Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 30 – లోతైన తాత్వికత దాగి ఉన్న పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

స్వప్నాల వెంట స్వర్గాల వేట

~

చిత్రం: దొంగాట

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: రమణీ భరద్వాజ

గాత్రం: ఎస్. పి. బాలసుబ్రమణ్యం

~

పాట సాహిత్యం

ఆటా ఇటా మరి నువ్వు కోరే దారి
ఆగలేవు సాగలేవు ఓ బాటసారి..

పల్లవి :
స్వప్నాల వెంట స్వర్గాల వేట@2
తుదిలేని దోబూచులాట
ప్రతి వారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట
ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి వెలుగేమిటంట
తెలవారితే కల తీరితే – కరిగేను ఈ దొంగాట
॥స్వప్నాల వెంట స్వర్గాల వేట॥

చరణం:
కళ్ళారా చూస్తూనే ఉంటారు అంతా
హృదయానికే వేస్తారు గంత
నిజమేమో నీడల్లే ఉంటుంది చెంత
మనసేమో అటు చూడదంట
ఈ నాలుగు దిక్కుల్లో ఏదో మన సొంతం
అది నాలుగు స్తంభాలాట
మునుముందే రాసుంది రానున్న గమ్యం
కనిపిస్తే ఏముంది వింత
మనతో మనం దొంగాటలు ఆడడమే బ్రతుకంటే అర్థం
॥స్వప్నాల వెంట స్వర్గాల వేట॥

చరణం:
కాలంతో ప్రతివారు ఏదో ఒకనాడు
ఆడాలి ఈ మాయ జూదం
గెలిచామో ఓడామో అది ముఖ్యం కాదు
ఊహలతో వెయ్యాలి పందెం
వరమేదో పొందాం అనుకున్నవారు
పోయింది పోల్చలేరు
పోగొట్టుకున్నాం అనుకున్నవారు –
పోయింది చూడలేరు
విధి ఆడిన దొంగాటలో ఫలితాలు తేల్చేది ఎవరు?
॥స్వప్నాల వెంట స్వర్గాల వేట॥

The Road Not Taken అనే ప్రఖ్యాతమైన Robert Frost narrative కవితలో నిత్యజీవితంలో మనం ఎదుర్కొనే dilemma ను గురించి ప్రస్తావిస్తాడు. ఏ రెండు అవకాశాలు మన ఎదుటికి వచ్చినా.. అటో, ఇటో తేల్చుకోలేక, ఆగలేక.. సాగలేక.. తికమక పడిపోతూ ఉంటాం.. ఎందుకంటే మన బ్రతుకులో మనం ఒంటరి బాటసారులం!

Two roads diverged in a yellow wood,

And sorry I could not travel both

And be one traveler, long I stood… ఇలా సాగుతుంది ఆ కవిత. అంతే లోతైన భావాన్ని, పై పాటలోని సాకీలో

“ఆటా ఇటా మరి నువ్వు కోరే దారి
ఆగలేవు సాగలేవు ఓ బాటసారి..”

అన్న రెండు వాక్యాల్లో ముచ్చటగా కూర్చారు సిరివెన్నెల. మన జీవితంలోని ఎన్నో ముఖ్య ఘట్టాల్లో, మనం మనసుల్లో నిరంతరంగా ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయమే, మన జీవితాన్ని సరైన పంథాలో నడిపిస్తుంది, మనకు ఫలితాన్ని ఇస్తుంది. In this conflicting world, your life is, what you decide.

ఒక కవి మనస్సు ఆవిష్కరించబడాలంటే, ఒక మంచి కవిత చాలు. వారిని వారు వెతుక్కోవడానికి చేసే ప్రయత్నమే, ఒక అద్భుతమైన కవిత్వంగా ఆవిర్భవిస్తుంది. కవిత అర్థం అయితే కవి అర్థమైనట్టే!

నిజంగా ఆలోచిస్తే, ఈ లోకంలో ప్రతివారు ఒంటరి బాటసారే కదా! ఎవరి స్వప్నాలు వారివి, ఎవరి స్వర్గాలు వారిది. వారి వారి గమ్యాలను చేరుకోవడానికి ప్రతివారూ నిరంతరంగా పరుగు పడుతూనే ఉంటారు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, శరీరం అనే ముసుగు తొడుక్కున్న ప్రతి ఆత్మ, తనకు నిర్ణయించిన ఆటను తను ఆడుకొని, తను నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకొని, చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకుంటుంది. ఇదో తుది లేని ఆట. పరమాత్మ సూత్రధారిగా నడిపించే ఒక జగన్నాటకం. ఇప్పుడు ఈ పాటలో అంతర్లీనంగా ఎంత లోతైన తాత్వికత దాగి ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

పల్లవి:
స్వప్నాల వెంట స్వర్గాల వేట@2
తుదిలేని దోబూచులాట
ప్రతి వారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట
ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి వెలుగేమిటంట
తెలవారితే కల తీరితే – కరిగేను ఈ దొంగాట
॥స్వప్నాల వెంట స్వర్గాల వేట॥

I’m an artist. I feel everything. Nothing is too small or too big in my world. I’m an artist. I write and create, I dream and fantasize, there is music in my dreams. There’s color

everywhere. I’m an artist, I feel more..

Blessing Thabane అనే కవయిత్రి, I’m an artist, అనే తన కవితలో, ప్రతి మనిషి కనే కలల గురించి వర్ణిస్తూ, తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకొనే ఒక కళాకారిణిననీ, తనకి నచ్చినట్టుగా జీవితాన్ని సృజించుకుంటానని అంటుంది. అదే ఫిలాసఫీని, మనకు ఈ పాటలో అందిస్తున్నారు సిరివెన్నెల.

ఇది ఎంతో తాత్వికంగా, మానవ జీవన గమనాన్ని చిత్రీకరించే ఒక పాట. ప్రతి మనిషి కళ్ళలో, ఒక బంగారు కోట లాగా, వారి స్వప్నం వారిని ఊరిస్తూ ఉంటుంది. ఆ స్వప్న తీరాల్లోనే, వారు కోరుకున్న స్వర్గం వేచి చూస్తూ ఉంటుంది. కానీ చిక్కంతా ఎక్కడుందంటే, మన గమనంలోనే. మనం చేరవలసిన తీరానికి సరియైన దారి ఏదో ఎంచుకోవడమే మనం చేయవలసిన పని. కానీ ఆ దిశగా మనల్ని నడిపించే దిక్సూచి అంత సులభంగా అందరికీ దొరకదు. ఎవరో మన కళ్ళకి గంతలు కట్టి, మనతో ఆడే వారంతా తలో దిక్కున దాక్కున్నట్టు, వాళ్లను పట్టుకోవడానికి మనం ప్రయాస పడినట్టు, మన గమ్యం కూడా మన కళ్ళకు గంతలు కట్టి, మనల్ని దొంగాట ఆడిస్తూ ఉంటుంది. ఆ కలల ప్రపంచం నుండి మనం మేల్కొన్న రోజు ఆ దొంగాట ఆగిపోతుంది, అన్నది పల్లవి సారాంశం. Means justify the Ends – గమనం గమ్యాన్ని నిర్ధారిస్తుంది, అని మహాత్మా గాంధీ ఉద్ఘాటిస్తే, Ends justify the Means (if the goal is morally acceptable) – గమ్యం గమనం యొక్క సార్థకతను నిరూపిస్తుంది, అని Niccolò Machiavelli ప్రతిపాదిస్తాడు. కాబట్టి, గమ్యాన్ని చేరే, సరియైన గమనమే, జీవిత పరమార్ధం.

చరణం:
కళ్ళారా చూస్తూనే ఉంటారు అంతా
హృదయానికే వేస్తారు గంత
నిజమేమో నీడల్లే ఉంటుంది చెంత
మనసేమో అటు చూడదంట
ఈ నాలుగు దిక్కుల్లో ఏదో మన సొంతం
అది నాలుగు స్తంభాలాట
మునుముందే రాసుంది రానున్న గమ్యం
కనిపిస్తే ఏముంది వింత
మనతో మనం దొంగాటలు ఆడడమే బ్రతుకంటే అర్థం
॥స్వప్నాల వెంట స్వర్గాల వేట॥

ఈ ప్రపంచంలోని మాయాజాలం ఏంటంటే, కళ్ళతో చూసేది మనసుకు తాకదు. మన మనసుకు అర్థమైందే నిజమని భ్రమిస్తాం. నిజం మన ప్రక్కనే నీడలాగా దాగి ఉన్నా, మనం గుర్తించలేం. చిత్ర నేపథ్యమైతే, రెండు జంటలు పక్క పక్కనే ఉంటూ, సరియైన భాగస్వామిని నిర్ణయించుకోవడంలో, ఒక నాలుగు స్తంభాలాటలాగా కథ సాగుతూ ఉంటుంది.

విధి మాత్రం చేరవలసిన గమ్యాన్ని ఎప్పుడో నిర్ధారించి ఉంటుంది, కానీ అది ముందే తెలిసిపోతే, బ్రతుకు ఆటలో ఎటువంటి రసానందం దొరకదు. మన బ్రతుకుతో మనం (మరెవరితోనో కాదు) దొంగాట ఆడడమే, జీవితం అంటారు సిరివెన్నెల. ఎంతోమంది ప్రముఖ కవుల లాగా Fate/ Destiny ని సిరివెన్నెల సమర్థిస్తున్నట్టు అనిపిస్తుంది ఈ పాటలో.

Superiority to Fate

Is difficult to gain

‘Tis not conferred of Any

But possible to earn.. అని Emily Dickinson, నిర్ధారిస్తే..

Deep in the man sits fast his

fate

To mould his fortunes, mean

or great.. అని మద్దతిస్తారు Ralph Waldo Emerson, ‘Fate’ అనే తన కవితలో..

చరణం:
కాలంతో ప్రతివారు ఏదో ఒకనాడు
ఆడాలి ఈ మాయ జూదం
గెలిచామో ఓడామో అది ముఖ్యం కాదు
ఊహలతో వెయ్యాలి పందెం
వరమేదో పొందాం అనుకున్నవారు
పోయింది పోల్చలేరు
పోగొట్టుకున్నాం అనుకున్నవారు –
పోయింది చూడలేరు
విధి ఆడిన దొంగాటలో ఫలితాలు తేల్చేది ఎవరు?
॥స్వప్నాల వెంట స్వర్గాల వేట॥

కలల వెంట కాలంతోపాటు, పరిగెడుతూ నెగ్గడమే జీవితం! ప్రతివారు కాలంతో ఒక మాయా జూదం ఆడాలని, ఊహలతోనే పందెం కాయాలని అంటారు సిరివెన్నెల. ‘ఏదో సాధించాం’ అనుకున్న వారు పోగొట్టుకుంది ఏంటో గుర్తించలేరు. విలువైనవి తమకు లభించినా, పోగొట్టుకున్న వాటి గురించి దిగులు పడుతూ, పొందింది ఏంటో గుర్తించలేరు మరికొందరు. ఈ విధంగా, మనసుకు గంతలు కట్టి, విధి మనతో దొంగాట ఆడిస్తూ ఉంటుంది. ఇందులో గెలుపు ఓటముల ప్రసక్తే లేదు. ఈ ఫలితాలను తేల్చేది ఎవరో కూడా మనకు తెలియదు. అందుకే, విధి ఆడే ఈ ఆటలో, మన మనసుకు గంతలు విప్పుకొని, నిజాలను గుర్తించి, గెలుపు దిశగా మనం పయనించాలని, ఎంతో లోతైన జీవన వేదాంతాన్ని మనకు ఈ పాట ద్వారా అందించారు, సిరివెన్నెల.

ఈ పాటనూ, దాన్ని రాసిన సందర్భాన్ని గురించీ, అందులో ఆయన పొందుపరిచిన ఫిలాసఫీ గురించీ, సీతారామశాస్త్రి గారు స్వయంగా రచించిన ‘సిరివెన్నెల తరంగాలు’ లోని ఆయన మాటల్లోనే అర్థం చేసుకుందాం. “దొంగాట చిత్రంలో కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో రమణీ భరద్వాజ గారు సంగీత దర్శకత్వం వహించారు. ఈ పాట రాయడానికి సిచ్యుయేషన్ గాని, పాత్రగాని ఏమీ లేవు. ఇలాంటి ‘ఏమీ లేని’ పరిస్థితుల్లోనే సృజనాత్మకతను ప్రదర్శించటానికి కవికి వీలుంటుంది. ఒక క్లబ్బులో ఒకరెవరో ఏదో పాట పాడుతున్నారు. అది పతాక సన్నివేశం. సినిమాలోని పాత్రలన్నీ అక్కడ చేరుకుంటాయి. అందులో ఆ పాత్రల తాలూకు మనస్తత్వాలన్నీ ప్రతిబింబించేలా అర్థం రావాలి. ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్తాను. సినిమా పాటకి ఒక ఉద్దేశ్యం వుంది. ఏంటంటే సాధారణంగా సినిమా పాట తెరకే పరిమితమౌతుంది. అంటే ఒకవేళ మనం కేసెట్ కొనుక్కుని వింటే అందులో ఈ పాట రాగం మీద అధారపడో, పాట తాలూకు మాధుర్యం మీద ఆధారపడో వుంటుంది. తెరమీద చూస్తే తప్ప దానికి సంపూర్ణమైన అర్ధం గోచరించదు. కానీ అదే పాట, సినిమా బైట కూడా ఏ వివరణా ‘వ్యాఖ్యానం’ సందర్భాలు చెప్పనక్కరలేకుండా స్వతంత్రంగా నిలబడగలిగినట్లయితేనే సార్థకమౌతుంది. ఆ పాటని సన్నివేశం కోసం చిత్రీకరించినప్పుడు అది సరిగ్గా సరిపోవాలని నేననుకుంటాను. అందువల్ల ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నేను సాధారణంగా తాత్విక ధోరణికి, ఫిలసాఫికల్ ధోరణికి వెళ్తూంటాను. ఈ వెళ్ళేటప్పుడు భాషలో కఠినత్వం, భావంలో సంక్లిష్టత లేకుండా చూసుకుంటాను. అంటే, ‘స్వప్నాల వెంట స్వర్గాల వేట’, ఇలా భావం ఎక్కడికక్కడే పూర్తయిపోతుంది. ఇటువంటి ప్రక్రియ చేయడంలో కూడా నేను మొదటివాణ్ణి కాను. ఇంతకు మునుపెప్పుడో దీన్ని ఆత్రేయగారు సాధించారు. చెప్పదల్చుకున్న భావం ఎంత చిన్నదయినా.. ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని’ ఈ నాలుగు మాటలు ఎంత పొడిగా అనిపిస్తాయో గుండెల్ని తడిమి చూస్తే అంత తడిగానూ అనిపిస్తాయి. అంత లోతుగానూ అనిపిస్తాయి. అంచేత ఇలాగ ప్రొజాయిక్ సింటెక్స్ లో వింటూ ఓ భావాన్ని బరువు లేకుండా సరాసరి శ్రోతల హృదయాల్లోకి పంపగలిగితే, బావుంటుందేమో! అలాంటి పాటల్లో ఇదొకటి”. అందుకనే ఈ పాటని భావతరంగం శీర్షిక కింద ‘సిరివెన్నెల తరంగాల’లో చేర్చడం జరిగిందట.

ఇంత అద్భుతమైన తాత్విక, వేదాంతపరమైన భావాలను, సందర్భానుసారంగా సినీ సాహిత్యంలో చేర్చి, విలువలు పడిపోయిన సమాజంలో విలువిలలాడుతున్న మనందరికీ, ఒక స్వాతి జల్లు లాగా సిరివెన్నెల గారు అందించిన ఈ అమృతాన్ని మనసారా ఆస్వాదిద్దాం.

Images Courtesy: Internet

Exit mobile version