Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 52 – కల్పనా జగత్తులో ఓలలాడించే పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

గుండె చాటుగా.. ఇన్ని నాళ్ళుగా

~

చిత్రం: క్లాస్‌మేట్స్

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: కోటి

గాత్రం : హేమచంద్ర, చిత్ర

~

పాట సాహిత్యం

పల్లవి:
గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ
నిన్ను కలుసుకోనీ నిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ ఇన్నాళ్ళ ఊసులన్నీ ॥ గుండె చాటుగా ॥

చరణం:
నీలిమబ్బులో నిలిచిపోకలా
నీలిమబ్బులో నిలిచిపోకలా నింగి రాగమాల
మేలిముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేల? కొమ్మ కొమ్మలో పూలుగా, దివిలోని వర్ణాలు వాలగా@2
ఇలకు రమ్మని చినుకు చెమ్మని చెలిమి కోరుకోనీ,
నిన్ను కలుసుకోనీ ॥ గుండె చాటుగా ॥

చరణం:
రేయి దాటని రాణివాసమా
రేయి దాటని రాణివాసమా అందరాని తార
నన్ను చేరగా దారి చూపనా రెండు చేతులారా చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగా@2
తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ నిన్ను కలుసుకోనీ ॥ గుండె చాటుగా ॥

Love is the greatest of all emotions, a passion more meaningful than any other, and the most valuable human experience in our lifetimes.

‘ప్రేమల భాషలు లేఖల నింపగ, నేర్పే కావాలి కోరిన తీరం చేరాలంటే, ఓర్పే కావాలి..’ అని, నేను ఒక గజల్లో వ్రాసుకున్నాను. ‘ప్రేమ’ అనే అనిర్వచనీయమైన భావాన్ని, భాషలో వ్యక్తీకరించడమే చాలా కష్టమైన పని. ఆ ప్రేమను, స్వయంగా కానీ, లేఖల ద్వారా కానీ, రాయబారుల ద్వారా కానీ, ఎదుటివారికి తెలియజేయడం మరింత ఇబ్బందికరమైన పని. సూర్యుడు పుడమి ప్రేయసికి వ్రాసే ప్రేమలేఖ.. చిరుజల్లు అయితే, చంద్రుడు అడవి కన్నెకు వ్రాసే ప్రేమలేఖ, పండు వెన్నెల.. ఇలకు గగనానికి మధ్య ఉన్న ప్రేమను తెలపడానికి రాయబారులు, వర్షము.. వెన్నెల. మన మనుగడలో కూడా జీవితంలో చాలాసార్లు మధ్యవర్తుల లేదా అవసరం ఉంటుంది.

రెండు రాజ్యాల, లేదా దేశాల మధ్య గొడవలను, యుద్ధాలను ఆపడానికి ఒక్క దౌత్యంతో సాధ్యమవుతుంది. దౌత్యంతో రాయబారాలు నిర్వహించేవారు ఉన్నపుడు ఎంతటి పెద్ద సమస్యకు అయినా సమాధానం దొరుకుతుంది. గద్దలు, రాబందులు, పావురాలు రామచిలకలు.. మొదట్లో మంచి courier డ్యూటీలు చేసేవి. పురాణాలలో కూడా మనకు రాయబారులు కనిపిస్తారు. భారతంలో శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారంగా వెళ్లాడు. అలాగే రామాయణంలో చూస్తే హనుమంతుడు లంకకు వెళ్లి రాయబారం నడిపాడు. ఇప్పుడైతే ప్రతి రంగంలోనూ అతి పెద్ద దౌత్య వ్యవస్థలు ఏర్పడ్డాయనుకోండి!

కానీ ప్రేమికుల మధ్య పక్షులు, జంతువులు, ప్రకృతి, రాయబారులుగా ఉండడం ఎక్కువగా గమనించవచ్చు. మహాకవి కాళిదాసు ‘మేఘసందేశం’ ద్వారా, జాషువా కవి ‘గబ్బిలము’ ద్వారా తమ రాయబారాలు నడిపారు. అలాగే శ్రీనాథుడు రచించిన శృంగార నైషధంలో నల-దమయంతుల మధ్య రాయబారం నెరపినది దివ్యలోకపు పక్షి అయిన హంస.

శ్రీనాథుడు తన శృంగార నైషధంలో చక్కగా హంస దౌత్యం చేశాడు. నలునికి-దమయంతీకీ మధ్య హంస రాయబారం నిర్వహించి, వారి ప్రేమకు ఎంతో కృషిచేసిందని చక్కటి వర్ణనతో రచించాడు. ఇంతకూ, ఈ హంస ఉపోద్ఘాతం ఏంటంటే, మన సినీ కవులు కూడా హంసలేఖలను తమ సాహిత్యంలో పొందుపరిచి, హంస రాయబారాన్ని మనకు గుర్తు చేస్తున్నారు.

ముత్యమంత ముద్దు చిత్రం కోసం, కొండవీటి దొంగ చిత్రం కోసం.. వేటూరి సుందర రామమూర్తి గారు వ్రాసిన పాటలలో మనకు హంస ద్వారా పంపే హంసలేఖల ప్రస్తావన కనిపిస్తుంది.

~

కొండవీటి దొంగ

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో అది నీకు పంపుకున్నా అపుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో..

……..

హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి

ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో..

~

ముత్యమంత ముద్దు..

‘ప్రేమలేఖ రాశా నీకంది ఉంటదీ, పూల బాణమేశా.. ఎదకంది ఉంటదీ,

నీటి వెన్నెలా.. వేడెక్కుతున్నదీ

పిల్ల గాలికే.. పిచ్చెక్కుతున్నదీ

మాఘమాసమా.. వేడెక్కుతున్నదీ

మల్లె గాలికే.. వెర్రెక్కుతున్నదీ

వస్తే.. గిస్తే.. వలచీ.. వందనాలు చేసుకుంట!

…………….

హంసలేఖ పంపా నీకంది ఉంటదీ

పూలపక్క వేశా అది వేచి ఉంటదీ..’

~

ఇక ఈరోజు, గుండె చాటుగా, ఇన్నిన్నాళ్ళుగా.. అనే పాట సాహిత్యమనే ఊహలసంద్రంలోకి, భావాల పడవనెక్కి, రసానందకరమైన ప్రయాణాన్ని చేసేద్దాం రండి! ఈ పాటలో ఒక ప్రేమికుడు తన ప్రేమను వ్యక్తపరిచే అందమైన భావగీతం ఉంటుంది. ఆ పాటలోకి వెళ్లేముందు, The World’s Greatest Letters లో ఒకటైన, Mary Shelley, P.B. Shelley కి వ్రాసిన ఒక లేఖను చూద్దాం. లేఖ ద్వారా ప్రేమని వ్యక్తీకరించిన విధానాన్ని గమనిద్దాం.

‘I would describe one of those moments, when the senses are exactly tuned by the rising tenderness of the heart, and according reason entices you to live in the present moment.- It is not rapture. It is a sublime tranquility. I have felt it in your arm Hush! Let not the light see, I was going to say hear it – These confessions should only be uttered – you know where, when the curtains are up and all the world shut out.’

పల్లవి:
గుండె చాటుగా, ఇన్నినాళ్ళుగా, ఉన్న ఊహలన్నీ ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ
నిన్ను కలుసుకోనీ నిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ ఇన్నాళ్ళ ఊసులన్నీ ॥ గుండె చాటుగా ॥

ఎంతో reserved గా, తన భావాలు తనలోనే దాచుకుంటూ, వాటికి కవితలలో అక్షర రూపం ఇస్తూ ఉండే కథానాయిక వ్రాసిన ఒక అందమైన కవితను, హీరో పాడినట్టుగా చూపించే సన్నివేశంలోది మన పాట. ఎంతో కాలంగా మనసులో దాచుకున్న ఊహలు, భావాలు, ఇష్టాలు, హంసలేఖల్లాగా ఎగిరిపోయి, తన ఊసులన్నీ తన ప్రేమికురాలికి చేరాలన్న ఆశ, ఆకాంక్ష మనకు పల్లవిలో కనిపిస్తుంది. ఇన్నాళ్లుగా మనసులో బంధింపబడిన ఊహలకు రెక్కలు వచ్చి ఎగరాలన్న, ఒక passionate desire అది. మన మనసులో భావాలు, ఎదుటివారి మనసును చేరినప్పుడు, కలిగే ఆనందం అవధులు లేనిది. ఇక మన సిరివెన్నెల గారైతే, దానికి మరింత వేగాన్ని జోడించి.. ఇన్నాళ్ళ ఊసులు.. ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్లి పోనీ.. అంటారు.

ఎంతో దివ్యత్వం ఆపాదించబడిన హంస, క్షీర – నీరాలను వేరు చేయగల హంస, సరస్వతి దేవికి వాహనమైన హంస, బ్రహ్మ లోకంలో సంచరించే దివ్యమైన హంస.. నలుడి దగ్గర దమయంతి గురించి, దమయంతి దగ్గర నలుని గురించి చెప్పవలసిన అతి ముఖ్యమైన, అత్యంత విలువైన సమాచారాన్ని చేరవేసి, ఆ జంటని ఏకం చేసినట్టు.. నిజంగా ప్రేమికుల మధ్య రాయబారాన్ని నడిపితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! అన్న అనుభూతిని పల్లవి ద్వారా సిరివెన్నెల మనకు అందిస్తున్నారు.

Emily Dickinson.. వ్రాసిన That I Did Always Love అనే కవితలోని బెస్ట్ పార్ట్ ఒకసారి చూద్దాం..

I argue thee

That love is life–

And life hath Immortality–

డిక్సన్ చెప్పినట్టు,‌ ప్రేమే జీవితం, ఆ నిజమైన ప్రేమను పొందిన జీవితమే శాశ్వతం.

చరణం:
నీలిమబ్బులో నిలిచిపోకలా
నీలిమబ్బులో నిలిచిపోకలా నింగి రాగమాల
మేలిముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేల? కొమ్మ కొమ్మలో పూలుగా, దివిలోని వర్ణాలు వాలగా@2
ఇలకు రమ్మని చినుకు చెమ్మని చెలిమి కోరుకోనీ,
నిన్ను కలుసుకోనీ ॥ గుండె చాటుగా ॥

తన ప్రేమను ఘనీభవించుకున్న మేఘం లాగా, నీలిమబ్బులాగా నింగిలోనే దాగిపోవద్దని, ప్రియుడు తన ప్రియురాలిని హెచ్చరిస్తున్నాడు. తళుకులీనే మెరుపుతీగ గగనంలో మెరిసినప్పుడే అందరి మనసు ఆనందంతో నిండిపోతుంది. ఆ మెరుపు తీగ మేలి ముసుగు వేసుకొని, మబ్బు వెనుక దాక్కుంటే లాభమేంటి? ఆ అందం ఎవరు చూడగలరు? ఆ అనుభూతి ఎవరు పొందగలరు? అందుకే ఆ రాగమాలను ఇలకు చేరుకొమ్మని ప్రియుడు అభ్యర్థిస్తున్నాడు. ఎంత అందంగా ఆహ్వానం పలుకుతున్నాడంటే, దివిలోని అందాలన్నీ రంగురంగుల పూలుగా కొమ్మల పైన అమరి ఉన్నాయట. ఆ వర్ణ శోభితమైన పూబాలలు చినుకుతో చెలిమి కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నాయట! ఆ పూల వంటి మనసుతో, చినుకు వంటి ప్రియురాలి స్నేహాన్ని తాను కోరుకుంటున్నాననీ, ఆమెను కలుసుకోవాలనుకుంటున్నాననీ, తన తపనను ఆ పాట ద్వారా తెలియజేస్తున్నాడు హీరో.

కానీ మనకు ఈ చరణంలో మనసుకు హత్తుకునే మరొక, అతి సున్నితమైన expression ఏంటంటే, “చినుకు చెమ్మని చెలిమి కోరుకొనీ”.. అంటే, ఒక చినుకు రూపంలో కాకున్నా, ఒక చిన్న మంచు బిందువు ఇచ్చే, చెమ్మ అంత స్నేహాన్నయినా తనకు అందించమని, ఒక ప్రేమికుడు కోరుకోవడం! ఇది మనల్ని ఎంతో ఊహాతీతమైన జగత్తులోకి తీసుకొని వెళుతుంది.

చరణం:
రేయి దాటని రాణివాసమా
రేయి దాటని రాణివాసమా అందరాని తార
నన్ను చేరగా దారి చూపనా రెండు చేతులారా చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగా@2
తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ నిన్ను కలుసుకోనీ ॥ గుండె చాటుగా ॥

I was once told that humans are made of stardust which is to say that there is a chance, that the lovers, those who are our soulmates, are just smaller pieces of the same star, అంటారు ఒక ఆంగ్ల కవి.

రెండవ చరణంలో, ప్రేమికుల మధ్య చేరలేని దూరాన్ని, అది కలిగించే మనోవ్యథను చిత్రీకరిస్తారు సిరివెన్నెల. రేయిలో మాత్రమే కనిపించే అందమైన తార లాంటి ప్రియురాలు, తనకి అందకుండా ఉందని, రేయి అనే రాణివాసంలోనే ఉండిపోతోందని, మనస్ఫూర్తిగా తన హృదయంలోకి ఆహ్వానం పంపుతున్నానని, తను నువ్వు చేరుకోమనీ విన్నవిస్తాడు ప్రియుడు. తన పెదవి పైన ఒక మలగని చిరునవ్వు లాగా ఆమెను ఉండిపొమ్మని కోరుకుంటాడు. దివి నుండి ఆమెను భువికి తరలి రమ్మని, ఆనందపు తళుకులను తనకు అందించమని, తన ఆకాంక్షను తెలియజేస్తున్నాడు. ఇదే భావాన్ని మనం ఒక చిన్న ఆంగ్ల కవితలో చూద్దాం.

A tapestry of stars, woven with light,

Each twinkle, a promise, a whisper of

fate,

In the cosmos of love, our hearts navigate..

ఒక surrealistic poetry తో, మన ఊహకి అందనంత స్థాయిలో కవిత్వీకరించడం, శ్రోతల మనసుల్లో ఆ భావ చిత్రాలను గీయడం, సిరివెన్నెల అలవోకగా చేసే ఒక పని. ఎంత ఉధృతమైన భావాలను సిరివెన్నెల కలం పలికించగలదో, అంతే సున్నితమైన, మృదు మధురమైన భావాలను కూడా అదే స్థాయిలో పలికించి.. మనల్ని ఒక కల్పనా జగత్తులో ఓలలాడించగలదు!

Images Source: Internet

Exit mobile version