[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
బోటని పాఠముంది..
~
చిత్రం: శివ
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గాత్రం: ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్పీ శైలజ, బృందం.
~
పాట సాహిత్యం
పల్లవి :
అతడు : బోటనీ పాఠముంది మ్యాటినీ ఆటవుంది. దేనికో ఓటు చెప్పరా!
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్టురా?
అతడు2: బోటనీ క్లాసంటే బోరు బోరు – హిస్టరీ రొష్టుకన్న రెస్టు మేలు
పాటలూ ఫైటులున్న ఫిల్ము చూడు బ్రేకులూ డిస్కోలు చూపుతారు
కోరస్ : జగడ జగడ జగడ జగడ జాం ||4||
ఆమె : దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరీ వింత గరీబూ
జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు వీరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే జీడి బ్రాండు ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు
కోరస్ : జగడ జగడ జగడ జగడ జాం ||4||
చరణం :
అతడు 2: అయ్యో మార్చినే తల్చుకుంటే మూర్చలే ముంచుకొచ్చె మార్గమే చెప్పు గురువా
అతడు 1 : ఏ.. ఛీ తాళం రాదు మార్చిట మార్చి, తాళంలో పాడరా వెధవా!
అతడు 2 : మార్చినే తల్చుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చె, మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఏందిరో ఇంత గొడవా?
అతడు1 : ఎందుకీ హైరానా వెర్రినాన్నా వెళ్ళరా సులువైన దారిలోన
ఆమె : ఉందిగా సెప్టెంబరు మార్చి పైన వాయిదా పద్ధతుంది దేనికైనా
చరణం :
అతడు 1 : మాగ్జిమమ్ మార్కులిచ్చు మ్యాథ్స్ పై ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు ఒంచరా.. ఓరేయ్..
కోరస్ : తందనా తందననా ||3||
ఆమె : క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టు కాస్త ఫస్టు రాంకు పొందవచ్చురోయ్
కోరస్ : తందనా తందననా ||3||
అతడు : అరే ఏంది సార్, లెక్కలూ, ఎక్కాలు తెల్వనోళ్ళు లక్కుతోని లచ్చలల్ల మున్గిపోతరు
పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు సర్కారీ క్లర్కులై మురిగిపోతరు
కోరస్ : జగడ జగడ జగడ జగడ జాం ||4||
♠
కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ; .. అన్న పద్యంలో..
తే. దేవదేవుని చింతించు దినము దినము; చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు; కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు; తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి..
భగవంతుని గురించి తెలుసుకున్నదే చదువంటాడు, పోతనామాత్యుడు, భాగవతంలో.
‘చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు
చదువు చదివెనేని సరసుడగును
చదువు మర్మమెరిగి చదివిన చదువురా
విశ్వదాభిరామ వినురవేమ!’
అని, ఆత్మ మర్మాన్ని తెలుసుకోవడమే చదువంటాడు వేమన.
“Education is nothing but ‘Dis’covering the Inner Light”, అంటారు స్వామి వివేకానంద. తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేలా చేసేదే నిజమైన విద్య అని ఆయన అభిప్రాయం.
ఈ విధంగా, మహాకావ్యాలలో కానీ, శతకాలలో కానీ, ఆత్మ పరమైన, మానవీయపరమైన విద్యలనే చదువుగా వివరించడం జరిగింది. విద్యకు నిర్వచనం కాలానుగుణంగా మారుతూ వచ్చింది. ఆధునిక కాలంలో, మారిన పరిస్థితులకు అనుగుణంగా, ‘కొలువులివ్వగలుగు చదువులే చదువులు..’ అని మనం నిర్ధారించుకోవలసి వస్తుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, ఉద్యోగాలు కావాలంటే, దానికి తగిన అర్హత కలిగించే చదువులు చదువుకోవాల్సిందే! దాందేముంది చదివేద్దాం.. అంటారా? బానే ఉంది కానీ, మరి పరీక్షల మాటేమిటి? అయ్య బాబోయ్.. ఆ పేరు చెప్పకు.. అది వింటేనే నాకు టెన్షన్ వచ్చేస్తుంది! అంటారు నూటికి 90 మంది విద్యార్థులు.
‘Exams, exams, pain in the neck
I’ve bitten all my nails, I’m a nervous wreck!
I smell so bad and look grotesque
Stress building up, will I fail?
My books all piled up, towering on my desk Trapped inside my own head
It’s tangible now it’s like I’m in jail
With the stress of it all: I’m over fed!
I step in the classroom; I can feel fear in the air
I just hope my parents, my life they will spare
Peeling is my skin and falling out is my hair
Life without exams? That life is so rare!’
-Sian Mein.
భయపడుతూ, గోర్లు కొరుక్కుంటూ, పరీక్ష హాల్లో ఖైదీలా, ఫెయిల్ అవుతానేమో.. అని అనుమాన పడుతూ ఉండే స్థితిని.. Exams, exams, pain in the neck.. అంటూ వర్ణిస్తున్నారు, Sian Mein.
పరీక్షలు దగ్గర పడుతున్నాయి అంటే, ఎక్కువ మంది విద్యార్థుల్లో సహజంగా టెన్షన్ మొదలవుతుంది. పుణ్యకాలం అంతా వృథాగా గడిపేసి, పరీక్షల ముందు పట్టుమని పది రోజుల్లో అంతా చదివేద్దాం అనుకుంటే, టెన్షన్ తప్పుతుందా? అయితే, పరీక్షల కాలంలో, విద్యార్థుల ప్రవర్తన పలు రకాలుగా ఉంటుంది. పద్ధతిగా చదువుకొని పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తారు. వాళ్లతో ఏ గోల లేదు. కానీ, ఎలాగోలా గట్టెక్కేద్దాం! అనుకున్న వాళ్లు, చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు. హాల్ టికెట్ తెచ్చుకున్న తర్వాత, తగిన టెస్ట్ పేపర్లు, గైడ్లు తదితర Materials, అన్వేషణ మొదలు పెడతారు. అందులో ఇంపార్టెంట్ ప్రశ్నలను గుర్తించడానికి, మూడు నాలుగేళ్ల ప్రశ్నాపత్రాలను బయటికి తీస్తారు. వాటి నుండి ఎక్కువగా వచ్చినవి, రానివి, ఈ సంవత్సరం (ఈ Sem లో) వచ్చే అవకాశం ఉన్న వాటిని గుర్తించి, కాస్త చదవడం ప్రారంభిస్తారు. మరికొంతమంది ప్రబుద్ధులు చాలా తెలివిగా మైక్రో జిరాక్స్ కాపీలు తయారు చేసుకుని (కాపీ కొట్టడానికి అవకాశం దొరికితే వాడుకోవడానికి), పరీక్షల బరిలోకి దిగడానికి సిద్ధం అయిపోతారు.
ఇక సెమిస్టర్ సిస్టం వచ్చాక, ఏమాత్రం చదువుకోకుండా, లేదా ఎక్కువ టెన్షన్ వల్ల, పరీక్ష రోజు భయమేసి, పరీక్ష పేపర్లో ఒక ఆటోగ్రాఫ్ చేసి, ఎగ్జామ్ హాల్ నుండి బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చి, పరీక్షకు డ్రాప్ పెట్టాను! అంటూ స్టేట్మెంట్స్ ఇస్తారు. Back log ల గాడిద మోతలను మోస్తూ, ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో కూడా, M 1, M 2.. పెండింగ్ ఉన్నాయంటూ, పరీక్షల ఫీజులు కట్టుకుంటూ తిరుగుతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. వీటికి అంతమే ఉండదు.
ఇక పాఠశాల స్థాయి విద్యార్థులైతే, అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రుల ఆటుపోట్ల మధ్య నలిగిపోతూ ఉంటారు. రాసిందే రాస్తూ.. చదివిందే చదువుతూ.. పరీక్ష యుద్ధంలో నెగ్గడానికి ప్రయత్నిస్తుంటారు.
ఇలాంటి చదువు నేపథ్యాన్ని పురస్కరించుకొని, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, మూడు దశాబ్దాల క్రితమే, ‘శివ’ చిత్రంలో, కాలేజీ విద్యార్థుల మానసిక స్థితిని, మనస్తత్వాన్ని ప్రతిబింబించేలాగా, ఒక block buster పాటను రచించారు.
సినిమా పాటను, పాటలా కాకుండా, వచనంలో చదివితే కూడా మంచి అర్థాన్ని ఇచ్చేట్టు ఉండాలనీ, దాని భావం చదివినప్పుడు కూడా మనసును తాకాలనే ప్రత్యేకమైన అభిప్రాయం కలిగిన వారు సిరివెన్నెల. తన ప్రతి పాటలో ఆ మూల ఉద్దేశాన్ని సాధించడానికి వీలైనంత ప్రయత్నం చేశారాయన. అదేవిధంగా, శైలిలో కూడా విలక్షణతను ప్రదర్శించడానికి ఆరాటపడ్డారు. సిరివెన్నెల వచనశైలికి శ్రీకారం చుట్టిన ‘శివ’ (1989) చిత్రంలోని ‘బోటనీ పాఠముంది’ పాటలో ఆ శైలిని పరిశీలిస్తే, సరదాగా కొందరు కాలేజీ స్నేహితులు చెప్పుకునే కబుర్లనే పాటలాగా మలిచి, ఒక వినూత్న శైలిని ఆయన సృష్టించారు. కాలేజీ క్యాంటీన్లో స్నేహితులందరూ బోటనీ క్లాసుకు వెళ్లాలా? మాటీనీ ఆటకి వెళ్లాలా? అనే చర్చలో, సరదాగా సాగే పాట ఇది. వచన శైలిలో గతంలో కొసరాజు, ఆత్రేయ మొదలైనవారు రాసినా, అప్పట్లో కొన్ని పాటలకే అలాంటి అవకాశం దక్కింది. కానీ సీతారామశాస్త్రి గారు వచన శైలిలో ఎన్నో పాటలు తెరకు అందించారు. వచన పరిభాషలోని మామూలు పదాలనే, రాగంలో ఇమిడేలా, అందంగా అమర్చే ఒక ప్రత్యేక శైలిని (Prosoic Syntax) ఇలాంటి పాటల్లో, చాలా నేర్పుగా సిరివెన్నెల ముందుకు తీసుకువచ్చారు.
విద్యార్థులు సహజంగా మాట్లాడుకునే style లో, వారి ముద్రను స్పష్టం చేస్తూ, వారి భావాలకు ఒక icon లాగా, వాళ్ల అల్లరితో గోలగోలగా సాగిన ఈ youthful song యువతరాన్ని అమితంగా ఆకట్టుకుంది. విద్యార్థుల mood మరియు attitude లను ఈ పాట చక్కగా ప్రతిబింబిస్తూ, విద్యార్థిలోకాన్ని ఉర్రూతలూగించింది. విద్యార్థుల సహజ ధోరణికి అద్దం పట్టినట్టున్న ఈ వచనశైలి ప్రయోగం తెలుగుపాటను కొత్తపుంతలు తొక్కించింది. సినిమా పాటలలో, వచన శైలికి, తనకు ఇది మొదటి పాటగా సిరివెన్నెల చెప్పుకున్నారు.
చదువు మీద ఏ మాత్రం గురిలేని, చిత్ర కథానాయకుడు, తమ సహ విద్యార్థులకు గీతోపదేశం చేస్తున్నట్టుగా కనిపిస్తూ.. విద్యావ్యవస్థలోని అవకతవకల్ని బయటపెడుతూ, వాటి మీద వ్యంగ్య బాణాలను సంధిస్తూ.. సిరివెన్నెల రాసిన మరోపాట కూడా ‘గులాబి’ (1995) చిత్రంలో వచ్చింది.
‘క్లాసు రూములో తపస్సు చేయుట వేష్టురా గురూ
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరూ
చేయిజారితే ఇలాంటి రోజులు రావెన్నడూ
అందుకే నువు ప్రతిక్షణాన్ని అందుకో గురూ..
మైడియర్ జూనియర్ వైఫియర్ బ్రదర్?’
..అనే పాటలో కూడా విద్యార్థులు, ఆసక్తి లేకుండా, తల్లిదండ్రుల కోసం క్లాస్ రూమ్‌లో వేలాడుతూ ఉండడం వ్యర్థం అన్న ప్రబోధం కనిపిస్తుంది. తమకిష్టమైన రంగాన్ని యెంచుకొని రాణించమనే సలహా, పెద్దల యిష్టాలకు బలవుతూ, పనికిరాని పట్టాలు పుచ్చుకొని జీవితాల్ని వ్యర్థం చేసుకుంటున్నారనే ఆవేదన మనకు కనిపిస్తాయి. క్లాసు రూము నుంచి బయటకొచ్చి ప్రపంచాన్ని తెలుసుకోమనీ, జీవితాన్నిదిద్దుకోమనీ, ఆయన యువతకు ఇచ్చే సందేశం ఇది.
విద్యా వ్యవస్థలో వున్న, జరుగుతున్న.. అవకతవకలపై, సిరివెన్నెల సంధించిన మరో అస్త్రం ‘మనసిచ్చి చూడు’, చిత్రంలో మనకు కనిపిస్తుంది.
పల్లవి:
బోడి చదువులు చదివేస్తు నీ బుర్రంతా భోంచేస్తూ
ఆడిచూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు
ఒక్క పోజు కొట్టు లక్షలు వచ్చిపడేటట్టు
అడిడాస్ బూట్లు తొడగవ నీకు ఆరుకోట్లు
ఎంత చదివితే సంపాదిస్తావు అంతపెద్ద అంతస్తు
ఓరి ఇన్నోసెంట్ స్టూడెంటు!
చరణం:
చిరపుంజిలోన చినుకంతైన తడుస్తుందా నీ జుట్టు
‘థార్’ ఎడారి గోలెందుకురా గోదారి ఒడ్డు నుంటూ
‘వీరప్పన్’ కొట్టేసుంటాడు అశోకుడెపుడో నాటిన చెట్లు
పాత డేట్లు బట్టీ వేస్తూ అసలేంటీ కుస్తీ పట్లు
‘ఐ. క్యూ’ అంటే అర్థం తెలుసా? – అతి తెలివికి తొలిమెట్టు
ఆడేపాడే ఈడును దానికి పెట్టకు తాకట్టు
పనికిరాని చెత్తంతా నింపకు చెదలు పట్టు
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటూ!
చరణం:
లీకు వీరులకు ముందే తెలుసు క్వశ్చన్ పేపరు గుట్టు
లోకజ్ఞానం కలిగినవాడే కోచింగ్ సెంటర్ పెట్టు
మార్కుల కోసం ఏడవలేదురా ఎదిగిన ఏ సైంటిస్టు
గుర్తుపట్టరా ఏ రంగంలో వుందో నీ ఇంట్రెస్టు
నీకు నువ్వు బాసవ్వాలంటే దాన్ని బయట పెట్టు
‘రేసుహార్సు’ వై లైఫ్‌ను గెలిచే పరుగు మొదలు పెట్టు
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటూ! ||బోడి చదువులు||
ఈ పాటలో కూడా సిరివెన్నెలకు విద్యార్థి లోకం పై ఉన్న, concern మనకు కనిపిస్తుంది. పెద్దల ఒత్తిళ్లకు లొంగిపోయి, తమకు ఇష్టం లేని రంగంలో బలవంతంగా చదువులు కొనసాగించకూడదని, అలా చేయడం వల్ల బ్రతుకులో రాణించలేరనీ సిరివెన్నెల ఈ పాట ద్వారా గట్టిగా warning ఇస్తున్నారు. ఓరి ఇన్నోసెంట్ స్టూడెంట్! అంటూ, అమాయకత్వంతో తమ బ్రతుకులు బలి చేసుకోవద్దని, బలమైన సూచన చేస్తున్నారు.
నిజానికి చదువులో ఎదుర్కొనే పరీక్షల కంటే జీవితంలో ఎదుర్కొనే సవాళ్లు చాలా పెద్దవి. ఎవరికైనా జీవితంలో లక్ష్యం ఏమిటి? జీవితాన్ని సుఖంగా గడపడం. అంతే కదా! అయితే, తమ కెరీర్లో స్థిరపడే వరకు విద్యార్థులకు రెండు options వారి ముందుంటాయి. చదువుకునే సమయంలో సుఖ పడిపోయి, జల్సాగా జీవితాన్ని వృధా చేసుకుని, ఆ తర్వాత జీవితమంతా పశ్చాత్తాప పడుతూ, కష్టాలతో గడపడం. రెండవ దారి విద్యార్థి దశలోనే తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకొని, దానికి తగిన పరిశ్రమ చేసి, ప్రణాళిక బద్ధంగా ఎదిగి, జీవితకాలం సుఖంగా బ్రతకడం. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో తెలివైన నిర్ణయం తీసుకోవాలి. అందమైన ఈకలు కలిగిన ఒక పక్షి ఉండేదట. ఒక వేటగాడు వలపన్ని, “ఆహారం కోసం నువ్వు ఎక్కువ దూరం వెళ్లి శ్రమపడనవసరం లేదు. నేను వచ్చినప్పుడంతా ఒక ఈకను ఇవ్వగలిగితే, నీకు నెలకు సరిపడా ధాన్యాన్ని ఇస్తాను”, అని చెప్పాడట. ఆ పక్షి చాలా సంతోష పడిపోయి, ఏ కష్టం లేకుండా, సుఖంగా నా ఆహారం నా దగ్గరికి వస్తుంది కదా. ఒక ఈక పోతే పోయింది, మళ్లీ పుడుతుంది, అని సంబరంగా, వేటగాడి ఆఫర్ ఓకే చేసిందట. కొద్దికాలం బాగానే గడిచింది. వయసు పెరిగి పోయాక, ఈకలు పెరగడం ఆగిపోయాయి. ఇప్పుడు ఎగరడానికి సహకరించే ఈకలు లేవు, ఈకలు లేకపోవడంతో ధాన్యాన్ని ఇచ్చే వేటగాడు రాడు.. ఇప్పుడు మిగిలిన జీవితమంతా ఆ పక్షి ఎలా గడపాలి? అర్థమైంది కదా! అందుకే కష్టపడగలిగిన సమయంలోనే, చదువు తప్ప వేరే బాధ్యత లేని కాలంలోనే, మన భవిష్యత్తుకు సంబంధించిన, investment మనమే సిద్ధం చేసుకోవాలి. మీ జీవితానికి సంబంధించిన బాధ్యత మీరే తీసుకోవాలి. అప్పుడు భవిష్యత్తంతా ఆనందమయంగా ఉంటుంది.
SWOT పద్ధతి ద్వారా, తమలోని బలాలు బలహీనతలు, ఆసక్తులు, అవకాశాలు, గుర్తించి కెరీర్‌కు సంబంధించిన ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుని, ఆ విధంగానే ముందుకు వెళ్లాలి. తనకు ఆసక్తి ఉన్న రంగంలో మాత్రమే, టెండూల్కర్ అయినా, లతా మంగేష్కర్ అయినా, మరెవరైనా ఉన్నత శిఖరాలను అందుకోగలరు. తనకు ఏ రంగంలో ‘ఆసక్తి’, సాధించగలిగే ‘ఆ శక్తి’, ఉన్నాయో గుర్తించి, గెలుపు గుర్రంలా ముందుకు దూకమని, ఆయన విద్యార్థులను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు.
పరీక్షల సమయంలో, ఈ పాటల్లో ఉన్న సాహిత్యం కూడా విద్యార్థులకు సరైన దిశా నిర్దేశం చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా, విద్యార్థుల మనస్తత్వాలకు అనుగుణంగా మసులుకోగలిగితే, మార్కులు, ఇతరులతో పోల్చి కించపరచడాలు, విద్యార్థులలో ఆత్మ న్యూనత భావం, బలవన్మరణాలు తగ్గి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారవుతారు.
Images Courtesy: Internet