Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 25 – వివాహాన్ని ఆనందించమనే పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

అలనాటి రామచంద్రుని..

~

చిత్రం: మురారి

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: మణిశర్మ

గానం: జిక్కి, సునీత, సంధ్య

~

పాట సాహిత్యం

పల్లవి:
అలనాటి రామచంద్రుడి కన్నింటసాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి ॥ అలనాటి॥
తెలుగింటి పాలసముద్రం కనిపెంచిన కూన
శ్రీహరి యింటి దీపమల్లె కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి ॥ అలనాటి॥

కోరస్:
చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగాలేవని వెలవెలబోవమ్మా

చరణం:
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్లు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దుగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులుచేసే సమయాన (2)
కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడండి
తళతళ మెరిసిన ఆనందపు తడిచూపుల అక్షితలేయండి ॥ చందమామ॥

చరణం:
సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ వున్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లిమండపాన
గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లెవున్నా మరగలేదు మన్మథుని ఒళ్లు ఈ చల్లని సమయాన
దేవుళ్ల పెళ్లివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా (2)
అనుకొని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి ॥ చందమామ॥

‘పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్, ఎల్లరి సుఖము చూడాలోయ్, మీరెల్లరు హాయిగ ఉండాలోయ్..’ అని పింగళి గారి దీవెన. (మనలో మన మాట! సరియైన భాగస్వామి దొరికితే ఆయన చెప్పినట్టు, fridge లో పెట్టినట్టు చల్లగా ఉంటామేమో కానీ, wrong partner అయితే మాత్రం oven లో.. పడ్డట్టే!)

‘The wise people never marry because when they marry, they turn otherwise’, అని చమత్కరిస్తారు.. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త Stephen Hawking.

“By all means, marry. If you get a good wife, you will be happy. If you get a bad one, you will be a philosopher.” అని వేదాంతం చెప్పారు Socrates.

ఏది ఏమైనా, పెళ్లి అనేది ప్రతి వారి జీవితంలో ఒక పరిపూర్ణతను చేకూర్చే ఒక మంచి మలుపు. వివాహం అంటే ‘విశేషమైన వాహం’, అని అర్థం. అంటే వధువు యొక్క బరువు బాధ్యతలు వరుడు, వరునికి సంబంధించిన బాధ్యతలన్నీ వధువు వహిస్తామని పరస్పర అంగీకారంతో చేసుకునే ఒక ఒప్పందం. మొత్తం మీద పెళ్ళి లేదా వివాహం అనేది సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం.

యాజ్ఞవల్క్య స్మృతిని అనుసరించి పూర్వీకులు అష్టవిధ వివాహాలను గుర్తించారు. వీటిలో బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ఆర్ష వివాహం ప్రాజాపత్య వివాహం – శాస్త్రామోదం పొందగా, అసుర వివాహం, గాంధర్వం, రాక్షసం, పైశాచికం, అనే వివాహాలను ధర్మ శాస్త్రం ఆమోదించలేదు. వివిధ సంస్కృతులు, మతాలు, జాతులలో వివాహానికి ఎన్నో నిర్వచనాలు ఇవ్వబడ్డాయి.

వధూవరులిద్దరి జీవితంలో వివాహం మరపురాని ఒక ముఖ్యమైన ఘట్టం, వివాహం. ఏ మతానికి చెందిన వివాహమైనా ఒక ధర్మబద్ధమైన ప్రమాణం ఉంటుంది. హిందూ వివాహ వ్యవస్థలో అయితే వధూవరులను ముడివేసే మూడు ముళ్ళకు, ఆజన్మాంతం వారిద్దరిని కలిసి నడవమని దీవిస్తూ వేయించే ఏడు అడుగులకు, వేదమంత్రాల బలం, ఇరువర్గాల వారి సాక్ష్యం ఉంటుంది.

“ఇద్దరి ప్రాణాలొకటిగా చేసి ప్రణయము పేరే పరిణయం
ఇద్దరి పాదాలొకటిగా సాగే పయనము పేరే పరిణయం
త్రివేణి సంగమ మనిపించాలి మూడుముళ్ల ఈ సుముహూర్తం
అనేక జన్మలు నడిపించాలి ఏడడుగుల ఈ తొలిగమనం..”

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన ‘కన్యాదానం’ చిత్రంలోని ‘కళ్యాణం.. ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభ తరుణం గత చరితలు చూడని శుభతరుణం’ .. అనే పాటలో ..తనువు తలపు రెండూ కలిసిన వధువే భార్య కాగలదని, మనువు అంటే మనసు వేసే బంధమేనని నిర్వచిస్తారు సిరివెన్నెల. ‘పెళ్లంటే నూరేళ్లపంట’ అనే బలమైన సూత్రం మీద ఈ వివాహ వ్యవస్థ నెలకొని ఉంది కాబట్టి, ఏ వివాహమైన నూరేళ్ళ పంటగా మారాలంటే వారి మనసులు ముడిపడాలి. వాగ్గేయకారుల సాహిత్యంలో కూడా మనకు దేవుళ్లకు సంబంధించిన పెళ్లి పాటలు కనిపిస్తాయి.

సినిమాల్లో పెళ్లి పాట అనగానే మొదటగా గుర్తుకొచ్చేది ‘కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి..’ అనే అపురూపమైన సముద్రాల సాహిత్యం (సీతారామ కళ్యాణం 1961).

ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను పెనవేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం ఎన్నెన్నో.. జన్మల అనుబంధం.. ఇది వివాహ బంధానికి ఆచార్య ఆత్రేయ గారిచ్చిన నిర్వచనం.

కళ్యాణ వైభోగమే, శ్రీ సీతారాముల కళ్యాణమే.. మన మాంగల్య ధారణ శుభ ముహూర్తమే.. అన్నది బాగా ప్రచారంలో ఉన్న ఆత్రేయ గారి మరో మధుర గీతం.

ఇంగ్లీషులోన మ్యారేజి,

హిందీలో అర్థమూ షాదీ

ఏ భాషలో ఏమన్ననూ

మన తెలుగులోన పెళ్ళి.. అంటారు ఆరుద్ర, ‘ఆరాధన’ చిత్రంలో, సరదాగా సాగే ఓ గీతంలో.

‘జీవితాన మరువలేము.. ఒకే రోజు

ఇరుజీవితాలు ఒకటిగ.. ముడివేసే రోజు

అదే పెళ్ళిరోజు.. పెళ్ళిరోజూ

~

నిన్న చూడ నీవు నేను.. ఎవరికెవరమో

నేడు చూడ నీవు నేను.. ఒకరికొకరిమే..’ ఇది రాజశ్రీ గారి ఒకానొక పెళ్లి నిర్వచనం.

~

కోకిలమ్మ పెళ్లికి కోనంతా సందడి..

పూలన్నీ తలంబ్రాలు పున్నమి తొలిరేయి..

అంటూ భావగీతంలో సాగుతుంది వేటూరి గారు రచించిన ఓ పెళ్ళి పాట.

~

‘మా ఆవిడ మీదొట్టు – మీ ఆవిడ చాలా మంచిది’, చిత్రంలో సిరివెన్నెల గారి మరో పెళ్లి పాట.

“మాంగల్యం తంతునాహేనా మమజీవన హేతునా కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం”

…..

వేదమంత్రం కలిపింది ఈ బంధం

ప్రతి జంటకీ వినిపించనీ కల్యాణ రాగం జీవితాంతం విడిపోనీ దాంపత్యం

ధర్మానికి కామానికి నిజమైన అర్థం

నాతి చరామి బాసలను – దాటని బంధం పెళ్ళంటే దానికి మేమే సాక్ష్యమని చాటిస్తున్నది మీ జంటే

………

మూడుముళ్ళేసే ముహూర్తం దీపమౌతుంది

ఏడు జన్మాల దారిని చూడమంటుంది. పెళ్ళికాగానే చెరో సగమైన ఇద్దరినీ

ఏకమౌతూనే ఒకే ఒక లోకమౌతుంది..

~

తెలుగు సినీ రచయితలందరూ పెళ్లి పాటలు పాటలు రచించినా, ఎక్కువ పెళ్లి పాటలు రాసిన ఘనత సిరివెన్నెలకే దక్కుతుందని సినీ గేయ సాహిత్య పరిశోధకుడు, నంది అవార్డు గ్రహీత, డాక్టర్ పైడిపాల విశ్లేషించారు.

‘మురారి’ చిత్రంలో దేవతల పెళ్ళి తంతులా ఘనంగా జరిగే, నాయకుని పెళ్లి ఘట్టాన్ని వివరిస్తూ సిరివెన్నెల రచించిన ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొంది, మంచి పెళ్లి పాటల జాబితాలో చేరిపోయింది.

అలనాటి రామచంద్రుడి కన్నింటసాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి ॥ అలనాటి॥
తెలుగింటి పాలసముద్రం కనిపెంచిన కూన
శ్రీహరి యింటి దీపమల్లె కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి ॥ అలనాటి ॥

పెండ్లి కుమార్తెను, పెండ్లి కుమారుడిని పరిచయం చేస్తూ విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలతో పోల్చారు సిరివెన్నెల. కానీ ఆయన పదవిన్యాసం ఒకసారి గమనించండి! రామచంద్రుడికి సాటి, బాలచంద్రుడి కన్నా మేటి, అనిపించేలాగా ఉన్నాడట అబ్బాయి. సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవిలా, శ్రీ హరి ఇంటి దీపంలా కనిపించే జాణ అట, అపరంజి బొమ్మ లాంటి అమ్మాయి. దేవుళ్ళ పేర్లు చెబుతూ, వారికి సాటిగా ఉన్నారని చెప్పకుండా, అలా అనిపిస్తున్నారని చెబుతూ వాళ్ళని వర్ణించడం! ఎంత చమత్కారమైనా రచన! చందమామను మించిన అందగాడు అబ్బాయని, వెన్నెలను మించిన సోయగాలు అమ్మాయివనీ, కోరస్‌లో మనకు పలికిస్తారు.

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్లు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దుగా తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులుచేసే సమయాన
కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడండి
తళతళ మెరిసిన ఆనందపు తడిచూపుల అక్షితలేయండి ॥ చందమామ ॥

ఒకప్పటి సంప్రదాయం ప్రకారం అయితే, అసలు పరిచయం లేని చిన్న వయసు వధూవరులకు వివాహం జరుగుతున్నప్పుడు, తొలి స్పర్శ, చిలిపి చేష్టలు, వారిలో మొదలయ్యే అనుభూతులు అన్నీ కొత్తగా ఉండేవి. అలాంటి సరసాలను వర్ణిస్తూ, బొట్టు కట్టే సమయంలో అబ్బాయి మునివేళ్లు, అమ్మాయి మెడపై గిలిగింతలు కలిగించడం, దాంతో ఆమెకు కలిగే పులకింతలు హృద్యంగా అక్షరబద్ధం చేశారు సిరివెన్నెల. ఈ పాటలో మనకు ఎంతో భావుకత కనిపిస్తుంది. నేలకు జారుతున్న ముత్యాల వంటి తలంబ్రాలు, తుంటరి జలకాలలాగా వారిద్దరి తలపులను తడిపేస్తున్నాయట. ఆ జడిలో తడిసిపోతూ, కళకళగా, ఆనందంగా వారు అందరికీ కనువిందు చేస్తున్నారట. అప్పుడు చూసేవారి మనసులలో పొంగిన ఉద్వేగం వల్ల కురిసే ఆనందభాష్పాల తడి చినుకులతో వారిని ఆశీర్వదించమంటున్నారు సిరివెన్నెల.

సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ వున్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లిమండపాన
గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లెవున్నా మరగలేదు మన్మథుని ఒళ్లు ఈ చల్లని సమయాన
దేవుళ్ల పెళ్లివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి ॥ చందమామ ॥

‘మురారి’ చిత్రంలో పెళ్ళికొడుకు ఒక పెద్ద జమీందారు వంశానికి చెందిన వాడు. ఆ వివాహం చాలా ఘనంగా నిర్వహించబడుతూ ఉంటుంది. ఆ గొప్పతనాన్ని చెప్పడం కోసం, దేవుళ్ళ పెళ్లి వేడుకలు అయినా ఇంత ఘనంగా జరిగేనా, అని అందరూ అనుకునేలాగా ఉన్నాయి అని కాస్త అతిశయోక్తిని జోడించి చెప్పారు సిరివెన్నెల. దానిలో భాగంగానే, చూడడానికి సీతారాముల కళ్యాణంలా ఉన్నా, వీరత్వానికి అక్కడ పరీక్షలు జరగలేదట, శివుని ధనస్సు అక్కడ విరగలేదట. శివపార్వతుల వివాహానికి పెట్టిన ముహూర్తం లాంటిదే ఇక్కడ పెట్టినా, శివునికి పెళ్లి చేయడానికి వచ్చి, ఆయన కోపాగ్నికి కాలి బూడిదైన మన్మథుడి లాగా, ఇక్కడ ఎవరికీ ఒళ్ళు మరగలేదట. ఇంత ఘనమైన పెళ్లి కాబట్టి, ఏ వివరాలు అడగకుండా బంధుజనమంతా తరలివచ్చి, ఈ వివాహాన్ని ఆనందించమని ఆహ్వానం పలుకుతారు రెండో చరణంలో. ఈ విధంగా అతిశయోక్తులతో కూడిన పోలికలు, భావుకత నిండిన పదప్రయోగాలు, సిరివెన్నెల మార్కు చమత్కారం ఈ పాటలో మనకు మెండుగా కనిపిస్తాయి.

వివాహం గురించి, పెళ్లి తంతు గురించి, వేదమంత్రాల గురించి, ఎన్నో పాటలలో సంప్రదాయ బద్ధంగా, వివరించిన సిరివెన్నెల తన కత్తికి రెండవ వైపు కూడా పదును ఉందని నిరూపిస్తూ, ఆహ్వానం వంటి చిత్రాల్లో సంప్రదాయాన్ని ప్రశ్నించే, అభ్యుదయ గీతాలు రాశారు.

భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరు.. భర్తగ మారకు బ్యాచిలరు.. /వద్దురా సోదరా అరె పెళ్లంటే నూరేళ్ల మంటరా.. ఆదరాబాదరా నువ్వెళ్లి గోతిలో పడొద్దురా… అనే వెటకారపు పాటలు కూడా పెళ్లిపై ఆయన వ్రాసి కవి అనే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులు రెండింటిని మనకు చూపించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

Images Courtesy: Internet

Exit mobile version