[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
ఒకటి రెండు అంటూ విడిగా లెక్కడితే
~
చిత్రం: చక్రం
సంగీతం: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్, బృందం
~
పాట సాహిత్యం
కృష్ణ కృష్ణ కృష్ణా హే రామ రామ రామా..
చిన్నా పెద్ద అంతా.. జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్. పండుగ చేయ్యలంటా.. జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్ తీపి చేదు అంతా జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్ పంచి పెట్టాలంటా జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్..
రంగేళి హోలీ హంగామా కేళి
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి రవ్వల రించోలి సిరి దివ్వెల దీవాలి
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితేగాని పండుగ రానందా సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా
జీం తరత్తా తకథిమి, జీం తరత్తా జీం తరత్తా తకథిమి, జీం తరత్తా
హేయ్ రంగేళి హోలీ (హోలీ) హంగామా కేళి (కేళి) ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వల రించోలి సిరి దివ్వెల దీవాలి
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాల
రవ్వల రించోలి సిరి దివ్వెల దీవాలి
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి ఇష్టపడే ఆ పూటే అలవాటైతే ప్రతిరోజు వసంతమవుతుంది
గడపలు అన్ని జరిపి ఆ గణపతి పండుగ జరిపి నిమజ్జనం కాని జనం జరిపే పయనం నిత్య భాద్రపదమవుతుంది
లోకులు చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే చూపులు దీపాలుగజేసే జాగరణే శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చె రోజొకటుండాలా చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగాలేదా
రంగేళి హోలీ, హంగామా కేళి
కన్నుల జోలపదాలై కొల్లల జానపదాలై నరుడికి గీత పథమై నడవడమంటే, అర్థం కృష్ణ జయంతి
అందరి ఎండకు మనమే పందిరయ్యే లక్షణమే మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామ నవమయ్యింది
మనలో మనమే కలహించి మనలో మనిషిని తలతుంచి విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటైంది మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి
(గొబ్బియలో గొబ్బియలో,గొబ్బియలో గొబ్బియలో)
ఒకటి రెండంటూ విడిగా లెక్కడితే తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వునువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే కోట్ల ఒక్కటై ఎవరి ముసుగులో వాళ్ళు ఉన్నామంతే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే! మనిషితనం ఒక్కటే!
♠
లోకా సమస్తా సుఖినోభవంతు! అని నిత్యం ప్రార్థించే భారతదేశంలో విశ్వమానవ సౌభ్రాతృత్వం, వసుధైక కుటుంబం అనేవి మన ఎద పలికే నాదాలు, నిత్య వేదాలు. మానవత్వమే మహామతంగా ఎదిగిన గొప్ప జాతి మనది. ఆ మూల సిద్ధాంతాలను, ఆమూలాగ్రం ఆకళింపు చేసుకుని, తన సాహిత్యంతో విశ్వమానవత్వానికి వన్నెలు దిద్దిన సినీ కవి, సిరివెన్నెల. నువ్వు-నేను అనే గీతలు చెరిపేస్తే ‘మనం’ అనే సమైక్య భావమే మానవత్వమని, (Erase all the boundaries to be a human being), మనిషితనానికి భాష్యం చెప్పిన కవి సిరివెన్నెల.
ఇలాంటి భావాలను ప్రతిఫలించే ఎన్నో పాటలు సిరివెన్నెల కలం నుండి జాలువారాయి. చాలా సినిమాలలో వివిధ సందర్భాలలో వ్రాసిన ఇలాంటి పాటలు, విలువైన విలువలు నేర్పుతూ, శ్రోతల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. సిరివెన్నెల గారి పాటలు విన్నవారికి ఆనందం, భావోద్వేగం అనుభవంలోకి రావడమే కాక, ఆలోచనలు కూడా రేకెత్తిస్తాయి. నిత్య జీవితంలో ప్రతి మనిషి, సమాజం సహజంగా ఎదుర్కొనే విషయాలనే తన పాటలకు subject గా తీసుకుని, ఎన్నో పాటలు రాసే అవకాశం ఆయనకు కలిగింది. సిరివెన్నెల గారు రాసిన చాలా పాటల్లోని ముఖ్యమైన concept మనిషితనం – humanity. వివిధ సినిమాలలో వివిధ మనస్తత్వాలు కలిగిన నేపథ్యానికి సంబంధించి ఎన్నో పాటలు సిరివెన్నెల వ్రాయాల్సి వచ్చినప్పుడు, తను చెప్పాలనుకున్న సిద్ధాంతాలను, ఆ పాటల ద్వారా మనకు అందచేశారు. సాధ్యమైనంత వరకు అలాంటి పాటలన్నీ మనిషికి – జీవితానికి ఉపయోగపడేలాగా భావోద్వేగాన్ని, తర్కాన్ని జోడించి రాసేవారు. సిరివెన్నెల గారి పాటలు ఎక్కువగా మనందరికీ ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడే universality ని కలిగి ఉంటాయి. ప్రతి పాటలోనూ మనకు మనమే కనిపిస్తూ, ఇది నా పాటే, అచ్చంగా నా భావం లాగే ఉంది! అనిపిస్తుంది.
సిరివెన్నెల గారి పాటలు తరచి తరచి విశ్లేషించే కొద్దీ, అవి సినిమా పాటల స్థాయికి మించి ఎంతో ఉన్నతమైన, గంభీరమైన విలువలను పాఠకులకు అందించడానికి నిర్దేశించబడ్డాయని అర్థం అవుతుంది.
సిరివెన్నెల వ్రాసే ప్రతి పాటలో ఏదో ఒక కొత్తదనం, ఒక కొత్త కోణం ఆవిష్కృతమవుతాయి. అయితే వినడానికి మాత్రం ప్రతి పాట సామాన్యంగా, సార్వజనీనంగా అనిపిస్తాయి. అవి ఎటువంటి పాటలయినా మనిషి అంతరంగానికి ప్రతీకలుగా ఉంటాయి. మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మన భావాలకే ఆయన పాటలు అద్దం పడతాయి కాబట్టి! పుట్టినప్పటి నుండి ప్రతి మనిషి ఏదో వెతుకుతూనే ఉంటాడు. అది దొరక్కపోతే ఏదో వెలితిగా ఉన్నట్టు ఉంటుంది. ఆ వెలితిని ఎలా పూడ్చుకోవాలో అర్థం కాదు. దానికి సమాధానమే, మనిషితనం. దానికి సమాధానంగా పుట్టినవే సిరివెన్నెల అందించిన ఆణిముత్యాలు. ప్రతి మనిషీ తనని తానే వెతుక్కుంటూ, తనవైపుకే ప్రయాణిస్తూ ఉంటాడు. అందుకే సిరివెన్నెల, ‘గమనమే నీ గమ్యమైతే.. బాటలోనే బ్రతుకు దొరుకు’, అంటారు. ఆ వెతుకులాటలో తనని తాను కనుగొన్న సీతారామశాస్త్రి, తన విజయాన్ని (మన విజయంగా మార్చి) పాటల రూపంలో మనతో పంచుకున్నారు. అందువల్లే ఆయన పాటలు మన అంతరంగాన్ని మనకే పరిచయం చేస్తాయి.అదే ఆయన విజయ రహస్యం!
“అయన కవిత్వమంతా ఒకటే – మనిషి – ఆయన ఇష్టదైవం శివుడైన మనిషి ఆయన చూసేది – చూపించేది పాడేది – పాడించేది – అంతా శివం.
అంటే మనిషితనం.
అందుకే అది అందరి పాట.. అందరి ఆలోచన.. అందరి ఆశ..
అందరిలా ఉన్న ‘ఒక్కడి’ సమగ్ర స్వరూపం సత్య దర్శనం.”- కీ.శే. చాగంటి శరత్ బాబు (పూర్ణత్వపు పొలిమేరలో..)
సిరివెన్నెలగారి మనిషితనం – సిద్ధాంతం ఎన్నో పాటల్లో చాలా బలంగా తన గళం విప్పింది. వాటిలో మచ్చుకు కొన్ని;
ఏ మార్గము ఏనాడు మరవదు ఈ మట్టితో తన చుట్టరికం – అమ్మమ్మ డాట్ కాం.
నీకు నాకు అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే నువ్వు నేను వారు వీరు అంతా కలిసి మనం ఒకటే – అటు అమెరికా ఇటు ఇండియా.
ప్రతి మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది, రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, తెప్ప తగులు పెట్టేస్తావా ఏరు దాటగానే – రుద్రవీణ.
ఏ మహిమలూ లేక, ఏమాయలూ లేక, నమ్మ శక్యము గాని ఏ మర్మమూ లేక, మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి, మహిత చరితగా మహిని మిగలగలిగే మనిషి – కృష్ణం వందే జగద్గురుం
ఆశలన్నీ మన సొంతం మన సొంతం లోకమంతా మన సొంతం ఈ సృష్టి మన సొంతం
గువ్వల్లో వేగాలు సొంతం, ఊహల్లో లోకాలు సొంతం, ఎగిరి వచ్చే ఉదయాలు సొంతం, ఎదిరించే శిఖరాల సొంతం – సొంతం.
మన సొంతం అంటూ వేరే ఏ బంధం లేదంటారు, మనమంతా మానవులమే ఆ బంధం చాలంటారు,
అనుకోవడంలోనే అంత ఉందని పెద్దలు అంటారు- తారక రాముడు
నీతో నువ్వు ప్రవహిస్తూనే, నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ, సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు, నువ్వు ఆగిన చోటే కాలం ఆగుతుంది అంటూ, లోకం చదివే నీ కథకిపుడే స్వీకారం చుట్టు- వేదం.
“సిరివెన్నెల గారు నిరంతరం ‘మనిషితనం’ అనే అంశం పైన పరిశోధన చేసిన శాస్త్రవేత్త అనీ, ఆ ఫలాన్ని కవనం రూపంలో మనకు సినిమా అంతర్జాలం మాధ్యమాల ద్వారా ప్రచురించారు లేదా వినిపించారు”, అని, పూర్ణత్వపు పొలిమేరలో అనే పుస్తకంలోని తన వ్యాసంలో డాక్టర్ కొండా వెంకట్ తన అభిప్రాయాన్ని అద్భుతంగా, అక్షరసత్యంలా, వెలిబుచ్చారు.
రంగేళి హోలీ హంగామా కేళి
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి రవ్వల రించోలి సిరి దివ్వెల దీవాలి
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితేగాని పండుగ రానందా సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా?
పండుగ అంటేనే పదిమందితో సంతోషాన్ని పంచుకోవడం. కక్షలూ, కార్పణ్యాలూ, ఈర్ష్యలూ అసూయలు అన్నీ మరిచిపోయి, నలుగురితో ఆనందంగా గడపడం. చిరునవ్వులతో దీపాలు వెలిగిస్తే వచ్చే పండుగ కోసం, ఏ పంచాంగం మనకు ముహూర్తం నిర్ణయించాలి? సంతోషంగా గడపే ఏరోజైనా పండుగే, అన్నది సిరివెన్నెల సిద్ధాంతం.
తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి ఇష్టపడే ఆ పూటే అలవాటైతే ప్రతిరోజు వసంతమవుతుంది
గడపలు అన్ని జరిపి ఆ గణపతి పండుగ జరిపి నిమజ్జనం కాని జనం జరిపే పయనం నిత్య భాద్రపదమవుతుంది
లోకులు చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే చూపులు దీపాలుగజేసే జాగరణే శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చె రోజొకటుండాలా చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగాలేదా
ఉగాది రోజు వేప ప్రసాదాన్ని ఎలా ఇష్టపడి తింటామో, అలాగే జీవితంలో వచ్చే కష్టాలను, ఒడిదుడుకులను ఆనందంగా స్వీకరించగలిగితే, ఆహ్వానించగలిగితే ప్రతిరోజు ఉగాదే అవుతుంది, ప్రతి మాసం వసంతమే అవుతుంది. నువ్వు – నేను అన్న తేడాలని చెరిపేసి, మనం అన్న భావానికి పెద్దపీట వేసి, గణపతి పండగ చేసుకుంటే ఆనందం వెల్లువవుతుంది. నిజానికి మనం ఇలాంటి పండుగలు జరుపుకుంటున్నప్పుడు నీవు – నేను మధ్య అంతరాలు ఎక్కువై, పంతాలకు పోయి, ఎన్నో ఎన్నో ఇబ్బందులకు అందర్నీ గురి చేస్తున్నాయి. ఎదుటివాడి కష్టం నాదే అనుకుని, వారి జీవితాల్లో కూడా ఎప్పుడెప్పుడు వెలుగులు వస్తాయా అని ఎదురుచూసే జాగరణే శివరాత్రి అవుతుందని, సిరివెన్నెల బలంగా ఉపదేశిస్తున్నారు. మొత్తం మీద, పండగలన్నిటి సారాంశం మానవులంతా ఒక్కటే! అని చాటి చెప్పడం. ప్రతివారిని తట్టి, తట్టి ఆ విషయంగా జాగృతం చేయడం! బంధువులు ఎక్కడో దూరం నుండి రెక్కలు కట్టుకొని వాలితేనే పండగ వస్తుందా? నీ చుట్టూ ఉన్న వారందరూ నీ వారే అనుకుంటే, ప్రతిరోజు పండుగ రాదా? అన్నది ఆయన ప్రశ్న/సమాధానం.
కన్నుల జోలపదాలై కొల్లల జానపదాలై నరుడికి గీత పథమై నడవడమంటే అర్థం కృష్ణ జయంతి
అందరి ఎండకు మనమే పందిరయ్యే లక్షణమే మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామ నవమయ్యింది
మనలో మనమే కలహించి మనలో మనిషిని తలతుంచి విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటైంది మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి
(గొబ్బియలో గొబ్బియలో,గొబ్బియలో గొబ్బియలో)
భగవద్గీతను అర్థం చేసుకోవడం అంటే, ఆత్మ పరమాత్మల అభేదాన్ని ఆకళింపు చేసుకోవడమే! ఆ మార్గమే మన గమ్యమైనప్పుడు, ఆ కృష్ణుడు మన మనసులో మళ్ళీ ఉదయించినట్టే కదా! అందరి ఎండకు, అంటే ఇతరుల కష్టాలకు, నేనున్నాను అని నీడనిచ్చే పందిరి లాగా మనిషి మారడమే శ్రీరామనవమి! ఎంత గొప్ప మానవతా దీపం, ఈ వాక్యం! అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి! ఇదే కదా సిరివెన్నెల గారు మనకందించిన సందేశం! మన అంతఃశత్రువులైన కామ క్రోధాది అరిషడ్వర్గాలతో మనమే యుద్ధం చేసి, మనలోని రాక్షసుడిని సంహరించి, మనిషిని మేల్కొల్పడమే విజయదశమి. అందరూ ఆనందంగా పంచే నవ్వులే భోగిమంటలై వెలుగుతుంటే, మన మనసుని ప్రశాంతంగా పెట్టుకుని, మదిలో మనం వేసే రంగవల్లులే సంక్రాంతి ముగ్గులు అవుతాయి. ప్రతి పదంలోనూ, వాక్యంలోనూ, సిరివెన్నెల మనకు చేస్తున్న మార్గదర్శనం, మనిషిగా ఒదుగు – మనిషిగా ఎదుగు!
ఒకటి రెండంటూ విడిగా లెక్కడితే తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వునువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే కోట్ల ఒక్కటై ఎవరి ముసుగులో వాళ్ళు ఉన్నామంతే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే! మనిషితనం ఒక్కటే!
జగమంత కుటుంబం నాది.. అన్న సిరివెన్నెలకు ఆచరణాత్మకంగా కూడా దాన్ని సుసాధ్యం చేసుకున్నారు. ప్రపంచం నలుమూలల్లోని తెలుగు వారంతా ఆయన కుటుంబంలో సభ్యులయ్యారు. పదాలు తేలికగా కనిపించే ఈ పాట మూడో చరణంలో ఎంతో భావ గాంభీర్యం ఉంది. సంఖ్యలు ఏ విధంగా విడివిడిగా లెక్కపెట్టినప్పుడు 9 మాత్రమే ఉంటాయి కానీ, కలుపుకుంటూ పోయినప్పుడు అవే అనంతమవుతాయి. ఎవరెంతకు వారు, నేను వేరు, నేను వేరు అని, ఎల్లలు గీసుకుని బ్రతికినప్పుడు ఒంటరిగానే ఉంటారు. మా దేశం, మా ఊరు అని పెదవులు పలుకుతున్నాయి కానీ, ఎల్లలు చెరపలేకపోతే, మానవులుగా కూడా మనం లెక్కించబడం! ఇన్ని కోట్ల మంది ఒక్కటై మనం అని నిర్ణయించుకున్నామంటే, మన సమస్య అందరిదవుతుంది, అందరి ఆనందం మనదవుతుంది.
మనిషి స్వార్థపరుడుగా మారడం మొదలు పెట్టినప్పటి నుండి, మనిషితనానికి దూరంగా జరుగుతూనే ఉన్నాడు. ఊర బావిని ఊరు ఎప్పుడో మర్చిపోయింది! ఊరిలో మన భాగం అని అనుకోవడం లేదు, మన మనసులో మానవత్వం అనే ఊటా లేదు! మనం అనే మాట మనసారా విని, యుగాలు గడిచిపోతోంది. ఇటీవలే ఒక ఆధ్యాత్మిక గురువు తన ప్రవచనంలో సెలవిచ్చినట్టు, కంప్యూటర్లో అన్ని విండోలు ఓపెన్ చేశాక, విషయం గందరగోళంగా మారి, ఒక కొలిక్కి రాకపోతే, మనం home బటన్ నొక్కేసి, వెనక్కి వచ్చేస్తాం. అదేవిధంగా మనం కూడా మనిషితనం అనే హోం బటన్ నొక్కేసి, మన సహజ స్వభావంలోకి వెళ్ళిపోతే, ప్రపంచం క్షణాల్లో స్వర్గంగా మారిపోతుంది! కలియుగమే సత్యయుగం అవుతుంది! ఇది సత్యం! ఇది తథ్యం!
మానవత్వం పరిమళిస్తే, మానవుడే మహాత్ముడు అవుతాడు. ఎదుటి వాడి బాధలో తన బాధను, ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కోగలుగుతాడు. ఈ భావ సారూప్యతే Empathy. ఇదే వసుధైక కుటుంబం, ఇదే ప్రపంచీకరణ, ఇదే universality.
“ఇస్మాయిల్‌ను చెట్టుకవి అన్నట్టు ఆత్రేయను మనసుకవి అన్నట్టుగా, మనిషితనాన్ని శోధించడానికి పాటల్లో సైతం నిరంతరం ప్రయత్నించిన సిరివెన్నెలను మనిషికవి అనడం సమంజసంగా ఉంటుంది. ఆ మాట ఆయనతో చెబితే ఆమోదం ముద్ర వేశారు” – డాక్టర్ పైడిపాల (సిరివెన్నెల రసవాహిని).
సిరివెన్నెల గారి స్ఫూర్తిని అంది పుచ్చుకుని, ఆయన ఆశయాలకు ఊపిరి పోస్తే, మనం ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్టే! మనిషితనానికి ఆహ్వానం పలుకుదాం, మనిషి కవికి జేజేలు పలుకుదాం.
Images Source: Internet