవతాన్ని మొదలుపెట్టారు పోతన.

‘సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి..’ అంటూ భగవంతుడినే తల్లిదండ్రులుగా భావించి తాదాత్మ్యం చెందారు త్యాగరాయ స్వామి వారు.

‘తనయుని బ్రోవ జనని వచ్చునో తల్లి వద్ద బాలుడు బోవునో.. వత్సము వెంట – ధేనువు చనునో, వారిదమును గని పైరులు చనునో..’

మనల్ని కాపాడడానికి ఆ జగజ్జనని మన దగ్గరికి వస్తుందో, దూడ వెంటే ఆవు వెళ్తుందో, పైరు వద్దకు మేఘం వెళుతుందో.. అనే అపురూప భావజాలంతో, తల్లి కరుణని మరో కృతిలో ఆయన వ్యక్తీకరించారు.

‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’.. అంటూ మొరపెట్టుకున్నాడు రామదాసు.

‘జననీ నిను వినా, దిక్కెవ్వరమ్మా!’ అని, అమ్మవారికి ఆర్తితో విన్నవించుకుంటారు, మరొక వాగ్గేయకారులు సుబ్బరాయ శాస్త్రిగారు.

సినీ సాహిత్యంలో అయితే అమ్మ మీద ఎంత విస్తృతమైన పాటలు వచ్చాయో, ఎంత అద్భుతమైన కవనాలు అందరినీ కదిలించాయో చెప్పనలవి కాదు. మచ్చుకు కొన్ని పాటలు ఇప్పుడు చూద్దాం.

‘అమ్మ’ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట’ అని ప్రశంసించారు, దాశరథి.

‘అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశం
అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా, నాన్నంటే నీలాకాశం తల వంచేనా
నూరేళ్ళ ఆశాదీపం నువ్వే మా ఆరో ప్రాణం నువ్వే మా తారాధిపం పూజా పుష్పం..’

అంటూ కితాబిచ్చారు మన వేటూరి.

‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ..
మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మా
నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మా..’

అంటూ అమృతమూర్తి అయిన అమ్మను తనివి తీరా కొనియాడారు చంద్రబోస్.

అమ్మ-నాన్నలిద్దరూ నాణేనికి బొమ్మ-బొరుసు లాంటివారని, వారి లాలన-పాలన బిడ్డల భవిష్యత్తుకు దారి చూపుతుందని, వారి ఎదుగుదలలో తల్లిదండ్రులు ఇద్దరికీ సమానమైన భాగస్వామ్యం ఉందని, తెలియజేసే పాటను సిరివెన్నెల ‘మావిడాకులు’ చిత్రం కోసం వ్రాశారు.

పల్లవి:
అతడు: అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో
ఇలలో వెలసిన ఆ బ్రహ్మపేరు అమ్మ అనుబంధానికి అనురాగానికి తొలి రూపం అమ్మంటే
ఆమె: నాన్నంటే తోడురా నీ వెంటే నీడరా
అతడు: అమ్మయిన స్త్రీజన్మ అరుదైన పుణ్యం
చరణం:
అతడు: రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం
పేగు చీలి ముడతపడిన పొత్తికడుపు చర్మం స్త్రీజాతి త్యాగాలు రాసున్న గ్రంథం
మమతెరిగిన మాతృత్వం తరగని అందం
అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం
ఆమె: అతిమధురం తల్లితండ్రి అయ్యేక్షణం

తల్లి త్యాగాన్ని ప్రశంసించడంలో, ‘పొత్తికడుపు చర్మం, స్త్రీ జాతి త్యాగాలు రాసుకున్న గ్రంథం’, అనే వ్యక్తీకరణ ఎంత మనసుకు తాకేలా, హృదయాన్ని చెలింపజేసేలా ఉందో చూడండి! ఎంత లోతైన, సూక్ష్మ పరిశీలన! సిరివెన్నెల మార్క్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవే!

ఇక పాట విశ్లేషణ లోకి వెళ్తే, విశ్రాంతి లేకుండా, అలుపెరగకుండా కుటుంబం కోసం నిరంతరం శ్రమించే అమ్మ విలువను తెలియజేసే ‘అమ్మ రాజీనామా’, చిత్రంలో కథ సారాన్నంతా తెలిపే పాట ఇది. అసలు ఈ చిత్రమే, ఒక ప్రయోగాత్మక ప్రబోధాత్మక చిత్రం. అందరికీ సెలవు వున్నట్టే యింటికి మూలస్తంభమైన అమ్మ సెలవు పెడితే కలిగే పరిణామాల కథాంశంగా సాగిన ఈ చిత్రంలో, అమ్మ విలువను తెలియజేస్తూ సిరివెన్నెల ఈ పాటను రాశారు. ఈ పాటకు ముందూ వెనకా సినిమాల్లో అమ్మపాటలు అనేకం వచ్చినా, తన ప్రత్యేకమైన ముద్రను, స్థానాన్ని నిలబెట్టుకున్న పాట ఇది.

ఈ చిత్రంలో మనవరాలికి పాటల పోటీ కోసం అమ్మ గురించి నాన్నమ్మ భారతి (ఊర్వశి శారద) పాట రాసి యివ్వడమనే సందర్భానికి తగినట్టు మలచిన ఈ పాట చిత్ర కథాంశానికి ఆయువుపట్టు లాంటిది. తన అమృతగళంతో చిత్ర ఆలపించిన ఈ గీతం ఎంతో ప్రజాదరణకు నోచుకుంది.

ఎవరు రాయగలరూ.. అమ్మా! అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ.. అమ్మా! అను రాగం కన్న తియ్యని రాగం..
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి ||ఎవరు||

అమ్మ గురించి అందరికీ అర్థమయ్యే భాషలో రాసిన ఈ పాటకు వ్యాఖ్యానం అవసరం లేదు. పైన అంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, అంతమంది మహనీయులు, అన్ని రకాల నిర్వచనాలు ఇచ్చినా, మాతృత్వపు అమృతాన్ని ఏవి సరిగ్గా నిర్వచించలేవని తేల్చి చెపుతూ, ఎవరు రాయగలరు, ‘అమ్మా’ అను మాటకన్నా కమ్మని కావ్యం? అని, ఆ పదమే ఒక కావ్య సమానం, కాబట్టి ఇంకెవరూ మించిన నిర్వచనం ఇవ్వలేరు- అని ఘంటాపథంగా తేల్చిచెప్పారు సిరివెన్నెల.

What Mother Means అనే కవితలో Karl Fuchs ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. ‘అమ్మ! అన్నది ఎంత సింపుల్ పదమైనా, దాని అర్థాన్ని ఇప్పటివరకు ఎవరూ వివరించగలగడం వినలేదు’, అని దీని సారాంశం.

“Mother” is such a simple word,
But to me there’s meaning seldom heard.
For everything I am today,
My mother’s love showed me the way.

అవతారమూర్తియైనా అణువంతే పుడతాడు అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని..

సృష్టిలో అన్నింటికంటే గొప్పదనం, నిండుదనం, ప్రేమధనం అన్నీ అమ్మకే ఆపాదించినా, ఆ అమ్మను కన్నది కూడా ఒక అమ్మే కదా అంటారు సిరివెన్నెల ఎంతో ఆర్ద్రంగా.

ఇదే భావన మనకు ‘To My Mother’ అనే Edgar Allan Poe, కవితలో కూడా కనిపిస్తుంది.

Because I feel that, in the Heavens above,
The angels, whispering to one another, Can find, among their burning terms of love,
None so devotional as that of a “Mother”.

స్వర్గంలో ప్రేమ సాగరంలో తెలియాడే దేవదూతలు, తల్లి కన్నా గొప్ప అంకితభావం కలిగిన శక్తి లేదని గుసగుసలాడుకుంటున్నారు.. అంటారు ఆలెన్ పో.

శ్రీరామరక్ష అంటూ నీళ్లుపోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది (2) నూరేళ్లు ఎదిగె బ్రతుకు అమ్మచేతి నీళ్లతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతివేళ్లతో ||ఎవరు||

అమ్మచేతివేళ్లతో నడక నేర్చి, ఆమెచేతి నీళ్లతో నూరేళ్ల బతుకు నడుస్తుందనడం లాంటి జీవనసత్యాలు శ్రోతల హృదయాలను చెప్పలేనంతగా హత్తుకున్నాయి. ప్రతి వారి ఎదలయలో, అమ్మ పట్ల ఉన్న అనుభూతి ఇదే కదా! అందుకే అది అందరి పాట అయ్యింది. అమ్మ తత్వాన్ని గొప్పగా ఆవిష్కరించింది.

I struggle so deeply/to understand/
how someone can/pour their entire soul/blood and energy/into someone/
without wanting/anything in return.

..ఏ స్వార్ధము లేకుండా తమ సర్వస్వాన్ని బిడ్డల కోసం ఎలా అర్పిస్తారో తనకు అర్థం కావడం లేదు, అంటుంది రూపీ కౌర్. ఈ విషయం తనకు అర్థం అవ్వాలంటే, తను అమ్మ అయ్యేదాకా వేచి చూడాల్సిందే! అని స్పష్టంగా చెప్తుంది.

‘అమ్మ రుణం తీర్చుకోవడంలో.. నాకు ఉన్న ఒక తరిగిపోని ఆశ..
అమ్మకే ఒకసారి అమ్మగా నే మారి,
కమ్మగా పాడాలి అమ్మ పాట మరీ మరీ
ఈ అమ్మకే అమ్మనై పుట్టాలి ఒకసారి,
నా ఊపిరే ఊయలై ఊపాలి లాలి..’

చివరగా, అమ్మ గొప్పతనాన్ని శిఖరాగ్రాన నిలిపిన మనుస్మృతిలోని ఈ శ్లోకంతో మన చర్చ ముగిద్దాం.

ఉపాధ్యాయాత్ దశాచార్యః, ఆచార్యణాం శతం పితా।
సహస్రం తు పితౄన్ మాతా గౌరవేణ అతిరిచ్యతే॥

ఒక ఆచార్యుడు పదిమంది ఉపాధ్యాయుల కన్నా ఉన్నతుడు, నూరు మంది ఆచార్యుల కన్నా తండ్రి ఉన్నతుడు, వెయ్యి మంది తండ్రుల కన్నా తల్లి ఉన్నతురాలు, ఆమెను అన్ని రెట్లుగా గౌరవించాలి అని దాని భావం.

తల్లీ-బిడ్డల అనుబంధాన్ని, మమకారపు మాధుర్యంతో రంగరించి రాసిన ఈ పాట అందరి హృదయాల్ని దోచుకుందనడంలో సంశయానికి తావేలేదు. సిరివెన్నెల గారి అమృతతుల్యమైన అమ్మ పాట.. నాకు ఇన్ని రకాల నిర్వచనాలను జ్ఞప్తికి తెచ్చింది. మన భావాలనే తన భావాలుగా, తగిన భాషనిచ్చి, ఉదాత్తమైన భాష్యాన్నిచ్చి ఎంతో ఉత్తమంగా, హృద్యంగా నిర్వచించే.. సిరివెన్నెలకూ, ఆయనను కన్నతల్లికి, తండ్రికి, సృష్టిలోని అందరు మాతృమూర్తులకు ఇవే నా వందనాలు!

Images Courtesy: Internet

Exit mobile version