Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 29 – అలతి పదాలలో మృదు మధురమైన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

సిగ్గు పూబంతి

~

చిత్రం: స్వయంకృషి

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: రమేష్ నాయుడు

గానం: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, ఎస్. జానకి, ఎస్.పీ. శైలజ.

~

పాట సాహిత్యం

పల్లవి:

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి..

చరణం 1:

విరజాజి పూలబంతి అరసేత మోయలేని

విరజాజి పూలబంతి అరసేత మోయలేని

సుకుమారి ఈ సిన్నదేనా

శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా

ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు@2

సూసి అలకలొచ్చిన కలికి@2

ఏసినాది కులుకుల మొలికి ॥సిగ్గు పూబంతి॥

చరణం 2:

సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న@2

చిలకమ్మ కొనసూపు సవురు

బొండుమల్లి సెండుజోరు

చేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ రూపు@2

మెరిసే నల్లమబ్బైనాది..@2

వలపు జల్లు వరదైనాది ॥సిగ్గు పూబంతి॥

హృదయంలోని అందమైన భావాలకు అక్షర రూపం దిద్దితే సాహిత్యం; ఆ మధుర భావాలకు ఓణీలా, రాగాల బాణీ చుడితే సంగీతం; సంగీత, సాహిత్యాలను మధురంగా మేళవిస్తే ఒక చక్కటి పాట పుడుతుంది. శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం – వంటి ఎన్నో సంగీత కళారూపాలు వున్నా, జానపద గీతాలు అన్నింటికన్నా ముందు పుట్టిన మేలిమి ముడి సరుకు. ‘పని పాట’ల జంట మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మానవుడు పని నేర్చుకున్నాడో అప్పుడే పాట పుట్టిందని నిర్ణయించారు. శ్రమను మరచిపోవడానికి, చకచకా పని చేయడానికి పాట పుట్టింది. రైతు పాటలు, రోకలి పాటలు, వాన పాటలు, ఏరువాక పాటలు, విసురురాతి పాటలు, పడవను నడిపేవాళ్లు ‘హైలెస్సా, హైలెస్సా, ఓలెస్సా’ అని పాడుకునే శ్రామికుల పాటలు ఆ కోవకు చెందినవి. సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు వాటిలో భాగాలే. జానపద గేయాలను – పిల్లల పాటలు, స్త్రీల పాటలు, వేడుక పాటలు, శ్రామికుల పాటలుగా విభజించారు.

జానపద గేయాలు లేదా సాహిత్యానికి – కర్తృత్వం తెలియదు. అజ్ఞాత కర్తృత్వం లేదా సామూహిక కర్తృత్వం ఉంటుంది. భాష నిసర్గంగా, సరళంగా ఉంటుంది. జీవితాలు, సంస్కృతితో ముడిపడి ఉంటుంది. మౌఖిక సంప్రదాయంలో ఒకరి నుంచి మరొకరికి నోటి ద్వారా వ్యాపిస్తుంది. ఇది లయ ప్రధానంగా ఉంటూ, లోకజ్ఞానానికి, సమష్టితత్వానికి, మనోవికాసానికి, చిత్త ఏకాగ్రతకు, ధారణ శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. వీటిల్లో కల్పనాశక్తికి పెద్దపీట వేస్తారు. ఇవి ఎంతో మనోరంజకంగా, చిత్రవిచిత్రంగా, లయబద్ధంగా ఉండి, శ్రోతలను ఉత్తేజపరుస్తాయి. ఈ కథల్లో పురాణ కథలు, ఐతిహ్యాలు, జానపద తత్వకథలను గమనిస్తాం.

ఈ ఆశు కవితల్లో, జన సామాన్య పరిచిత వస్తువులే గేయాలుగా ఉండి, శృంగార, కరుణ రసాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ జానపదాలు స్త్రీల పాటలకు వచ్చేసరికి జాణపదాలుగా మారి, ఆధ్యాత్మిక ఉన్నతికి దారి తీసే తత్వాలతో జ్ఞాన పథాల స్థాయి దాకా విస్తరించి ఉన్నాయి. జనుల హృదయాల్లో నుండి అప్రయత్నంగా, సహజంగా వెలువడే ఒక పామర సృష్టి ఒక రకమైన జానపదమైతే, ప్రయత్న పూర్వకంగా శాస్త్ర ప్రమాణాలతో జానపద బాణీలో చేసే రచనలు, మరో కోవకు చెందినవి.

నన్నయ, నన్నెచోడుడు, పాల్కురికి సోమన, శ్రీనాథుడు, అన్నమయ్య, కదిరీపతి, త్యాగయ్య, రామదాసు, సూరదాసు, కనకదాసు, మొదలైన కవులు, పదకర్తలు కూడా జానపద గీతాలు రచించారు. వీరి సాహిత్యంలో ఊయల పాటలు, రోకటి పాటలు, వెన్నెల పదాలు, తుమ్మెద పదాలు, జాజర పాటలు, మేలుకొలుపులు, నీరాజనాలు, ఏలలు, గొబ్బిపాటలు, లాలి- జోలపాటలు, హాస్య ప్రధాన పాటలు, హరికథలు, బుర్రకథలు, బోధలు, విప్రవినోదులు.. వంటి ఎన్నో రకాల పాటలు వున్నాయి. అమూల్యమైన ఈ సాహిత్యంలో సనాతన సాంప్రదాయాలు, విలువలు, ఆచారాలు, కట్టుబాట్లు ప్రతిబింబిస్తాయి. అందుకే చాలా కాలం నుండి వీటిని సేకరించడం, పదిలపరచడం జరుగుతోంది. తెలుగు జానపద సాహిత్య సేకరణలో మనవాళ్లే కాకుండా , బ్రౌన్, బోయల్ మొదలైన పాశ్చాత్యులు కూడా ఎంతో కృషిచేశారు.

జన బహుళ్యంలో ఇంతగా చొచ్చుకుపోయిన, లయ ప్రధానమైన జానపదం, సినీరంగంలో కూడా తన వాటాను తాను దక్కించుకుంది. చాలా మంది సినీ గేయరచయితలు అనేక కవితా ప్రక్రియల్లో సాహిత్య సృష్టి చేసిన వాళ్ళే. సముద్రాలగారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారి బసవరాజు, ఆరుద్ర, దాశరథి, ఆత్రేయ, వేటూరి.. వీళ్ళంతా సినిమా గీత రచయితలు మాత్రమే కాదు కవులు, వచనకవులు, కథా, నవలా, నాటక రచయితలు.. ఇంకా అనేకానేక సాహితీ ప్రక్రియల్లో ఆరితేరిన దిట్టలు.

సిరివెన్నెలగారు కూడా అన్ని ప్రక్రియలతో పాటు జానపద బాణీలో సినిమాల కోసం కొన్ని పాటలు రాశారు. మచ్చుకు కొన్ని ఇక్కడ చూద్దాం.

1.తారకరాముడు చిత్రంలో:

సెట్టు మీదికి ఉసిరికి సంద్రాన ఉప్పుకి

సుట్టరికం పెట్టాడు సిత్తరాల దేవుడు,

జనమలున్నవో లేవో ఆ బెమ్మదేవుడికి ఎఱుక

ఆ కొమ్మకి నీకు ఋణవేటంటే సెప్పగలదా చిలకా, సెప్పగలదా చిలక..

2.చిరుత నవ్వుల వాడె సిన్నెక్క- వీడు వెరపరుగడు సూడవె సిన్నెక్క.. అనే అన్నమయ్య పదాన్ని తలపింపజేస్తూ.. గౌతమి చిత్రంలో..

పూలవెల్లువ సూడె సిన్నెక్క – పిల్ల పాలనవ్వుల్లోన సిన్నెక్క

రేపో మాపో పెళ్ళి నువు అత్తారింటికి వెళ్ళి- చేమంతమ్మా సీమంతానికి రావే మళ్ళి..

3.ఆపద్భాంధవుడు చిత్రంలోని..

ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా

అంత వింత గాథల్లో ఆనందలాలా..

బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా

రేపల్లె వాడల్లో ఆనంద లీలా

ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి

ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి

బాలుడా?.. గోపాలుడా? .. లోకాల పాలుడా?

తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!

తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!

4.శుభ సంకల్పం చిత్రంలో..

హైలెస్సో హైలెస్సో.. హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సో……… హైలెస్సో హైలెస్సా

సూర్యుడైనా సలవ సంద్రుడైనా కోటి సుక్కలైనా……… అష్ట దిక్కులైనా నువ్వైనా……

అహ నీనైనా అహ నీవైనా…అహ నావైనా

సంద్రాన మీనాల సందమే.. హైలెస్సో హైలెస్సో.……… హైలెస్సో హైలెస్సా

నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో హైలెస్సా

నింగి నీలవంతా సంద్రమే హైలెస్సో… హైలెస్సా

నీలాల కన్నుల్లో సంద్రమే……… నింగి నీలవంతా సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే..

నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే@2

~

ఇక చిరంజీవిగారికి మొదటి నంది అవార్డును సాధించిపెట్టిన స్వయంకృషి చిత్రంలో, చిరంజీవి, విజయశాంతిలపై చిత్రించిన పాట.. సిగ్గు పూబంతి.. ఇది ఒక సరస శృంగార గీతం. చాలా సున్నితంగా, అలతి పదాలతో చెప్పదలచుకున్న భావాన్ని మృదు మధురంగా ఒలికించిన గీతం.

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

లోకోత్తర ఆదర్శ దంపతులైన సీతారాములను ఉపమానంగా తీసుకొని, ఒక చిలిపి శృంగారాన్ని పలికించిన జాన జాణతనం సిరివెన్నెల కలానిది.

సింగారపు మొగ్గ విరిసిన సీతమ్మ, సిగ్గును పూబంతిలా రామునిపై విసిరిందట. సొగసు సంపెంగ గుత్తులు (పైకి పూలగుత్తి.. కానీ భావంలో సీతమ్మ మేని సొగసులు) రామయ్యకు మెత్తగా తగిలి, ఆయన మనసులో కాముడు శృంగార భావాలు రగిలించాడట! ఎంత సరస శృంగారం!

విరజాజి పూలబంతి అరసేత మోయలేని

విరజాజి పూలబంతి అరసేత మోయలేని

సుకుమారి ఈ సిన్నదేనా

శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా

ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు@2

సూసి అలకలొచ్చిన కలికి@2

ఏసినాది కులుకుల మొలికి ॥సిగ్గు పూబంతి॥

పూబంతిని కూడా అరచేతిలో మోయలేని ఈ సుకుమార బంతి సీతమ్మ, నిజంగా శివధనస్సును మోసిందా? అంత మహాశక్తి తనలో దాచుకున్న ఇంతి ఈమేనా? అని రామయ్య కళ్ళతో ఉడికిన్నట్లుగా, చిన్నెలు కురిపించే చూపులు విసిరాడట. ఆ అపహాస్యానికి అలకబూనిన సీతామాలక్ష్మి కులుకుల మొలికిని విసిరిందట! ఎంత చక్కటి అభివ్యక్తి! సినిమాలో పాత్రలకు అనుగుణంగా అనిపిస్తూ.. చక్కగా సీతారాముల (కల్పిత) శృంగార సన్నివేశాన్ని మన మనో ఫలకంపై చిత్రీకరించారు సిరివెన్నెల.

సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న@2

చిలకమ్మ కొనసూపు సవురు బొండుమల్లి సెండుజోరు

చేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ రూపు@2

మెరిసే నల్లమబ్బైనాది..@2

వలపు జల్లు వరదైనాది ॥సిగ్గు పూబంతి॥

మరి మన సీతమ్మ ఏమన్నా తక్కువ తిందా? తలవంచి కూర్చుని వున్నా, పూబంతిని రామునిపై గురిచూసి విసురుతోందట. బంతితో బాటు రెచ్చగొట్టే అందమైన కొనచూపులను కూడా విసురుతోందట. ఆ చూపుల్లోని తళుకు, నీలిమేఘ శ్యాముని శరీరంపై పడిందట. మబ్బుల్లో మెరుపులా ఆ చూపు, రూపు పెనబడి, వలపు జల్లు వరదలా కురిసిందట! ఎంత గొప్ప భావ ప్రకటన చాతుర్యమో చూడండి! ఏ వాగ్గేయకారులను తలపిస్తుందో, మీరే నిర్ణయించండి!

ఖరహరప్రియ రాగంలో, సున్నితమైన కంపన, అనుకంపన, ప్రకంపన స్వరాలతో ఎంతో మాధుర్యంగా సాగిన ఈ పాట, వెన్నెలలో పూలనావలా కులుకుతూ, వయ్యారాలు పోతూ మనల్ని అనిర్వచనీయమైన ఆనందంలో ఓలలాడిస్తుందటంలో సందేహం లేదు!

ఏ గుణాన్ని, ఏ రసాన్ని, ఏ తత్వాన్ని ఒక పాటలో అందించాలనుకుంటారో, దాని కోసం సిరివెన్నెల అనుభవించిన ప్రసవవేదన మనకు ప్రతి పదంలో, వాక్యంలో, భావంలో, అడుగడుగునా కనిపిస్తుంది. అంత అందమైన, లయాత్మకమైన, ప్రాసలతో కూడిన పదాలను తన పాటలో పొదిగి, రసాత్మకమైన గీతాల్ని మనకు అందించారు. ఆ జల్లుల వరదల్లో మనం కూడా తడిసి మురిసిపోదాం! సిరివెన్నెల రాసిన కథానిక, ‘ఎన్నో రంగుల తెల్ల కిరణం’, ఆయన సాహితీ పటిమను వర్ణించడానికి ఉపమానంగా, ఎంతో చక్కగా సరిపోతుంది.

Images Courtesy: Internet

Exit mobile version