Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 49 – కొత్త ఆలోచనల పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

సిరివెన్నెల సాహితీ కుటుంబ సభ్యులకు ఒక విన్నపం…నేను సిరివెన్నెల సాహిత్యానికి ఒక వీరాభిమానిని. 49 వారాలుగా, ‘సంచిక’ లో ‘సిరివెన్నెల పాట – నా మాట’ శీర్షికన పాటల తులనాత్మక విశ్లేషణ చేస్తున్నాను. ’50వ వ్యాసం కోసం సీతారామశాస్త్రి గారి అభిమానుల కవితలు/ ఆయన పై వ్రాసిన పాటలను సేకరించి, 50వ ఎపిసోడ్ ను ప్రత్యేక ఆకర్షణగా నిలపాలని ఉంది. వచ్చే గురువారం లోగా, ఆసక్తి కలిగిన వారు మీ మనసులోని భావాలకు అక్షర రూపం ఇస్తూ, 9441324587 నెంబర్ కు ‘సిరివెన్నెల పాట నా మాట’ శీర్షికతో మీ కవితలను పంపవలసిందిగా కోరుతున్నాను. మీ కవితలతో పాటుగా మూడు నాలుగు లైన్ల చిరు పరిచయం కూడా, (ఇష్టమైతే ఫోన్ నెంబర్ తో సహా) పంపగలరు. కవితల ఎంపికలో సంపాదక వర్గానిదే తుది నిర్ణయం.. శ్రీవాణీశర్మ.

అమ్మైనా నాన్నైనా

~

చిత్రం: సింహాద్రి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల

గానం: కళ్యాణి మాలిక్.

~

పాట సాహిత్యం

గిరినీ మే గలగాల గిర తీతి బైమారె బియ్యాన దెకదెకో జురతీతి బైమా …

పల్లవి:
అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పై నుంచి ఈ వాన ఇట్టా దూకేనా చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా సయ్యాట సాగేనా ఎగసే కెరటాన అమ్మ నాన్న ఉంటే అమ్మో మహఇబ్బందే కాప్టైనా అల్లరి చేసే వీల్లేదే ॥ అమ్మైనా నాన్నైనా ॥

చరణం:
సూరీడికి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే
పగలైనా వెలుతురు వస్తుందా
జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే రాతిరేళ వెన్నెల కాస్తుందా
నిను చేరేనా నా లాలన ఏనాటికైనా ఓ పసికూనా ఆడిందే ఆటంట పాడిందే పాటంట
ఆపేందుకు అమ్మ నాన్న లేరంట
సరదాగా రోజంతా తిరిగేనా ఊరంతా ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మ
అలుపంటూ లేకుండా చెలరేగి ఉరికేనా ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్న

చరణం:
అలిగిందా రాచిలక కూర్చుందా కిమ్మనక
నాతో మాటాడేదెవరింక
రానందా నావంక దాగుందా కొమ్మెనక
అమ్మో మరి నాకేం దారింక
ఏదీ ఏదీ రానీ రానీ నన్నేరుకోనీ ముత్యాలన్నీ
ఈ నవ్వే చాలంట పులకించే నేలంతా పున్నాగ పువ్వుల తోటయ్యేనంట
దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి ఆనందం అంచులు నేడే చూడాలి

Innocence is beauty and innocence is bliss, because in innocence lies purity.

పసిపిల్లల్ని చూసినా, ప్రకృతిని చూసినా మన మనసంతా ఆనందంతో నిండిపోతుంది. మనం ఎంత చిరాకులో ఉన్నా, మనసు తేలిక పడిపోతుంది. ఎందుకని? పిల్లల నవ్వులు మన మనసుల్ని హాయితో నింపేస్తాయి. దానికి కారణం వారిలోని స్వచ్ఛత, ఇంకా అమాయకత్వం. వారి నవ్వే కాదు, వారి అలక, మారాము కూడా ముచ్చటగానే ఉంటాయి. పిల్లలు ఎదిగే క్రమంలో పిల్లలు పేచీలు పెట్టడం, మారాం చేయడం, తిక్క పెట్టడం అనేవి సర్వసాధారణంగా జరిగేవే. ఒక్కోసారి వాటికి అంతం లేదా అని కూడా అనిపిస్తూంటుంది. కాని అవి ఎక్కువ కాలం ఉండవు. ఏడవడం ద్వారానే పిల్లలు వారికి కావాల్సినవి కానీ, అశోకంగా ఉన్న విషయాలను కానీ తెలియజేస్తారు.

సాధారణంగా పిల్లలు వారి కోపాన్ని, తమకు అనుకూలంగా ఏదైనా జరగలేదన్న నిరాశను వ్యక్తీకరించడానికి ఎంచుకొనే మార్గం మారాం చేయటం. వారు తమ భావాలను మాటల ద్వారా వ్యక్తం చేయలేరు.

ఇదే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, మానసిక స్వస్థత లేని వారు కూడా. ఇటు పిల్లలు కానీ, అటు మానసిక స్వస్థత లేని (mentally disturbed) వారు కానీ, తమ ప్రపంచంలో తాము ఉంటూ, ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా, తమకు ఏది కావాలో అది పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

‘సింహాద్రి’ చిత్రంలో మతి స్థిమితం తప్పిన నాయిక భూమిక, అమ్మ, నాన్న కావాలని పేచీ పెడుతుంది. ఆ అమ్మాయిని ఎంతో జాగ్రత్తగా చూసుకునే స్నేహితుడుగా, సింహాద్రి (ఎన్టీఆర్) ఆ అమ్మాయిని ఓదార్చే సందర్భంలో ఈ పాట రాయాల్సి వచ్చింది.

ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తే, అది తినడం మంచిది కాదని ఓదార్చవచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్లమని మారాం చేస్తే, కొంత సమయం తరువాత తీసుకెళ్తామని ఒప్పించవచ్చు. కానీ, అమ్మానాన్నలను తెచ్చి ఇవ్వలేనప్పుడు, ఏమని ఓదార్చాలి? అమ్మానాన్న అవసరం లేదులే! అని ఎలా చెప్పాలి? ఈ కథా నేపథ్యానికి పాట వ్రాయడం ఎంత కష్టమైన పరిశ్రమ! ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులకు కూడా, తన సహజమైన out of box భావనల ద్వారా, అందరికీ convincing గా పాట వ్రాయడం, అది hit song గా మారడం, గొప్పగా ప్రజాదరణ పొందడం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సిరివెన్నెల కలానికే సాధ్యం.

డాక్టర్ కొండ వెంకట్ చెప్పినట్టు context కి తగిన raw material తీసుకొని, దానిపై research చేసి, తనదైన philosophy ని, దాని ద్వారా మనకి చేరవేయడం, ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

ఇక పాట విశ్లేషణలోకి వెళ్దాం. ఈ పాటలో నిజానికి వివరించాల్సిన అవసరం ఏమాత్రం లేని భాష ఉంది. కానీ, అలాంటి సందర్భానికి పాటను సృష్టించిన సిరివెన్నెల ఆలోచన తరంగాలను మీ వరకు చేర్చడమే నా ప్రయత్నం.

పల్లవి:
అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పై నుంచి ఈ వాన ఇట్టా దూకేనా
చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా సయ్యాట సాగేనా ఎగసే కెరటాన
అమ్మ నాన్న ఉంటే అమ్మో మహఇబ్బందే కాస్తైనా అల్లరి చేసే వీల్లేదే ॥ అమ్మైనా నాన్నైనా ॥

అమ్మ నాన్న కావాలని మారం చేసే నాయికను, logical గా convince చేసే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు హీరో. Watched Pot Never Boils అన్నట్టు, ఒకరి అదుపాజ్ఞలలో సాగే ఏ విషయానికైనా, అనుకున్నంత స్వేచ్ఛ లభించదు, అన్న సారాంశం మనకు పల్లవిలో ప్రకటిస్తారు సిరివెన్నెల. మళ్లీ తనదైన బాణీలో లేకుండా పైనుండి దూకే వర్షాన్ని, అడ్డే లేకుండా ఎగసిపడే కెరటాలను ఉదాహరణలుగా తీసుకొని, వాటికి అమ్మానాన్న లేరు కాబట్టి, అదుపు చేయడం లేదు కాబట్టి, అంత స్వేచ్ఛగా ఉన్నాయి, అని ఆమెను ఒప్పిస్తాడు. అమ్మానాన్న ఉంటే కాస్త కూడా అల్లరి చేయడానికి వీలు లేదు కాబట్టి వారు లేకపోవడం మంచిదేలే! అన్న భావం వచ్చేలాగా, ఒక ఆలోచన, ఎంత కొత్తగానో అనిపిస్తుంది!

చరణం:
సూరీడికి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే
పగలైనా వెలుతురు వస్తుందా
జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే రాతిరేళ వెన్నెల కాస్తుందా
నిను చేరేనా నా లాలన ఏనాటికైనా ఓ పసికూనా ఆడిందే ఆటంట పాడిందే పాటంట
ఆపేందుకు అమ్మ నాన్న లేరంట
సరదాగా రోజంతా తిరిగేనా ఊరంతా ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మ
అలుపంటూ లేకుండా చెలరేగి ఉరికేనా ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్న

Order is the Law of Heavens.. ఒక నిర్ణీతమైన కక్ష్యలో, నిర్ణీతమైన పరిధిలో, కేటాయించబడిన ధర్మాలను పాటిస్తూ ముందుకు వెళుతుంది విశ్వంలోని ప్రతి అణువు. కానీ అంత గొప్పUniversal Law, Universal Fact ని, సరదాగా సూర్యుడికి నాన్న ఉంటే, స్కూల్లో చేర్పిస్తే, మనకి సూర్యుడు ఎలా వస్తాడు? చంద్రుడికి అమ్మ ఉంటే, రాత్రిపూట జోకొట్టి పడుకోబెడితే, మనకి వెన్నెల ఎక్కడ నుండి వస్తుంది? ఊరంతా బలాదూరుగా తిరిగే చిరుగాలికి, అమ్మ నాన్న ఉంటే పరిస్థితి ఏంటి?

సెలయేటిని ఎవరైనా అదుపు చేస్తే పరిస్థితి ఏంటి?

అని చిన్న పిల్లలకు వివరించినట్టు వివరిస్తూ, (ఆమె అప్పటి మనస్తత్వానికి సరిపోయేటట్లు), శ్రోతలకి కూడా ఎన్నో విజ్ఞాన రహస్యాలను విప్పి చెప్పారు సిరివెన్నెల.

అలిగిందా రాచిలక కూర్చుందా కిమ్మనక
నాతో మాటాడేదెవరింక
రానందా నావంక దాగుందా కొమ్మెనక
అమ్మో మరి నాకేం దారింక
ఏదీ ఏదీ రానీ రానీ నన్నేరుకోనీ ముత్యాలన్నీ
ఈ నవ్వే చాలంట పులకించే నేలంతా పున్నాగ పువ్వుల తోటయ్యేనంట
దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి ఆనందం అంచులు నేడే చూడాలి..

ఈ రకంగా అమ్మాయిని ఆలోచింప చేసి, నువ్వు నా మీద అలిగితే ఎలా, చెట్టు వెనుక దాక్కుంటే ఎలా, అని ప్రశ్నిస్తాడు సింహాద్రి. అతని మాటలకు చేష్టలకు, కిలకిలా నవ్వుతుంది కథానాయకి. ఆమె నవ్వులోని ముత్యాలన్నీ ఏరుకుని, తను ఆనందిస్తానంటాడు నాయకుడు. అలుపెరుగని ఆనందాన్ని పొందాలని, అది చుక్కల్ని తాకి ఆనంద మనుషులు చూడాలని, తన ఆకాంక్షను తెలియజేస్తాడు, సింహాద్రి.

ఇంత క్లిష్టమైన అంశాన్ని ఒక పాటలోకి పొందుపరచడం అనితర సాధ్యమైన విషయమే! అమ్మానాన్న అవసరం ఏముందిలే, అని చెప్పడం illogical అవుతుంది. ఒకవేళ అమ్మ నాన్న లేకపోతే, రాకపోతే.. ఎంత స్వేచ్ఛగా ఉండొచ్చో!

అన్న ఒక చిన్న ఆశని మనసులో రేపి, అని ప్రకృతి సోదాహరణలతో వివరిస్తూ, విమర్శకులకు ఏమాత్రం దారి ఇవ్వకుండా, ఆ కాన్సెప్ట్‌కి న్యాయం చేయడం, అందరి చేత, భేష్ అనిపించుకోవడం సిరివెన్నెల జాణతనం! Hats off to you సిరివెన్నెల కవనమా!

Images Source: Internet

Exit mobile version