Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 42 – ప్రేమ వర్ణన సాగిన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

పంచమ వేదం ప్రేమ నాదం

~

చిత్రం: పృథ్వీరాజ్

సంగీతం : సత్యం

సాహిత్యం: సిరివెన్నెల

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

~

పాట సాహిత్యం

పల్లవి :
అతడు : పంచమవేదం ప్రేమనాదం గంగాసాగర సంగమ సంగీతం శృంగార మంత్రాల మంగళ సంకేతం – ప్రేమనాదం
ఆమె : పంచమవేదం ప్రేమనాదం గంగాసాగర సంగమ సంగీతం శృంగార మంత్రాల మంగళ సంకేతం – ప్రేమనాదం
అతడు : పంచమవేదం
ఆమె : ప్రేమనాదం

చరణం :
అతడు: హృదయగగనమున తొలకరి కదలిక
ఆమె : బ్రతుకు పుటలలో పచ్చని గీతిక ||హృదయ॥
అతడు : కళ్ళలోన విరివనాల పండగ పల్లవించు పరిమళాల పండుగ
ఆమె : పట్టలేని పరవశాలు చిందగ పట్టపగలు పంచవర్ణ చంద్రిక
అతడు : అవనికి తెలిసిన ఆది కావ్యమిది
ఆమె : అవధులు తెలియని అమర గానమిది
అతడు : పంచమవేదం
ఆమె : ప్రేమనాదం

చరణం :
ఆమె : మౌనమే శృతిగా మనసు పాడినది
అతడు : మోహమే జతిగా నాట్యమాడినద
॥మౌనమే॥
ఆమె : తేలుతున్న రాగమాల మాధురి తూలుతున్న రాసలీల లాహిరి
అతడు : మేలుకున్న మెరుపుకన్నె మాదిరి మేని వన్నె మెలిక తిరిగె మరిమరి
అతడు : పంచమవేదం
ఆమె : ప్రేమనాదం

సిరివెన్నెల సాహిత్యంలోని భావ కవిత్వపు లక్షణాలలో మనం ఇప్పటివరకు భావుకత, ప్రకృతి ప్రియత్వం గురించిన పాటలను చర్చించాం.

ఇప్పుడు మరో లక్షణమైన, ప్రణయతత్వం గురించి మాట్లాడుకుందాం. సిరివెన్నెల సినీయేతర సాహిత్యంలో ఇలాంటివి మనకు చాలా కనిపించినా, మనం సినిమా సంబంధమైన సాహిత్యాన్ని గురించి మాత్రమే చర్చిస్తున్నాం కాబట్టి, కొన్ని పాటల ద్వారా ఈ లక్షణాన్ని విశ్లేషించుకుందాం.

ఈ ప్రణయతత్వం మనకు ఎక్కువగా యుగళగీతాల్లో, శృంగార గీతాల్లో కనిపిస్తుంది. నిజానికి యుగళగీతం అనే అంశమే తన మనసుకు అంతగా పట్టదని, సిరివెన్నెల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇద్దరు ప్రేమికులు ప్రేమను గురించిన కబుర్లను పాటల రూపంలో పాడుకోవడమేంటని చమత్కరించారు. అయితే, సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అవసరం కాబట్టి, కథా నేపథ్యానికి సంబంధం లేకున్నా, కనెక్టివిటీ లేకున్నా అవసరమైన చోట్ల (అనవసరమైన చోట్ల?), ఇలాంటి పాటలు రాయక తప్పదు, అంటారాయన. అయితే ఇలాంటి గీతాల్లో అటు అమలిన శృంగారం స్థాయి కాకపోయినా, దిగజారుడు స్థాయి సాహిత్యం లేకుండా వీలైనంత మేలిరకం పాటలను ఆయన తెరకు అందించారు. మచ్చుకి కొన్ని పాటలని ఇప్పుడు పరిశీలిద్దాం.

~

పల్లవి :
అతడు : నీ చెంతే ఒక చెంచిత ఉంటే వెన్నెల్లో వేట అది నీ వెంటే ఒక చంద్రిక ఉంటే పున్నమితో పాట
అది అదే కదా ఇది ఔనేమో అంటోంది మది

ఆమె : నీ చెంతే ఒక చెంచిత ఉంటే వెన్నెల్లో వేట
అది నీ వెంటే ఒక చంద్రిక ఉంటే పున్నమితో పాట
అది అదే కదా ఇది ఔనేమో అంటోంది మది

చరణం :
అతడు : వయసుకి వగరొస్తుంటే వసంతాల రాక అది
ఆమె : సొగసుకి చిగురొస్తుంటే వయ్యారాల వేకువది
అతడు : మల్లికి సిగ్గులు పూస్తుంటే పరాగాల భారమది
ఆమె : పిల్లకి తొందర పుడుతుంటే సరాగాల గారమది
అదే కదా ఇది ఔనేమో అంటోంది మది
॥ నీ చెంతే ఒక ॥- స్వరాభిషేకం.

అతడు : జాబిలి వచ్చి జామైయ్యింది జాజులు విచ్చి జామైయ్యింది తాపం పెంచే ఉడుకు దుడుకు ముడిపడి ఉరికే వేళయ్యింది గోలయ్యింది
ఆమె : జాబిలి వచ్చి జామైయ్యిందా – జాజులు విచ్చి జామైయ్యిందా తాపం పెంచే ఉడుకు దుడుకు ముడిపడి ఉరికే వేళయ్యిందా గోలయ్యిందా
అతడు : జాబిలి వచ్చి జామైయ్యింది జాజులు విచ్చి జామైయ్యింది

చరణం :
అతడు : పందిరి మంచం ఒంటరి కంటికి కునుకునివ్వనంది
ఆమె : వరస కుదరనిదే సరసానికి తెర తీయకూడదంది ॥పందిరి॥
అతడు : వడ్డించిన అందాలన్నీ అడ్డెందుకు అంటున్నాయి ॥2॥
ఆమె : కళ్యాణం కాకుండానే కలబడితే తప్పన్నాయి
అతడు : జాబిలి వచ్చి జామైయ్యింది జాజులు విచ్చి జామైయ్యింది
ఆమె : తాపం పెంచే ఉడుకు దుడుకు ముడిపడి ఉరికే వేళయ్యిందా గోలయ్యిందా
అతడు : జాబిలి వచ్చి జామైయ్యింది.
ఆమె : జాజులు విచ్చి జామైయ్యిందా..
శ్రీనివాస కళ్యాణం.

పల్లవి
ఆమె: అమ్మా అబ్బా అమ్మా అబ్బా
హాయ్ ఓపలేనంటోంది తూగిపోతూ ఉంది తీగ నడుమెందుకో
అతడు : అమ్మా అబ్బా అమ్మా అబ్బా
హే ఆగలేనంటోంది రేగిపోతూ ఉంది వేడి వయసెందుకో

చరణం:
ఆమె: కురిసే వెన్నెలలో సనసన్నని చలి వింతలు తడిసే వన్నెలలో నులివెచ్చని గిలిగింతలు
అతడు : మెరిసే కన్నులతో వెలిగించిన నడిరాతిరి రగిలే అల్లరితో కలిగించిన ఓ తిమ్మిరి
ఆమె : పడి లేచే కెరటాలై సడి చేసే సరదాలు
అతడు : జడకుచ్చుల నాట్యాలై నడుమెక్కిన అందాలు..- భలే మొగుడు
పల్లవి :
ಅమె : ముద్దుకు ముందుకు రమ్మంటే కంగారు పడక ॥2॥ కావాలంటే కౌగిలి కమ్మగ తీర్చద ఆకలి ॥2॥ చిలకలా నేఁ కులుకుతూ నా ఈడే ఇస్తానంటే చేదా
అతడు : ముద్దుకు ముంచుకు రాకమ్మో బంగారు చిలక ॥2॥
కవ్వించేలా తాకుతూ అల్లరి చెయ్యకు చాలిక ॥2॥ ఆమె: అంతగా నువ్వడిగితే ఆలోచిస్తా చూస్తా ఆనక

చరణం :
ఆమె : రాజ్యాలే నేనడిగానా రతనాలే తెమ్మన్నానా పోనీలే పాపమంటూ చేరదీస్తే రానా
అతడు : ఏందమ్మో ఈ చెలగాటం బాగుందా ఈ మొగమాటం ఏదైనా కానిదైతే ఎందుకీ తగలాటం
ఆమె: నేనేమో సై అంటున్నా నీ వాటం చూస్తే సున్నా
రాయైన రాజుకోదా మోజుగా రమ్మంటే
అతడు : పచ్చి పాలు వెచ్చబెట్టి రెచ్చగొట్టకు నీ ఇచ్చకాల ఉచ్చులేసి రచ్చపెట్టకు- సార్వభౌముడు

పల్లవి
అతడు: వెన్నెల్లో వేసంకాలం ఎండల్లో శీతాకాలం నీ ఒళ్ళో సాయంకాలం హాయిలే హలా
ఆమె : కన్నుల్లో తొలి కార్తీకం కౌగిట్లో కసి తాంబూలం సరసంలో సంధ్యారాగం సాగునే ఇలా
అతడు: ఏకంగా ఏలేరాజ్యం యదలోనే రాసేపద్యం
ఆశల్లో పొసేఆద్యం కాదులే కలా
లాలి లాలి లాహిరీ ఇదేమి లాహిరీ
ఆమె:లాలి ఎంతపాడినా ఇదేమి అల్లరీ
పండనీ పదేపదే పెదాలతిమ్మిరీ
అతడు: పండనీ పదేపదే పెదాలతిమ్మిరీ
-ఒట్టేసి చెబుతున్నా.

పల్లవి:
ఆమె: నువ్వు నేను అంతే లోకం అంటే ఇంతే ఇంకేదైనా ఉన్నా లేనట్టే ఎవరైనా ఇది వింటే ఏమనుకుంటారంటే అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
అతడు : అనుమానం కలిగిందెందుకు ఇంతగా అణుమాత్రం దూరం కూడా లేదుగా అదికూడా చెప్పాలా నమ్మేట్టుగా || నువ్వు నేను అంతే ॥

చరణం :
ఆమె : కన్నుల్లో నీ రూపు కదిలిందా నువు చెప్పు నిద్దర్లోనైనా వదిలిందా నీ తలపు అపుడపుడూ నీ చూపు నన్నొదిలి కాసేపుడతా ఎటువైపెళుతుంది అసలేంటో మైమరపు
అతడు : ఎప్పటికప్పుడు కంటికి నువ్వు సరికొత్తగ కనిపించొద్దా అందుకనే నా చూపుని కొద్దిగ పక్కకి పంపిస్తా ॥ ఎవరైనా ఇది ॥- కృష్ణార్జునులు

~

ఇలాంటి పాటలన్నింటిలో స్త్రీ పురుషుల మధ్య సహజంగా ఉండే ఆకర్షణలు, ఆరాటాలు, చిలిపి గొడవలు, కొంటె అల్లర్లు అన్ని కలబోసి అందించారు. అందించడమే కాక, తెరపై వాటిని అద్భుతంగా పండించారు. కొన్ని యుగళ గీతాలలో కూడా ఉన్నత స్థాయి సాహిత్యాన్ని అందిస్తూ కొన్నిటిలో జన సామాన్యంలో ఉన్న వాడుక భాషలో, కొన్నింటిని ఇంగ్లీషు హిందీ పదాలతో కలగలిపిన మిక్చర్ లాగా క్రేజీగా కూడా ఆయన రాయడం జరిగింది. ఇప్పుడు మనం పంచమ వేదం ప్రేమ నాదం పాట విశ్లేషణ ఒకసారి చూద్దాం.

అతడు : పంచమవేదం ప్రేమనాదం గంగాసాగర సంగమ సంగీతం

శృంగార మంత్రాల మంగళ సంకేతం – ప్రేమనాదం

ఆమె : పంచమవేదం ప్రేమనాదం గంగాసాగర సంగమ సంగీతం శృంగార మంత్రాల మంగళ సంకేతం – ప్రేమనాదం

అతడు : పంచమవేదం

ఆమె : ప్రేమనాదం

ప్రేమను  పంచమ వేదంగా నిర్వచించి, స్త్రీ పురుషుల సమాగమాన్ని, నదీ సాగర సంగమంలా ఎంతో గొప్పదనాన్ని ఆపాదించారు సిరివెన్నెల. ఆ ప్రణయాన్ని సంగమ సంగీతమని, శృంగార మంత్రాల మంగళ సంకేతమని వర్ణించారు.

చరణం :

అతడు: హృదయగగనమున తొలకరి కదలిక

ఆమె : బ్రతుకు పుటలలో పచ్చని గీతిక ||హృదయ॥

అతడు : కళ్ళలోన విరివనాల పండగ పల్లవించు పరిమళాల పండుగ

ఆమె : పట్టలేని పరవశాలు చిందగ పట్టపగలు పంచవర్ణ చంద్రిక

అతడు : అవనికి తెలిసిన ఆది కావ్యమిది

ఆమె : అవధులు తెలియని అమర గానమిది

అతడు : పంచమవేదం

ఆమె : ప్రేమనాదం

హృదయం అనే గగనంలో తొలకరి కదలికే ప్రేమట! ఆ కదలిక వచ్చినప్పుడు కళ్ళలో విరి వనాలు, చిగురించి పరిమళాలు వెదజల్లుతాయట! పట్టలేని పరవశాలు కలుగుతాయట! భూమికి పరిచయమైన ఆదికావ్యం ప్రేమేనట. ఆ ప్రేమ చిగురించినప్పుడు, అవధులు తెలియని అమర గానం, ప్రేమ నాదం, పంచమ వేదంలా పల్లవిస్తాయట! ఎంతో గొప్ప poetic aesthetics ఈ వర్ణనల్లో కనిపిస్తున్నయో గమనించండి. అందుకే నేను సిరివెన్నెలను భావకవి అని మనసారా విశ్వసిస్తాను.

చరణం :

ఆమె : మౌనమే శృతిగా మనసు పాడినది

అతడు : మోహమే జతిగా నాట్యమాడినద

మౌనమే॥

ఆమె : తేలుతున్న రాగమాల మాధురి తూలుతున్న రాసలీల లాహిరి

అతడు : మేలుకున్న మెరుపుకన్నె మాదిరి మేని వన్నె మెలిక తిరిగె మరిమరి

అతడు : పంచమవేదం

ఆమె : ప్రేమనాదం

రెండవ చరణంలో, ప్రేమ మొదలైన తర్వాత మౌనమే శృతిగా మనసు పాడుతుంటే, దానికి తాళం వేస్తూ మొహం నాట్యం చేస్తున్నదట! ఆనంద పారవశ్యంలో బాగా మాల తేలుతోందట, రాసలీల లాహిరి తూలుతోందట! ఆమె మేనిలోని వన్నెలన్నీ అప్పుడే మేలుకున్న మెరుపు కన్నెలాగా మెలికలు తిరుగుతున్నాయట! ఎంత భావాతీతమైన వర్ణన! మనసును ఏదో లోకాల్లోకి తీసుకుపోయేంత గొప్పగా ప్రేమ వర్ణన సాగిన పాట ఇది.

శృంగారరసం సినిమాపాటల్లో అనివార్యమని, తను కూడా కొన్ని చిలిపి పాటలు రాశాననీ ఒకటి రెండు ఇంటర్వ్యూలలో సిరివెన్నెలే అంగీకరించారు. ఉదాహరణగా ‘అల్లుడుగారు వచ్చారు’ చిత్రంలోని ‘చాలీచాలని కునుకులలోన చాలాకాలమే సతమతమైనా…’ అనే పాటను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి దానిలో అంత కొంటెతనం లేనే లేదు! శృంగారాన్ని బూతు అనుకొని రాయడం నాకిష్టం లేదు. అందుకని అవసరమైతే ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేస్తాను. అంతటితో సమస్య పరిష్కారమవుతుందా? నేను రాయకపోతే మరొకడు ఆ బూతురాత పనికి సిద్ధంగా వుంటాడు. అసలు ఈ విషయమై విస్తృతంగా చర్చలు జరపడానికి ప్రజావేదిక ఏర్పాటు చేయాలి. ప్రజలు ‘ఈ చెత్త మాకొద్దు బాబోయ్’ అని గొంతెత్తి అరవనంత కాలం చిత్రరంగానికి తను చేస్తున్న తప్పేమిటో తెలియదు. అని విశాఖపట్టణంలో జరిగిన ఓ పత్రికావిలేకరుల సమావేశంలో శృంగారానికీ బూతుకి మధ్య తేడా గురించి వివరిస్తూ ప్రసంగించారు. ఏ కవి అయినా సినిమాల్లో శృంగాక గీతాలు రాయనని భీష్మించుకుని కూర్చుంటే ఆయనెంత ప్రతిభావంతుడైనా, శృంగార నుంచి నిష్క్రమించి భజనగీతాలో, రామకోటో రాసుకోవలసి వస్తుంది. అందువల్ల ఆయన మడికట్టుకుని కూర్చోకుండా, అలాంటి పాటలు రాయను అని చెప్పకుండా, ఆ పాటలను కూడా ఎంతో గుంభనంగా, ఒక నియమిత స్థాయిలో, కమర్షియల్ గా కూడా హిట్ అయ్యేలాగా, ప్రేమ గీతాలని, ప్రణయ గీతాల్ని సినిమా తెరకు అందించారు సిరివెన్నెల.

Exit mobile version