[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
గోదారి రేవులోన..
~
చిత్రం: రుక్మిణి
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: విద్యాసాగర్
గానం: సుజాత
~
పాట సాహిత్యం
పల్లవి:
గోదారి రేవులోన రాదారి నావలోన నామాటే చెప్పుకుంటు ఉంటారంట
నానోట చెప్పుకుంటే బాగోదో ఏమో గాని నాలాంటి అందగత్తె నేనేనంట
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ పున్నాలు పూయునంట
కన్నుల్లో కాసింత కోపమొస్తె ఊరంత ఉప్పెనొచ్చి ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట ॥గోదారి॥
చరణం:
పాట అంటే నాదేగాని కోయిలమ్మదా – ఒట్టి కారుకూతలే
ఆట అంటే నాదే కాని లేడిపిల్లదా – పిచ్చి కుప్పిగంతులే
పొలాల వెంట చెంగుమంటు సాగుతూ పదాలు పాడితే
జిగేలుమంటు కళ్ళు చెదిరి ఆగవా జులాయి గాలులే ఏ చిన్నమచ్చలేని నా వన్నెచిన్నె చూసి చంద్రుడే సిగ్గుతో మబ్బుచాటు చేరుకోడ ॥గోదారి॥
చరణం:
నాకు పెళ్ళి ఈడు వచ్చి పెద్దవాళ్ళకి ఎంత చిక్కు తెచ్చెనే
రాకుమారి లాంటి నాకు జోడు వెతకడం వాళ్ళకెంత కష్టమే
ఫలాని దాని మొగుడు గొప్పవాడని అనాలి అందరూ అలాని నాకు ఎదురు చెప్పకూడదే మహానుభావుడు నాకు తగ్గ చక్కనోడు నేను మెచ్చు ఆ మగాడు ఇప్పుడే ఎక్కడో తపస్సు చేస్తూవుంటాడు ॥గోదారి॥
♠
సొగసు కీల్జడ దాన సోగ కన్నుల దాన వజ్రాల వంటి పల్వరుస దాన
బంగారు జిగి దాన బటువు గుబ్బల దాన నయమైన యొయ్యారి నడల దాన
తోరంపు గటి దాన తొడల నిగ్గుల దాన పిడికిట నడగు నెన్నడుము దాన
తళుకు జెక్కుల దాన బెళుకు ముక్కర దాన పింగాణి కనుబొమ చెలువు దాన
మేలిమి పసిండి రవ కడియాల దాన
మించి పోనేల రత్నాల మించు దాన
తిరిగిచూడవె ముత్యాల సరుల దాన
చేరి మాటాడు చెంగావి చీర దాన..
అంటూ ఎన్ని హొయలను, ఎన్నెన్ని సొగసు, సోయగాలను ఆయా కాంతల మేనికాంతులలో సందర్శించాడో, ఎంత విస్తృతంగా పర్యటిస్తూ ఎన్ని అందాలను తనివితీరా ఆస్వాదించాడో.. అన్ని ఒంపుసొంపులను, తళుకుబెళుకులను తన పద్యాల నడకలలోనూ నడిపించి చూపాడు శ్రీనాథ కవి సార్వభౌముడు. స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడంలో అందె వేసిన చేయి ఈయనది. అసలు స్త్రీల అందాలని వర్ణించని కవులెవరైనా ఉన్నారా? అది ఎంత గొప్ప కవితా వస్తువు!
స్త్రీల శరీర నిర్మాణం మాత్రమే కాక, నవ్వులో, అలకలో, అమాయకత్వంలో, కోపంలో, ప్రేమలో, క్రీగంటి చూపులో.. ప్రతి చర్య ప్రతి చర్యల్లో వయ్యారం తొనిగిసలాడుతుంది. బాల్యం నుండి, యవ్వన దశలో, తల్లి అయినప్పుడు, ప్రౌఢగా ఉన్నప్పుడు.. ఇలా ప్రతి దశలోనూ.. కొన్ని విశిష్టమైన అందాలను, సంతరించుకొని ఉంటుంది స్త్రీ. తరచి తరచి చూస్తే స్త్రీల ప్రతీ కదలికా మనకేదో కవిత్వం చెప్తున్నట్లు ఉంటుంది. అందుకేనేమో మన పూర్వీకులు అంత గొప్పగా వర్ణనలు చేసేసి, స్త్రీ సౌందర్యం గురించి లెక్క లేదని కావ్యాలు వ్రాసేశారు!
ఈ లోకంలో ఎన్ని గొప్ప సౌందర్యాలు ఉన్నాయి, అని ఆలోచిస్తే.. వెతికే ఓపికా, ఆస్వాదించి స్పందించే మనసూ ఉండాలే కాని ఈ లోకంలో ప్రతీదీ సౌందర్యమే.. సౌందర్యం గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలంటే ఈ లోకంలో ముఖ్యంగా కనపడేవి రెండే సౌందర్యాలు.
- అనంతమైన ప్రకృతికి సంబంధించిన సౌందర్యం..
- ప్రకృతికే అందాన్ని కూర్చే- స్త్రీత్వానికి సంబంధించిన సౌందర్యం..
చెట్లు, చేమలు, వాగులు, వంకలు, జలపాతాలు, కొండలు – లోయలు, తెలిమంచు విడివడే సూర్యోదయాలు, వికసించే పుష్పాలు, పలుకరించే పచ్చని పైర్లు, మేనికి హాయినిచ్చే పిల్ల తెమ్మెరలు, అల్ల నల్లన వీచే చల్లగాలులు, సాయం సందెలు, ఆరు ఋతువులు, కీటకాలు, పక్షులు, జంతువులు, ఇసుక తిన్నెలు, ఎగసిపడే అలలు..
వేటి సౌందర్యం మనల్ని అబ్బురపరచదు?
కాబట్టి కవులకు కళాకారులకు, ప్రధానమైన ప్రేరణ, ప్రకృతి లేదా స్త్రీ.
Women are like flowers, soft and fair, elegant in every way, each one unique, a work of art, nature’s beauty on display అంటాడు ఒక ఆంగ్ల కవి.
Sonnet 130 లో తన Mistress ని ఈ విధంగా ప్రశంసిస్తాడు William Shakespeare..
My mistress’ eyes are nothing like the sun;
Coral is far more red, than her lips red:
If snow be white, why then her breasts are dun;
If hairs be wires, black wires grow on her head..
సరే! ఇక విషయంలోకి వచ్చేస్తే, సినీ గీతాల్లో స్త్రీ సౌందర్య వర్ణన.. నాకు తెలిసినంతలో60 నుండి 70 శాతం పాటల్ని నింపేసి ఉండవచ్చు. అటు ప్రియురాలు కానీ, ఇటు భార్య కానీ.. అందాలకు హారతులు పట్టడమే.. పురుష పుంగవుల బాధ్యత అన్నట్టు, ఉంటుందది. సిరివెన్నెల గారు ‘దేవయాని’ చిత్రం కోసం వ్రాసిన ఈ పాటను గమనిస్తే, దేవయాని తన అందాలకు తనే కితాబిచ్చుకుంటూ ఉంటుంది.
పూల కన్నెలా లేక పాల వెన్నెలా, వాన విల్లులా కాక తేనె జల్లులా
ఈ భువిలో మరి ఆ దివిలో నను పోలిన అందములేవి మరి? అని ప్రశ్నిస్తుంది.
నాకున్నన్ని హొయలు హంసలకు ఉన్నాయా, నా కళ్ళ కన్నా చేపలు అందంగా ఉంటాయా, పరుగెత్తే వాగుకు నాకున్నన్ని ఒంపుసొంపులు ఉన్నాయా, నా అందం ముందు నెమలి తలదించుకుని పోవాల్సిందే కదా.. అని తన అందాలకు తానే నీరాజనాలు ఇచ్చుకుంటూ మురిసిపోతుంది దేవయాని.
‘రుక్మిణి’ చిత్రంలో కూడా, దాదాపు ఇలాంటి సందర్భానికి పాట వ్రాయాల్సి వచ్చినప్పుడు.. సిరివెన్నెల ఎంత ముచ్చటగా ఆ భావాన్ని తన పాటలో కూర్చి, మనకు అందించారో గమనించండి.
గోదారి రేవులోన రాదారి నావలోన నామాటే చెప్పుకుంటు ఉంటారంట
నానోట చెప్పుకుంటే బాగోదో ఏమో గాని నాలాంటి అందగత్తె నేనేనంట
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ పున్నాలు పూయునంట
కన్నుల్లో కాసింత కోపమొస్తె ఊరంత ఉప్పెనొచ్చి ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట ॥గోదారి॥
యథాప్రకారంగానే, చాలా సరళమైన తెలుగులో, హీరోయిన్ అందాలను తానే ప్రశంసించుకుంటున్నట్టు వ్రాసిన పాట ‘గోదారి రేవులోన’. నిండు యవ్వనంలో, అందంగా, కాస్తంత అల్లరిగా, చిలిపిగా ఉండే హీరోయిన్, పొలం గట్ల మీద, పచ్చని ప్రకృతి, backdrop లో shoot చేయబడిన పాట ఇది.
గడసరి పల్లెటూరి పిల్ల, ఎంత అతిశయోక్తిగా తన అందాల గురించి మాట్లాడుకుంటుందో, సిరివెన్నెల ఈ పాటలో పలికించారు. గోదారి రేవులో సాగే పడవల్లో అందరూ తన గురించే మాట్లాడుకుంటూ ఉంటారట. తను కాస్త నవ్వితే పున్నాగ పూలు విరగబోస్తాయట! తనకు కాస్త కోపం వస్తే, రేవు పొంగి, ఉప్పెన వస్తుందట! ఊరంతా తన వద్దకు వచ్చి, నీకు ఎందుకు కోపం వచ్చింది, ఆ ఊసేంటో మాకు చెప్పు, అని సందడి సందడి చేస్తారట. తను మరో మాట కూడా చెబుతుంది, ‘నా అందానికి మరి ఎవరు సాటి లేరు, నా అంత అందగత్తెను నేనొక్కదాన్నే!’ అని. చెప్పాల్సింది అంతా చెప్పి, ‘అయినా ఈ మాట నా అంతట నేనే చెప్పుకోకూడదు లెండి’ అంటుంది, గడుసుగా.
ఇలా చెప్పడంలో సిరివెన్నెల గారు లోకరీతులను ఎంత నిశితంగా పరిశీలిస్తారో అర్థమవుతుంది. మరి ముఖ్యంగా కొంత శాతం మంది స్త్రీలైతే, శుభ్రంగా చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి, ‘అయినా నాకెందుకులేమ్మా’, అంటారు. చెప్పదలుచుకున్న విషయానికి మరింత అతిశయోక్తులు జోడించి, ‘నా నోటితో నేను అనకూడదు కానీ..!’ అంటూ సాగదీసి, చెప్పదలుచుకున్నది మనస్ఫూర్తిగా చెప్పేస్తారు.
పాట అంటే నాదేగాని కోయిలమ్మదా – ఒట్టి కారుకూతలే
ఆట అంటే నాదే కాని లేడిపిల్లదా – పిచ్చి కుప్పిగంతులే
పొలాల వెంట చెంగుమంటు సాగుతూ పదాలు పాడితే
జిగేలుమంటు కళ్ళు చెదిరి ఆగవా జులాయి గాలులే ఏ చిన్నమచ్చలేని నా వన్నెచిన్నె చూసి చంద్రుడే సిగ్గుతో మబ్బుచాటు చేరుకోడ ॥గోదారి॥
ఇక చరణం విషయానికొస్తే, కావాల్సినన్ని బడాయిలు పోతుంది కథానాయిక. కోయిల నాకంటే అందంగా పాడుతుందా? లేడి పిల్లది పిచ్చి గంతులు కానీ, నాలాగా చెంగు చెంగుమంటూ పొలం గట్ల వెంబడి పరిగెట్టగలదా? నా వేగాన్ని చూసి గాలులే ఆగిపోవా? తన అందానికి మచ్చ ఉన్న చంద్రుడు, మచ్చలేని నా అందాన్ని చూసి, మబ్బుల వెనక్కి వెళ్లి దాక్కోడా? అని కొంటెగా ప్రశ్నిస్తూ, తన అందాలకు తానే మురిసిపోతుంది.
అందమైన ఆడవాళ్లు, అద్దం ముందు నిలబడి, (బయటికి చెప్పకపోయినా!) తమ సౌందర్యాన్ని ఇతరులతో పోల్చుకుంటూ, ఇదే విధంగా మురిసిపోతారనడంలో అతిశయోక్తి లేదు. ఇటు ప్రకృతితోనో, అటు మరో అందమైన స్త్రీతోనో పోల్చుకొని, తమకు ఎవరు సాటి లేరని, రారని.. పొంగిపోతుంటారు.
“She walks in beauty, like the night
Of cloudless climes and starry skies;
And all that’s best of dark and bright
Meet in her aspect and her eyes;” అని
-Lord Byron స్త్రీల అందాలను ప్రశంసిస్తాడు.
నాకు పెళ్ళి ఈడు వచ్చి పెద్దవాళ్ళకి ఎంత చిక్కు తెచ్చెనే
రాకుమారి లాంటి నాకు జోడు వెతకడం వాళ్ళకెంత కష్టమే
ఫలాని దాని మొగుడు గొప్పవాడని అనాలి అందరూ అలాని నాకు ఎదురు చెప్పకూడదే మహానుభావుడు నాకు తగ్గ చక్కనోడు నేను మెచ్చు ఆ మగాడు ఇప్పుడే ఎక్కడో తపస్సు చేస్తూవుంటాడు ॥గోదారి॥
ఇక రెండో చరణానికి వచ్చేసరికి, కథ మరో మలుపు తిరుగుతుంది. మరి ఇంత అందానికి సరైన జోడు ఒకటి కావాలిగా! ఇంత గొప్ప అందగత్తెక్కి పెళ్లి ఈడు రావడంతో, ఇంట్లో వాళ్లకి పెద్ద చిక్కు వచ్చి పడిందట! రాజ కుమార్తె వంటి ఈమెకు సరిజోడుని, ఈ సౌందర్య రాశిని మెప్పించే రాకుమారుడిని ఎక్కడ వెతకాలి? అన్నది ఆ చిక్కుముడి. వాళ్లు ఎలాంటి వరుణ్ణి వెతకాలి అంటే.. ఫలానా అమ్మాయి మొగుడు ఎంత గొప్పవాడు అని ఊరంతా ముక్కున వేలు వేసుకోవాలట! ‘అయినా నా అంత అందగత్తె అంత సులభంగా దొరుకుతుందా?’ అని ప్రశ్నించుకొని, ‘నాలాంటి దాన్ని పొందడానికి ఎక్కడో ఎవరో తపస్సు చేస్తూ ఉంటారులే!’ అని సమాధానం ఇచ్చుకుంటుంది. ఇంతలో ఈవిడకి మరో అనుమానం పొడుచుకొచ్చిందట. అంత గొప్పవాడు భర్తగా వచ్చినా, తన మీద పెత్తనం చేయకూడదట. తన మాటకు ఎదురు చెప్పకుండా, ఆ మహానుభావుడు తనను అపురూపంగా చూసుకుంటాడా అని! నా మొగుడు నా మాటకు ఎదురు చెప్పకూడదు, అని కూడా ఈమె నిర్ణయించుకుంటుంది. ఇది ప్రతి అమ్మాయికి సహజమైన ఆశే కదా!
పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలకి, సహజంగా ఉండే ఆలోచనలు, అతిశయోక్తులు, గర్వం, తనమీద తనకున్న ఆత్మవిశ్వాసం.. ఇలా అన్నీ.. అద్దంలో చూపించేశారు సిరివెన్నెల. ఈయన వ్రాసిన ఏ పాట చూసినా, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారా? అని ఆశ్చర్యపోయేంత సున్నితమైన, లోతైన విషయాలను తన పాట ద్వారా తెలియజేస్తారు. అవును, నేను ఒకప్పుడు ఇలాగే ఆలోచించాను కదా! అని ఆయా పాత్రలకు సామ్యం వున్న, నిజజీవితంలోని వ్యక్తులకు అనిపిస్తుంది. ఇటు సమాజం పట్ల, అటు మానవ నైజం పట్ల, ఒక్కో తరం వారి విలువల పట్ల, యువత భావాల పట్ల, స్త్రీల సున్నితమైన మనోభావాల పట్ల, ఇంత పరిశీలనా దృష్టి కలిగిన కవి కావడం వల్లనే, ఆయన మనకు ఆరాధ్యుడయ్యారు. ఆగర్భ శ్రీమంతుల్లాగా ఈయన ఒక ఆగర్భ కవి పుంగవుడు.. అంటే తల్లి కడుపులో నుండే కవిత్వం నేర్చుకొని పుట్టారన్న మాట.
Images Source: Internet