సిరివెన్నెల పాట – నా మాట – 55 – తెలుగు ఘన వారసత్వాన్ని వర్ణించిన పాట

1
1

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

మనసే మీటనా

~

చిత్రం: తోక లేని పిట్ట

సాహిత్యం : సిరివెన్నెల

సంగీతం : ధర్మవరపు సుబ్రహ్మణ్యం

గానం : చిత్ర

~

పాట సాహిత్యం

పల్లవి :
మనసే మీటనా చెలిమే చాటనా ॥2॥
తొలిచినుకంటి తెలిగింటి పాటతో ॥2॥
చరణం:
త్యాగరాయుని భావాలనల్లి తీగసాగిన రాగాలమల్లి అన్నమాచార్యుని కీర్తనలతేలి దేవదేవుని లాలించు లాలి
తేనెల కాణాచి మన తెలుగును చవిచూచి అమృతమేమి రుచి అనరేమి మైమరచి
జగమేలే.. పరమాత్మ ఎవరితో మొరలిడుదు
తేటి నడకలకి సెలయేటి పరుగులకి ॥2॥
తన పలుకిచ్చి పులకించు పాటతో..
చరణం:
నన్నయాదుల తొలి తెలుగు మాట
భరతగాధకు బంగారుబాట కృష్ణరాయల కనుసైగ వెంట
భువనవిజయము సాగించెనంట
పోతన మాగాణి శ్రీనాథుని మారాణి
సాటిలేని బాణి మన జాను తెలుగువాణి
నగరాజ ధర నీదు పరివారమెల్ల ఒగి బోధలు చేసెడివారలు గాదే
జానపదములకీ నెరజాణ జావళికి ॥2॥
తన లయలిచ్చి నడిపించు పాటతో..

మనసే మీటనా చెలిమే చాటనా ॥2॥
తొలిచినుకంటి తెలిగింటి పాటతో ॥2॥

‘ఎంత చక్కనిదోయి ఈ తెనుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ అని తెలుగును ప్రశంసిస్తూ మురిసిపోయారు కందుకూరి రామభద్రకవి. అవును! ‘రంగారు బంగారు చెంగావులు’ ధరించి.. ఆ తోటలో తెలుగు భాషామతల్లి ఆనందంగా విహరిస్తూ, విలాసంగా నర్తిస్తూ వుంది. ఈ సుందర తెలుగు నందనవనంలో జానపదాలు విరిశాయి, ప్రబంధాలు మెరిశాయి, పద్యాలు మురిశాయి, గీతాలు జలపాతాలై నర్తించాయి, ఆధునిక ప్రక్రియలెన్నో వెలిశాయి.. సాహితీ సుమాలు విరిశాయి.. విరిసి, విరిసి, పరిమళిస్తున్నాయి.. గుబాళిస్తూనే ఉంటాయి.

ఇక కవుల బాణీలో తెలుగు ఘనత చెప్పుకోవాలంటే.. నిలిచిపోయిన ‘దేశభాషలందు తెలుగు లెస్స’.. పుట్టుకను గురించి ఒకసారి పరిశీలిద్దాం.

మూలఘటిక కేతన 13వ శతాబ్దంలో రచించిన ‘ఆంధ్ర భాషాభూషణము’ అనే తెలుగు వ్యాకరణ గ్రంథంలో ఈ పద్యం పుట్టుక, అక్కడినుంచి దాని ప్రయాణం, మొదలయింది:

తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును
దానివలన గొంత గానబడియె
గొంత తాన కలిగె నంతయు నేకమై
తెనుగుబాస నాగ వినుతి కెక్కె.

‘ఆంధ్ర భాషాభూషణము’ లోని ఈ పద్యం మొదటి పాదం అర్థాన్ని స్ఫూర్తిగా తీసుకుని, క్రీ.శ.14వ శతాబ్దం కాకతీయుల కాలపు కవి అయిన వినుకొండ వల్లభరాయుడు, తన ‘క్రీడాభిరామం’లో ఈ క్రింది పద్యంగా రూపాంతరం చెందించాడు:

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స,
జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?

చివరగా 15వ శతాబ్దంలో అది శ్రీకృష్ణదేవరాయలుచే రచించబడిన ప్రసిద్ధ కావ్యం, ‘ఆముక్తమాల్యద’ లోని ఈ క్రింది విధంగా చోటు చేసుకుంది.

తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స.

కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి, అమృత గుళిక వంటి తెలుగు ఘనతను తెలిపే.. పద్యం-

ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించినపుడును విన్పించు భాష
విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష
రసభావముల సమర్ణ శక్తియందున నమర భాషకు దీటైన భాష
జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష
భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి భాషయన నిద్దియని చెప్పబడిన భాష
తనర ఛందస్సులోని యందమ్ము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష..

“ఆంధ్రత్వ మాంధ్ర భాషా చ నాల్పస్య తపసః ఫలమ్” అన్న అప్పయ్య దీక్షితుల మల్లే-

“బాహుజన్మ కృత పుణ్య పరిపాకమున జేసి ఆంధ్రుడై ధాత్రిలో నవతరించు బహుజన్మ కృత పుణ్య పరిపాకమున జేసి ఆంధ్ర భాషను మాటలాడుచుండు”, అన్న మాట మరి అక్షర సత్యమేగా!

‘తేనె కన్న మధురంగా తెలుగు, ఆ తెలుగుదనం మన కంటికి వెలుగు’ అన్న ఆరుద్ర మాట అసత్యం ఎలా అవుతుంది?

‘అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అని కాళోజీ కోప్పడ్డారంటే- పడరా మరి! ‘తెలుగువాడిగా పుట్టడం, తెలుగుభాషలో మాట్లాడడం తపస్సు చేస్తే సాధ్యం కాని విషయం కదా!

సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి..
తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినాననీ కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ
తల వంచి కైమోడ్చు తమ్ముడా తెలుగు తల్లి నను కని పెంచినాదని కనుక తులలేని జన్మమ్ము నాదని త్రైలింగ ధామం..
త్రిలోకాభిరామం అనన్యం.. అగణ్యం.. ఏదో పూర్వపుణ్యం త్రిసంధ్యాభివంద్యం.. అహో జన్మ ధన్యం

~

తెలుగు భాష ఘనతను చాటే, కొన్ని సినీ గీతాలు:

1952 లో పల్లెటూరు సినిమా కోసం వేములపల్లి శ్రీకృష్ణ వ్రాసిన ఒక ప్రేరణాత్మక గీతం..

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తీ గలవోడా..
వీర రక్తపుదార వార వోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా..

డా. సి. నారాయణ రెడ్డి గారు “తల్లా! పెళ్లామా!” చిత్రం కోసం1970లో వ్రాసిన మరో తెలుగు మల్లి.. ఈ పాట..

తెలుగు జాతి మనది తెలుగు జాతి మనది
తెలంగాణ నాది నెల్లూరు నాది..
..నిండుగ వెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది
రాయలసీమ నాది.. సర్కారు నాది..
అన్నీ కలిసిన తెలుగునాడు.. మనదే.. మనదే .. మనదేరా..

అమెరికా అమ్మాయి చిత్రం కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం ఒలికించిన చక్కెర మాటల మూట, చిక్కని తేనెల ఊట..

పాడనా తెలుగు పాట, పరవశమై మీ ఎదుట మీ పాట.. పాడనా తెలుగు పాట..

దినదినము వర్ధిల్లు తెలుగుదేశం, దీప్తులను వెదజల్లు తెలుగు తేజం అని మొదలుపెట్టి..

తేనె కన్నా తీయనిది తెలుగు భాష

దేశ భాషలందు లెస్స తెలుగు భాష.. అంటూ.. సామగానమయమైన తెలుగు భాషకు కితాబునిచ్చారు ఆరుద్ర గారు, రాజ్ కుమార్ చిత్రం కోసం.

శంకరంబాడి సుందరాచారి గారి అమృత రచన, ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’, పాటను లీడర్ చిత్రంలో టంగుటూరి సూర్య కుమారి గారి గాత్రంలోనూ, బుల్లెట్ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గాత్రంలోను వినిపించడం జరిగింది.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.. చిత్రంలో,

డల్లాస్ దానయ్య వేగాస్ వీరయ్య న్యూయార్క్ నరసయ్య రావయ్యా ..తానాలో తాతయ్య ఆటాలో కోటయ్య నాటాలో నాగయ్య చూడయ్యా.. వాక్యాలతో మొదలుపెట్టి.. లక్ష్మీకాంత్ గారి రచన అయిన..
‘తెలుగంటే.. గోంగూర, తెలుగంటే.. గోదారి
తెలుగంటే.. గొబ్బిళ్ళు, తెలుగంటే.. గోరింట
తెలుగంటే.. గుత్తొంకాయ్, తెలుగంటే.. కొత్తావకాయ్
తెలుగంటే.. పెరుగన్నం, తెలుగంటే.. ప్రేమా, జాలీ, అభిమానం…’
చరణాలను జోడించి తెలుగు భాష ఘనతను కీర్తించడం జరిగింది.

ఈ వారం మనం చర్చించబోయే ‘మనసే మీటనా’, అనే పాట, ‘తోక లేని పిట్ట’, అనే చిత్రంలోనిది. ఈ పాట మొత్తం అమృతుల్యమైన, మన తెలుగు భాష ఘన వారసత్వాన్ని వర్ణిస్తూ సాగుతుంది.

మనసే మీటనా చెలిమే చాటనా ॥2॥
తొలి చినుకంటి తెలిగింటి పాటతో ॥2॥
చరణం:
త్యాగరాయుని భావాలనల్లి తీగసాగిన రాగాలమల్లి అన్నమాచార్యుని కీర్తనలతేలి దేవదేవుని లాలించు లాలి
తేనెల కాణాచి మన తెలుగును చవిచూచి అమృతమేమి రుచి అనరేమి మైమరచి
జగమేలే.. పరమాత్మ ఎవరితో మొరలిడుదు
తేటి నడకలకి సెలయేటి పరుగులకి ॥2॥
తన పలుకిచ్చి పులకించు పాటతో..

తొలి చినుకు ఎంత హాయిగా వుండి ఎంత ఆర్తిని తీరుస్తుందో..అంత మధురమైన తెలుగు పాటతో ‘మనసు మీటి చెలిమి చాటుతాను’, అన్న పల్లవితో ప్రారంభమవుతుంది ఈ పాట. అమెరికా నుండి వచ్చిన ఒక అమ్మాయి, (హీరో అత్త కూతురు) ఒక family get-together లో పాట పాడడం నేపథ్యంగా ఈ పాట చిత్రీకరించబడింది. అయితే గమ్మత్తుగా, ఆ పాటకు ఆ హీరో, తను ప్రేమించిన అమ్మాయితో, ఆ అమ్మాయి ఒక శాస్త్రీయ నృత్యం చేస్తున్నట్టు, ఊహల్లో తేలిపోతాడు.

త్యాగరాజు, అన్నమయ్య వంటి వాగ్గేయకారులను ఉటంకిస్తూ చరణం సాగుతుంది. 96 కోట్ల రామనామం జపించిన త్యాగరాజు, రామకథామృతాన్ని తాళ సమన్వయంతో, నాద సుధారస ప్రవాహంలా, పాడుకుని ధన్యుడైనాడు. నిరంతరం త్యాగయ్య ధ్యాస రాముడే. ఈ నాదస్వరూపుడు తన శ్వాసనే రాముడికి అంకితం చేశాడు. ఇక జో.. అచ్చుతానంద.. జో.. జో ముకుందా అంటూ.. దేవదేవునికే లాలి పాడి నిద్రపుచ్చిన అన్నమయ్య, తన పదాలతోనే వెంకటేశ్వరని కీర్తిస్తూ పరమపదానికి చేరిన ధన్యజీవి.

అలాంటి త్యాగయ్య భావాలనల్లుకొని తీగ సాగిన రాగాల మల్లిని, అన్నమయ్య రాగాల్లో తేలియాడిన, తేనె ఊట లాంటి మన తెలుగును చవిచూసి, దీని ముందు అమృతం రుచి ఎంత? అమృతం రుచి దిగదుడుపే!.. అనుకుంటారట. తేటినడకలకి, సెలయేటి పరుగులుకి తన పలుకులనే కులుకులుగా ‘ఇచ్చిందట తెలుగు’. మిగతా వారిలాగా, సెలయేటి కులుకులు తనలో నింపుకుంది తెలుగు.. అని చెప్తే సీతారామశాస్త్రి ఎందుకు అవుతారు?

ఇక రెండు చరణాల మధ్యలో.. ఎటువంటి లింకు లేకుండా.. నగుమోము కనలేని.. అనే త్యాగరాయ కృతిలోని వాక్యాలను తీసుకోవడం జరిగింది. అటు సందర్భంతో కానీ, ఇటు భావంతో కానీ సమన్వయం కాని ఈ వాక్యాలను ఎందుకు తీసుకున్నారో.. నాకైతే అర్థం కాలేదు. ఆ కీర్తన పూర్తిగా క్రింద ఇవ్వడం జరిగింది.

నగుమోము కనలేని త్యాగరాయ కీర్తన

పల్లవి:
నగుమోము గనలేని నా జాలిఁ దెలిసి నన్ను బ్రోవగ రాద? శ్రీరఘువర నీ ॥ నగుమోము॥
అనుపల్లవి:
నగరాజధర! నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసెడువారలు గారె? యిటు లుండుదురే? నీ ॥ నగుమోము॥
చరణము:
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేఁడో? గగనాని కిలకు బహు దూరం బనినాఁడో? జగమేలే పరమాత్మ! యెవరితోనీ మొఱలిడుదు? వగ చూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత! ॥ నగుమోము॥

చరణం:
నన్నయాదుల తొలి తెలుగు మాట
భరతగాధకు బంగారుబాట
కృష్ణరాయల కనుసైగ వెంట
భువనవిజయము సాగించెనంట
పోతన మాగాణి శ్రీనాథుని మారాణి
సాటిలేని బాణి మన జాను తెలుగువాణి
నగరాజ ధర నీదు పరివారమెల్ల ఒగి బోధలు చేసెడివారలు గాదే
జానపదములకీ నెరజాణ జావళికి ॥2॥
తన లయలిచ్చి నడిపించు పాటతో..

మొదటి చరణంలో వాగ్గేయకారులను సన్నుతించిన మన కవీంద్రుడు, రెండవ చరణంలో సాహితీవేత్తలను కొనియాడారు. మహాభారతాన్ని తెనిగించిన నన్నయ, తిక్కన ఎ‍ఱ్ఱన మహాకవులకు నివాళి అర్పించారు సిరివెన్నెల. ఇన్ని శతాబ్దాల తరువాత కూడా కొంచమైనా ఘనత తగ్గని, భువన విజయం, రాచకవి అయిన కృష్ణదేవరాయల సారథ్యంలో జరిగింది. తెలుగు సాహిత్యానికి వెలలేని పోషణనిచ్చి, అష్టదిగ్గజ కవులను సమాదరించి, తెలుగు సాహితీమతల్లిని, బంగారు పల్లకిలో తన భుజస్కందాలపై ఊరేగించాడు కృష్ణదేవరాయలు. పోతన భాగవతాన్ని, శ్రీనాథుని సాహిత్యాన్ని, ఎంత గుంభనంగా ఉదహరించారో! హలంపట్టి పొలం దున్నిన.. పోతన సాహిత్యాన్ని, పోతన మాగాణి అని, ‘వాణి నా రాణి అన్న’, శ్రీనాధుని ఆత్మవిశ్వాసాన్ని.. ఒకే వాక్యంలో చూపించారు సిరివెన్నెల. ‘ముద్దులు గార భాగవతమున్ రచియించుచు పంచదారలో అద్దితివేమొ గంటమును’ అని పోతన విషయంలో కరుణశ్రీ ఆశ్చర్యచకితులయ్యారట.

అలవోకగా, అతి సహజంగా జనపదుల నోటి వెంట జాలువారే జాన(ణ)పదంలో ఇమిడి ఉన్న స్వచ్ఛమైన ప్రకృతి వంటి తెలుగు సొగసులకు, శృంగారపరమైన భావనను వెలిబుచ్చుతూ సాగే జాన జావళిలోని తెలుగు అందాలకు హారతులిచ్చారు సిరివెన్నెల.

19వ శతాబ్దపు పూర్వార్ధంలో సుమారుగా స్వాతి తిరునాళ్ కాలంలోనే ‘జావళి’ అనే కొత్త ప్రక్రియ అవతరించింది. క్షేత్రయ్య సృష్టించిన ‘పదం’ లాగే యిదీ ప్రధానంగా నృత్యానికి అందునా అభినయానికి ఉద్దేశించినదే అయినా పాట కచేరీలలో చివర ‘తుక్షా’లలో ఒకటిగా వినిపిస్తూ వచ్చింది.

1950-60 సంవత్సరాల మధ్య కాలంలో విడుదలైన తెలుగు సినిమాలలో కొన్ని గొప్ప పదాలు, జావళీలు వచ్చాయి. కృష్ణశాస్త్రి, సముద్రాల, మల్లాది, పింగళి వంటివారు రచించిన ఆ గీతాలను రాజేశ్వరరావు, సుబ్బరామన్, ఘంటసాల, పెండ్యాల వంటి సంగీత దర్శకులు స్వరపరచగా భానుమతి, బాలసరస్వతి, వసంతకుమారి, పి.లీల, సుశీల వంటి వారు గానం చేశారు. ఏ మాత్రం అశ్లీలత లేని ఆ పాటలను అందరూ హాయిగా పాడుకోవచ్చు. అవి ఎప్పటికీ ఆకర్షణ కోల్పోనివి. ఇప్పుడు లభిస్తున్న జావళీలలో ‘ఇటు సాహసములు ఏల నాపై’ అనే స్వాతి తిరునాళ్ రచనే అన్నిటికంటే మొదటిది కావచ్చు. ధర్మపురి సుబ్బరాయరు జావళీలలో ముఖ్యమైనవి – ‘ఎంతటి కులుకే’, ‘అది నీపై మరులు గొన్నదిరా’, ‘మరుబారి తాళలేనురా’, ‘నారీమణి నీకైనదిరా’, స్మరసుందరాంగుని సరియెవ్వలే’.

మొదటి చరణం లాగానే, రెండవ చరణంలో కూడా, ‘నగరాజ ధర నీదు పరివారమెల్ల ఒగి బోధలు చేసెడివారలు గాదే .. అన్న ఈ వాక్యాన్ని’ త్యాగరాయ కృతిలో నుండి తీసుకోవడం జరిగింది.

అతి మధురమైన తెలుగు ఘనతను, అత్యంత మధురంగా అక్షరీకరించిన సిరివెన్నెలకు నమస్సుమాంజలి అర్పించడం తప్ప, మనం చేయగలిగింది ఏదీ లేదు. ‘సుందర తెలుంగు’ అని, Italian of the East అనీ, కొనియాడబడిన తెలుగుకు, అమ్మ ప్రేమ లాంటి తెలుగుకు, అమృతం వంటి తెలుగుకు, గణనీయమైన తెలుగు సాహితీ పటిమకు, సిరివెన్నెల అర్పించిన అక్షర నివాళి ఇది!

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here