Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 37 – నోరూరించే వంకాయ పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఆహా ఏమి రుచి అనరా మైమరచి

~

చిత్రం: ఎగిరే పావురమా

సంగీతం: ఎస్వీ కృష్ణారెడ్డి

సాహిత్యం: సిరివెన్నెల

గాత్రం: చిత్ర..

~

పాట సాహిత్యం

పల్లవి
ఆహా ఏమి రుచి అనరా మైమరచి,
రోజూ తిన్నా మరి మోజే తీరనిది
తాజా కూరలలో రాజా ఎవరండి
ఇంకా చెప్పాల వంకాయేనండి..
॥ఆహా.. ఏమి రుచి అనరా మైమరచి॥

చరణం:
అల్లం పచ్చిమిర్చి శుచిగా నూరుకొని
దానికి కొత్తిమిరి బాగా తగిలిస్తే
గుర్తొంకాయ కర్రి ఆకలి పెంచు కదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
వండుతూనే వుంటేనే రావా ఘుమ ఘుమ ఘుమ ఘుమలు..
॥ఆహా.. ఏమి రుచి అనరా మైమరచి॥

చరణం:
లేత వంకాయలతో వేపుడు చేసేదా.. మపద.. దనిసరి రిగరిగగరిస.. నిసగప..
మెట్టవంకాయలతో చట్నీ చేసేదా
టొమెటోతో కలిపి వండిపెడితే
మీరు అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియగ తెలుపగ తరమా

ఆహా.. ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా వంకాయేనండీ

‘వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి’, అంటూ భక్తికి కూడా, రుచులను జోడించే భోజనం ప్రియులు తెలుగువారు. 22 ఆసియా పసిఫిక్ దేశాలలో ఒక సర్వే నిర్వహిస్తే, అత్యధికంగా భారతీయులే సగటున వారానికి 13.2 గంటలు వంట గదిలో గడుపుతారని వెల్లడైందట. చాలామంది మగవారు వారానికి ఒకరోజైనా కాలక్షేపం కోసం, ఒక హాబీలా రకరకాల పదార్థాలు వండడం మామూలు అయిపోతోందట. అత్యధికంగా ఇండోనేషియా వారు (40% మంది) ప్రపంచంలోనే ఎక్కువ పాకశాస్త్ర ప్రయోగాలలో వంటింట్లో మునిగితేలుతున్నారట. భారతీయులు రెండవ స్థానంలో 39%తో, చైనా వారు 32%తో మూడో స్థానంలో ఉన్నారట! అటు వండి వడ్డించే, నలభీమపాక నిపుణులూ, ఇటు ప్రతి పదార్థాన్ని విందుగా పసందుగా తింటూ, ఆనందిస్తున్న భోజన ప్రియులూ(foodies) నానాటికి పెరిగిపోతున్నారు. భోజన ప్రియత్వానికి, ఎంతో పేరు పొందిన శ్రీనాథుడు, కర్ణాటక రాజ్యంలో తనకు నచ్చిన రుచికరమైన భోజనం దొరకక, ఎంత వగచాడో చూడండి.

కుల్లాయెత్తితి గోకచుట్టితి మహా కూర్పాసముం దొడ్గితిన్
వెల్లుల్లిన్ దిలపిష్టమున్ విసివితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లా యంబలి ద్రాగితిన్ రుచుల దోసం బంచు బోనాడితిన్
దల్లీ కన్నడరాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్

~

‘కృష్ణాతీరం’, నవలలో మల్లాది రామకృష్ణ గారు

అన్నప్పగారి భోజన ప్రియత్వం గురించి చెబుతూ అన్నప్ప చేతే ఇలా అనిపిస్తారు…

“యీ స్వస్థికేంగాని, పెందరాడే కాస్త పప్పూ అన్నం బెడుదూ. చుట్టాలొచ్చేరని, నవకాయ పిండివంటలూ జేసేవ్. వంకాయ నాలుగు పచ్చాలు చేసి పోపులో వేసి, ఆనపకాయమీద యింత నువ్వు పప్పుచల్లి, అరటిదూట మొఖాన యింత ఆ వెట్టి, తోటకూర కాడల్లో యింత పిండి బెల్లం పారెయ్. కొబ్బరీ, మామిడీ, అల్లం యీ పచ్చళ్ళు చాల్లే – పెరుగులో తిరగబోత పెట్టి, దాన్లో పది గారిముక్కలు పడేయ్. రవంత శెనగపిండి కలిపి, మిరపకాయలు ముంచి చమురులో వెయ్. సరే క్షీరాన్నమంటావా, అదోవంటా? ములక్కాయలు మరి కాసిని వేసి, పులుసో పొయిమీద పడెయ్, యీ పూటకు యిల్లా లఘువుగానే పోనీయ్. ఇదిగో నేనూ స్నానం జేసి వస్తున్నా గాని, ఈ లోగా, ఓ అరతవ్వెడు గోధుంపిండి తడిప్పెట్టూ, రత్తమ్మొస్తే నాలుగు వత్తి అలా పడేస్తుంది… మధ్యాహ్నం పంటి క్రిందకు వుంటాయ్!

పాత కాలాల పెళ్లిళ్లలో, విందు బాగా లేదని పలు రకాల పాటల ద్వారా వియ్యంకులను ఆట పట్టించేవారు. ఉదాహరణకు.. ఈ పాట చూడండి.

1: ఏలాగూభోంచేతుమూ ఈ విందుమేమేలాగూ భోంచేతుము

చాలా పెళ్ళిల్లాయె ఈలాంటి విందూమేమెలాగూ భోంచేతుమూ

ముతకాబియ్యా పన్నమూ ఎంజనము చూడా ముద్దాకూరలె వేసిరీ—

మారూ అడుగాకుండా మరిమరి వడ్డించరు…

2: విందు భోజనం పసందు భోజనం వియ్యాలవారింట వింతభోజనం ॥విందు॥

పనసపొట్టు కూరలో పసలేదండి అరటికాయ కూరలో ఆవరేదండి గుత్తీవంకాయ కూర అన్నారండి

ఉత్తుత్తి కాయలే వడ్డించారండి. ॥విందు॥

ఇది వియ్యంకులకు తమిళుల భోజన ఆహ్వానం…

~

భోజనం సేయ్యవారంగళ్ మీనాక్షి సుందరేశ కళ్యాణ మండపత్తిళ్ “భోజనం సేయ్యవారంగళ్”

నవచిత్రమానదౌ కళ్యాణమండపత్తిళ్ “భోజనం సేయ్యవారంగళ్”…

~

ఈ విషయానికొస్తే ప్రపంచంలో ఎవరూ ‘తగ్గేదేలే’ అంటారు. పిల్లలకు నంబర్స్ నేర్పడానికి ఇంగ్లీషులో ఉన్న ఈ రైమ్ చూడండి:

I went to the fridge.
I opened the door.
There on the shelves
Inside I saw
Ten fish fingers
Nine strawberry yoghurts
Eight beefburgers
Seven slices of ham
Six large eggs
Five cold sausages
Four chunks of cheese
Three bottles of milk
Two cans of Coke
And a big bowl of blackcurrant jelly.

Julian అని ఐదవ తరగతి విద్యార్థి రాసిన ఒక పద్యం:

Cheese and cream makes me dream
Toast and pie makes me die
Sandy candy makes me handy
Powder and flour makes me sleep for an hour..

ఒక్క భోజనమే కాదు సుమండీ! ‌ కప్పు కాఫీ కోసం కూడా ఇవే ఇక్కట్లు.. వాటిపై కవితలు దండకాలు!

చెన్న పట్టణంలోని ఒక సభలో తాపీ ధర్మారావు గారు పోకూరి కాశీపతి అనే అవధాన పండితుడిని ఆయన సేవించిన కాఫీ మీద దండకం చెప్పమని కోరగా.. ఆయన ఆశువుగా ఇలా చెప్పారట.

శ్రీమన్మహాదేవీ, లోకేశ్వరీ, కాళికాసన్నిభాకారిణీ, లోకసంచారిణీ, అంబ కాఫీ జగన్మోహినీ తల్లి శ్రీకృష్ణుడా స్వర్గమున్ జేరివూతంబునౌ పారిజాతంబున్ దెచ్చియున్, నాతికిన్ ప్రీతిగా నిచ్చు
కాలంబునందా సుమంబందునం గల్గు బీజంబు
……..
దద్బీజజాలంబు నైర్లండు, నింగ్లండు, హాలెండు,
పోలెండు, రష్యా, జపాన్, జర్మనీ, గ్రీకు దేశంబులన్
నాటి పెన్ మ్రాకులై ఇండియన్ దోటలై
విత్తనాలిచ్చుచున్నావటంచున్ మదిన్ దోచెనే,
బాపురే, తీపిలో, నీరమున్, క్షీరమున్, జెక్కెరన్,
మించిటంగాదే నీ బీజ చూర్ణంబు, నా మూటిలో
జేర్చి సేవించుటన్ నీదు బీజంబులన్ బెంచులో
మాడ్చి చూర్ణమ్ము గావించినన్ దీపిపోదాయె నీ
మాధురీ శక్తి, నీ యింపు, నీ సొంపు, నీ పెంపు వర్ణింప
…… ఇలా ఓ ధారల సాగిపోయిందట, ఆ కాఫీ దండకం.

ఇటీవల కాలంలో ‘మిధునం’ సినిమా కోసం జొన్నవిత్తుల, తనికెళ్ల భరణి గార్లు కలిసి వ్రాసిన, మరో ప్రఖ్యాత కాఫీ దండకం..

అనుదిన్నమ్మును కాఫీయే అసలు కిక్కు కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కూ కప్పు కాఫీ లబించుటే గొప్ప లక్కూ అమృతమన్నది హంబక్కు అయ్యలారా.. జై కాఫీ..(సాకీ)

దండకం:

విశ్వంతరాలలో ఉన్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికీ, అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ, నాల్కతో నీకు జేజేలు పలికేము నానాటికీ… ఎర్లి మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్లైనాయున్ త్రోమకున్ తాగు బెడ్ కాఫీ కోసంబు పెండ్లాముపై రంకెలేయించకే బెస్టు టెస్టిశ్వరీ..బ్రష్ కాఫీశ్వరీ నెస్సుకేఫీశ్వరీ జిహ్వకున్ శుద్ది చేకూర్చవే బ్రూకుబాండేశ్వరీ….

~

ఇక సినీగీతాల విషయానికి వచ్చేసరికి..

వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఓహోహో నాకె ముందు..

…..

ఔరర గారెల్లల్ల అయ్యారే బూరెలిల్లా ఓహోరె అరిసెలుల్లా ఇవెల్ల నాకె చెల్ల…. అంటూ పింగళి తన రచనలో షడ్రసోపేతమైన పెళ్ళి వంట ఎలా వుంటుందో బూరెలు, గారెలు, అప్పళాలు, దప్పళాలు, పాయసాలు, లడ్లు, జిలేబీలు, అరిసెలు ఒకటేమిటి సమస్తం వడ్డించాడు (1957లోనే, మాయాబజార్ సినిమాలో) మనకి, చక్కటి తెలుగు సొగసులతో, ప్రాసలతో, ఎప్పటికీ మరచి పోకుండా.

~

పెళ్లి పుస్తకం చిత్రం కోసం.. ఆరుద్ర గారు వడ్డించిన పప్పు దప్పడం..

ప ప ప ప ప పప్పు దప్పళం ప ప ప ప ప పప్పు దప్పళం

అన్నం నెయ్యి వేడి అన్నం కాచిన్నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి  పప్పు దప్పళం కలిపి కొట్టడం .. భోజనం వనభోజనం.. వనభోజనం.. జనరంజనం..

~

సినిమా టైటిలే భోజనానికి సంబంధించిన, ‘ఆవకాయ బిర్యాని’ అనే సినిమాలో చంద్రబోస్ గారు ఏకంగా మానవ జన్మ ఎత్తిందే రుచి రుచిగా తినడానికి అనే స్టేట్మెంట్ ఇస్తూ పాట రాశారు..

ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా

వేడి వేడన్నంలో నెయ్యి చారు కూరలు వెయ్యెరా

అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగ చెయ్యెరా….

~

ఇక తనికెళ్ల భరణి గారు మిధునం సినిమా కోసం, భోజన ప్రియుడైన నాయకుడి కోసం.. ‘బృందావనమది అందరిదీ’, అనే ప్రఖ్యాతమైన ట్యూన్ లో, టిఫిన్లను, భోజనాలను కలిపి వర్ణిస్తూ ఒక పాట వ్రాశారు.

ఆవకాయ మన అందరిదీ గోంగూర పచ్చడి మనదేలే ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలు ఇంకెందుకులే ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలు ఇంకెందుకులే ‘ఆవకాయ’..

………

గుత్తివంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా

గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకుమురా.. అంటూ సాగుతుంది ఆ పాట.

~

భారతీయ సంస్కృతికి అద్దం పడుతూ, మన సంస్కృతి సంప్రదాయాల మీద, పెళ్లిళ్లు, ఉమ్మడి కుటుంబాలు, బంధుత్వాల మీద అనేక గీతాలు రచించారు సిరివెన్నెల. అందులో భాగంగా తెలుగుతనాన్ని, తెలుగు వారి గడుసుదనాన్ని కూడా అక్షరబద్ధం చేశారు.  పండుగలు – పబ్బాలతో సరిపెట్టక తెలుగువారి వంటకాన్ని కూడా నోరూరించేలా తన పాటలలతో లొట్టలు వేయించారు. పింగళి గారి నుండి, చంద్రబోస్ గారి వరకు జరిగిన వరుస ప్రయోగాలతో పాటు  సిరివెన్నెల కూడా ‘ఎగిరేపావురమా’  చిత్రంలో- తాజా కూరలలో.. రాజా అంటూ.. వంకాయపై కవిత్వాన్ని భాషలో వేగించి, కమ్మని పదాల కారప్పొడిని కలిపి వండారు.

ఆహా ఏమి రుచి అనరా మైమరచి,
రోజూ తిన్నా మరి మోజే తీరనిది
తాజా కూరలలో రాజా ఎవరండి
ఇంకా చెప్పాల వంకాయేనండి..
॥ఆహా.. ఏమి రుచి అనరా మైమరచి॥

“వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి భామామణియున్.. శంకరుని వంటి దైవము.. లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే” ..వంకాయ వంటి కూర, పద్మం వంటి ముఖం కలిగిన సీత వంటి స్త్రీ, శివుడి లాంటి దేవుడు, లంకాధిపతి రావణుడికి శత్రువైన రాముడి వంటి రాజు లేరన్నది ఈ చాటువు అర్థం. ఇంతకీ ఈ కూర మొట్టమొదట ఎవరు చేసి వుండొచ్చంటారు? అమ్మమ్మల నుండి అమ్మలు నేర్చుకుని వండిపెడితే సుష్టుగా లొట్టలేసుకుంటూ తిన్నాం కదా.. ఈ సందేహం మాత్రం ఎప్పుడూ మనకు రాలేదు? అరుణిమా కశ్యప్.. స్టీవ్ వెబర్, సోయితీ బెనర్జీలకు వచ్చింది. వాళ్ల  ప్రయోగాల వల్ల ఇప్పుడు వంకాయ కూర మూలాలు హరప్పా నాగరికత కాలంలోనే ఉన్నాయన్న నిజం వెలుగు చూసింది. వంకాయ కూర మూలాలు ఇలా బయటపడ్డాయన్నమాట!

అల్లం పచ్చిమిర్చి శుచిగా నూరుకొని
దానికి కొత్తిమిరి బాగా తగిలిస్తే
గుర్తొంకాయ కర్రి ఆకలి పెంచు కదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
వండుతూనే వుంటేనే రావా ఘుమ ఘుమ ఘుమ ఘుమలు..
॥ఆహా.. ఏమి రుచి అనరా మైమరచి॥

ఘుమఘుమలాడే గుత్తొంకాయ, అమాంతం ఆకలి పెంచేస్తుందని.. నాలుకపై అమృతంలా లోపలికి జారిపోతుందని చెబుతూ, సహజంగా ఇంట్లో ఎవరైనా వంకాయ కూర వాసనలు ముక్కుపుటాలకు తగిలేసరికి.. ‘బాగా ఆకలేస్తోంది ..త్వరగా వడ్డించు’, అని మనం వినే మాటలను ఎంతో సహజంగా పాట ఫ్రేములోకి దింపారు సిరివెన్నెల.

‘Albergine or Eggplant, Still A Fruit’ అనే ఒక కవితలో Johntatumaker వంకాయను ఇలా వర్ణిస్తారు.
Another vegetable that is a fruit, just like the tomato..
a fruit to boot, yet used as a veggie.
The Alvergine or Eggplant was not always of the color purple.
It was white and yellow, such a peculiar fellow,
and so really looked like a big goose egg. Thus, the name Eggplant..

నిండైన రంగులో నిగనికలాడే వంకాయ పలు పేర్లతో, పలు రంగుల్లో, పలు దేశాల్లో, అందర్నీ రంజింప చేస్తూ, రుచులలో మేటిగా దానికదే సాటిగా ముందుకు సాగిపోతోందన్నది నిస్సందేహం!

లేత వంకాయలతో వేపుడు చేసేదా.. మపద..దనిసరి రిగరిగగరిస.. నిసగప..
మెట్టవంకాయలతో చట్నీ చేసేదా
టొమెటోతో కలిపి వండిపెడితే
మీరు అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియగ తెలుపగ తరమా..

వంకాయతో చట్నీ, కూర, వేపుడు, పులుసు, వంకాయ బజ్జి, గుత్తొంకాయ, మువ్వొంకాయ వంటి ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో చక్కటి అవగాహన ఉన్న సిరివెన్నెల గారు, ఏ ఏ కాంబినేషన్లలో, ఎలాంటి రుచులు వస్తాయో కూడా వివరిస్తూ.. వంకాయ మీద బోలెడంత ప్రేమతో.. దేవుడి లీలల్లాగా.. సొగసు చూడ తరమా అన్న పంథాన.. వంకాయ లీలలు తెలియగ తరమా.. తెలుపగతరమా.. అంటూ ప్రశంసల జల్లులో వంగరాజును ముంచెత్తారు సిరివెన్నెల.

చివరగా, టర్కీ వారు ఎగ్ ప్లాంట్ అని పిలుచుకునే వంకాయను ఎంత ఇష్టపడతారో తెలుపుతూ Iris Love అనే ఆర్కియాలజిస్ట్, వంకాయను కనీసం నూరు విధాలుగా వండడం రాకపోతే, ఆ యువతిని పెళ్లి చేసుకోవడానికి ఏ టర్కీ వ్యక్తి ముందుకు రాడు! అని వివరించాడు. కాబట్టి మొత్తం మీద, ప్రపంచమంతా వంకాయ రుచికి బానిసలేనని, వంకాయ లీలల మీద ఎనలేని సాహిత్యం అందుబాటులో ఉందని మనకు అర్థమైంది.

సాధారణంగా వాడుకలో ఉన్న, మనం నిత్యం మాట్లాడుకునే మాటలతో, ఎంతో చక్కగా ఒక పాటను వంకాయపై కూర్చి మనందరి మనసులకు ఎంతో ఆనందం కలిగించారు సిరివెన్నెల. ‘ఆహా ఏమి రుచి’! అన్న శీర్షికన పలు టీవీ చానళ్లలో షోలు నడవడం.. సిరివెన్నెల గారి పాటకు ఉన్న పాపులారిటీని తెలియజేస్తుంది. ఏది ఏమైనా సిరివెన్నెల గారికి, వంకాయ రుచులకు హాట్సాఫ్.

Images Courtesy: Internet

Exit mobile version