Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 26 – ప్రాయాన్ని మించని భాషతో రాసిన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

తూనీగా తూనీగా

~

చిత్రం: మనసంతా నువ్వే

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: ఆర్.పీ. పట్నాయక్

గానం: ఉషా, సంజీవిని

~

పాట సాహిత్యం

పల్లవి:
తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీక ఉంటగా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంకా ఈ వంకా తిరిగావె ఎంచక్కా
ఇంకానా చాలింకా… ఇంతేగా నీ రెక్కా
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
ll తూనీగ తూనీగ ll

చరణం:
దొసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందె ఇట్టా నాకూ నేర్పిస్తె చక్కా
సూర్యుడ్నె కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడీ నీతో ఆడీ చందమామ అయిపోయాడుగా ll తూనీగ తూనీగ ll

చరణం:
ఆ కొంగలు ఎగిరీ ఎగిరీ
సాయంత్రం గూటికి మళ్ళీ తిరిగొచ్చే
దారిని యెపుడూ మరిచిపోవెలా
ఓ సారెటు వైపెళుతుంది
మళ్ళీ ఇటు వైపొస్తుందీ
ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాలెదా
కూ కూ బండీ మా ఊరుందీ
ఉండిపోవే మాతోపాటుగా llతూనీగ తూనీగ ll

బాల్యం ఓ అందమైన మధుర జ్ఞాపకం. దేవుడిచ్చిన ఒక తీయటి వరం. స్వచ్ఛమైన మనసులు, కపటమెరగని నవ్వులు, ఆనందాలు, తుళ్ళింతలు, ఆటలు, పాటలు, అల్లర్లు, మనల్ని మనమే మరచిన కేరింతలు, గిల్లికజ్జాలు మందలింపులు, అలకలు, బుజ్జగింపుల దొంతరలు, ఎల్లలెరుగని స్నేహాల కలబోత బాల్యం. బాల్యమే మన జీవిత నౌకకు చుక్కాని.

William Wordsworth వ్రాసిన My heart leaps up అనే కవితలో బాల్యం, యవ్వనం వృద్ధాప్యం, ఇంకా.. మరణంలోనైనా ఇంద్రధనుస్సు అందాలలో కానీ, అది మనకిచ్చే అనుభూతిలో కానీ మార్పే లేదనీ చెబుతూ, ఎల్లకాలం ప్రకృతితో అనుబంధం కావాలని కోరుకుంటాడు. The Child is father of the Man అనే చారిత్రాత్మక statement తో బాల్యపు అనుభూతులే మానవుని జీవితాన్ని రూపుదిద్దుతాయనీ, మన భవిష్యత్తుకు అది పునాది వంటిదని, బాల్యపు ప్రాముఖ్యతను చాటిచెప్పాడు.

My heart leaps up when I behold A rainbow in the sky:
So was it when my life began;
So is it now I am a man;
So be it when I shall grow old,
Or let me die!
The Child is father of the Man;
And I could wish my days to be
Bound each to each by natural piety.

~

బాల్యం గురించి Emily Dickson వ్రాసిన ఒక కవితలో, విప్పారిన నేత్రాలతో, ప్రకృతిలోని ప్రతి అందాన్ని తరిచి, తరిచి చూస్తూ, ఆస్వాదిస్తూ, నిండైన అమాయకత్వంతో దేన్నయినా నమ్ముతూ వుండే సరికొత్త విశ్వాసమే పసితనమని హృద్యమైన నిర్వచనం కనిపిస్తుంది.

The Child’s faith is new
Whole – like His Principle
Wide – like the Sunrise On fresh Eyes
Never had a Doubt –
Laughs – at a Scruple
Believes all sham
But Paradise.. – –

~

సినిమాల్లో చిన్న పిల్లలు పాడుకునే పాటలు, కథాపరంగా ఎంతో ప్రాచుర్యం పొంది Super hit అయినవి ఎన్నో వున్నాయి.

‘లేత మనసులు’ చిత్రంలో ఆరుద్ర రచించిన – ‘కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో..’ అనే పాట, ‘బడిపంతులు’ చిత్రంలో ‘బూచాడమ్మా.. బూచాడు.. బుల్లి పెట్టె లో వున్నాడు,‌ కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు..’ లాంటి ఆత్రేయ రచనలు అప్పట్లో అందరి పిల్లలకు నోళ్ళల్లో నానుతూ ఉండేవి. అలా పిల్లల చేత పాడించిన పాటలు తెలుగు సినిమా రంగంలో కోకొల్లలుగా ఉన్నాయి.

‘ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం..’ వంటి సిరివెన్నెల పాట ఈ కోవకు చెందినవే.

కథతో, పాత్రల ఔచిత్యంతో ముడిపడిన పాటలు ఎన్ని ఉన్నాయో, ఏదో ఒక ప్రాస పదాలతో, అర్థంలేని మాటలతో, కేవలం అలరించే ట్యూన్లతో పాపులర్ అవుతూ పాత్రల స్వభావంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్న చిన్నపిల్లల పాటలు కూడా అన్ని ఉన్నాయి. వారి వయసుకు, స్థాయికి మించిన భావాలతో పాటలు పుట్టుకొచ్చాయి. అలాంటి సమయంలో ప్రాయాన్ని మించని భాషతో, అలరించే సంగీతంతో, ఒక హృద్యమైన పాట అందరి మనసులను దోచేసింది. అదే – ‘మనసంతా నువ్వే’ సినిమాలో చిన్నపిల్లలు పాడుకునే, ‘తూనీగా.. తూనీగా’ పాట! పాట సాహిత్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే అర్థంకాని మాట ఒక్కటైనా ఉండదు. ఈ పాటలో విశ్లేషించడానికి ఏముంది అనిపిస్తుంది. కానీ సిరివెన్నెల గారి రచనా చమత్కారం ఈ పాటలో మనకు పుష్కలంగా దర్శనమిస్తుంది. ఇప్పుడు ఒకసారి పాట పల్లవిని గమనిద్దాం.

తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీక ఉంటగా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంకా ఈ వంకా తిరిగావె ఎంచక్కా
ఇంకానా చాలింకా.. ఇంతేగా నీ రెక్కా
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా

ఎన్ని తరాలు అయినా, ఈ ఆధునిక యుగంలో అయినా, తూనీగ ఎప్పుడు పిల్లలకు ఒక అందని ద్రాక్ష పండే. గాల్లో ఎగురుతూ ఉండే తూనీగను నేలపైన పరిగెడుతూ వెంబడించడం పిల్లలందరికీ ఓ గొప్ప fascination.

‘మనసంతా నువ్వే’ చిత్రంలో చిన్ననాటి ఉదయ్ కిరణ్, రీమాసేన్‌లపై ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. ధనవంతుల అమ్మాయి అయిన చిన్ననాటి హీరోయిన్ ఒక జీపులో ప్రయాణిస్తూ ఉండగా, పేదవాడైన చిన్ననాటి హీరో సైకిల్ టైర్‌ని దొర్లించుకుంటూ, దాంతో ఆడుకుంటూ, ఆ జీపు వెంట పరిగెడుతూ పడుకునే పాట ఇది.

ఈ సాహిత్యాన్ని సినిమా కథతో ముడిపెట్టి చూడగలిగితే సిరివెన్నెల పాటలోని కవితా శిల్పం మనల్ని తప్పకుండా అబ్బురపరుస్తుంది. ఆ ఇద్దరు చిన్న పిల్లల్ని జంట తూనీగలు అనుకుంటే, జీవితంలో నువ్వు ఎందాక పరిగెడతావు? నా వంకకే నువ్వు తిరిగిరా అని హీరోయిన్ అంటే, నీకు సాయంగా నీ వెనకే నేను ఉంటాగా! అంటాడు హీరో. కథలో రాబోయే అయోమయాన్ని, సందిగ్ధాన్ని సూచిస్తూ, ఆ వంకా ఈ వంకా (ఇద్దరు హీరోయిన్ల ప్రేమ నడుమ) చక్కగా తిరిగావు, ఇంక ఈ దాగుడుమూతలు చాలు, ఇద్దరం కలిసి జంటగా ఎప్పటికైనా ఆకాశం దాకా ఎగరగలమా అన్న ప్రశ్న, ఎగరగలమన్న ఆశావహ దృక్పథం ఇంత చిన్న పల్లవిలో ఇమిడించగలిగిన కవి చతురత మనకు కనిపిస్తుంది.

ఏది ఏమైనా, తూనీగకు సంబంధించిన కవితలు ప్రపంచ సాహిత్యంలో మనకు ఎన్నో చోట్ల కనిపిస్తాయి. Simon Clark తన Bumblebee Buzz, Bumblebee Dear అనే కవితలో కూడా తూనీగకు సంబంధించిన అంశం కనిపిస్తుంది.

Here the ringing in my ear,
The distant hum of doom,
I know to avoid the stinging tail,
Of the bumblebee buzz flying in to view.

Eat the honey of the evil bug,
Who bringeth tastes divine to all,
Why must I fear the faint noise?
That surely brings only joy.

దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మొ బాగుందె ఇట్టా నాకూ నేర్పిస్తె చక్కా
సూర్యుడ్నె కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడీ నీతో ఆడీ చందమామ అయిపోయాడుగా ll తూనీగ తూనీగ ll

ఇక చరణంలోకి వస్తే, చిన్నపిల్లలు సహజంగా వర్షంలో ఆడుకోవడం, చినుకుల్ని దోసిట్లో పోగేయడం వంటి వివరాలను ముచ్చటగా ఇందులో పొందుపరిచారు. కథాపరంగా చూస్తే ఇద్దరు స్నేహితుల మధ్య పోగేసిన జ్ఞాపకాలను పదిలంగా దాచుకోమనే సంకేతం మనకు కనిపిస్తుంది. ఆ చిన్ననాటి స్నేహం రెక్కలు తొడుక్కొని, ప్రేమగా మారి సీతాకోకచిలుకలాగా స్వేచ్ఛగా ఎగురుతుందనే భావం కూడా పలికిస్తాడు సిరివెన్నెలలోని భావుకుడు. అంత కష్టపడి చినుకుల్ని పోగేయడం ఎందుకు? ఆ చిట్కా నాకు నేర్పిస్తే సూర్యుడిని చినుకులుగా కరిగిస్తాను కదా! అంటుంది అమ్మాయి. చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఈ వాక్యంలో ఎంతో చక్కగా ఆవిష్కరించారు సిరివెన్నెల. ఎందుకంటే చిన్నపిల్లలకు అన్నీ సుసాధ్యాలే! అసాధ్యాలు అసలు కనిపించవు. సూర్యుడు నీతో ఆడుకుని, చల్లబడి చంద్రుడిగా మారిపోయాడు కదా! సూర్యుడు మనకింక ఎక్కడ దొరుకుతాడు? అని అబ్బాయి సమాధానం ఇస్తాడు. అమ్మాయిపై తనకున్న ప్రేమనంతా దీని ద్వారా చక్కగా అభివర్ణిస్తాడు.

ఆ కొంగలు ఎగిరీ ఎగిరీ
సాయంత్రం గూటికి మళ్ళీ తిరిగొచ్చే
దారిని యెపుడూ మరిచిపోవెలా
ఓ సారెటు వైపెళుతుంది
మళ్ళీ ఇటు వైపొస్తుందీ
ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాలెదా
కూ కూ బండీ మా ఊరుందీ
ఉండిపోవే మాతోపాటుగా ll తూనీగ తూనీగ ll

ఇక రెండో చరణంలో పిల్లల మనసుల్లో సహజంగా తలెత్తే ప్రశ్నలు, అనుమానాలు మనకు కనిపిస్తాయి. అంత దూరం ఎగిరే ఆ కొంగలు, సాయంత్రం అయ్యేసరికి తమ గూళ్ళకి తాము ఖచ్చితంగా ఎలా చేరుకుంటాయి? ఈ రైలు ఎందుకు ఇటూ అటూ తిరుగుతూ ఉంటుంది? ఈ రైలుకు సొంత ఊరు ఏది? లాంటి ప్రశ్నలు అవి. నిజంగా వలస పక్షుల గురించి ఆలోచిస్తే 15 వేల మైళ్ళ వరకు ఈ పక్షులు ఖండాలు దాటి వలస వెళ్తాయట! తిరిగి వాటి వాటి ఆవాసాలకు ఎలా చేరుకుంటాయో, శాస్త్రవేత్తలకు ఈనాటికి కూడా అంతుచిక్కని ఓ రహస్యమే. పిల్లలకే కాదు పెద్దలకు కూడా అవి సమాధానాలు దొరకని ఆశ్చర్యాలే.

కథా నేపథ్యంతో పోల్చి చూస్తే, ఇద్దరు పిల్లలు, ఒకరు స్వదేశంలో ఒకరు విదేశాల్లో పెరుగుతూ, పెద్దవాళ్ళై ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటూ, దగ్గరైన తర్వాత ఒకరికొకరు అందని పరిస్థితిలో ఉండటం చివరకు ఒకరికొకరు దగ్గర కావడమనే చక్కటి అన్వయం మనకు కనిపిస్తుంది. కొంగలు ఎంత దూరం ఎగిరినా తిరిగి తమ గూటికి చేరిపోయినట్టు, హీరోయిన్, హీరోని చేరగలుగుతుంది. కానీ హీరో గుర్తించే స్థితిలో లేక హీరోయిన్ కోసం వెతుకుతుంటాడు. మధ్యలో సెకెండ్ హీరోయిన్ ఎంట్రీతో కథ కాస్త పక్కకు మళ్ళుతుంది. ‘ఓ సారటు వైపెళుతుంది. – మళ్ళీ ఇటు వైపాస్తుంది- ఈ రైలుకి సొంతూరేదో గురుతురాదెలా!?’ అనే వాక్యాలు ఈ సన్నివేశాలకు సరిపోయేలా ఉంటాయి. ఇక చివరగా హీరోయిన్ అభ్యర్థన ఏంటంటే, ఓ రైలు బండీ! సొంత ఊరిలో మాతోపాటు నువ్వు ఉండిపో!

ఈ విధంగా చిన్నపిల్లల స్థాయి మాటలనే వాడుతూ, కథలోని మలుపులను నిగూఢంగా అన్వయిస్తూ, ఇటు సినీ గేయ రచయిత బాధ్యతను, అటు సునిశితమైన భావాలను పలికించే భావ కవి పాత్రను సమాన స్థాయిలో పోషించి, పాటను రక్తి కట్టించి, మన హృదయాల్లో, ‘మనసంతా నువ్వే’ అని నిండిపోయేలా చేసిన సిరివెన్నెల చిరస్మరణీయులు.. “కవిత్వం తూనీగ కాదు వెంటపడితే దొరకడానికి”, అంటాడు తెలుగు వెంకటేష్, ‘తూనీగతో ఓ సాయంకాలం’ అనే కవితలో. కానీ కవిత్వమే తన వెంటపడిన (తూనీగ) భావుక చక్రవర్తి సిరివెన్నెల.

Images Courtesy: Internet

Exit mobile version