Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట -3 – సమాజానికి కవి చేసిన హితోపదేశం

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

చిలుకా ఏ తోడు లేక..

~

చిత్రం: శుభలగ్నం, 1994.

దర్శకత్వం: ఎస్. వి.కృష్ణారెడ్డి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి.

గాత్రం: ఎస్.పీ. బాలసుబ్రమణ్యం.

~

సాహిత్యం:

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక.
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

~

బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే@2
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో..
హలాహలం కొన్నావే అతి తెలివితో..
కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే
||చిలకా ఏ తోడు లేక||

~

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో@2
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో..
అనాథగా మిగిలావే అమావాసలో..
తీరా నీవు కనుతెరిచాక తీరం కనబడదే యింకా
||చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ||

దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం, ఒక కొత్త రెవల్యూషనరీ కాన్సెప్ట్‌తో సంచలనాన్ని సృష్టించిన చిత్రం శుభలగ్నం. ఈ సినిమాలో, ‘చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరినడక’, అన్న ఈ పాట అప్పట్లో వైరల్‌గా మారి విపరీతమైన జనాదరణ పొందింది, ఇప్పటికీ పొందుతూనే ఉంది. సినిమానే కాక ఈ పాటని మరింతగా ప్రజలు ఆదరించారు. ఈ పాటలోని పద చిత్రము, భావచిత్రము అందరి మనసులు గెలుచుకొని, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నంది పురస్కారాన్నే కాకుండా ఆత్రేయ గారి మనస్విని పురస్కారాన్ని కూడా అందించింది. ఈ పాటలోని అద్భుతమైన సాహిత్యానికి మరింత జీవం పోసింది బాలు గారి అమృత గాత్రం.

ఇక పాట నేపథ్యానికి వస్తే, డబ్బుతోనే అన్ని సౌకర్యాలు వస్తాయి అన్న పిచ్చి భ్రమలో, మంచి అనుబంధాలతో.. ఆనందంగా సాగిపోతున్న జీవితాన్ని కష్టాలపాలు చేసుకుంటుంది కథానాయిక. ఎంతో ఆత్మీయంగా చూసుకునే భర్త, ఇద్దరు ముచ్చటైన పిల్లలతో సాగిపోయే మధ్యతరగతి సంసారంలో, తగినంత డబ్బు లేకపోవడం వల్ల తగ్గిన సౌకర్యాలతో కుమిలిపోయిన హీరోయిన్, ఒకానొక సందర్భంలో కోటి రూపాయల డబ్బు ఎరకు బలైపోయి, భర్తను రెండవ హీరోయిన్‌కు అప్పచెబుతుంది. ఆ డబ్బు మైకం తీరి కళ్ళు తెరిచేసరికి, తన జీవితంలో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి, ఒంటరిగా మిగలాల్సిన స్థితి వస్తుంది. ఆ సందర్భంలోనిది ఈ నేపథ్య గానం.

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక..
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

డబ్బుతో ఏదైనా కొనగలం, ఏమైనా చేసేయగలం, అన్న పిచ్చి భ్రమే, ఆ ఎడారంటి ఆశ. ఎడారిలో ఎంత దూరం ప్రయాణించినా నీటి జాడ, జీవించే దారి.. ఏవి కనపడవు. కానీ హీరోయిన్ మాత్రం పర్యవసానం తెలిసి.. ఈ ఆశలు వెంట పరుగు పెట్టలేదు. మధ్యతరగతి స్థాయి నుండి త్వరగా బయటపడాలన్న ఆత్రుతలో, అమాయకంగా కష్టాల్లో చిక్కుకుంటుంది. ఈ పాట విన్న ప్రతి శ్రోత మనసును దోచేసిన వాక్యం, ‘మంగళ సూత్రం అంగడి సరుకా? కొనగలవా చేజారాక?’ తన సౌభాగ్యాన్ని అమ్మేసుకున్న తరువాత, ఆమె కోల్పోయిన భాగ్యం, ఆత్మీయుడైన తన భర్త. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక, ఆమెకు ఎంత లాభమొచ్చిందని, ఏమి లాభం వచ్చిందని సిరివెన్నెల గారు సూటిగా ప్రశ్నిస్తారు.

బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే@2
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో..
హలాహలం కొన్నావే అతి తెలివితో..
కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే
||చిలకా ఏ తోడు లేక||

పల్లవి మాత్రమే నిజంగా కథా నేపథ్యానికి పూర్తిగా న్యాయం చేస్తుంది. ఇక చరణం విషయానికొస్తే, ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం మంది జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. డబ్బు సంపాదనలో, ఆ పిచ్చిలో, ఆ పేరాశలో బతుకుల్ని బలి చేసుకుంటున్నా వాళ్ళు మన చుట్టూ ఎంతమందో! బ్రతకటం తెలిసిన చాలా మందికి జీవించడం అంటే ఏమిటో తెలియకుండా పోతోంది. అనుభూతులకు దూరంగా.. కలల్లోనే జీవిస్తూ, నిజమైన వెలుగుల్ని చూడలేకపోతున్నారు.

అమృతమే చెల్లించి ఆ విలువతో.. హలాహలం కొన్నావే అతి తెలివితో’.. సభ్య సమాజానికి ఎంత పెద్ద చెంపపెట్టు ఈ వాక్యం! ఇది ఖచ్చితంగా ప్రతివారు ప్రశ్నించుకోవాల్సిన, introspect చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం. కుటుంబ జీవితాన్ని, తన వారితో గడిపే ఆనంద క్షణాల్ని, ఆస్వాదించాల్సిన ప్రకృతి అందాలని, తన స్వంత జీవితాన్ని.. వేటిని ఫణంగా పెట్టి, వేటి వైపు పరుగులు పెడుతున్నాం..? అసలైన సంపదకు విలువ తెలుసుకోలేక.. కృత్రిమానికి అర్రులు చాస్తూ.. గమ్యం తెలియకుండా పరుగులు పెడుతున్నాం. దివ్యత్వాన్ని, అమరత్వాన్ని ఇచ్చే అమృతం బదులుగా, నిరంతరం శరీరాన్ని దహించే హలాహలం కోరుకోవడం మూర్ఖత్వమే కదా? కరోనా కాలంలో రోడ్లపై వెదజల్లబడిన, ఏమాత్రం ఉపయోగపడని రంగు కాగితాలు, అనాథలుగా నేల రాలిన లక్షలాది ప్రాణాలు కూడా అందరి కళ్ళు తెరిపించలేకపోవడం నిజంగా దురదృష్టకరం.

చరణంలోని చివరి వాక్యం, ‘కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే!’ ఈ వాక్యం ఎంతో స్పష్టమైన భావ ప్రకటనకు ఉపమానం. ధనమున్న- పేద అనేది Oxymoron లాంటి పదాలు కూర్పు.. మనసును స్పందింప చేసే ఒక అందమైన ప్రయోగం. డబ్బు సంపాదనే ధ్యేయంగా, డబ్బుల వేటే ఒక పరుగు పందెంగా, సంపదే తమ స్టేటస్‌గా, బ్రాండ్లకే తాము బ్రాండ్ అంబాసిడర్లుగా.. బ్రతుకుతున్న ఎంతోమంది జీవితాలలో చెప్పలేనంత ఒంటరితనం, vacuum ఉంది. వాళ్లంతా మానసికంగా ఆరోగ్యంగా లేరు. స్థాయికి మించిన సంపాదన, శక్తికి మించిన పరుగు, అందరికీ దూరం చేసి.. అనురాగం, ఆత్మీయతలెరుగని పేదవాడిగా చేస్తుంది. ఆస్తి, అంతస్తులు చూసి పలకరించే కృత్రిమమైన పలకరింపులు, మనసు లేకుండా formality కోసం షేక్ హ్యాండ్లు ఇచ్చే భజనగాళ్ళు, స్నేహం ముసుగులో పని చేయించుకునే స్వార్థపరులు’ తప్ప, నిజంగా ప్రేమించే వారిని, నీవారిని.. నీకోసం గుండె నిండా ప్రేమని, ఆర్ద్రతనీ, కంటినిండా కన్నీటి బొట్లను నింపుకున్న వారినీ ఏ డబ్బుతోను కొనలేం. ప్రేమ మాత్రమే ప్రేమను గెలుచుకోగలదు, మనసు మాత్రమే మరొక మనసు స్పందన అందుకోగలదు. అందుకే ఆ ధనం లేనివారు నిజమైన పేదవారే!

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో@2
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో..
అనాథగా మిగిలావే అమావాసలో..
తీరా నీవు కనుతెరిచాక తీరం కనబడదే యింకా..

అనురాగం, మమకారం, మానవత్వం.. పంచినవారికి పంచినంత! ఎక్కువ ప్రేమ పొందాలంటే, ఎక్కువ ప్రేమ ఇవ్వాలి. డబ్బుతో ఆనందాన్ని కొనడం వీలుపడదు. డబ్బు మైకంలో అన్ని విలువలనూ వదులుకొంటూ, అందరినీ పోగొట్టుకొంటూ..

తీరా కళ్ళు తెరిచేసరికి ఒంటరిగా మిగిలిపోతారన్నది సిరివెన్నెలగారు సమాజానికి ఇచ్చిన విలువైన సందేశం. సినిమా పరంగా కథానాయికకు ఇచ్చిన సలహాగా పైకి కనిపించినా, ఇది సమాజానికి కవి చేసిన హితోపదేశం. సిరివెన్నెల పాట అంటేనే ప్రతి గుండెనూ తట్టి లేపే ఓ అందమైన సందేశం.

Images Source: Internet

Exit mobile version