Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 41 – లోతైన భావాల వెన్నెల పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

నెలరాజుని ఇలరాణిని

~

చిత్రం: శ్యాం సింగరాయ్

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: మిక్కీ జె మేయర్

గానం : అనురాగ్ కులకర్ణి, కోరస్

~

పాట సాహిత్యం

పల్లవి:
నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా
నడి రాతిరిలో తెరలు తెరిచి
నడి నిద్దురలో మగత మరచి
ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కల తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో ఛమకు ఛమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు సరికొత్త కళ ఛాంగురే ఇంతటిదా నా సిరి అన్నది ఈ శారద రాతిరి మిలమిలా చెలి కన్నుల తన కలలను కనుగొని అచ్చెరువున మురిసి. అయ్యహో ఎంతటిదీ సుందరి, ఎవ్వరూ రారు కదా తన సరి, సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారీ సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే..
చరణం:
తెర దాటి చెర దాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎద మీటి పలకరిస్తున్న శ్యాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది యామిని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాతిరి పూసిన వేకువ రేఖలు రాసినదీ నవల మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథకళి కదిలెను రేపటి కథలకు మున్నుడిలా
॥తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో ఛమకు ఛమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు సరికొత్త కళ//

సిరివెన్నెల గారి భావకవితా పరిమళాల్లో భాగంగా, ప్రకృతి ప్రియత్వం గురించి చర్చిస్తూ, ప్రకృతికి సంబంధించిన నేపథ్యంతో ఉన్న పాటలు, వాన నేపథ్యంగా ఉన్న పాటలు చర్చించాం. ఈవారం వెన్నెల అనే అంశం ప్రధానంగా ఉన్న పాటలను గురించి సమీక్షించుకుందాం. పేరులోనే సిరివెన్నెల ఉన్న చేంబోలు సీతారామశాస్త్రి గారు, సాహిత్యంలో కూడా వెన్నెలలు వెదజల్లడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

ఆయన రాసిన పాటలలో ఆణిముత్యాలు లాంటివి ఈ వెన్నెల పాటలు.

~

వెన్నెల రావే నీలిమబ్బు తెర దాటి
మల్లెల వీణై కరిగించాలి మౌనాన్ని.. కరిగించాలి మౌనాన్ని.. – లవ్ 91

అతడు: అడవిని కాసే వెన్నెల గుండెల్లో పూసింది,
ప్రకృతి ఆనందతాండవం చేసింది
పంచభూతాల సాక్షిగా రెండు హృదయాలు మమేకమైపోయి అమృతం కురిసింది ఆ రాత్రి
ఆమె: ఈ చల్లని వెన్నెల వేళ, పులకించిన నింగి నేల
వేదనాదమై దీవించెనే… – వెన్నెల్లో ఆడపిల్ల

పూలకన్నెలా లేక పాలవెన్నెలా, వాని విల్లులా కాక తేనె జల్లులా,
ఈ భువిలో మరి ఆ దివిలో ననూ పోలిన అందములేవి మరి..- కచదేవయాని

ఓ వెన్నెల నన్ను వేధించకే,
ఓ వెన్నెల నన్ను వేధించకే
రాగం యోగం మాయమైన మోడు నీడనే@2
ఓ వెన్నెల నన్ను వేధించకే.. ఓ వెన్నెలా – సాగర గీతం

అతడు: నులివెచ్చని వెన్నెల కురిసే, మలచేనా నిన్ను బ్రహ్మ పరువాల పైడి బొమ్మ.
ఆమె: అరవిచ్చిన కన్నుల విరిసే కలలన్నీ పూత పూసి నిలిపిను నన్ను బ్రహ్మ ఇలలో నీకోసమే
అతడు: ఏ జన్మదో ఈ సంగమం, ఈ మూగ సంగీత అనురాగసంకేతం..-గౌతమి

పల్లవి
కోరస్ : కోయిల కోయిల కోయిల కోయిల ॥ 5 ॥
అతడు : రాతిరి గడవని వెన్నెలమ్మ – నిరాశతో నిలవకే వెన్నెలమ్మ
నీ ఆశను వదలకే వెన్నెలమ్మ – నిశీధిని తరమవే వెన్నెలమ్మ చలువ సిరి జాబిలి – కలత పడకే చెలి ॥ 2 ॥
చెలిమి కబురంపనీ నీకై ఇలా ఇలా కలలా కళనింపనీ నీతో ఇలా ఇలా ఇలా ఇలా.. -మహారాణి అనే చిత్రంలో, నిరాశను తరిమి వేయమని.. సిరివెన్నెల ఇచ్చే.. ఒక బలమైన సందేశం.. ఇందులో వెన్నెలను ‘చలువ సిరి జాబిలి’ అని నిర్వచించారు సిరివెన్నెల.

అతడు : వెన్నెల్లో వేసంకాలం ఎండల్లో శీతాకాలం నీ ఒళ్ళో సాయంకాలం హాయిలే హలా
ఆమె : కన్నుల్లో తొలి కార్తీకం కౌగిట్లో కసి తాంబూలం సరసంలో సంధ్యారాగం సాగునే ఇలా – ఒట్టేసి చెబుతున్నా చిత్రంలో.. ఒక యుగళగీతంలో

అతడు : పగలే వెన్నెలాయే జగమే మనదాయే
ఆమె : సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
అతడు : స్వాతిజల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో
ಆమె : దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో..
పరువు ప్రతిష్ట చిత్రంలో ఒక శృంగార యుగళగీతంలో సిరివెన్నెల, వెన్నెల ప్రయోగం.

ఓ.. వెండి వెన్నెలా.. ఓ.. దిగిరా ఇలా.. అమ్మ కొంగులో చంటిపాపలా.. మబ్బు చాటునే ఉంటే ఎలా.. పడిపోతాననీ పసి పాదాలకీ పరుగే నేర్పవా మదిలో దాగిన మధుభావాలకి వెలుగే చూపవా మనసుంటే మార్గముంది తెంచుకోవే సంకెలా..
– లిటిల్ సోల్జర్స్ చిత్రంలో ఓ వెన్నెల పాట.

హాయి హాయి హాయి వెన్నెలమ్మా హాయి హాయి హాయి హాయి హాయి
తియ్య తియ్యనైన పాట పాడనీయి బాధపోనీ రానీ హాయి
చురుకుమనే మంటకు మందును పూయమని
చిటికెలలో కలతను మాయము చేయమని
చలువ కురిపించనీ ఇలా ఇలా ఈ నా పాటని
హాయి హాయి హాయి హాయి హాయి- తారక రాముడు.

పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం
నీ పేరే పాడుతున్న మౌన సంగీతం ఎద నీ రాక కోసం పలికే స్వాగతం- జానకి వెడ్స్ శ్రీరామ్ చిత్రంలోని పాట.

ఆమె : వేసంకాలం వెన్నెల్లాగ వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం?
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండగలాగ సొగసు ఎవరికోసం?
ఓరోరి అందగాడా నన్నేలు మన్మథుడా నీకోసం నీకోసం నీకోసం ॥2॥
అతడు: నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండగ చేసే సందడి వేళ
ఆకు వక్క సున్నం నీకోసం నీకోసం నీకోసం ॥2॥- నేనున్నాను చిత్రం కోసం..

~

సిరివెన్నెల కలం నుండి జాలువారిన ఈ వెన్నెల పాటలో జాబితాను చూశాక.. శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని నెలరాజుని, ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల,‌ అనే ఒక అపూర్వమైన పాటని ఈవారం సమీక్షించుకుందాం. ప్రముఖ సంగీత దర్శకులు మిక్కీ. జే. మేయర్, దర్శకత్వంలో అనురాగ్ కులకర్ణి, బృందం పాడిన, ఎంతో మధురమైన బాణీ కూర్చబడిన పాట ఇది. ఒక వెన్నెల కురిసే రాత్రిలో, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన కలయిక ఎంత గొప్పగా ఉంటుందో, ఈ పాట మనకు వివరిస్తుంది.

ఈ పాట మనకు పూర్తిగా అర్థం కావాలంటే, కథా నేపథ్యం కాస్త పరిచయం కావాలి. ఒక మంచి రచయిత, ఉన్నతమైన సంస్కార భావాలు ఉన్న వ్యక్తి కథానాయకుడు శ్యామ్ సింగరాయ్. దేవదాసిగా జన్మించిన మైత్రి (హీరోతో తదుపరి రోజీగా నామకరణం చేయబడుతుంది), తన కట్టుబాట్లకు, దేవదాసి వ్యవస్థలో జరిగే అన్యాయాలకు, అకృత్యాలకు, సాక్షిగా ఉంటుంది. నాస్తికవాది అయిన శ్యామ్, దేవీ నవరాత్రులలో ఆమెను చూసి, ఆమె నాట్యానికి, అందానికి ముగ్ధుడవుతాడు. వారిద్దరి మధ్యలో ప్రేమ చిగురించిన సందర్భంలో పాడుకునే, నేపథ్యగీతంగా సాగుతుంది ఈ పాట. వెన్నెల వేళలో, నది మధ్యలో, ఒక పడవలో, వారిద్దరూ కలసి కబుర్లు చెప్పుకోవడం, భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం, జరుగుతుంది. ఆ నేపథ్యంగా ఈ పాట సాగుతుంది.

తేలిక మాటలలోనే అపూర్వమైన భావాలను కురిపించిన ఈ పాట, భావ కవిత్వానికి ఒక ప్రతీకలా సాగి, మనందరి మనసులను చూరగొంటుంది.

పల్లవి:
నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా
నడి రాతిరిలో తెరలు తెరిచి
నడి నిద్దురలో మగత మరచి
ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కల తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో ఛమకు ఛమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు సరికొత్త కళ ఛాంగురే ఇంతటిదా నా సిరి అన్నది ఈ శారద రాతిరి మిలమిలా చెలి కన్నుల తన కలలను కనుగొని అచ్చెరువున మురిసి, అయ్యహో ఎంతటిదీ సుందరి, ఎవ్వరూ రారు కదా తన సరి, సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారీ సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే..

గగనంలో ఉండే చందమామని (నెలరాజునీ), ఈ భూమికే రాణి వంటి సౌందర్యవతి అయిన ఇలరాణిని కలిపింది శుభకరమైన సిరివెన్నెల. అంటే రాజుకు రాణికి మధ్య వారధిలా పనిచేసిందది.‌ ఆ రెండింటి మధ్య ఉన్న దూరాన్నే తీరంగా మారమని కోరుతున్నారు సిరివెన్నెల.‌ తీరం చేరలేనిది దూరం, చేరుకోవాల్సింది తీరం. అంటే ఇక్కడ కూడా ఆయన తన సానుకూల దృక్పథాన్ని బలంగా ప్రతిపాదిస్తున్నారు.

నడిరాత్రిలో, సగం నిద్రలో, స్వేచ్ఛ అనే అందమైన కలలు కంటూ, తన జీవితానికున్న అడ్డుతెరలని తొలగించుకొని, తన కలను సాకారం చేసుకోవడానికి బంధనాల నుండి బయటపడుతుంది హీరోయిన్. సహజంగానే తను నవ్వులో ఉన్న తళుకులు, ఆమె చెంపల్లో ఉన్న చమకులు, నాట్యకారిణి అయిన ఆమె మువ్వల్లో ఉన్న ఝనకులకు సరికొత్త అందాలు చేకూరాయి. అంటే ఆమె మరింత అందంగా, ఆనందంగా కనపడుతోంది.

శరదృతువులో, నవరాత్రుల చివరి రోజు, మనసును పులకింపజేసే వెన్నెల వేళను శారద రాత్రి అంటారు. అంత అందమైన రాత్రి, కవులకు కళాకారులకు ఎంతో చక్కటి స్ఫూర్తి కాబట్టి, జ్ఞానాన్ని, కళలను వికసింపజేసే రాత్రి, శారద రాత్రి. ఆ శారదా రాత్రినే personify చేసి‌ ప్రయోగించారు ఈ పాటలో సిరివెన్నెల. మిల మిల మెరిసే తన చెలి కనులలోని కలలను అర్థం చేసుకొని,‌ అయ్యారే ఎంత అందంగా ఉంది ఈ సుందరి! ఈమెకు ఎవరూ సాటి రారు కదా! సృష్టిలో ఉన్న అందాలన్నీ పోత పోసుకొని, సృష్టి‌ అందాల్ని ప్రతిబింబించే ఒక అద్దం లాగా తాను ఉందని ఆశ్చర్యపోయి, మురిసిపోయిందట శారద రాత్రి. ఆమె అందాన్నంతా వర్ణించిన తరువాత, ఇది నింగికి మేలుకు జరిగిన పరిచయమే, ఇందులో సందేహం లేదు! అని నొక్కి చెప్తారు. స్త్రీ వర్ణనలో కావ్యాల స్థాయి ఉపమానాలు ఇందులో ఆయన ప్రయోగించారు. ఇది భావ కవిత్వానికి, ఎంతో అందమైన ఉదాహరణ.

చరణం:
తెర దాటి చెర దాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎద మీటి పలకరిస్తున్న శ్యాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది యామిని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాతిరి పూసిన వేకువ రేఖలు రాసినదీ నవల మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథకళి కదిలెను రేపటి కథలకు మున్నుడిలా..

ఎంతో కఠినమైన ఆంక్షలను, చెరసాలలో బందీ లాంటి తన జీవితాన్ని మార్చుకోవడానికి, స్వతంత్ర జీవనం అనే వెలుగులు కోరుకుంటూ మంచి జీవితంలోకి అడుగు పెడుతున్న భామను (ప్రియురాలిని), అదే భావాలతో, తన ఎద ఉప్పొంగగా శ్యామ్ స్వాగతిస్తున్నాడు. వీరిద్దరి సంగమాన్ని ఎంతో ఆనందంగా, ప్రియమారగా చూస్తూ యామిని, (అందమైన నక్షత్రాలతో తీరిన చీకటి రాత్రి) మురిసిపోతోందట! అటు పల్లవిలోనూ ఇటు చరణంలోనూ నిశాకన్నెల రూపంలో ప్రకృతి వీరి ప్రేమను బాసటగా నిలుస్తున్నాయని సిరివెన్నెల అంతర్లీనంగా చెప్పారు.

వీరిద్దరూ కలబోసుకునే ఊసులే, ఆశలుగా విరబూస్తున్నాయట. దేవీ నవరాత్రులలో జరుగుతున్న వీరి సమాగమం కొత్త ఉదయానికి నాంది పలుకుతోంది. ఈ కథలో శ్యామ్ ఒక రచయిత కాబట్టి వారిద్దరి మధ్య జరిగే సంభాషణలన్నీ నవల లాగా సాగుతున్నాయి అని సూచనాత్మకంగా చెబుతున్నారు సిరివెన్నెల. అదేవిధంగా ఆమె కూడా నర్తకి కాబట్టి, ఆ కబురుల కథకళి, అన్న పొందికైన పదబంధాన్ని, భావ సూచకంగా ఉపయోగించారు. వీరిద్దరి మధ్య మౌనాలు కూడా మమతలై పొంగుతున్నాయట, కవితల సాగుతున్నాయట! కానీ, కథలోని మలుపులను సూచిస్తూ.. తుది ఎరుగని కబురుల కథకళి అన్న పదాన్ని ఎంతో చాకచక్యంగా పొందుపరచారు ఆయన. ఈ తుది ఎరుగని కబురుల కొనసాగింపు, భవిష్యత్తులో జరగబోయే ముగింపుకు మున్నుడిలా, అంటే ఒక నాంది ప్రస్థావనలా (precursor) ఉందంటారు.

భామని, శ్యాముని, యామిని వంటి ప్రాసలు, నడి రాతిరి తరలు తెరచి, తెర దాటి చెరదాటి, నవరాతిరి పూసిన వేకువ రేఖలు, దూరం.. తీరం వంటి ప్రతీకలు ఈ పాటలో ఎంతో హృద్యంగా ప్రయోగించారు సిరివెన్నెల.

కథ ప్రకారం వీధి మధ్య దూరం తరగడానికి, రెండు జన్మల కాలం పడుతుంది. ఇది రెండు జన్మల ప్రేమ కథ. కథానాయిక కోరిక ప్రకారం, తను ప్రేమించిన శ్యాంసింగరాయ్, మరోసారి జన్మించి, ఒక నదీ తీరంలోనే ఆమెను మళ్లీ కలుసుకుంటాడు. తన బలమైన ప్రేమకు చిహ్నంగా, అతని చేతిలో, ఆమె కన్ను మూస్తుంది. ఇంత భావాన్ని, దూరం.. తీరం అన్న రెండు చిన్న పదాలలో కూర్చి, తను పంచుకోవాలనుకున్న లోతైన భావాన్ని, మనకు ఎంతో అర్థవంతంగా అందించారు సిరివెన్నెల.

ఈ పాట గురించి చెప్పుకోవాల్సిన మరొక గొప్ప విశేషం ఉంది. ఇది ఆయన రాసిన ఆఖరి పాటట! రాస్తానో, రాయలేనో అనుకుంటూ పూర్తి చేసి ఇచ్చారట! ఇచ్చిన మరుసటి రోజే, అనారోగ్య కారణాలవల్ల ఆస్పత్రిలో చేరారట. అదే ఆఖరు పాట కావడం, అందులో తన ప్రియమైన, సిరివెన్నెల పేరుని ఉపయోగించడం ఎంత యాదృచ్ఛికం! మన మనసులో చెరగని ముద్ర వేసుకున్న, సిరివెన్నెలకు, ఆయన పంచిన అక్షర సుమాల పరిమళాలతోనే అంజలి అర్పిద్దాం!

Exit mobile version